శుక్రవారం, అక్టోబర్ 26, 2012

పాలగుమ్మి విశ్వనాథం గారికి నివాళి.

అమ్మదొంగా నిన్ను చూడకుంటే, మా ఊరు ఒక్కసారి పోయిరావాలి లాంటి అద్భుతమైన లలిత గీతాలను రచించి స్వరపరచి గానం చేసిన లలిత సంగీత స్వర చక్రవర్తి పాలగుమ్మి విశ్వనాథంగారు తన తొంభైమూడవఏట నిన్న గురురువారం (అక్టోబర్ 25) రాత్రి కన్నుమూశారు. వారితో ఒకే ఒక్కసారి ఫోన్ లో మాట్లాడినా ఎవరో అపరిచిత అభిమాని అని అనుకోకుండా ఆత్మీయంగా ఆయన పలకరించిన తీరును మరువలేను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

పుస్తకం.నెట్ లో వారికి నివాళి : http://pustakam.net/?p=12761

ఆ రెండు పాటలు సాహిత్యం తెలుసుకుని వినాలనుకుంటే ఈ బ్లాగులోని పాత టపాలను ఇక్కడ చూడండి.
అమ్మదొంగా నిన్ను చూడకుంటే ఇక్కడ  మాఊరు ఒక్కసారి పోయిరావాలి ఇక్కడ చూడండి.
హిందూ పేపర్ లో ఈ వార్త ఇక్కడ చూడచ్చు. 
ఈనాడు వార్త

బుధవారం, అక్టోబర్ 24, 2012

నేస్తమా నేస్తమా..

కొత్తపాటల్లో లిరికల్ వాల్యూస్ వెతుక్కోడం చాలా కష్టమౌతున్న ఈ రోజుల్లో వచ్చిన ఈ పాటలో ముఖ్యంగా పల్లవి భాస్కరభట్ల పాటలా కాక కవితలా రాశారనిపించింది. దానికి చక్కని దేవీశ్రీప్రసాద్ సంగీతం, అందమైన శ్రీకృష్ణ & హరిణిల స్వరం తోడై ఈ మధ్య నేను తరచుగా వినే పాటలలో ఈపాటను ముందుంచేలా చేశాయి. మీరూ వినండి. పూర్తి పాట ఆడియో రాగాలో ఇక్కడ వినవచ్చు.


చిత్రం : మరుకం (2012)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన : భాస్కరభట్ల రవికుమార్
గానం : శ్రీకృష్ణ , హరిణి

నేస్తమా నేస్తమా నువ్వె కోయిలై వాలతానంటే
తోటలా మారనా నీకోసం
ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరుతానంటే
తూరుపై చూడనా నీకోసం
నేననే పేరులో నువ్వు , నువ్వనే మాటలో నేను
ఈ క్షణం ఎంత బాగుందో ప్రేమలాగా
ఓ హో ప్రేమకే రూపమే ఇచ్చి దానికే ప్రాణమే పోస్తే
ఉండదా నిండుగా మనలాగా..ఆ ..ఆ

ఓహనేస్తమా నేస్తమా నువ్వె కోయిలై వాలతానంటే
తోటలా మారనా నీకోసం
ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరుతానంటే
తూరుపై చూడనా నీకోసం

నువ్వంటే ఎంతిష్టం.. సరిపోదే ఆకాశం..
నాకన్నా నువ్విష్టం .. చూసావా ఈ చిత్రం..
కనుపాపలోన నీవే కల ..ఎద ఏటిలోన నువ్వే అల
క్షణ కాలమైనా చాల్లె ఇలా ..అది నాకు వెయ్యేళ్ళే ..
ఇక ఈ క్షణం.. కాలమే.. ఆగిపోవాలి.. ఓ..

నేస్తమా నేస్తమా నువ్వె కోయిలై వాలతానంటే
తోటలా మారనా నీకోసం
ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరుతానంటే
తూరుపై చూడనా నీకోసం

అలుపొస్తే తల నిమిరే చెలినవుతా నీకోసం..
నిదరొస్తే తల వాల్చే ఒడినవుతా నీకోసం..
పెదవంచు పైన నువ్వే కదా..
పైటంచు మీద నువ్వే కదా..
నడుమొంపు లోన నువ్వే కదా..
ప్రతి చోట నువ్వేలే..
అరచేతిలో.. రేఖలా.. మారిపోయావే ... ఓ

నేస్తమా నేస్తమా నువ్వె కోయిలై వాలతానంటే
తోటలా మారనా నీకోసం
ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరుతానంటే
తూరుపై చూడనా నీకోసం

బుధవారం, అక్టోబర్ 10, 2012

దులపర బుల్లోడో..

ఖంగుమని మోగే భానుమతమ్మ గారి కంచుకంఠంలో ఏపాటైనాసరే ఓ ప్రత్యేకతని సంతరించుకుంటుంది. ఇక అదే ఇలా ఆకతాయికుర్రాళ్ళకి బుద్దిచెప్పే పాటంటే ఇహ ఆలోచించనే అక్కరలేదు ఆవిడ గొంతులో “దులపర బుల్లోడో..” అని వినగానే అలాంటి ఆకతాయిల గుండెల్లో రైళ్ళు పరిగెట్టాల్సిందే :-) తెలుగు సినిమా బ్రాండెడ్ దెయ్యం సాంగ్ “నిను వీడను నేనే” పాట ఉన్న అంతస్థులు సినిమాలోనిదే ఈ పాట కూడా. భానుమతి గారి అభినయం ఆవిడకి వంతపాడే రేలంగి, రమణారెడ్డిలతో కలిసి చూడడానికి కూడా మాంచి సరదాగా ఉంటూంది ఈ పాట. యూట్యూబ్ పనిచేయనివాళ్ళు ఆడియో చిమటా మ్యూజిక్ లో ఇక్కడ వినవచ్చు.
  

చిత్రం : అంతస్థులు
సంగీతం : కె.వి.మహదేవన్
రచన : కొసరాజు
గానం : భానుమతి

దులపర బుల్లోడో.. హోయ్ హోయ్...
దులపర బుల్లోడో దుమ్ము దులపర బుల్లోడా
చిలిపి కళ్లతో షికార్లు కొట్టే మలప రాములను పిలక బట్టుకొని
వన్.. టూ.. త్రీ... చెప్పి...

॥దులపర బుల్లోడో॥

సిరిగల చుక్కల చీర కట్టుకొని
జవాది కలిపిన బొట్టు పెట్టుకొని ॥ సిరిగల॥
వరాల బొమ్మ ముద్దులగుమ్మ
కాలేజీకి కదిలిందంటే వెకిలివెకిలిగా
వెర్రివెర్రిగా వెంటపడే రౌడీల పట్టుకొని... పట్టుకొని
తళాంగు త థిగిణ తక తోం తోం అని (2)
॥దులపర బుల్లోడో॥

సాంప్రదాయమగు చక్కని పిల్ల
సాయంకాలం సినిమాకొస్తే..
వస్తే ॥ సాంప్రదాయమగు॥
అదే సమయమని ఇంతే చాలునని
పక్క సీటులో బైఠాయించుకొని.. ఎట్టా
చీకటి మరుగున చేతులు వేసే
శిఖండిగాళ్లను ఒడిసి పట్టుకొని
చింతబరికెను చేత పట్టుకొని (2)
॥దులపర బుల్లోడో॥

రోడ్డు పట్టని కారులున్నవని
మూడంతస్తుల మేడలున్నవని (2)
డబ్బు చూచి ఎటువంటి ఆడది
తప్పకుండా తమ వల్లో పడునని
ఈలలు వేసి సైగలు చేసే
గోల చేయు సోగ్గాళ్ళను బట్టి... పట్టి
వీపుకు బాగా సున్నం పెట్టి (2)
॥దులపర బుల్లోడో॥

మాయమర్మం తెలియని చిన్నది
మంగళగిరి తిరనాళ్లకు పోతే... పోతే
॥మాయమర్మం॥
జనం ఒత్తిడికి సతమతమౌతూ
దిక్కుతోచక తికమక పడితే అయ్యయ్యో
సందు చూసుకొని సరసాలకు
దిగు గ్రంధసాంగులను కాపు వేసుకొని
రమా రమణ గోవిందా... (2)
॥దులపర బుల్లోడో॥

బుధవారం, అక్టోబర్ 03, 2012

శ్యామసుందరా ప్రేమమందిరా

ఆదినారాయణరావు గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన భక్తతుకారం సినిమాలోని పాటలు అన్నీ కూడా సూపర్ హిట్సే, ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాటలు. ఇందులోని ఈ "శ్యామసుందరా ప్రేమమందిరా" పాటంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం. తత్వాలతో కూడి పల్లెపదం/జానపదంలా అనిపించే ఈపాట ఎప్పుడు విన్నా నాకు తెలియకుండానే గొంతు కలిపేస్తాను.
 
దాశరధి గారి సాహిత్యంలో "అణువణువు నీ ఆలయమేరా నీవే లేని చోటులేదురా", "అహము విడిచితే ఆనందమురా", "సాధన చేయుమురానరుడా సాధ్యముకానిది లేదురా", "అణిగిమణిగి ఉండేవాడే అందరిలోకి ఘనుడు". "దొడ్డమానులను కూల్చుతుఫాను గడ్డిపరకను కదల్చగలదా", "బుడగవంటి బ్రతుకు ఒక చిటికెలోన చితుకు" వంటి మాటలు జీవితాంతం గుర్తుంచుకోవలసిన సత్యాలు. ఆదినారాయణరావు గారి బాణిలో ఆమాటలు అలా అలవోకగా నోటికి వచ్చేస్తాయి. రామకృష్ణ గారి స్వరం కూడా ప్రత్యేకంగా ఉండి ఆకట్టుకుంటుంది.
 
ఆడియోలో ఒకే పాటగా విడుదలైనా సినిమాలో ఈ పాట మొదటి రెండు చరణాలు ఒకసారి మిగిలిన రెండు చరణాలు వేరే పాటలా వస్తాయి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చివరి రెండు చరణాలు పడవెళ్ళిపోతోందిరా పాటగా ఇక్కడ చూడవచ్చు.  


చిత్రం: భక్త తుకారాం (1973)
సంగీతం: ఆదినారాయణరావు
సాహిత్యం: దాశరథి
గానం: రామకృష్ణ

శ్యామ సుందరా ప్రేమ మందిరా
నీ నామమే వీనుల విందురా
నీ నామమే వీనుల విందురా..
శ్యామసుందరా ...

అణువణువు నీ ఆలయమేరా.. నీవే లేని చోటు లేదురా
అణువణువు నీ ఆలయమేరా నీవే లేని చోటు లేదురా
నేనని నీవని లేనే లేదూ నీకు నాకు బేధమే లేదు

||శ్యామ సుందరా||
సుఖ దుఃఖాలకు నిలయం దేహం ఈ దేహము పై ఎందుకు మోహం
అహము విడిచితే ఆనందమురా అన్నిట మిన్నా అనురాగమురా
భక్త తుకారాం బోధలు వింటే తొలగిపోవును శోకమురా

||శ్యామ సుందరా||
సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా (2)
అలవాటైతే విషమే అయినా హాయిగా త్రాగుట సాధ్యమురా..
హాయిగ త్రాగుట సాధ్యమురా
సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా

కాలసర్పమును మెడలో దాల్చి పూల మాలగా తలచ వచ్చురా...
పూల మాలగా తలచ వచ్చురా
ఏకాగ్రతతో ధ్యానము చేసి లోకేశ్వరునే చేరవచ్చురా..
లోకేశ్వరునే చేరవచ్చురా

దాస తుకారాం తత్వ బోధతో తరించి ముక్తిని పొందుమురా..
తరించి ముక్తిని పొందుమురా

సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా

ఓహోహో హొయ్యారె హొయ్యారే హొయ్ హొయ్యా.. హొహోయ్..
ఓహోహో హొయ్యారె హొయ్యారే హొయ్ హొయ్యా.. 


అణిగిమణిగి ఉండేవారే అందరిలోకి ఘనులు హొహోయ్ (2)
దొడ్డమానులను కూల్చు తుఫాను గడ్డి పరకను కదల్చగలదా.. కదల్చగలదా
చిన్న చీమలకు చక్కెర దొరుకును గొప్ప మనిషికి ఉప్పే కరువు.. ఉప్పే కరువు
అణకువ కోరే తుకారామునీ మనసే దేవుని మందిరము.. మనసే దేవుని మందిరము
హోయ్ అణిగిమణిగి ఉండేవారే అందరిలోకి ఘనులు హొహోయ్
అణిగిమణిగి ఉండేవారే అందరిలోకి ఘనులు

హైలెస్సా హైలెస్సా హైలెస్సా
హైలెస్సా హైలెస్సా హైలెస్సా

పడవెళ్ళిపోతోందిరా...ఆ ఆ ఆ ఆ ఓ ఓ ...
పడవెళ్ళిపోతుందిరా ఓ మానవుడా దరి చేరే దారేదిరా
నీ జీవితము కెరటాల పాలాయెరా
పడవెళ్ళిపోతోందిరా..
హైలెస్సా హైలెస్సా హైలెస్సా..
హైలెస్సా హైలెస్సా హైలెస్సా..

తల్లిదండ్రి అతడే నీ ఇల్లు వాకిలతడే(2)
ఆ పాండురంగడున్నాడురా ఆ ఆ ... నీ మనసు గోడు వింటాడురా
నీ భారమతడే మోసేనురా ఓ యాత్రికుడా నిన్నతడే కాచేనురా..
పడవెళ్ళిపోతోందిరా.....

బుడగవంటి బ్రతుకు ఒక చిటికెలోన చితుకు(2)
ఇది శాశ్వతమని తలచేవురా ఆ ఆ...
నీవెందుకని మురిసేవురా..
నువు దరిజేరే దారి వెదకరా ఓ మానవుడా హరినామం మరువవద్దురా..
పడవెళ్ళిపోతుందిరా ఆ ఆ......

హైలెస్సా హైలెస్సా హైలెస్సా
హైలెస్సా హైలెస్సా హైలెస్సా
హైలెస్సా హైలెస్సా హైలెస్సా

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.