సోమవారం, ఏప్రిల్ 14, 2014

అంతా రామ మయం...

చిన్ని కృష్ణయ్య లీలలు కథలు కథలుగా చెప్పుకుంటారు కానీ రాములవారి బాల్యం గురించి అంతగా వినిపించదు కదా, కానీ సీతా కళ్యాణం సినిమా కోసం చిత్రీకరించిన ఈ పాటలో చిన్నారి రామయ్య గురించీ, చిన్నారి సీతమ్మ గురించీ బాపూ గారు ముచ్చటగా చూపించారు. దశరథ మహారాజుకి కైకకీ అంతా రామమయమేనట జాబిల్లిని కోరిన రామయ్యని అమ్మ ఎలా బుజ్జగించిందో మీరే చూడండి. అంతేకాదు శివధనుస్సు గురించిన కథ కూడా ఆసక్తిగా ఉంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.చిత్రం : సీతాకళ్యాణం (1976)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : ఆరుద్ర
గానం : బాలు, పి.బి. శ్రీనివాస్‌, రామకృష్ణ, పి.సుశీల, వసంత

అంతా రామమయం, దశరథనృపతికి - అంతా రామమయం.
రాముని తోటిదె లోకం, రామునిపైనే ప్రాణం
రాముని పేరే వేదం - రూపే మోదం
పలుకులె మోహన గానం, 
కన్నది మాత్రం కౌసల్యయినా కైకే రాముని తల్లి, 
అరక్షణమైనా రాముని విడిచి బ్రతకదు రెండవ తల్లి, 

అంతా రామమయం కైకా దేవికి అంతా రామమయం

విద్దెము విద్దెములాడే రాముని ముద్దులు చూడాలి
ముద్దిమ్మంటే ముందుకు ఉరికే మురిపెం చూడాలి
అడిగినదేదో ఇవ్వకపోతే - అల్లరి చూడాలి
మరి పంతాలు పెట్టేవేళ మారాం చూడాలి
పట్టిన పంతం చూడాలి బెట్టూ బింకం చూడాలి
కోరిన కోరిక తీరేవేళ గోమును చూడాలి గోమును చూడాలి..
అందని చంద్రుని కిందికి దించిన అమ్మను చూడాలి
చంద్రుని చూచి నవ్వే యింకో చంద్రుని చూడాలి
రామచంద్రుని చూడాలి 

అంతా రామమయం కైకా దేవికి అంతా రామమయం

ఏదీ ఏదీ, ఇంతటి వరకూ యిచటే వున్నది
ఇంతలో ఏమైనదమ్మా, ఏదీ ఏదీ ఏదీ - సీతమ్మ
చిట్టి పొట్టి ముద్దుల మూట చిన్నారి పొన్నారి సీతమ్మ, 
అవును అవును అందాల రాశి కామునిగన్న మాయమ్మ, 
అల్లన మెల్లన పారాడుతుంటే హంసధ్వనులే ఓయమ్మ, 
ఘల్లు ఘల్లు గజ్జెలమోత చల్లని గానమె అవునమ్మా, 
అహరహము పూజాగృహమున హరి మనోహర విగ్రహమునె
బాల జానకి తనివితీరా చూసుకుంటుంది
ఆ నీలవర్ణుని పొందు ఎపుడని ఎదురుచూస్తుంది.

జానకి రాముల కలిపే విల్లు, జనకుని ఇంటనె ఉన్నది
ఆ యింటికి ఆ వింటికి, ఘనమగు కథ యొకటున్నది
తారకాసురుని తనయులు ముగ్గురు దారుణ బలయుతులు
విపరీతమ్మగు వరములు పొంది, కట్టిరి త్రిపురములు
ఆ కోటల చుట్టూ పెట్టిరి ఎన్నో రక్కసి రక్షణలు
ఎదురు లేదని చెలరేగిరి - ఆ త్రిలోక కంటకులు
దారుణ హింసలు తాళజాలక తల్లడిల్లి సురలు
హిమాలయమ్మున త్రినేత్రధారికి తెలిపినారు మొరలు
సర్వదేవమయ సర్వమహేశ్వర - శరణు శరణు శరణు
శత్రుభయంకర పాప లయంకర శరణు శరణు శరణు
పాహిమాం పాహిమాం పాహిమాం.. 
గర్వాంధులు ఆ త్రిపురాసురుల - కడతేర్ప నిదే అదను
పాహిమాం పాహిమాం పాహిమాం, 
పాహిమాం పాహిమాం పాహిమాం, 

మేరు పర్వతము వింటిబద్దగా ఆదిశేషుడే వింటి నారిగా, 
నలువరాణియే వింటి గంటగా నారాయణుడే వింటి శరముగా, 
అమరెను శివునికి విల్లు.. అసురుల ఆయువు చెల్లు, 
అమరెను శివునికి విల్లు.. అసురుల ఆయువు చెల్లు, 

చండ ప్రచండ అఖండ బలుండగు గండరగండడు శివుడు, 
కొండరథముపై కొండవింటితో దండిమగల చెండాడె.
దండిమగల చెండాడె.
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

పైపాటలో దశరథ మహరాజుకి అంతా రామమయం అంటే ఈ పాటలో రామదాసుకి ఈ జగమంతా ఎలా రామమయంగా కనిపిస్తుందో ఎంత బాగా చెప్పారో చూడండి. రాఘవేంద్రరావు గారు తీసిన భక్తి సినిమా పాటల చిత్రీకరణలో కాస్త చక్కగా చిత్రీకరించారు అనిపించిన పాట శ్రీరామదాసు సినిమాలోని ఈ అంతా రామమయం పాట మీరూ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.
చిత్రం : శ్రీరామదాసు (2006)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : రామదాసు, పోతన
గానం : బాలు 

అంతా రామమయం.. ఈ జగమంతా రామమయం
రామ రామ రామ రామ రామ రామ రామ రామ
రామ రామ రామ రామ రామ రామ రామ రామ
రామ రామ రామ రామ రామ రామ రామ రామ

అంతా రామమయం ఈ జగమంతా రామమయం
అంతా రామమయం ఈ జగమంతా రామమయం
అంతా రామమయం

అంతరంగమున ఆత్మారాముడు
అనంత రూపముల వింతలు సలుపగ
సోమ సూర్యులును సురలు తారలును
ఆ మహాంబుధులు అవనీజంబులు

అంతా రామమయం ఈ జగమంతా రామమయం
అంతా రామమయం

ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ
ఓం నమో నారాయణాయ

అండాండంబులు పిండాండంబులు
బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగ
నదులు వనంబులు నానా మృగములు
విహిత కర్మములు వేద శాస్త్రములు

అంతా రామమయం ఆ.... ఈ జగమంతా రామమయం

రామ రామ రామ రామ రామ రామ రామ రామ
రామ రామ రామ రామ రామ రామ రామ రామ

సిరికింజెప్పడు; శంఖచక్ర యుగముం చేదోయి సంధింపడు
ఏ పరివారంబును జీరడు అభ్రగపతిం పన్నింపడు
ఆ కర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు వివాదప్రోత్థిత
శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహియై. 
రామ రామ రామ రామ రామ రామ రామ రామ
రామ రామ రామ రామ రామ రామ రామ రామ 
 

2 comments:

అంతా బాపూ మయం..సీతాకల్యాణమంతా బాపు మయం..పిక్స్ మొదటిది మినహాయిస్తే మిగిలిన రెండూ మరింత ఆప్ట్ గా వుండాలి వేణూజీ..

థాంక్స్ శాంతి గారు.. మార్చడానికి ప్రయత్నిస్తాను..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.