ఆదివారం, జనవరి 31, 2010

బాణం - నాలోనేనేనా, మోగిందీ జేగంటా

బాణం, రొటీన్ చిత్రాల ప్రవాహంలో ఓ వైవిధ్యమైన ప్రయత్నం. ఈ సినిమా కాన్సెప్ట్ ఎంత వైవిధ్యంగా రఫ్ గా ఉంటుందో దీనిలో ప్రేమకథ అంతే వైవిధ్యంగా సున్నితంగా ఉంటుంది. ఆ ప్రేమకథకు తగినవిధంగా ఉన్నవి రెండే పాటలు అయినా చక్కని మెలొడీతో ఆకట్టుకుంటాయి. రిలీజ్ అయిన దగ్గర నుండీ ఈ సినిమా పాటలు రెండూ నను వెంటాడుతూనే ఉన్నాయి వారానికి ఒక సారైనా వినకుండా ఉండనివ్వట్లేదు. ఒక వేళ మీరు ఇంతవరకూ విని ఉండక పోతే వెంటనే వినేయండి. మణిశర్మగారు స్వరపరిచిన ఈ రెండు పాటల సంగీతం, సాహిత్యం మరియూ చిత్రీకరణ అన్నీ ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నట్లు ఉంటాయి కాని వీడియో కేవలం ఒక నిముషం నిడివి ఉన్నవి మాత్రమే దొరికాయి. కనుక పూర్తి పాట ఆడియో లింకుల్లో వినండి.

నాకు అత్యంత ఇష్టమైన మొదటి పాట "నాలో నేనేనా" ఈ మధ్య వరకూ కూడా దదాపు ప్రతిరోజూ రెండు మూడు సార్లైనా ఈ పాట కొంతైనా వినేంతగా నచ్చింది. దీని అందమైన లిరిక్ ఒక ఎత్తైతే ఈ పాటకు మరింత అందం చేకూర్చింది హేమచంద్ర గానం. మణిశర్మ మెలొడీ.. ఈ మధ్యకాలంలో ఇంత శ్రద్దగా మణి చేసిన ట్యూన్ లేదేమో అనిపించేంతగా, ఇంకా చెప్పాలంటే అసలు మణిశర్మేనా ఈ ట్యూన్ కట్టింది అనిపించేలా స్వరపరిచారు. దానిని అంతే అందంగా హేమచంద్ర సైంధవి తమ గళాల్లో పలికించారు.

"నేనేనా.. ఏదో అన్నానా.. నువ్వు విన్నావా.. ఇంతకీ ఏం విన్నావ్" అంటూ తనతో తనులేని కథానాయకుని మైమరుపుని స్పష్టంగా చెప్తూ పల్లవి మొదలెట్టించేస్తారు. మొదటి చఱణం లో కథానాయకుడు "తడబాటుని దాటేసి, పరదాలను తొలగించుకుని.. ప్రాణమే పలుకుగా వెలువడనీ" అని చెప్తుంటే, కథానాయికతో "మన పిచ్చిగానీ అసలు ఎదలో ఉన్నదంతా పదాల్లో పలుకుతుందా ? నా మౌనమే ప్రేమాలాపన.. నామనసున ఉన్నది నీ మాటల్లో బయటకు వస్తుంటే ఇక మన మధ్య మాటలెందుకు ? అనిపించి, వారిద్దరి మధ్య ఉన్న అనుభంధాన్ని మనకి స్పష్టంగా అర్ధమయ్యేలా చెప్పేస్తారు. ఇక రెండో చఱణంలో కథానాయిక "సాక్షాత్తూ ఆ దైవమే వరంగా నాలో సగమై నాకు దొరికింది" అని చెప్తుంటే నీతో చెలిమి చేస్తున్న నిముషాలు నూరేళ్ళుగా ఎదిగిపోయాయి.. మన మనువుకు మనమే సాక్ష్యం, మన మాటే మంత్రం, మన మధ్యఉన్న ప్రేమే మనని కలిపి ఉంచే బంధం.." అని కథానాయకునితో అనిపించి ఆ అనుభంధాన్ని మరింత దృఢంగా చూపించేస్తారు.



02 Naalo Nenena [a...

చిత్రం : బాణం
సహిత్యం : రామజోగయ్య శాస్త్రి
సంగీతం : మణి శర్మ
గానం : హేమచంద్ర , సైంధవి

నాలో నేనేనా.. ఏదో అన్నానా..
నాతో నేలేని మైమరపునా..
ఏమో అన్నానేమో.. నువ్వు విన్నావేమో..
విన్న మాటేదో నిన్నడగనా ||నాలో నేనేనా||

అలా సాగిపోతున్న నాలోన
ఇదేంటిలా కొత్త ఆలోచన
మనసే నాదీ.. మాటే నీదీ..
ఇదేం.. మాయో...

నాలో నేనేనా.. ఏదో అన్నానా..
నాతో నేలేని మైమరపునా..
ఏమో అన్నానేమో.. నువ్వు విన్నావేమో..
చిన్న మాటేదో నిన్నడగనా..

ఔనూ కాదు తడబాటునీ.. అంతో ఇంతో గడి దాటనీ..
విడి విడి పోనీ పరదానీ.. పలుకై రానీ ప్రాణాన్నీ..
ఎదంతా పదాల్లోన పలికేనా.. 
నా మౌనమే ప్రేమ ఆలాపన..
మనసే..నాదీ.... మాటే..నీదీ..
ఇదేం.. మాయో..

నాలో నేనేనా.. ఏదో అన్నానా..
నాతో నేలేని మైమరపునా..
ఏమో అన్నానేమో.. నువ్వు విన్నావేమో..
చిన్న మాటేదో నిన్నడగనా..

దైవం వరమై దొరికిందనీ.. నాలో సగమై కలిసిందనీ
మెలకువ కానీ హృదయాన్నీ.. చిగురై పోనీ శిశిరాన్నీ..
నీతో చెలిమి చెస్తున్న నిమిషాలూ..
నూరేళ్ళుగా ఎదిగిపోయాయిలా..
మనమే సాక్ష్యం... మాటే మంత్రం
ప్రేమే.. బంధం..

నాలో నేనేనా.. ఏదో అన్నానా..
నాతో నేలేని మైమరపునా..
ఏమో అన్నానేమో.. నువ్వు విన్నావేమో..
చిన్న మాటేదో నిన్నడగనా..

~*~^~*~^~*~^~*~^~*~^~*~^~*~^~*~

ఇదే సినిమాలో నాకు నచ్చిన మరో అందమైన పాట "మోగిందీ జేగంటా". అసలు ఈ పాటకన్నా శ్రేయ గొంతు విని తన్మయత్వంలో మునిగిపోయేవాడ్ని. "తననాన నానాన" అని తను మొదలు పెట్టగానే ఏదో లోకంలోకి వెళ్ళిపోతాం. ఆ తర్వాత కమ్మనైన తన కంఠస్వరం ఆ అందమైన ట్యూన్ లో వయ్యారాలు పోతుంటే అసలు లిరిక్ పై ధ్యాస ఎక్కడ పెట్టగలం మీరే చెప్పండి.అలా ముందు ఒక పాతిక సార్లు ఆ గొంతు విని ఆ మాయాజాలం తట్టుకుని బయట పడిన తర్వాత లిరిక్ పై ధ్యాస పెడితే వహ్వా రామజోగయ్య శాస్త్రి గారు ఎంత బాగా రాశారు పాట అని అనుకోకుండా ఉండలేము.

కొన్ని పాటలు మాములుగా వినడం కన్నా సినిమాలో చూసినపుడు లిరిక్ మరింత అర్ధవంతంగా అనిపించి మరింత బాగా నచ్చేస్తాయి, అటువంటి పాటలలో ఇదికూడా ఒకటి. పాట ప్రారంభంలోనే "జేగంట మోగింది.. అంతా మంచే జరుగుతుందని మనసు చెబుతుంది" అంటూ అమాయకత్వం నిండిన హీరోయిన్ చెపుతుంటే ఆ మాటలను శ్రేయ గొంతులో వింటూ "మరే ఇంత అమాయకురాలికి అంతా మంచే జరగాలి" అని మనం కూడా మనసులో ఆశీర్వదించేస్తాం. "ననుపిలిచినదీ పూబాటా.. తనతో పాటే వెళిపోతా" అని అంటుంటే అప్పటికే హీరో స్వభావం తెలిసిన మనం ఏం పర్లేదు వెళ్ళిపో అంటూ భరోసా ఇచ్చేస్తాం.

ఇక చరణం మొదలెట్టాక "అలుపెరుగనీ పసి మనసునై సమయంతో వెళుతున్నా" అంటూ కథానాయిక స్వభావాన్ని అద్భుతంగా ఆవిష్కరించేస్తారు రచయిత. "ఏ దూరమో.. ఏ తీరమో ప్రశ్నించనీ పయనం లోనా.. ఈ దారితో సహవాసమై కొనసాగనా ఏదేమైనా.." అంటూ తన భరోసాను మనకి తెలియచేసి "మనకి కూడా ఇంతటి భరోసా చూపగల తోడు దొరికితే బాగుండు" అనిపించేస్తాడు.

రెండవ చరణం లో "కల నిలవనీ కనుపాపలో కళలొలికినదోఉదయం.. అది మెదలుగా నను ముసిరినా ఏకాంతం మటుమాయం.." అని అంటూ తన ఒంటరితనం అతని చెలిమితో ఎలా మాయమయ్యిందో వివరించేస్తారు. "చిరు నవ్వుతో ఈ పరిచయం వరమై ఇలా నను చేరిందా" అంటూ తన ఆరాధనను ఒక్క లైన్ లో చెప్పించేస్తారు.

04 Mogindi Jeganta...


చిత్రం : బాణం
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : శ్రేయా ఘోషల్

తననాన నానాన..
తననాన నానాన..

మోగిందీ జేగంటా.. మంచే జరిగేనంటా..
మనసంటోందీ ఈ మాటా..
కొలిచే దైవాలంతా.. దీవించారనుకుంటా..
నను పిలిచినదీ పూబాటా..
తనతోపాటే వెళిపోతా
ఆకాశం నీడంతా నాదేనంటోందీ..
అలలు ఎగసే.. ఆశా..
ఏ చింతా కాసింతా లేనే లేదందీ
కలత మరిచే.. శ్వాస..

||మోగిందీ జేగంటా||

పద పదమనీ నది నడకనీ ఇటు నడిపినదెవరైనా..
తన పరుగులో తెలినురగలో నను నేనే చూస్తున్నా..
ప్రతి పిలుపునీ కథమలుపనీ మలి అడుగులు వేస్తున్నా..
అలుపెరుగనీ పసిమనసునై సమయంతో వెళుతున్నా..
నలుసంత కూడా నలుపేది లేనీ.. వెలుగుంది నేడూ నా చూపునా
ఏ దూరమో.. ఏ తీరమో ప్రశ్నించనీ పయనం లోనా..
ఈ దారితో సహవాసమై కొనసాగనా ఏదేమైనా..ఆఆఆఅ...

||మోగిందీ జేగంటా||

ఒక చలువలా ఒక విలువలా జత కలిసినదోసాయం..
మనసెరిగినా మధుమాసమై నను చేర్చిందీ గమ్యం..
కల నిలవనీ కనుపాపలో కళలొలికినదోఉదయం
అది మెదలుగా నను ముసిరినా ఏకాంతం మటుమాయం..
నా చుట్టూ అందంగా మారింది లోకం.. ఊహల్లోనైనా లేదీ నిజం
చిరు నవ్వుతో ఈ పరిచయం వరమై ఇలా నను చేరిందా
బదులడగనీ ఈ పరిమళం నా జన్మనే మురిపించేనా..ఆఆఆఅ..

||మోగిందీ జేగంటా||

బుధవారం, జనవరి 06, 2010

శివారెడ్డి మిమిక్రీ వీడియో

నేను ఎపుడైనా రిలాక్స్ అవ్వాలంటే యూట్యూబ్ లో చూసే వీడియోలలో శివారెడ్డి మిమిక్రీ వీడియోలు ఖచ్చితంగా ఉంటాయి. కేవలం ద్వని అనుకరణకు పరిమితం కాకుండా మ్యానరిజమ్స్ క్యాచ్ చేసి వాటిని అనుకరించడం శివారెడ్డికి ఇంత పేరు రావడానికి కారణం అని నేను అనుకుంటూ ఉంటాను. వజ్రోత్సవాల ఫంక్షన్ లో డ్యాన్సు లతో చూసిన వీడియో అంతా చూసి ఉంటారు. లేదంటే రిలేటెడ్ వీడియోలల్లో అవికూడా దొరకవచ్చు ప్రయత్నించండి. మొదట ఇచ్చినది ప్రముఖులు వీధుల్లో అమ్మకాలు చేపడితే ఎలా ఉంటుంది అనే అంశం దీనిలో కృష్ణం రాజు హైలైట్. ఇక రెండోది రాజకీయ నాయకుల ఎదురుగా వాళ్ళ గొంతులను అనుకరించడం. ఇందులో సత్యన్నారాయణ గారి గొంతు హైలైట్. ఇక మూడోది, ఈ చిచ్చర పిడుగు పేరు నాగేంద్ర అనుకుంటాను, ఇతను కూడా చాలా బాగా చేస్తున్నాడు. ఇందులో బాలకృష్ణ గారి కుక్క మిమిక్రి హైలైట్ :-)












నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.