బుధవారం, డిసెంబర్ 30, 2009

ఒకటే జననం.. ఒకటే మరణం..

చాలా రోజులుగా రాద్దాం అనుకుంటున్న ఈ టపా అనుకోకుండా ఈ పాట ఈ వారం ఈనాడు ఆదివారం సంచిక లో రచయిత సుద్దాల అశోక్ తేజగారి వ్యాఖ్యానంతో కనిపించే సరికి వెంటనే ప్రచురించేస్తున్నాను. ఈ సినిమా శ్రీహరి సినిమాల్లో నాకు నచ్చిన వాటిలో ఒకటి, కాస్త లాజిక్కులను పక్కన పెట్టి చూస్తే కంట్రోల్డ్ యాక్షన్ తో ఆకట్టుకుంటుంది ఒక సారి ఛూసి ఆనందించవచ్చు. ఇది నచ్చడానికి మరో కారణం సింధుమీనన్ కూడా లేండి. తన మొదటి తెలుగు సినిమా అనుకుంటాను మోడర్న్ డ్రస్సుల్లో కాకుండా మన పక్కింటి అమ్మాయిలా సాదాసీదాగా చూడచక్కగా ఉండి ఇట్టే ఆకట్టుకుంటుంది. పాటకచేరి శీర్షిక నిర్వహిస్తున్న ఈనాడు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ పత్రిక క్లిప్పింగ్ కూడా ఇక్కడ ఇస్తున్నాను ఆసక్తి ఉన్నవారు చదువుకోవచ్చు.

సాహిత్యానికి సంగీతమో సంగీతానికి సాహిత్యమో తెలియదు కానీ ఈ పాటలో రెండూ ఒకదానికి ఒకటి అన్నట్లు ఒదిగి పోతాయి. పల్లవిలో ఉన్న ఫోర్స్ చరణాలలో కొంచెం తగ్గినట్లు కనిపిస్తుంది కానీ మొత్తం పాట విన్నపుడు ఒకే రకమైన ఉత్తేజాన్ని ఇస్తుంది. పల్లవి ఎత్తుగడ మాత్రం అద్భుతం సాహిత్యం పరంగా కానీ సంగీత పరంగా కానీ. నేను వాకింగ్ చేసేప్పుడు వినే ప్లేలిస్ట్ లో ఈ పాట మొదట ఉండేది (అంటే వాకింగ్ చేసింది కొద్దిరోజులైనా ఇలాటి అర్భాటలకు తక్కువ చేసే వాడ్ని కాదులెండి:-) నిజం చెప్పద్దూ, ఇదీ, ముత్తులో ఒకడే ఒక్కడు మొనగాడు, తమ్ముడు లో look at my face లాంటి పాటలు వింటూ జిమ్ కెళ్తే వచ్చే ఆ ఉత్సాహం  ఆనందం మాటల్లో చెప్పలేం అంటే నమ్మండి. సరే మరి మీరు విని ఉండక పోతే ఒకసారి వినేయండి.


చిత్రం : భద్రాచలం
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం : సుద్దాల అశోక్ తేజ
గానం : శంకర్ మహదేవన్, చిత్ర

ఒకటే జననం ఒకటే మరణం
ఒకటే గమనం ఒకటే గమ్యం
గెలుపు పొందె వరకూ అలుపు లేదు మనకు..
బతుకు అంటె గెలుపూ గెలుపుకొరకె బ్రతుకు..
కష్టాలు రానీ కన్నీళ్ళు రానీ
ఏమైన గానీ ఎదురేది రానీ
ఓడిపోవద్దు రాజీపడొద్దు
నిద్ర నీకొద్దు నీకేది హద్దు

||ఒకటే||

రాబోయే విజయాన్ని పిడికిలిలో చూడాలి
ఆ గెలుపూ తప్పట్లే గుండెలలో మోగాలీ
నీ నుదిటీ రేఖలపై సంతకమే చేస్తున్నా
ఎదనిండా చిరునవ్వే చిరునామై ఉంటున్నా
నిన్నే వీడని నీడవలే నీతో ఉంటా ఓ నేస్తం
నమ్మకమే మనకున్న బలం

నీలికళ్ళలో మెరుపూ మెరవాలి
కారు చీకట్లో దారి వెతకాలి
గాలివానల్లో ఉరుమై సాగాలి
తగిలే గాయాల్లో గేయం ఊదాలి

||ఒకటే||

నిదరోకా నిలుచుంటా.. వెన్నెలలో చెట్టువలె
నీకోసం వేచుంటా.. కన్నీటీ బొట్టువలె
అడుగడుగు నీ గుండె ..గడియారం నేనవుతా
నువు నడిచే దారులలో.. ఎదురొచ్చి శుభమవుతా
రాసిగ పోసిన కలలన్నీ దోసిలి నిండా నింపిస్తా
చేతులు చాచిన స్నేహంలా ...

ముట్టుకున్నావా మువ్వా అవుతుంది
పట్టుకున్నావా పాటే అవుతుంది
అల్లుకున్నావా జల్లే అవుతుంది
హత్తుకున్నావా వెల్లుఔతుంది...

||ఒకటే||

ఈ నూతన సంవత్సరం ఈ పాటలా మీలో ఉత్తేజాన్ని నమ్మకాన్ని నింపి మీకందరికీ అన్ని శుభాలను చేకూర్చాలని, మీరు కోరుకున్న రీతిలో జీవిస్తూ సుఖసంతోషాలను మీ సొంతం చేసుకోవాలని ఆశిస్తూ... అందరికీ 2010 నూతనసంవత్సర శుభాకాంక్షలు, కాస్త ముందుగా :-)

మంగళవారం, డిసెంబర్ 22, 2009

మిడిసిపడే దీపాలివి !!

అప్పట్లో దూరదర్శన్ చిత్రలహరిలో ఒకటి రెండు సార్లు ఈ పాట చూసిన గుర్తు. చంద్రమోహన్ నల్లశాలువా ఒకటి కప్పుకుని ఏటి గట్టున అటు ఇటు తిరుగుతూ తెగ పాడేస్తుంటాడు. అతనికోసం కాదు కానీ నాకు చాలా ఇష్టమైన ఏసుదాస్ గారి గొంతుకోసం ఈ పాటను శ్రద్దగా వినే వాడ్ని. లిరిక్స్ కూడా చాలా బాగున్నాయ్ అనిపించేది. నా ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం డిపార్ట్మెంట్ డే సంధర్బంగా జరిగిన పాటలపోటీలో నేను తప్పక పాల్గొనాలి అని మావాళ్ళంతా డిసైడ్ చేశారు. ర్యాగింగ్ పీరియడ్ లో బలవంతంగా నాతో పాడించిన పాటలను కాస్తో కూస్తో రాగయుక్తంగా పాడేసరికి నే బాగా పాడతాను అనే అపోహలో ఉండేవారు. సరే ఏ పాటపాడాలి అని తర్జన భర్జనలు పడటం మొదలుపెట్టాను. జేసుదాస్ పాటే పాడాలి అని మొదటే నిర్ణయించుకున్నాను కానీ ’ఆకాశదేశానా’, ’మిడిసిపడే’ పాటలలో ఏదిపాడాలి అని తేల్చుకోలేక చివరికి నా ఆప్తమితృడికి పాటలు రెండూ వినిపించి సలహా అడిగితే నీగొంతుకు ’మిడిసిపడే’ బాగ సూట్ అవుతుంది అదే అని ఖాయం చేసేసుకో అని చెప్పాడు. నాకు కూడా అదినిజమే అనిపించింది. అదీకాక "ఆకాశదేశాన" లోని సంగతులు సరిగా పాడలేకపోతున్నాను అని స్పష్టంగా తెలుస్తుంది.

అలా మొదటి సారి ఈ పాట పూర్తి సాహిత్యాన్ని సంగ్రహించి శ్రద్దగా నేర్చుకోవడం జరిగింది. పోటీ రోజు రానే వచ్చింది నాకు పాట పాడటం వచ్చినా సాహిత్యం సరిగా గుర్తుండేది కాదు. అదీకాక అందరి ముందు నుంచొని పాడవలసి వచ్చినపుడు మైండ్ బ్లాంక్ అయి అసలు గుర్త్తొచ్చేది కాదు. ఈ సారి ఎలా అయినా గెలవాలని పాట రాసుకుని పేపర్ చేతిలో పెట్టుకుని వెళ్ళాను. నా గొంతుకు కాస్తగాంభీర్యత జోడించి బోలెడంత విషాదాన్ని నింపి సీరియస్ గా పాడటం మొదలు పెట్టాను. అప్పటివరకూ కాస్త అల్లరి చేస్తున్నవారు సైతం నిశ్శబ్దంగా పాటలోలీనమై వినడం మొదలుపెట్టారు, మొదటి చరణం పూర్తైంది శ్రోతల కళ్ళలో ప్రశంస స్పష్టంగా కనిపించింది, రెండవచరణం మొదలు పెట్టాక అందులో చివరి లైన్లు ఎప్పుడూ గుర్తుండేవే అన్నధైర్యంతో పేపర్ మడిచి లోపల పెట్టేశాను కానీ అక్కడికి వచ్చేసరికి హఠాత్తుగా ఆ లైన్లు మర్చి పోయి తడబడిపోయాను. మళ్ళీ పేపర్ తీసి పాట పూర్తి చేయవలసి వచ్చింది. జడ్జిలు నువ్వు ఆ పేపర్ పెట్టుకోకుండా తడబడాకుండా పాడితే ప్రైజ్ నీదే అయి ఉండేది, పైన చెప్పిన కారణాల వలన నిన్ను నాలుగో స్థానానికి నెట్టేయవలసి వచ్చింది అని వ్యాఖ్యానించారు. 

ఈపాట ఎప్పుడు విన్నా ఆనాటిసంఘటన అంతా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. నా క్లాస్ మేట్ ఒక అమ్మాయి అయితే వీడికి ఏదో చాలా పే..ద్ద ఫ్లాష్ బ్యాక్ ఉండి ఉంటుంది అందుకే ఇంత విషాదగీతాన్ని భావయుక్తంగా పాడుతున్నాడు అనుకుందిట. తరువాత రోజుల్లో నాకు మంచి నేస్తమయ్యాక "అసలు సంగతేంటి గురూ.." అని అడిగింది అంత స్టోరీ లేదమ్మా అని చెప్పాను. ఇంజనీరింగ్ లో కాదుకానీ తర్వాత రోజులో ఈపాట పాడుకోదగిన అనుభవాలు కొన్ని ఎదురయ్యాయి కాని ఎక్కువ కాలం బాధించలేదనుకోండి అది వేరే విషయం. ఇంతకీ విషయం ఏమిటంటే పాట చాలా బాగుంటుంది, వేటూరి గారి సాహిత్యం ఆకట్టుకుంటే రాజా సంగీతం హృదయాన్ని సున్నితంగా స్పృశిస్తుంది. ఇక ఏసుదాస్ గారి గొంతు మరింత వన్నెచేకూర్చింది అని చెప్పాల్సిన పనేలేదు.

చిత్రం : ఆస్తులు అంతస్తులు
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : కె.జె.ఏసుదాస్

మిడిసి పడే దీపాలివి
మిన్నెగసి పడే కెరటాలివి
మిడిసి పడే దీపాలివి
మిన్నెగిసి పడే కెరటాలివి
వెలుగు పంచలేవు ఏ దరిని చేరుకోవు
వెలుగు పంచలేవు ఏ దరిని చేరుకోవు
ఈ జీవితమే ఒక గమ్యం లేని నావ
సుఖ దుఃఖాలే ఏకమైన రేవులో

||మిడిసి||

బావి లోతు ఇంతని తెలుసు
నదుల లోతు కొంతే తెలుసు
ఆడ గుండె లోతు ఎంతో లోకం లో యెవరికి తెలుసు
ఏ నిమిషం ప్రేమిస్తుందో ఏ నిమిషం పగబడుతుందో
ఎప్పుడెలా మారుతుందో తెలిసిన మగవాడు లేడు
రాగం అనురాగం ఎర వేసి జత చేరి
కన్నీట ముంచుతుందిరా

||మిడిసి||

పాము విషం సోకిన వాడు ఆయువుంటె బతికేస్తాడు
కన్నె వలపు కరిచిన వాడు నూరేళ్ళకి తేరుకోడు
సొగసు చూసి మనసిచ్చావా బందీగా నిలబడతావు
నీ కలలే విరిగిననాడూ కలతే నీ తోడవుతుంది
లేదు ఏ సౌఖ్యం రవ్వంత సంతోషం ఈ ఆడదాని ప్రేమలో

||మిడిసి||

ఇదే పాట కథానాయిక పాడినది ఇక్కడ చూడండి. రెండు సాహిత్యాలు వేటికవే సాటి అన్నట్లు ఉన్నాయి. ఇదికూడా వేటూరిగారే రాశారేమో తెలియదు. ఈ పాటను కామెంట్ ద్వారా అందించిన తృష్ణ గారికి ధన్యవాదాలు.

 

అలుపు రాని కెరటాలివి
ఏ గెలుపు లేని హృదయాలివి
వయసు ఊరుకోదు ఆ వలపుమాసిపోదు
ఏనాడైనా తెరచాప లేని నావ
చేరగలిగేనా తను కోరుకున్న రేవుకి

||అలుపు||

ప్రేమించిన ఆడ మనసు ప్రాణమైన అర్పిస్తుంది
ప్రేమ విలువ తెలియకపోతే ఆడదెపుడు అర్ధం కాదు
తనువులోని అందం గాని మనసులోని మర్మం గానీ
నమ్మిన మగవాడి ముందు ఏ ఆడది దాచలేదు
లేదు నా నేరం...ఏముందో తెలిపావో
శిరసొంచి మొక్కుతానులే

||అలుపు||

ఆడదంటే అమృత హృదయం
తల్లితనమే సృష్టికి మూలం
పైట చాటు రొమ్ము వెనుక అమ్మ మనసు దాగుంటుంది
కన్నీటిని దాచుకుంటూ చిరునవ్వును పంచిస్తుంది
తను సీతై నిప్పుల పడిలో రామవాక్కు నిలబెడుతుంది
నాడు ఈనాడు ఆ రాత ఎద కోత
రవ్వంత మారలేదులే

||అలుపు||

ఆదివారం, డిసెంబర్ 13, 2009

ఓ నిండు చందమామ !!

లేతమావి చిగురులు అప్పుడే తిన్న గండు కోయిలలా... ఆ పరమేశ్వరుడు గరళాన్ని నిలిపినట్లు ఇతనెవరో అమరత్వాన్ని సైతం త్యాగం చేసి అమృతాన్ని తన గొంతులోనే నిలిపివేసాడా? ప్రతి పాటలోనూ అదే మాధుర్యాన్ని ఒలికిస్తున్నాడు అనిపించేటట్లు, తన విలక్షణమైన గళంతో శ్రోతలను మంత్ర ముగ్ధులను చేసే అద్భుతమైన గాయకుడు కె.జె.ఏసుదాసు. తను పాడినది కొన్ని పాటలే అయినా ఆయన పాటలను పదే పదే ఇప్పటికీ వింటున్నారంటే ఆపాటల సంగీత సాహిత్యాలు ఒక కారణమైనా ఆయన గళం లోని మాధుర్యం సైతం పెద్ద పాత్ర వహిస్తుంది అన్నదాంట్లో ఎలాంటి సందేహంలేదు. ఏసుదాస్ పేరు వినగానే తెలుగులో మొదట గుర్తు వచ్చేది మేఘసందేశం అయినా తర్వాత గుర్తొచ్చేది మోహన్ బాబు గారి పాటలు. ఇవేకాకుండా తెలుగులో ఆయన ఇంకా చాలా మంచి పాటలు పాడారు. ఇక హిందీ విషయానికి వస్తే ఆయన పేరు విన్న వెంటనే చిత్‍చోర్ చిత్రాన్ని అందులోని "గొరి తెర గావ్ బడాప్యారా" పాటనీ గుర్తు చేసుకోని వారు ఎవరూ ఉండరేమో.

తెలుగులో బాగా ప్రాచుర్యాన్ని పొందిన పాటలు చాలా ఉన్నా నాకు ఎందుకో ఈ "నిండు చందమామ.." పాట చాలా ఇష్టం. సహజంగా జాబిలి అంటే ఉన్న ఇష్టం వల్లనో తెలియదు. తనగొంతులోని మాధుర్యమో తెలియదు. సాహిత్యం లోని అందమో తెలియదు కారణమేదైనా నాకు చాలా నచ్చిన పాట ఇది. మొదటి సారి అలవోకగా విన్నపుడు పాత పాట కనుక పి.బి. శ్రీనివాస్ గారు పాడారేమో అనుకున్నాను కానీ గొంతు ఏసుదాస్ గారిదిలా ఉందే అని తర్వాత క్యాసెట్ పై చూసి అచ్చెరువొందాను. ఈన అప్పుడే ’63 లోనే తెలుగు సినిమాకు పాడారా అని. ఆరుద్ర గారి సాహిత్యం మదిలో గిలిగింతలు పెడితే, కోదండపాణి గారి సంగీతం హాయిగా సాగిపోతుంది. ఇక ఏసుదాస్ గారి గాత్రం గురించి  చెప్పనే అక్కరలేదు. ప్రత్యేకించి "నిండు చందమామ" కు ముందు "ఓ ఓ ఓ ఒ ఒ ఒ ఓ.." అని పలికినపుడు ఆహా అనిపించక మానదు. మీరు కూడా విని ఆనందించండి.


ఈ పాట వినాలంటే చిమట మ్యూజిక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చిత్రం : బంగారు తిమ్మరాజు (1963)
సంగీతం : యస్.పి. కోదండపాణి
సాహిత్యం: ఆరుద్ర
గానం : కె.జె.ఏసుదాస్

ఓ నిండు చందమామ నిగ నిగలా భామ
ఒంటరిగా సాగలేవు కలసి మెలసి పోదామా..
ఓ..ఓ..ఓ...ఒ ఒ ఒ ఓ నిండు చందమామ...

నిదురరాని తీయని రేయి నిను పిలిచెను వలపుల హాయి
మధురమైన కలహాలన్నీ మనసుపడే ముచ్చటలాయే..

నిదురరాని తీయని రేయి నిను పిలిచెను వలపుల హాయి
మధురమైన కలహాలన్నీ మనసుపడే ముచ్చటలాయే..

మేలుకున్న స్వప్నములోనా ఏల ఇంత బిడియపడేవూ..
మేలుకున్న స్వప్నములోనా ఏల ఇంత బిడియపడేవూ..
ఏలుకునే ప్రియుడను కానా లాలించగ సరసకు రానా..

ఓ ఓ ఓ నిండు

దోర వయసు ఊహలు నీలో దోబూచులు ఆడసాగే..
కోరుకున్న మురిపాలన్నీ కొసరి కొసరి చెలరేగే..

దోర వయసు ఊహలు నీలో దోబూచులు ఆడసాగే..
కోరుకున్న మురిపాలన్నీ కొసరి కొసరి చెలరేగే..

నీదు మనసు నీలో లేదూ నాలోనె లీనమయే..
నీదు మనసు నీలో లేదూ నాలోనె లీనమయే..
నేటినుంచి మేనులు రెండూ నెరజాణా ఒకటాయే..

ఓ..ఓ..ఓ...ఒ ఒ ఒ ఓ నిండు చందమామ....

ఏసుదాస్ గారి గురించి చెప్పి ’గొరితెర గావ్ బడా ప్యారా’ వీడియో ఇవ్వకుండా ముగించాలని అనిపించడం లేదు అందుకనే ఈ పాటకు తగ్గ విజువల్స్ తో కూర్చిన ఈ అందమైన వీడియో మీకోసం.


బుధవారం, డిసెంబర్ 09, 2009

మల్లెలు పూసే... వెన్నెల కాసే...

బాలు గారు పాడిన ఈ పాట నాకు చాలానచ్చే పాటలలో ఒకటి. హిందీలో కిషోర్ కుమార్ గారి పాటలలో సాహిత్యం, ట్యూన్ ఒక అందమైతే కిషోర్ కలిపే సంగతులు మరింత అందాన్నిస్తాయి. మెలొడీ + హిందీ అస్వాదించలేనంత చిన్న వయసు లోకూడా నేను కిషోర్ పాటలు ఈ జిమ్మిక్కుల కోసం వినే వాడ్ని. ఉదాహరణ కి దూరదర్శన్ లో ఆదివారం ఉదయం వచ్చే రంగోలీ లో ఈ పాట ఎక్కువగా వేసే వాడు. "చలాజాతాహూ కిసీకే దిల్ మే..." ఈ పాటలో మధ్య మధ్యలో కిశోర్ విరుపులు సాగతీతలు భలే ఉండేవి. ఇలాంటివే ఇంకా చాలా పాటలు ఉన్నాయ్.


ఇక ప్రస్తుతానికి వస్తే ఇంటింటి రామాయణం లోని ఈ పాటను కూడా బాలు తన స్వరంతోనే నవరసాలు పలికించేస్తారు. అక్కడక్కడ పదాలు పలకడం, సాగతీయడం లాటి సంగతులు పాటకు మరింత అందాన్ని ఇస్తాయి. "మల్లెలు పూసే వెన్నెలకాసే" అని వింటే మనకి నిజంగా వెన్నెల్లో తడిచినంత హాయైన అనుభూతి కలుగుతుందనడం అతిశయోక్తి కాదేమో. "ముసి ముసి నవ్వులలో.." అన్నచోట విరిసీ విరియని మొగ్గలా చిన్న నవ్వును మనమీద చిలకరిస్తారు.. చివరికి వచ్చే సరికి "పెనవేయి" అన్న మాట ఎంత బాగా పలుకుతారో ఆ అనుభూతి వింటే గానీ తెలియదు. వేటూరి వారి సాహిత్యం అందంగా అలరిస్తే, రాజన్ నాగేంద్ర గారి సంగీతం ఆహ్లాదకరంగా సాగిపోతుంది. మొత్తం మీద విన్నాక ఒక అందమైన అనుభూతిని మిగిల్చే ఈ పాట మన అందరి కోసం ఇక్కడ, మీరుకూడా విని ఆనందించండి.


పాట వినాలంటే ఇక్కడ నొక్కి వినండి

చిత్రం : ఇంటింటి రామాయణం(1979)
సంగీతం: రాజన్ నాగేంద్ర
సాహిత్యం : వేటూరి
గానం : యస్ పి బాలసుబ్రహ్మణ్యం

మల్లెలు పూసే.. వెన్నెల కాసే.. ఈ రేయి హాయిగా
మల్లెలు పూసే.. వెన్నెల కాసే.. ఈ రేయి హాయిగా
మల్లెలు పూసే.. వెన్నెల కాసే.. ఈ రేయి హాయిగా
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా...
మల్లెలు పూసే.. వెన్నెల కాసే.. ఈ రేయి హాయిగా

ముసి ముసి నవ్వులలో గుస గుస లాడినవే...
నా తొలి మొజులే.. నీ విరజాజులై
ముసి ముసి నవ్వులలో గుస గుస లాడినవే...
నా తొలి మోజులే.. నీ విరజాజులై

మిస మిస వన్నెలలో మిల మిల మన్నవిలే
నీ బిగి కౌగిలిలో జాబిలి రాత్రులే
కాటుకలంటుకున్న కౌగిలింత లెంత వింతలె

మనసులు పాడే మంతనమాడే ఈ పూట జంటగా
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా...
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా

హాహా..ఆ..హాహా...హా...ఆ....ఆ.......

తొలకరి కోరికలే తొందర చేసినవే
ఈ విరి శయ్యకే ఆవిరి తీరగా

తొలకరి కోరికలే తొందర చేసినవె
ఈ విరి శయ్యకే ఆవిరి తీరగా
సొగసరి కానుకలే సొద పెడుతున్నవిలే
యే తెర చాటునో ఆ చెఱ వీడగా..
అందిన పొందులోనె అందలేని విందులీయవె

కలలిక పండే కలయిక నేడే కావాలి వేయిగా
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా...
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా

మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా...
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా

image courtesy tollywoodsingers.com

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.