సోమవారం, సెప్టెంబర్ 28, 2009

తల ఎత్తి జీవించు -- మహాత్మ

క్రియేటివ్ కృష్ణవంశీ దర్శకత్వం లో వస్తున్న శ్రీకాంత్ వందవ చిత్రం "మహాత్మ" లో సిరివెన్నెల గారు రచించిన ఈ రెండు పాటలూ, విన్న వెంటనే బాగున్నాయి అనిపించి బ్లాగ్ లో పెట్టేయాలనిపించింది. ఈ లిరక్స్ ని మా ఆర్కుట్ కమ్యునిటీ లో కష్టపడి టైప్ చేసి ముందే పోస్ట్ చేసిన ఫణి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వల్ప మార్పులతో ఇక్కడ మీ కోసం. "ఇందిరమ్మ ఇంటి పేరు కాదుర గాంధీ" పాట లో "సూర్యుడు అస్తమించని రాజ్యానికి పడమర దారిని చూపిన క్రాంతి" లాటి పంక్తులు రాయడం సిరివెన్నెలగారికే చెల్లింది. పాట వినాలంటే సీడీ కొనడం సక్రమమైన పద్దతి :-) కానీ ఇది ఇప్పటికే ఆన్లైన్ లో దొరుకుతుంది కనుక లింక్ ఇస్తున్నాను. ఒక సారి విని, మిగిలిన పాటలు కూడా నచ్చితే సీడీ కొనండి. నేను ఈ రెండు తప్ప వేరేవి ఇంకా వినలేదు.


మహాత్మ చిత్రం లోని పాటల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. "తల యెత్తి జీవించు" పాట మొదటి నుండి నాలుగవది, మహాత్ముని పై రాసిన "ఇందిరమ్మ ఇంటిపేరు" పాట మొదటిది.

చిత్రం: మహాత్మా
సాహిత్యం: సిరివెన్నెల
సంగీతం: విజయ్ ఆంటోని
గానం: బాలసుబ్రహ్మణ్యం

సింగమ్ము పై తిరుగు పురుష కేసరి శాతవాహనుడు పూర్వజుడు నీ జాతికీ

తల ఎత్తి జీవించు తమ్ముడా
తెలుగు నేలలో మొలకెత్తినాననీ
కనుక నిలువెత్తుగా ఎదిగినాననీ

తల వంచి కైమోడ్చు తమ్ముడా
తెలుగు తల్లి నను కని పెంచినాదని
కనుక తులలేని జన్మమ్ము నాదని
త్రైలింగ ధామం...త్రిలోకాభిరామం
అనన్యం...అగణ్యం...ఏదో పూర్వపుణ్యం
త్రిసంధ్యాభివంద్యం....అహో జన్మ ధన్యం

||తల ఎత్తి||

శ్రీ మహావిష్ణువే శ్రీకాకుళాంధ్రుడై శ్రీకారమును చుట్టె నీ చరితకి
శ్రీశైల భీమేశ కాళేశుడై హరుడు ప్రాకారము కట్టె నీ సీమకి
సింగమ్ము పై తిరుగు పురుష కేసరి శాతవాహనుడు పూర్వజుడు నీ జాతికీ
పడతి సీతమ్మతో రామయ్య కొలువైన పంచవటి చాలు నీ ప్రఖ్యాతికి

||తల ఎత్తి||

తరతరమ్ములు దాటి తరలివచ్చిన మహాత్ములతపః సంపత్తి నీ వారసత్వం
ఇచట పుట్టిన చిగురు కొమ్మైన చేవయని ఆంధ్రులకు అందినది ఆర్య సత్వం
మువ్వన్నె జెండాగ మిన్నంటి లోకాన మేటి సంస్కృతి చాటు ఘనత నీ స్వంతం
భారతాంబకు పెద్ద కొడుకుగా మనగలుగు ఆత్మ గౌరవముతో వర్ధిల్లు నిత్యం

||తల ఎత్తి||

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

చిత్రం: మహాత్మా
సాహిత్యం: సిరివెన్నెల
సంగీతం: విజయ్ ఆంటోని
గానం: బాలసుబ్రహ్మణ్యం

రఘుపతి రాఘవ రాజారాం
పతీత పావన సీతారాం
ఈశ్వర్ అల్లా తెరో నాం
సబ్ కో సన్మతి దే భగవాన్

ఇందిరమ్మ ఇంటిపేరు కాదుర గాంధీ
ఊరికొక్క వీధి పేరు కాదుర గాంధీ

||ఇందిరమ్మ||

కరెన్సీ నోటు మీద
ఇలా నడి రోడ్డు మీద
మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ
భరతమాత తలరాతను మార్చిన విధాతరా గాంధీ
తరతరాల యమయాతన తీర్చిన వరదాతర గాంధీ

||ఇందిరమ్మ||

రామనామమే తలపంతా
ప్రేమధామమే మనసంతా
ఆశ్రమ దీక్ష., స్వతంత్ర కాంక్ష
ఆకృతి దాల్చిన అవధూత
అపురూపం ఆ చరిత
ధర్మయోగమే జన్మంతా
ధర్మక్షేత్రమే బ్రతుకంతా
సంభవామి అని ప్రకటించిన అలనాటి కృష్ణ భగవద్గీత ఈ బోసినోటి తాతా
మన లాగే ఒక తల్లి కన్న మాములు మనిషి కదరా గాంధీ
మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచద ఆయన స్ఫూర్తి
సత్య అహింసల మార్గ జ్యోతి
నవ శకానికే నాంది

||రఘుపతి|| ||రఘుపతి||

గుప్పెడు ఉప్పును పోగేసి
నిప్పుల ఉప్పెనగా చేసి
దండి యాత్రనే దండయాత్రగా
ముందుకు నడిపిన అధినేత
సిసలైన జగజ్జేత
చఱఖా యంత్రం చూపించి
స్వదేశీ సూత్రం నేర్పించి
నూలుపోగుతో మదపుటేనుగులను బంధించాడురా జాతి పితా సంకల్ప బలం చేత
సూర్యుడు అస్తమించని రాజ్యానికి పడమర దారిని చూపిన క్రాంతి
తూరుపు తెల్లారని నడిరాతిరికి స్వేచ్ఛా భానుడి ప్రభాత కాంతి
పదవులు కోరని పావన మూర్తి
హృదయాలేలిన చక్రవర్తి
ఇలాంటి నరుడొకడు ఇల తలంపై నడయాడిన ఈనాటి సంగతీ
నమ్మరానిదని నమ్మక ముందే ముందు తరాలకు చెప్పండి

సర్వజన హితం నా మతం
అంటరానితనాన్ని అంతః కలహాలనీ
అంతం చేసేందుకే నా ఆయువంతా అంకితం

హే రాం !!

ఆదివారం, సెప్టెంబర్ 27, 2009

లేడీస్‍టైలర్ -- హాస్య సన్నివేశం

ఎంత పాటల బ్లాగ్ అయితే మాత్రం అస్తమానం పాటలే వినిపిస్తే రొటీన్ అయిపోద్దని కాస్త వెరైటీ గా ఈ రోజు హాస్య సంభాషణ వినిపిద్దాం అని ఓ చిన్న ప్రయత్నం. లేడీస్ టైలర్ లోని ఈ హిందీ పాఠం సీన్ చూసి నవ్వుకోని వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. వంశీ గారి దర్శకత్వం లో మాటల రచయిత తనికెళ్ళ భరణి హిందీ తో చేసిన మాటల గారడి ఇక్కడ... అప్పుడప్పుడూ చూసి రిలాక్స్ అవ్వి నవ్వుకోడానికి సరదాగా బాగుంటుంది అని...హె హె అదీ..
అబ్ టైం క్యాహువా..
మై కబ్ ఆనేకు కహే ఆప్ కబ్ ఆయే..
అగర్ రోజ్ అయిసే హీ దేర్ కరే తొ ముఝ్ సే నహీ హోగా..

ఓహో ఇవ్వాళ హిందీ పాఠం గావల్ను.
బీచ్ మే అసిస్టెంట్ సీతారాముడు హై ఓ ఖాతా హై.. ఇంకానేమో
బట్టల సత్యం హై, శీనూ భీ హై ఓ ఢరాతా హై… బెదిరిస్తాడండీ.. ఇసీలియే మై హిందీ మే...
ఆపూ..
నేమాట్లాడింది హిందీ కాదాండి.
ఇది హిందీయా ఇది వింటే హిందీ ని అర్జంట్ గా రాజభాష గా రద్దుచేస్తారు.
ఈ సారి లేట్ గా వచ్చావా తోలు వలిచేస్తాను.. చమడా నికాల్దూంగీ సమజ్ గయా..
ఆ గయా గయా తెలుగులో వలిచారు కదండీ ఇంక హిందీ లో కూడా ఎందుకులెండి.
అసలు ఏ భాషైనా నేర్చుకోవాలంటే దాని మీద ధ్యాసుండాలి, విదేశీయుడైన జాన్ హిగ్గిన్స్ భాగవతార్ తెలుగు నేర్చుకుని త్యాగరాయ కృతులు పాడారు, సిగ్గేయడం లేదు.
సిగ్గెందుకండీ మన భాష పదిమందీ నేర్చుకుంటున్నారని అ.ఆ గర్వపడాలి గానీ..
Shutup
బ్రౌన్ దొర వేమన పద్యాలని సంస్కరించి తెలుగులో నిఘంటువు కూడా రాశాడు మనకి మనభాషే సవ్యంగా వచ్చి చావదు ఇక పరాయి భాషా.. హా... సరే సరి..
ఏవండీ మరీ అంత ఇదిగా తిట్టకండి.. తల్చుకుంటే నేనూ నేర్చుకోగలను జహి జందీ..
ఆ...
అదే హిందీ
ఓహో హిందీ లో నలుపుని ఏమంటారో చెప్పు..
కవ్వా..
కవ్వా అంటే కాకి..
కాకి నలుపే కదండీ.. హి..
సంతోషించాం. ఆ... ఉంగరాన్నేమంటారూ..
అంగూటీ..
హమ్మయ్యా.. మరి బొంగరాన్ని..
లంగూటీ..
నీ బొంద లట్టూ అంటారు.
అదేదో తినేదన్నట్లు గుర్తు
సుందరం సుందరం నీకీ జన్మకి హిందీ రాదు చదువురాదు. నన్నొదిలేయరాదూ..
వదిలేయడమా మిమ్మల్నా చచ్చినా వదల్ను దొరక్క దొరక్క దొరికారు. ఎన్ని వెతికానూ ఎంత వెతికాను మీరు గనక కాదంటే మీ జడకి ఉరేస్కుని చచ్చిపోతాను. ఏదీ మీ జడ ఇది జడా కాదు జతోజడ..
పాఠం..
పాఠాన్దేముందండీ వెదవ పాఠం గైడ్లు కొనుక్కొని చదువుకోవచ్చు.. కానీ మీలాంటి టీచర్ నాలాంటి స్టూడెంట్ మనిద్దరి మధ్యా ఉన్న అవినావాభావ సంబంధం. మీరలా పాఠం చెప్తుంటే నా దృష్టంతా దానిమీదే ఉంది..
దేనిమీదా..
అదే పాఠం మీద దాన్నే జపరే జమ అంటారు.
జపరే జమ ఎంటి..
హిందీ మాష్టారు అయుండి జపరే జమ అంటే కూడా తెలియదా...
జపరే .. జపించరా... జమా దొరుకుతుందీ...
అయ్ బాబోయ్ హిందీ గంగలా పొంగుకుంటూ వచ్చేస్తుంది....
సుజాతా మై మర్ జాతా.. తుమారా చుట్టూ ఫిర్ జాతా.. అది నా తలరాత...
మై పడా తుమ్హారీ తొడా... మచ్చా బహుత్ అఛ్చా...
మై బచ్చా బట్టల సత్యం లుచ్చా..
సుజాతా మై తుమ్ కో ప్రేమ్ కర్తాహూ..
మై నిజం బోల్తాహూ...
మనిద్దరం పెళ్ళిచేస్కుని ఈ ఊర్నుంచీ ఉడ్ జాతా హై...
అప్పుడు శుక్ర మహర్దశ... చక్ర్ ఫిర్ ఆతా....
ఆ ఎక్కడ... ఎక్కడ...
ఇక్కడే... నాయనా నీ హిందీ వింటే జీవితం మీదే విరక్తి కలుగుతుంది.
ఛీ లెక్కల్ తీయ్...
లెక్కలా..ఈ లెక్కలేంటండీ బాబు.. ఎప్పుడు చూసినా లెక్కలు ఖగోళ శాస్త్రం చరిత్రేనా మనిషి వాడి మచ్చ గురించి పట్టించుకునే పని లేదా...
మచ్చా...
ఆ అదే మనిషన్న తర్వాత మచ్చ లేకుండా బతకాలి కదండీ.. అందుకని..
ఇపుడూ రోజూ మీరు నాకు పాఠాలు నేర్పుతున్నారు కదా..
గురుదక్షిణ గా ఇవ్వాళ నేను మీకు కుట్టు నేర్పనా..
కుట్టుని హిందీ లో సీనా అంటారు ఇంగ్లీష్ లో ఇచ్చింగ్ అంటారు..
ఇచ్చింగ్ కాదు స్టిచ్చింగ్...
అదేనండీ బాబు ఒప్పేసుకున్నారు కదా...

సోమవారం, సెప్టెంబర్ 21, 2009

తారలు దిగి వచ్చిన వేళా

నిన్న సెప్టెంబరు 21 న అక్కినేని గారు తన పుట్టిన రోజు జరుపుకున్న సంధర్భంగా అనుకుంటాను. ఒక టీవీ చానల్ వారు ప్రేమాభిషేకం సినిమా వేసారు. అప్పటి వరకూ రిమోట్ లో ఛానల్ బటన్ కి నా వేలికి పోటీ పెట్టి పందెం వేసి ఆడుకుంటున్న వాడ్ని హఠాత్తుగా ఈ పాట వినపడటం తో అక్కడే ఆగిపోయాను... ఈ సినిమా రిలీజ్ అయిన సమయం లో నేను చాలా చిన్న వాణ్ణి కాని అప్పుడప్పుడే కాస్త ఊహ తెలుస్తుంది. సినిమాల్లో యన్టీఆర్ గారి ఎయన్నార్ గారి స్టెప్పు లు ఇంట్లో వేసి అందరిని అలరించే రోజులు అనమాట. నాన్న నా టాలెంట్ కి ముచ్చట పడి ఒక బెల్ బోటం ప్యాంటు కుట్టిస్తే మనం అదేసుకుని వీర లెవల్ లో హీరోలా ఫీల్ అయి అన్నగారి స్టెప్పులు తెగ వేసే వాళ్ళం.

సరే ఇక ఈ పాట విషయానికి వస్తే నాకు చాలా ఇష్టమైన పాట అప్పట్లో అంతగా తెలిసేది కాదు కానీ సెకండ్ రిలీజ్ లో చూసినపుడు ఈ పాట తెగ నచ్చేసింది. తారలు దిగి వచ్చిన వేళా అంటూ సాగే పాట కి మొదట చక్రవర్తి గారు పలికించే మ్యూజిక్ దాని కి అణుగుణంగా కెమెరా ఎవరో కానీ పెళ్ళికి అలంకరించిన దీపాలనే తారలు గా అద్భుతం గా చూపించారు అనిపించింది. కావాలంటే మీరూ ఓ సారి వీడీయో లో మొదట వచ్చే సీన్స్ చూడండి. ఇక ప్రారంభం లో వొచ్చే బాలు గారి ఆలాపన నాకు చాలా ఇష్టం. అప్పట్లో కాస్త ప్రాక్టీస్ చేసి నేర్చేసుకున్నా కూడా.. ఇంకా ఈ పాట చూశాక మనం కూడా ఏయన్నార్ లా సూటూ బూటు వేసుకుని స్టైల్ గా ఇలా సైడాంగిల్ లో లుక్కులిస్తూ పాట పాడేయాల్రా అని ఓ కోరిక కూడా ఉండేది. మా దోస్తుల్లో కొందరైతే ఈ సినిమా హీరో లా మనక్కూడా క్యాన్సర్ ఉంటే బాగుండు అని అనుకున్నవాళ్ళూ లేకపోలేదు కాని నేనసలే ఇంటిలిజెంట్ కదా అలాటి పిచ్చి కోరికలు కోరితే ఇంట్లో బడిత పూజ చేస్తారు అని తెలుసు కాబట్టి సైలెంట్ గా ఉన్నా :-)

ఇంక ఈ సినిమా గురించి చెప్పాలంటే మాటలు చాలవు. కాస్త ఓవర్ యాక్షన్ భరించ గలిగితే ఈ సినిమాను తెగ ఎంజాయ్ చేయచ్చు. అక్కినేని వారు మొదటి భాగం లో ’హే దేవీ..’ అనుకుంటూ ఎంత ఉషారుగా ప్రేమించేస్తారో జబ్బు గురించి తెలిసాక అంతే విషాదంగా ఆకాశం లోకి చూస్తూ త్యాగం చేసేసి అలరిస్తారు. ఈ సినిమా డైలాగుల క్యాసెట్ మా ఇంట్లో చాలా రోజులే నలిగింది. అందుకే నిన్న సినిమా చూస్తూంటే డైలాగులు వింటుంటే ఒక్కసారి అప్పటి ఙ్ఞాపకాల లోకి వెళ్ళి పోయాను. సినిమా మొదట్లో వచ్చే వాటికన్నా జయసుధ ఇంట్లో ఉండే డైలాగులు కేక. శ్రీదేవి వచ్చినప్పటివి కానీ.. అక్కినేని జయసుధ తో తను ఒంటరి వాడిని కానని మరణం గురించి చెప్తూ "ఒకో సారి కిందుంటుంది ఒకోసారి పై నుంటుంది ఒకోసారి ముందుంటుంది ఒకోసారి వెనకుంటుంది.." అనే సంభాషణలు కానీ అక్కినేని గారి నోటివెంట విని తీరాల్సిందే..

నిజానికి ఈ సినిమాలో పేరు తెచ్చుకున్న పాటలు బోల్డు కానీ నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం. ఇంకా వేరే పాటలు అంటే.. మా ఊరి పాట "కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా.." ఈ పాట కోటప్ప కొండ తిరునాళ్ళ లోనే తీసారు అని చెప్పుకునే వాళ్ళు అప్పట్లో కానీ నాకు మళ్ళి ఈ పాట చూసి నిర్ధారించుకునే అవకాశం రాలేదు. ఇంకా "నా కళ్ళు చెబుతున్నాయి..నిను ప్రేమించానని..", "ఆగదూ ఆగదూ.. ఆగితే సాగదు", "వందనం అభివందనం", "దేవీ మౌనమా శ్రీదేవీ మౌనమా", "ఒక దేవుడి గుడి లో.." దేనికదే ఫేమస్. అప్పట్లో బాలు గారు కాస్తంత మిమిక్రీ చేసి అచ్చూ అక్కినేని గారే పాడారా అన్నట్లు పాడేవారు. అదీ ఓ కారణమేమో వందనం లాటి పాటలు అంతగా హిట్ అవడానికి. ఏదేమైనా తారలు దిగివచ్చిన సాహిత్యం వీడియో మీకోసం. అలానే ఆసక్తి వుంటే తెలుగు FM వారి లింక్ కూడా ఇస్తున్నాను మిగిలిన పాటలు వినాలని అనిపిస్తే ఆ లింక్ లో వినగలరు. సాహిత్యం మాత్రం కేవలం ఈ పాటకే ఇస్తున్నా.ఈ చిత్రం లోని మిగిలిన పాటలు ఇక్కడ ఈ లింక్ పై క్లిక్ చేసి వినవచ్చు

చిత్రం : ప్రేమాభిషేకం,
సాహిత్యం : దాసరి నారాయణరావు
సంగీతం : చక్రవర్తి
గానం : బాలసుబ్రహ్మణ్యం

తారలు దిగివచ్చిన వేళ.....
మల్లెలు నడిచొచ్చిన వేళ.....
చందమామతో ఒక మాట చెప్పాలి.. ఒక పాట పాడాలి...
చందమామతో ఒక మాట చెప్పాలి.. ఒక పాట పాడాలి...

||తారలు||

ఊరంతా ఆకాశానా గోరంత దివ్వెగా
పిడికెడంత గుండెలోనా కొండంత వెలుగుగా
కనిపించే రంగులన్ని సింధూరపు చీరెగా
కనిపించని సిగ్గులన్ని ముసుగేసిన మబ్బుగా
కనిపించే రంగులన్ని సింధూరపు చీరెగా
కనిపించని సిగ్గులన్ని ముసుగేసిన మబ్బుగా
నిలిచిపొమ్మనీ మబ్బుగా... కురిసిపొమ్మనీ వానగా...
విరిసిపొమ్మనీ వెన్నెలగా... మిగిలిపొమ్మనీ నా గుండెగా...
మిగిలిపొమ్మనీ... నా గుండెగా...

చందమామతో ఒక మాట చెప్పాలి.. ఒక పాట పాడాలి...
చందమామతో ఒక మాట చెప్పాలి.. ఒక పాట పాడాలి...
||తారలు||

నీలిరంగు చీకటిలో నీలాల తారగా
చూడనంత శూన్యములో దొరకనంత ఆశగా
వేటాడే చూపులన్ని లోలోని ప్రేమగా
వెంటాడే వలపులన్ని కాబోయే పెళ్లిగా
వేటాడే చూపులన్ని లోలోని ప్రేమగా
వెంటాడే వలపులన్ని కాబోయే పెళ్లిగా
చెప్పిపొమ్మనీ మాటగా... చేసిపొమ్మనీ బాసగా...
చూపిపొమ్మనీ బాటగా... ఇచ్చిపొమ్మనీ ముద్దుగా...
ఇచ్చిపొమ్మనీ... ముద్దుగా

చందమామతో ఒక మాట చెప్పాలి.. ఒక పాట పాడాలి...
చందమామతో ఒక మాట చెప్పాలి.. ఒక పాట పాడాలి...
||తారలు||

శుక్రవారం, సెప్టెంబర్ 04, 2009

ఎవరేమీ అనుకున్నా..

రాజశేఖరుని చూసినపుడల్లా నాకు ఆయన మొండి తనం దాని వెంటనే యస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం లో వచ్చిన బడ్జెట్ పధ్మనాభం సినిమాలోని ఈ పాటా గుర్తొచ్చేస్తాయి. అప్పుడప్పుడూ నాకు కాస్త inspiration ఇంధనం అవసరమైనపుడు వినే ఈ పాట పల్లవి లో ధ్వనించే మొండి తనాన్ని రాజశేఖరుడు అణువణువునా ఒంట బట్టించుకున్నారు అనిపిస్తుంది. ఈ మొండితనం తో తను గెలుచుకున్న హృదయాలు ఎన్నున్నాయో బద్ద వైరం పెంచుకున్న హృదయాలు అన్నే ఉన్నాయి. కానీ ఆయన ఇక లేరు అని తెలుసుకుని "అయ్యో" అనుకోని హృదయం ఒక్కటి కూడా లేదనడం లో అతిశయోక్తి లేదేమో.. రాష్ట్రమంతా స్వచ్చందంగా బంద్ పాటిస్తూ శోక సంద్రం లో మునిగిఉందన్న వార్తలు అది నిజమని నిరూపిస్తున్నాయి. తననుకున్నది సాధించడానికి ఎంతకైనా తెగించే తత్వమే "చెప్పకుండా వెళ్తున్నా.." అని చెప్పి మరీ వెళ్ళిపోయేలా చేసిందని బాధ పడడం తప్ప ఎవరైనా ఏమి చేయగలం. ఆ మహా మనిషి కీ ఆయనతో పాటు ఈ దుర్ఘటనలో మరణించిన వారందరి ఆత్మలకూ శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

ఈ పాట వినడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజ్యాన
రాజు నువ్వే బంటూ నువ్వే మంత్రీ నువ్వే సైన్యం నువ్వే
ఏమైనా ఏదైనా నువ్వేళ్ళే బడి లోన
పలకా నువ్వే బలపం నువ్వే ప్రశ్నా నువ్వే బదులూ నువ్వే..
అన్నీ నువ్వే కావాలి అనునిత్యం పోరాడాలీ..
అనుకున్నది సాధించాలీ...

||ఎవరేమీ||

అవమానాలే ఆభరణాలు.. అనుమానాలే అనుకూలాలు..
సందేహాలే సందేశాలు.. ఛీత్కారాలే సత్కారాలూ...
అనుకోవాలీ.. అడుగేయాలీ ముళ్ళ మార్గాన్ని అణ్వేషించాలీ..
అలుపొస్తున్నా కలలే కన్నాపూల స్వర్గాన్ని అధిరోహించాలీ..
ఎవరికి వారే లోకంలో.. ఎవరికి పట్టని శోకం లో.. నీతో నువ్వే సాగాలీ..

||ఎవరేమీ||

బలమూ నువ్వే.. బలగం నువ్వే.. ఆటా నీదే.. గెలుపూ నీదే..
నారూ నువ్వే .. నీరూ నువ్వే.. కోతా నీకే.. పైరూ నీకే..
నింగీ లోనా తెల్ల మేఘం నల్ల బడితేనే జల్లులు కురిసేనూ..
చెట్టు పైనా పూలూ మొత్తం రాలీ పోతేనే పిందెలు కాసేనూ..
ఒక ఉదయం ముందర చీకట్లూ.. విజయం ముందర ఇక్కట్లూ..
రావడమన్నది మామూలూ..

||ఎవరేమీ||

ఈ ఫోటోను ప్రచురించిన Hindu వారికీ ఇది నా కళ్ళబడేలా చేసిన త్రివిక్రం గారికీ ధన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.