సోమవారం, సెప్టెంబర్ 21, 2009

తారలు దిగి వచ్చిన వేళా

నిన్న సెప్టెంబరు 21 న అక్కినేని గారు తన పుట్టిన రోజు జరుపుకున్న సంధర్భంగా అనుకుంటాను. ఒక టీవీ చానల్ వారు ప్రేమాభిషేకం సినిమా వేసారు. అప్పటి వరకూ రిమోట్ లో ఛానల్ బటన్ కి నా వేలికి పోటీ పెట్టి పందెం వేసి ఆడుకుంటున్న వాడ్ని హఠాత్తుగా ఈ పాట వినపడటం తో అక్కడే ఆగిపోయాను... ఈ సినిమా రిలీజ్ అయిన సమయం లో నేను చాలా చిన్న వాణ్ణి కాని అప్పుడప్పుడే కాస్త ఊహ తెలుస్తుంది. సినిమాల్లో యన్టీఆర్ గారి ఎయన్నార్ గారి స్టెప్పు లు ఇంట్లో వేసి అందరిని అలరించే రోజులు అనమాట. నాన్న నా టాలెంట్ కి ముచ్చట పడి ఒక బెల్ బోటం ప్యాంటు కుట్టిస్తే మనం అదేసుకుని వీర లెవల్ లో హీరోలా ఫీల్ అయి అన్నగారి స్టెప్పులు తెగ వేసే వాళ్ళం.

సరే ఇక ఈ పాట విషయానికి వస్తే నాకు చాలా ఇష్టమైన పాట అప్పట్లో అంతగా తెలిసేది కాదు కానీ సెకండ్ రిలీజ్ లో చూసినపుడు ఈ పాట తెగ నచ్చేసింది. తారలు దిగి వచ్చిన వేళా అంటూ సాగే పాట కి మొదట చక్రవర్తి గారు పలికించే మ్యూజిక్ దాని కి అణుగుణంగా కెమెరా ఎవరో కానీ పెళ్ళికి అలంకరించిన దీపాలనే తారలు గా అద్భుతం గా చూపించారు అనిపించింది. కావాలంటే మీరూ ఓ సారి వీడీయో లో మొదట వచ్చే సీన్స్ చూడండి. ఇక ప్రారంభం లో వొచ్చే బాలు గారి ఆలాపన నాకు చాలా ఇష్టం. అప్పట్లో కాస్త ప్రాక్టీస్ చేసి నేర్చేసుకున్నా కూడా.. ఇంకా ఈ పాట చూశాక మనం కూడా ఏయన్నార్ లా సూటూ బూటు వేసుకుని స్టైల్ గా ఇలా సైడాంగిల్ లో లుక్కులిస్తూ పాట పాడేయాల్రా అని ఓ కోరిక కూడా ఉండేది. మా దోస్తుల్లో కొందరైతే ఈ సినిమా హీరో లా మనక్కూడా క్యాన్సర్ ఉంటే బాగుండు అని అనుకున్నవాళ్ళూ లేకపోలేదు కాని నేనసలే ఇంటిలిజెంట్ కదా అలాటి పిచ్చి కోరికలు కోరితే ఇంట్లో బడిత పూజ చేస్తారు అని తెలుసు కాబట్టి సైలెంట్ గా ఉన్నా :-)

ఇంక ఈ సినిమా గురించి చెప్పాలంటే మాటలు చాలవు. కాస్త ఓవర్ యాక్షన్ భరించ గలిగితే ఈ సినిమాను తెగ ఎంజాయ్ చేయచ్చు. అక్కినేని వారు మొదటి భాగం లో ’హే దేవీ..’ అనుకుంటూ ఎంత ఉషారుగా ప్రేమించేస్తారో జబ్బు గురించి తెలిసాక అంతే విషాదంగా ఆకాశం లోకి చూస్తూ త్యాగం చేసేసి అలరిస్తారు. ఈ సినిమా డైలాగుల క్యాసెట్ మా ఇంట్లో చాలా రోజులే నలిగింది. అందుకే నిన్న సినిమా చూస్తూంటే డైలాగులు వింటుంటే ఒక్కసారి అప్పటి ఙ్ఞాపకాల లోకి వెళ్ళి పోయాను. సినిమా మొదట్లో వచ్చే వాటికన్నా జయసుధ ఇంట్లో ఉండే డైలాగులు కేక. శ్రీదేవి వచ్చినప్పటివి కానీ.. అక్కినేని జయసుధ తో తను ఒంటరి వాడిని కానని మరణం గురించి చెప్తూ "ఒకో సారి కిందుంటుంది ఒకోసారి పై నుంటుంది ఒకోసారి ముందుంటుంది ఒకోసారి వెనకుంటుంది.." అనే సంభాషణలు కానీ అక్కినేని గారి నోటివెంట విని తీరాల్సిందే..

నిజానికి ఈ సినిమాలో పేరు తెచ్చుకున్న పాటలు బోల్డు కానీ నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం. ఇంకా వేరే పాటలు అంటే.. మా ఊరి పాట "కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా.." ఈ పాట కోటప్ప కొండ తిరునాళ్ళ లోనే తీసారు అని చెప్పుకునే వాళ్ళు అప్పట్లో కానీ నాకు మళ్ళి ఈ పాట చూసి నిర్ధారించుకునే అవకాశం రాలేదు. ఇంకా "నా కళ్ళు చెబుతున్నాయి..నిను ప్రేమించానని..", "ఆగదూ ఆగదూ.. ఆగితే సాగదు", "వందనం అభివందనం", "దేవీ మౌనమా శ్రీదేవీ మౌనమా", "ఒక దేవుడి గుడి లో.." దేనికదే ఫేమస్. అప్పట్లో బాలు గారు కాస్తంత మిమిక్రీ చేసి అచ్చూ అక్కినేని గారే పాడారా అన్నట్లు పాడేవారు. అదీ ఓ కారణమేమో వందనం లాటి పాటలు అంతగా హిట్ అవడానికి. ఏదేమైనా తారలు దిగివచ్చిన సాహిత్యం వీడియో మీకోసం. అలానే ఆసక్తి వుంటే తెలుగు FM వారి లింక్ కూడా ఇస్తున్నాను మిగిలిన పాటలు వినాలని అనిపిస్తే ఆ లింక్ లో వినగలరు. సాహిత్యం మాత్రం కేవలం ఈ పాటకే ఇస్తున్నా.ఈ చిత్రం లోని మిగిలిన పాటలు ఇక్కడ ఈ లింక్ పై క్లిక్ చేసి వినవచ్చు

చిత్రం : ప్రేమాభిషేకం,
సాహిత్యం : దాసరి నారాయణరావు
సంగీతం : చక్రవర్తి
గానం : బాలసుబ్రహ్మణ్యం

తారలు దిగివచ్చిన వేళ.....
మల్లెలు నడిచొచ్చిన వేళ.....
చందమామతో ఒక మాట చెప్పాలి.. ఒక పాట పాడాలి...
చందమామతో ఒక మాట చెప్పాలి.. ఒక పాట పాడాలి...

||తారలు||

ఊరంతా ఆకాశానా గోరంత దివ్వెగా
పిడికెడంత గుండెలోనా కొండంత వెలుగుగా
కనిపించే రంగులన్ని సింధూరపు చీరెగా
కనిపించని సిగ్గులన్ని ముసుగేసిన మబ్బుగా
కనిపించే రంగులన్ని సింధూరపు చీరెగా
కనిపించని సిగ్గులన్ని ముసుగేసిన మబ్బుగా
నిలిచిపొమ్మనీ మబ్బుగా... కురిసిపొమ్మనీ వానగా...
విరిసిపొమ్మనీ వెన్నెలగా... మిగిలిపొమ్మనీ నా గుండెగా...
మిగిలిపొమ్మనీ... నా గుండెగా...

చందమామతో ఒక మాట చెప్పాలి.. ఒక పాట పాడాలి...
చందమామతో ఒక మాట చెప్పాలి.. ఒక పాట పాడాలి...
||తారలు||

నీలిరంగు చీకటిలో నీలాల తారగా
చూడనంత శూన్యములో దొరకనంత ఆశగా
వేటాడే చూపులన్ని లోలోని ప్రేమగా
వెంటాడే వలపులన్ని కాబోయే పెళ్లిగా
వేటాడే చూపులన్ని లోలోని ప్రేమగా
వెంటాడే వలపులన్ని కాబోయే పెళ్లిగా
చెప్పిపొమ్మనీ మాటగా... చేసిపొమ్మనీ బాసగా...
చూపిపొమ్మనీ బాటగా... ఇచ్చిపొమ్మనీ ముద్దుగా...
ఇచ్చిపొమ్మనీ... ముద్దుగా

చందమామతో ఒక మాట చెప్పాలి.. ఒక పాట పాడాలి...
చందమామతో ఒక మాట చెప్పాలి.. ఒక పాట పాడాలి...
||తారలు||

8 comments:

హ హ హ. బాగుంది. మా అమ్మ ఏయెన్నార్ కీ వీర ఫేను. ఈ సినిమా చూడ్డమే కాక, గ్రామఫోను రికార్డుకూడా తెచ్చింది. ఆ రికార్డు ప్లే చేసినప్పుడల్లా నేనేమో తీసెయ్యమని గోల. కానీ అలాగే వినీ వినీ .. జయసుధ - శ్రీదేవి మధ్య డయలాగులు కంఠతా వచ్చేశాయి.
అన్నట్టు సాకి అంటే పాట ముందు వచ్చే వచనం, ఆలాపన కాదు. ఉదాహరణకి .. మనసు గతి ఇంతే ముందు .. తాగితే మరిచి పోగలను .. ఎట్సెట్రా.

బాగున్నాయి మీ జ్ఞాపకాలు.కొత్తపాళి గారు Thx అండి.ఎవరినో సాకి గురించి recently అడిగాను.

కొత్తపాళీ గారు నెనర్లు. అప్పట్లో ఇంటికొకరు ఏయెన్నార్ ఫేను ఉండేవారేమో కదా.. సాకి గురించి వివరించినందుకు నెనర్లు. టపా లో సరిచేశాను.

వినయ్ గారు నెనర్లు.

:-)

కమ్మటి కల అనే బ్లాగు చూశాను. అందులోనూ మంచి పాటలున్నట్టున్నాయి. నాకు లింకైతే గుర్తులేదు.

మీ దయ వల్ల మ్యూజికాలజిస్ట్ రాజా గారి బ్లాగులొ కొన్ని అరుదైన సంగతులు తెలుసుకున్నాను. ధన్యవాదాలు.

నెనర్లు గీతాచార్య గారు. నేను కూడా వెతకడానికి ప్రయత్నించాను కాని కమ్మటి కల కనిపించ లేదండి :-)

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.