సోమవారం, ఫిబ్రవరి 25, 2013

జరుగుతున్నది జగన్నాటకం

ఈ రోజుల్లో తొమ్మిదిన్నర నిముషాల పాట ఎవరు చూస్తారంటూ అందరూ డిస్కరేజ్ చేయడంతో తాను ఈ పాటని పూర్తిగా ఒకే చోట ఉపయోగించలేకపోయానని క్రిష్ బాధపడినా కూడా గతేడాది జరిగిన కొన్ని అద్భుతాలలో ఒకటైన ఈపాటని సినిమాలో సరిగా చిత్రీకరించనందుకు తనని నేను ఎప్పటికీ క్షమించలేను. సిరివెన్నెల గారు దశావతారాల గురించి రాసిన ఈ పాట బాల సుబ్రహ్మణ్యం గారు పాడటంతో ఖచ్చితంగా మరింత ఆకట్టుకుందనడంలో ఏ సందేహం లేదు. మణిశర్మ ప్రేరణ పొందిన సంగీతం ఉపయోగించినా అది పాటకు బహుచక్కగా అమరింది. సినిమాలో ఒకే చోట ఉపయోగించకపోయినా అక్కడక్కడ నేపధ్యంలో బాలు స్వరంలో వినవచ్చిన ఈ పాట సినిమా మూడ్ ని ఎలివేట్ చేస్తుంది. 

ఈ పాట వింటున్నపుడు అక్కడక్కడా కొన్ని పదాలు అర్ధంకాక పోయినా కూడా ఒక అవ్యక్తమైన అనుభూతికి లోనై రోమాలు నిక్కబొడుచుకోవడాన్ని ప్రత్యక్షంగా అనుభవించవచ్చు. మొన్నే పాడుతాతీయగా కార్యక్రమంలో ఈ పాట గురించి చర్చిస్తూ 'విలయం విజృంభించునని' అన్నమాటలో విజృంభణని అందరూ జకి జవత్తు ఇచ్చి స్ట్రెస్ చేసి ఎలా పలుకుతారో చెప్పి అది తప్పని అక్కడ జవత్తులేదని కేవలం అర్ధం వల్ల అలా ఫోనొటిక్ స్ట్రెస్ తో పలుకుతున్నామని సరైన ఉచ్చారణ వత్తులేకుండా పలికే విజృంభణ అని వివరించడం చూసి అచ్చెరువొందాను. క్రిష్ ని చాలామంది అదేంటి బాలుగారు అలా వత్తులేకుండా తప్పు పాడారు అని ప్రశ్నిస్తే వివరణ ఇవ్వాల్సి వచ్చిందట. ఈ పాటకు ఎవరో దశావతారలతో చక్కని వీడియో ప్రజంటేషన్ చేశారు అది మీకోసం ఇక్కడ ఇస్తున్నాను. ఆడియో మాత్రమే కావాలనుకున్న వారు రాగాలో ఇక్కడ వినవచ్చు. ఈ పాటలోని క్లిష్టమైన పదాలకు ప్రతిపదార్ధం మరియూ ఆంగ్లంలో అర్ధమూ కావాలంటే ఈ పాట గురించి ఐడిల్ బ్రెయిన్ లో విజయసారధి గారు రాసిన సమగ్రమైన వ్యాసం ఇక్కడ చదవండి.  


చిత్రం : కృష్ణం వందే జగద్గురుమ్
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం

జరుగుతున్నది జగన్నాటకం .. జరుగుతున్నది జగన్నాటకం ..
పురాతనపు పురాణ వర్ణన పైకి కనబడుతున్న కథనం
నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్ధం

జరుగుతున్నది జగన్నాటకం .. జరుగుతున్నది జగన్నాటకం ..
 

చెలియలి కట్టను తెంచుకొని విలయము విజృంభించునని
ధర్మ మూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని
సత్యవ్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి
నావగ త్రోవను చూపిన మత్స్యం కాలగతిని సవరించిన సాక్ష్యం


చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే
పొందగోరినదందలేని నిరాశలో అణగారిపోతే
బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక
ఓటమిని ఓడించగలిగిన ఓరిమే కూర్మమన్నది క్షీరసాగరమథన మర్మం


ఉనికిని నిలిపే యిలను కడలిలో కలుపగనురికే ఉన్మాదమ్మును
కరాళ దంష్ట్రుల కుళ్ళగించి యీ ధరాతలమ్మును ఉధ్ధరించగల
ధీరోధ్ధతి రణ హుంకారం ఆదివరాహపు ఆకారం

 

ఏడీ ఎక్కడరా నీ హరి ? దాక్కున్నాడేరా భయపడి ?
బయటకి రమ్మనరా .. ఎదుటపడి నన్ను గెలవగలడా తలపడి ?
నువు నిలిచిన యీ నేలని అడుగు .. నీ నాడుల జీవ జలమ్ముని అడుగు
నీ నెత్తుటి వెచ్చదనాన్నడుగు నీ ఊపిరిలో గాలిని అడుగు
నీ అడుగుల ఆకాశాన్నడుగు నీలో నరునీ హరినీ కలుపు
నీవే నరహరివని నువు తెలుపు

ఉన్మత్త మాతంగ భంగి ఘాతుక వితతి
హంతృ సంఘాత నిర్ఘృణ నిబడమే జగతి
అఘము నగమై ఎదిగె అవనికిదె అశనిహతి
ఆతతాయుల నిహతి అనివార్యమౌ నియతి
శితమస్తి హత మస్తకారి నఖ సమకాసియో
కౄరాసి గ్రోసి హుతదాయ దంష్ట్రుల ద్రోసి మసిజేయు మహిత యజ్ఞం

అమేయమనూహ్యమనంత విశ్వం.. 

ఆ బ్రహ్మాండపు సూక్ష్మ స్వరూపం ఈ మానుష రూపం .. 
కుబ్జాకృతిగా బుధ్ధిని భ్రమింపజేసే.. అల్పప్రమాణం
ముజ్జగాలనూ మూడడుగులతో కొలిచే త్రైవిక్రమ విస్తరణం
 


జరుగుతున్నది జగన్నాటకం జగ జగ జగ జగ జగన్నాటకం
జరుగుతున్నది జగన్నాటకం జగ జగ జగ జగ జగమే నాటకం

పాపపు తరువై పుడమికి బరువై పెరిగిన ధర్మగ్లానిని పెరుకగ
పరశురాముడై .. భయదభీముడై .. పరశురాముడై భయదభీముడై
ధర్మాగ్రహ విగ్రహుడై నిలచిన శోత్రియ క్షత్రియ తత్వమే భార్గవుడు


ఏ మహిమలూ లేక యే మాయలూ లేక నమ్మశక్యముగాని యే మర్మమూ లేక
మనిషిగానే పుట్టి మనిషిగానే బ్రతికి మహిత చరితగ మహిని మిగలగలిగే మనికి
సాధ్యమేనని పరంధాముడే రాముడై ఇలలోన నిలచే

ఇన్ని రీతులుగా యిన్నిన్ని పాత్రలుగా నిన్ను నీకే నూత్నపరిచితునిగా
దర్శింపజేయగల జ్ఞాన దర్పణము కృష్ణావతారమే సృష్ట్యావరణతరణము


అణిమగా మహిమగా గరిమగా లఘిమగా ప్రాప్తిగా ప్రాకామ్యవర్తిగా
ఈశత్వముగా వశిత్వమ్ముగా నీలోని అష్ట సిధ్ధులూ నీకు కన్పట్టగా
స్వస్వరూపమే విశ్వరూపమ్ముగా

నరుని లోపలి పరునిపై దృష్టి పరుపగా
తలవంచి కైమోడ్చి శిష్యుడవు నీవైతె నీ ఆర్తి కడతేర్చు ఆచార్యుడవు నీవే


వందే కృష్ణం జగద్గురుమ్ వందే కృష్ణం జగద్గురుమ్
కృష్ణం వందే జగద్గురుమ్ కృష్ణం వందే జగద్గురుమ్
వందే కృష్ణం జగద్గురుమ్ వందే కృష్ణం జగద్గురుమ్
కృష్ణం వందే జగద్గురుమ్ కృష్ణం వందే జగద్గురుమ్
కృష్ణం వందే జగద్గురుమ్

శుక్రవారం, ఫిబ్రవరి 15, 2013

ఈ బ్లాగ్ పేరు మార్పు.

ఫ్రెండ్స్,

రేపటినుండి ఈ బ్లాగ్ పేరు మార్చాలని నిర్ణయించుకున్నాను. 

ఇప్పటి వరకూ "సరిగమల గలగలలు" అనే పేరున్న ఈ బ్లాగ్ ను రేపటినుండి "పాటతో నేను" అని మార్చబోతున్నాను కనుక ఇకపై అగ్రిగేటర్స్ లోనూ గూగుల్ లోను ఇతర లింక్స్ లోనూ ఈ బ్లాగ్ ఇదే పేరుతో కనిపిస్తుంది. ఐతే బ్లాగ్ అడ్రస్ (URL) మార్చకుండా పాతదే (sarigamalagalagalalu.blogspot.com) ఉంచడం వలన ఈ బ్లాగ్ కు లింక్ చేసి ఉన్న, బుక్ మార్క్ చేసుకున్న మిత్రులు ఏ విధమైన మార్పూ చేయాల్సిన అవసరం ఉండదు. కేవలం రేపటి నుండి మీ లింక్ లిస్ట్ లో "పాటతో నేను" అన్న పేరు కనిపిస్తే అది ఒకప్పటి 'సరిగమల గలగలలు' బ్లాగే అన్న విషయం గుర్తుంచుకుంటే చాలు. 

ఇపుడీ పేరు మార్పిడికి పెద్దకారణాలు ఏవీ లేవు నా మెయిన్ బ్లాగ్ "నాతో నేను నాగురించి" కి అనుబంధంగా ఈ "పాటతో నేను" అన్న పేరు ఈ పాటల బ్లాగ్ లక్షణానికి దగ్గరగా మరింత బాగుంటుందని మారుస్తున్నాను అంతే. ఈ పేరు నేనీ బ్లాగ్ క్రియేట్ చేసినపుడు తట్టనందుకు నన్ను నేను తిట్టుకున్నా ఇప్పటికైనా ఈ ఐడియా వచ్చినందుకు మెచ్చుకుని ఇలా బ్లాగ్ టైటిల్ మారుస్తున్నాననమాట. కనుక గుర్తుంచుకోండి మిత్రులు రేపటినుండి "పాటతో నేను" అనే బ్లాగ్ కనిపిస్తే అది మీరు గత నాలుగేళ్ళగా ఆదరిస్తున్న 'సరిగమల గలగలలు' బ్లాగ్ మాత్రమే తప్ప కొత్తది కాదు :-)

గురువారం, ఫిబ్రవరి 14, 2013

करिये ना - Taal (1999)

సంగీతానికి భాషాపరిమితులు లేవన్నది సత్యం. భాషకతీతంగా కొన్ని పాటలు సంగీతంతోనే మన మనసులో చెరగని ముద్ర వేసేస్తాయి, అలాంటి పాటలలో రహ్మాన్ కంపోజిషన్స్ ముందు ఉండేవి అని చెప్పచ్చేమో. ఈ పాటకు అర్ధం తెలియని నా మిత్రులు సైతం పదే పదే వినడం పాడడానికి ప్రయత్నించడం నేను గమనించాను, నిజానికి తాళ్ లో చాలా పాటలు అలాగే అద్భుతమైన సంగీతంతో ఆకట్టుకుంటాయి. ఈమధ్య పాటలు వినడం మళ్ళీ మొదలెట్టాను కదా చాలా రోజుల తర్వాత విన్న పాట ఇది, నాకు చాలా ఇష్టం. అన్నట్లు ఇప్పటివరకూ ఈ బ్లాగ్ లొ హిందీ పాటలు పోస్ట్ చేసినట్లు లేను కదా. సాథారణంగా నేను తెలుగు తో పాటు హిందీ ఇంగ్లీష్ తమిళ్ పాటలు కూడా వింటూంటాను. సో వీలు చూస్కుని అపుడపుడు ఆయాభాషా గీతాలను కూడా మీతో పంచుకుంటాను. 

ఎలాగూ ప్రేమికులదినోత్సవం కూడా కనుక పనిలో పనిగా ప్రేమికులకు వినిపిద్దామని ఇపుడీపాట పోస్ట్ చేస్తున్నాను, కానీ రెండుచేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్లు ప్రేమలో ఇద్దరి కంట్రిబ్యూషన్ ముఖ్యం కనుక మీరొక్కరు వింటే కొంచమే లాభం సో మీ మీ పార్టనర్స్ ని కూడా పక్కన కూర్చోపెట్టుకుని వినండి.. ప్రామిస్ చేసి బ్రేక్ చేయడం మన సంప్రదాయం కాదని మరోసారి నొక్కిచెప్పండి :-) ప్రామిస్సులు గుర్తుచేస్కోమన్నాను కదా అని పట్టుచీరలో వడ్డాణాల ప్రామిస్ లో గుర్తుచేస్కుంటే కష్టం మరి :-) 
ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.


Film: Taal
Music Director: A R Rahman
Lyricist: Anand Bakshi
Singer(s): Sukhvindar Singh,  Alka Yagnik

सा सा रे सा सा
गा मा गा रे रे सा रे सा सा
यारा यारा यारा हो

करिये ना हाँ करिये ना कोई वादा किसी से करिये ना
करिये करिये हो करिये करिये तो वादा फिर तोड़िये ना

हाथ किसी का पकड़िये ना 
पकड़िये तो फिर छोड़िये ना

सा सा रे सा सा
गा मा गा रे रे सा रे सा सा
यारा यारा यारा हो

मैनूँ खिच पैंदी ए
सीने विच पैंदी ए
ओ मैंनूँ कुछ हो गया दुनिया कैंदी ए

ओ इस कुछ का नाम जवानी है ये उम्र बदि दीवानी है
तूम तननना तूम तननना तूम तननना ननना ना
सच्चे सब सपने लगते हैं बेगाने अपने लगते हैं
अपनों से मुँह मोड़िये ना सपनों के पीछे दौड़िये ना

करिये ना हाँ करिये ना कोई वादा किसी से करिये ना
करिये करिये हो करिये करिये तो वादा फिर तोड़िये ना


ऐना बदला दे नाल मैं जुड़ जावाँ
बन जावाँ पतंग मैं उड़ जावाँ

कोई परदेसी आवेगा तेरी डोली ले जावेगा
मैं सारी रसमें तोड़ूँगी बाबुल का घर नहीँ छोड़ूँगी
तक़दीरों का मुँह खोलिये ना 
चुप रहिये बस कुछ बोलिये ना 

करिये ना हाँ करिये ना कोई वादा किसी से करिये ना
करिये करिये हो करिये करिये तो वादा फिर तोड़िये ना

हाथ किसी का पकड़िये ना 
पकड़िये तो फिर छोड़िये ना

सा सा रे सा सा
गा मा गा रे रे सा रे सा सा

सा सा रे सा सा
गा मा गा रे रे सा रे सा सा
यारा यारा यारा हो

For lyrics in other scripts visit here.

బుధవారం, ఫిబ్రవరి 13, 2013

శీతవేళ రానీయకు రానీయకూ

దదాపు రెండున్నరేళ్ళ తర్వాత నిన్న నా ఐపాడ్ ని జాగ్రత్తగా బయటకు తీసి రీఛార్జ్ చేసి ఎప్పటిలాగే షఫుల్ ప్లేలో నాఐపాడ్ నాకోసం ఏం పాట వినిపిస్తుందా అని ఆత్రంగా ఎదురు చూస్తూ వింటే తను నాకోసం ఎన్నుకున్న పాట ఇది. “శీతవేళ రానీయకు రానీయకూ శిశిరానికి చోటీయకు చోటీయకూ” అంటూ పాడటం మొదలెట్టేసరికి ఔరా అనుకుంటూ పాటతో పాటే పెదవులపై అనుకోకుండా ఓ చిన్న చిరునవ్వు వికసించింది :-) ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట తరచూ వినే పాట కూడా. ఈ సంధర్బంలో వినడం మాత్రం తనకు రానివ్వద్దని తనగురించి ప్రాధేయపడుతుందో నన్ను హెచ్చరిస్తూందో కానీ భలే ఎన్నుకుంది అనిపించింది. 

ఈ సినిమా పాటల గురించి ఏం చెప్పను ప్రతిపాటా ఒక ఆణిముత్యమే. రమేష్ నాయుడి గారి బెస్ట్ వర్క్, ప్రత్యేకించి ఈ పాటకి సాహిత్యానికి తగినట్టుగా సంగీతం కూడా భలే కరెక్ట్ గా అమరింది, ఇందులో నాకు వాళ్ళిద్దరి సాన్నిహిత్యం కూడా భలే నచ్చుతుంది. చరణాల మధ్య పల్లవి పాడేప్పుడు ఒకళ్ళుపాడుతుంటే మరొకరు రాగంతీస్తూ సపోర్ట్ చేయడం అద్భుతంగా కుదురుతుంది. బహుశా చిత్రీకరించడం కష్టమని వదిలేశారో చిత్రం నిడివి దృష్టిలో పెట్టుకుని కత్తెరకి బలిచేశారోకానీ ఈ పాట వీడియో ఇంతవరకూ నేను చూడలేదు. సినిమాలోకానీ డివిడిలో కానీ ఎక్కడా రాలేదని అంటూంటారు.

ఈ పాట గురించి అక్కిరాజు భట్టిప్రోలు గారు చాలా చక్కని వ్యాఖ్యానం తన బ్లాగ్ లో రాసుకున్నారు ఒక్కసారి వీలు చేసుకుని అది ఇక్కడ చదవండి. పాటని ఎప్పుడెప్పుడు ఏ ఏ సంధర్భాలలో వినాలో ఎలా అర్ధంచేస్కోవాలో బహుచక్కగా వివరించారు తను. ఈ పాట ఆడియో రాగా లో ఇక్కడ వినవచ్చు.

పాడింది ఇద్దరే కదా ఆ మూడవ రంగు ఎవరి స్వరం ? ఎక్కడినుండి వచ్చిందని ఆశ్చర్యపడుతున్నారా :-) మొదటిది ఏసుదాసు గారి స్వరం రెండవది సుశీలమ్మ స్వరం మూడవ రంగు ఇద్దరూ కలిపి పాడినది. అందుకే ఈ పాట నాకు ఇంకా ఎక్కువ ఇష్టం.

చిత్రం : మేఘసందేశం
సాహిత్యం : దేవులపల్లి కృష్ణశాస్త్రి
సంగీతం : రమేష్ నాయుడు
గానం : ఏసుదాస్, సుశీల

శీతవేళ రానీయకు – రానీయకూ
శిశిరానికి చోటీయకు – చోటీయకూ
శీతవేళ రానీయకు – రానీయకూ
శిశిరానికి చోటీయకు – చోటీయకూ
ఎద లోపల పూలకారు
ఏ నాటికీ పోనీయకూ
శీతవేళ రానీయకు – రానీయకూ
శిశిరానికి చోటీయకు – చోటీయకూ

ఉగ్రమైన వేసంగి గాడ్పులు
ఆగ్రహించి పై బడినా అదరి పోవకూ
అదరి పోవకూ
ఉగ్రమైన వేసంగి గాడ్పులు
ఆగ్రహించి పై బడినా అదరి పోవకూ
అదరి పోవకూ
ఒక్కుమ్మడిగా వర్షా మేఘం
వెక్కి వెక్కి రోదించినా
లెక్క చేయకూ – లెక్క చేయకూ

శీతవేళ రానీయకు – రానీయకూ
శిశిరానికి చోటీయకు – చోటీయకూ
శీతవేళ రానీయకు – రానీయకూ
శిశిరానికి చోటీయకు – చోటీయకూ

చైత్రంలో తొగరెక్కిన కొత్త కోర్కెలు
శరత్తులో కైపెక్కే తీయని కలలు
చైత్రంలో తొగరెక్కిన కొత్త కోర్కెలు
శరత్తులో కైపెక్కే తీయని కలలు
మనసారా తీర్చుకో – మనుగడ పండించుకో
లోకానికి పొలిమేరను – నీలోకం నిలుపుకో

శీతవేళ రానీయకు – రానీయకూ
శిశిరానికి చోటీయకు – చోటీయకూ
శీతవేళ రానీయకు – రానీయకూ
శిశిరానికి చోటీయకు – చోటీయకూ

ఉదయాన మగత నిదర చెదరిపోవు వేళ
మబ్బులలో ప్రతి తారక మాయమయే వేళ
ముసలితనపుటడుగుల సడి ముంగిట వినబడెనా
ముసలితనపుటడుగుల సడి ముంగిట వినబడెనా
వీట లేడనీ చెప్పించూ – వీలు కాదనీ పంపించూ
వీలు కాదనీ పంపించు.

శీతవేళ రానీయకు – రానీయకూ
శిశిరానికి చోటీయకు – చోటీయకూ
ఎద లోపల పూలకారు
ఏ నాటికీ పోనీయకూ...
శీతవేళ రానీయకు – రానీయకూ
శిశిరానికి చోటీయకు – చోటీయకూ

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.