బుధవారం, జనవరి 30, 2013

బెంగపడి సాధించేదేవిటీ...

ఈ మధ్య వచ్చే చాలా సినిమాలలో పాటలకి ఆడియో రిలీజ్ నుండి సినిమా విడుదలైన ఒకటి రెండు వారాల వరకూ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది, అంతలోనే మరో కొత్త సినిమా పాటలు వాటిని పక్కకి తోసేస్తాయి ఒకరెండు నెలలు గడిచాక అసలా సినిమా+పాటలూ వచ్చిన విషయం కూడా మర్చిపోతాం. కానీ 1999 వరకూ వచ్చిన పాటలలో చాలావరకు పాటలకి Expiry date అనేది ఉండదు. కొన్ని పాటలు మన నిత్యజీవితంలో భాగస్వామ్యాన్ని పొందితే కొన్ని ఎప్పుడు విన్నా ఫ్రెష్ గా అలరిస్తాయి. ఆ మొదటి కేటగిరీకి చెందినదే “మనీ మనీ” సినిమాలోని ఈ “బెంగపడి సాధించేదేవిటీ” పాట. ఈ సినిమా విడుదలై ఇన్నేళ్ళైనా ఇంకా ఇప్పటికీ ఏదైనా ఇబ్బందులు వచ్చి మూడ్ బాలేకపోతే ఈ పాట పాడేస్కుని రిలాక్స్ అవుతాను. సినిమా ఫ్లాప్ అవడం వలన పాటలు కూడా అంత ప్రాచుర్యాన్ని పొందలేకపోయాయి కానీ సిరివెన్నెల గారు రాసిన పాటలలో బెస్ట్ సాంగ్స్ సరసన సులువుగా చేరిపోగల సత్తా ఉన్నది ఈ పాట.

శ్రీ సంగీత సారధ్యంలో చిత్ర, చక్రవర్తి గానం చేసిన ఈ సిరివెన్నెల రచనలో ఆంగ్ల పదాలు కాస్త ఎక్కువే కనిపించినా అవి దర్శకుడి టేస్ట్ కి సినిమా నేపధ్యానికి కరెక్ట్ గా సరిపోతాయి. ఎంతపెద్ద కష్టమైనా బాధపడుతూ కూర్చోటంవలన లాభంలేదనీ జీవితంలో ఆటుపోటులు సహజమని అర్ధంచేస్కుని ముందుకు వెళ్తూనే ఉండాలనే నీతిని చెప్తారు సిరివెన్నెల. అలా అని “పెద్ద ఓదార్చావులేవోయ్ ఇదే కష్టం నీకొస్తే తెలుస్తుంది..” అని అనే అవకాశం మనకి ఇవ్వకుండా ఒకపక్క కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో చెప్తూనే ఎదుటి వాడి కష్టాన్ని సులువుగా తీస్కుని ఓదార్చేవాళ్ళని దెప్పిపొడుస్తూ కూడా పాటంతా సరదా ఐన సంభాషణలతో నడిపించడం ఆకట్టుకుంటుంది.

నాకు ఈ పాట వీడియో కూడా చాలా ఇష్టం ఈ మనీ సిరీస్ లో జయసుధ వర్కింగ్ వుమన్ గెటప్ కానీ రేణుకసహాని నవ్వుకాని ఈ సినిమాలో కొత్తగా పరిచయం చేసిన సురభిని కానీ చూడటం విజువల్ ట్రీట్. ఇక్కడ లింక్ ఇచ్చిన వీడియోలో రెండవ చరణం ముందు చురాలియా మ్యూజిక్ బిట్ దగ్గర సురభి కింద కూచున్నపుడు జుట్టు అలల్లా ఎగురుతూ ఒక సైడ్ యాంగిల్ లో తనని అలా చూస్తుంటే అప్పట్లో కుర్రకారుకి మతిపోయేది :-) ఈ పాట వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఆడియో మాత్రమే వినాలనుకున్న వాళ్ళు ఇక్కడ వినవచ్చు.    


చిత్రం : మనీ మనీ
సాహిత్యం : సిరివెన్నెల
సంగీతం : శ్రీ
గానం : చిత్ర, చక్రవర్తి

బెంగపడి సాదించేదేవిటీ.. మనకుంది కదా టేకిటీజీ పాలసీ..
వాట్టెపిటీ(What a pity) ఏం ముంచుకొచ్చింది..
తమ ఫేసు మరి చిన్నబోయిందేమిటి
బెంగపడి సాదించేదేవిటీ.. మనకుంది కదా టేకిటీజీ పాలసీ..
ప్రాణహాని కాదు కదా ఐతే ఏమి వర్రీ..
జీవితాన ఆటుపోటులు అతి సహజం సుమతీ

అవును మరి మీ సొమ్మేం పోయింది..
మహ తేలికగా అనిపిస్తుంది మా గతి
ఏం సింపతీ.. మాబేషుగ్గా ఉంది..
దిగితేనే కదా లోతుపాతూ తేలేది
మాటతోటి మాయమయేదా మంటెత్తే సంగతీ
మాకు తెలవని థియరీలా ఇవి.. చాల్లే నీ సుత్తి

రోజూ ఎన్నో రైళ్ళూ బస్సులు పల్టి కొడుతున్నా
జర్నీ చేయక కూర్చున్నారా ఇంట్లో ఎవరైనా
బోడెగ్జాంపులు(బోడి example) అర్ధం ఏమిటి ఏడుపు నేరమనా
దెబ్బ తగలితే అబ్బా అనడా ఎంతటివాడైనా
ఇలాంటివన్ని మాములే అనుకుంటే పోలే
మరే అలాగా నువ్ పడ్డప్పుడు అనుకుంటాలే
కాలికేస్తే వేలికి వెయ్యకు లాభం ఏముంది
బాధ చూసి బోధలు చెయ్యకు ఎదోగా ఉంది

వాట్టెపిటీ ఏం ముంచుకొచ్చింది..
తమ ఫేసు మరి చిన్నబోయిందేమిటి
బెంగపడి సాదించేదేవిటీ.. మనకుంది కదా టేకిటీజీ పాలసీ..

హర్షద్ మెహతా కన్నా చక్రం అడ్డం తిరిగిందా
బోఫోర్స్ అయినా ఏ ఫోర్స్ అయినా కంట్రీ ఆగిందా
చుట్టు అంతా ఓకే ఐతే నాకేం ఒరిగిందోయ్
నా అక్కౌంట్లో మైనస్సంతా ప్లస్సైపోతుందా
ఊహూ ఉసూరుమంటే మాత్రం కలిసొస్తుందా
సరే అలా అని ఆనందిస్తే బాగుంటుందా
ఈతి భాదలన్నవి ఎరగని జీవుడి జాడేది
లేనిపోని టెన్షను దేనికి బీ బ్రేఓ సుమతీ

వాట్టెపిటీ ఏం ముంచుకొచ్చింది..
తమ ఫేసు మరి చిన్నబోయిందేమిటి
బెంగపడి సాదించేదేవిటీ.. మనకుంది కదా టేకిటీజీ పాలసీ..
ప్రాణహాని కాదు కదా ఐతే ఏమి వర్రీ..
జీవితాన ఆటుపోటులు అతి సహజం సుమతీ

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.