
సరే ఇంకా రామనవమి అనగానే నాకు సీతారాముల కల్యాణం చూతము రారండీ పాట గుర్తొస్తుంది. ఆ పాటా, ఇంకా పందిళ్ళ లో క్రమం తప్పకుండా వేసే లవకుశ లో పాటలు భాస్కర్ గారు తన టపా లో అల్రెడీ వేసేసారు (ఆ టపా ఇక్కడ చూడండి) ఇవేకాక ఇంకా సీతారామ కల్యాణం అనగానే ఖచ్చితంగా ఓ రెండు హరికధలు గుర్తుకు వస్తాయి. ఈ రెండూ సోషల్ సినిమాలకు సంభందించినవైనా అందులో సీతా రాములను చూపించక పోయినా ఆ వర్ణన, సంగీతం, గాత్రం మనల్ని మంత్ర ముగ్దులను చేస్తాయి. వాటిలో మొదట గుర్తు వచ్చేది వాగ్దానం సినిమా లో ఘంటసాల గారు గానం చేసిన సీతా కళ్యాణం హరికధ. రేలంగి గారి బాణి లో చిన్న చిన్న చెణుకు లు విసురుతూ నవ్విస్తూ హుషారు గా సాగే కధ లో మనం మైమరచి పోతాం. "రఘూ రాముడూ... రమణీయ..." అని మొదలు పెట్టగనే తెలియకుండానే తన్మయంగా తల ఊపేస్తాం.. "ఎంత సొగసు కాడే.." అంటే అవును కదా అని అనిపించక మానదు... అసలు సొగసు అన్న మాట పలకడం లోనే ఘంటసాల గారు ఆ దివ్య సుందర మూర్తిని సాక్షాత్కరింప చేస్తారు. ఇక చివరికి వచ్చే సరికి హెచ్చు స్వరం లో ఒక్క సారి గా "ఫెళ్ళు మనె విల్లు... " అనగానే సీతమ్మవారి సంగతేమో కానీ కధ వింటున్న వారెవ్వరికైనా గుండె ఝల్లు మనక మానదు అంటే నమ్మండి. ఈ పాట నాకు పూర్తిగా ఎక్కడా దొరక లేదు. దొరికిన వెంటనే పోస్ట్ చేస్తాను.
ఇక రెండోది స్వాతి ముత్యం సినిమా లోనిది. విశ్వనాధ్ గారి దర్శకత్వం, కమల్ అభినయం, హరికధ, భజన, కోలాటం అన్ని కలిపి ఇళయరాజా గారు స్వరకల్పన చేసిన ఈ పాటను బాలు గారు అలరిస్తారు. నాకు ఈ పాట చాలా ఇష్టమ్ ఎక్కువ సార్లు వినడం వలనో ఏమో దదాపు నోటికి కంఠతా వచ్చు :) కాలేజ్ లో కూడా ఒకరిద్దరు ఫ్రెండ్స్ అడిగి మరీ ఈ పాట పాడించుకునే వారు నా చేత... ఈ పాట శ్రీరామ నవమి సంధర్బంగా మీ కోసం.
చిత్రం: స్వాతిముత్యం (1986)
గానం : బాలసుబ్రహ్మణ్యం,శైలజ
సాహిత్యం : ఆత్రేయ
సంగీతం : ఇళయరాజ
రామా కనవేమి రా
రామా కనవేమిరా శ్రీ రఘు రామ కనవేమిరా
రామా కనవేమి రా
రమణీ లలామ నవ లావణ్య సీమ
ధరాపుత్రి.. సుమ గాత్రి..
ధరాపుత్రి సుమ గాత్రి నడయాడి రాగా
రామా కనవేమి రా !!
సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేసించే జానకిని
సభాసదులందరు పదే పదే చూడగా శ్రీ రామ చంద్ర మూర్తి
కన్నెత్తి సూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు
||రామా కనవేమి రా||
ముసి ముసి నగవుల రసిక శిఖామణులు సా నిదమ ప మగరిస
ఒసపరి చూపుల అసదృశ విక్రములు సగరిగ మనిద మ ని ని
ముసిముసి నగవుల రసిక శిఖామణులు తా తకిట తక ఝణుత
ఒసపరి చూపుల అసదృశ విక్రములు తకఝణు తకధిమి తక
మీసం మీటే రోష పరాయణులు నీ దమప మా గరిగ
మా సరి ఎవరను మత్త గుణొల్వణులూ.. ఆహ..
క్షణమే.. ఒక దినమై.. నిరీక్షణమే.. ఒక యుగమై...
తరుణి వంక శివ ధనువు వంక
తమ తనువు మరచి కనులు తెరచి చూడగ
రామా కనవేమిరా..కనవేమిరా..
ముందుకేగి విల్లందబోయి ముచ్చెమటలు కక్కిన దొరలు భూ వరులు
తొడగొట్టి ధనువు చేపట్టి బావురని గుండెలు జారిన విభులు
ముందుకేగి విల్లందబోయి ముచ్చెమటలు కక్కిన దొరలు భూ వరులు
తొడగొట్టి ధనువు చేపట్టి బావురని గుండెలు జారిన విభులు
అహ గుండెలు జారిన విభులు
విల్లెత్తాలేక మొగమెత్తాలేక సిగ్గేసిన నరపుంగవులూ
తమ వళ్ళు వొరిగి రెండు కళ్ళు తిరిగి వొగ్గేసిన పురుషాగ్రణులూ
ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
ఆ ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
అరెరె ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
అహ ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
కడక తైయ్యకు తా ధిమి తా..
రామాయ రామభద్రాయ రామచంద్రాయ నమః
అంతలొ రామయ్య లేచినాడు ఆ వింటి మీద చెయ్యి వేసినాడు
అంతలొ రామయ్య లేచినాడు ఆ వింటి మీద చెయ్యి వేసినాడు
సీత వంక ఓరకంట చూసినాడు
సీత వంక ఓరకంట చూసినాడు
ఒక్క చిటికలో విల్లు ఎక్కు పెట్టినాడు
చిటికలో విల్లు ఎక్కు పెట్టినాడు
ఫెళ ఫెళ ఫెళ ఫెళ ఫెళ ఫెళ విరిగెను శివ ధనువు
కళలొలికెను సీతా నవ వధువు
జయ జయ రామ రఘుకుల సొమ ||2||
దశరథ రామ దైత్యవి రామ ||2||
జయ జయ రామ రఘుకుల సొమ ||2||
దశరథ రామ దైత్యవి రామ ||2||
సీతా కల్యాణ వైభోగమే శ్రీ రామ కల్యాణ వైభోగమే ||2||
కనగ కనగ కమనీయమె అనగ అనగ రమణీయమె ||2||
సీతా కల్యాణ వైభోగమే శ్రీ రామ కల్యాణ వైభోగమే
రామయ్య అదుగోనయ్య
రమణీ లలామ నవ లావణ్య సీమ
ధరాపుత్రి సుమ గాత్రి నడయాడి రాగా
రామా కనవేమిరా శ్రీ రఘు రామ కన వేమిరా ఆ.. ఆ.. ఆ..
రామా కనవేమి రా