సోమవారం, సెప్టెంబర్ 23, 2013

రుక్మిణీ కళ్యాణం హరికథ

హరికథా ప్రక్రియపై నాకున్న మక్కువ మీ అందరికీ తెలిసినదేగా ముఖ్యంగా సినిమాల్లో వచ్చే హరికథలంటే నాకు మరీ ఇష్టం. సూత్రధారులు సినిమాలోని ఈ రుక్మిణీ కళ్యాణ హరికథ కూడా బాగుంటుంది. సాథారణంగా కథకులుగా మగవాళ్ళనే చూస్తుంటాం అయితే ఈ సినిమాలో రొటీన్ కి భిన్నంగా కె.విశ్వనాధ్ గారు కె.ఆర్.విజయ గారితో హరికథ చెప్పించారు. ఆవిడ ఆహార్యానికి తగినట్లుగా సుశీల గారు నేపధ్యగానం చేశారు, కనులు మూసుకుని కథ వింటూంటే సన్నివేశాలు (సినిమాలోవి కాదు రుక్మిణీ కళ్యాణంలోని సన్నివేశాలు) కళ్ళముందు సాక్షాత్కరించేస్తాయి. 

ఈ పాటను రాసినది మాడుగుల నాగఫణి శర్మ గారన్న విషయం ఈరోజే దీని గురించి వెతుకుతుంటే తెలిసింది. ఇవికూడా ఏవైనా పద్యాలలోవేమో తెలియదు కానీ ప్రాసతో కూడిన కొన్ని కొన్ని పదప్రయోగాలు చాలా ఆకట్టుకుంటాయి. కె.వి.మహదేవన్ గారి బాణి గురించి నే చెప్పగలిగినదేముంది అద్భుతమనే మాట తప్ప. ఈ హరికథను మీరు ఇక్కడ వినవచ్చు ప్లే లిస్ట్ లో మొదటినుండి ఐదవ పాట “శ్రీరస్తూ శుభమస్తూ” అనే టైటిల్ తో ఉంటుంది.  

చిత్రం : సూత్రధారులు
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : మాడుగుల నాగ ఫణి శర్మ
గానం : సుశీల, ఎస్. పి. పల్లవి

శ్రీమద్ గజాననం నత్వా
స్తుత్వా శ్రీ సత్య సాయినమ్
శ్రీ హరికథా పితామహమహమ్ వందే..
నారాయణ దాస సద్గురుమ్.

శ్రీరస్తూ... శుభమస్తూ...

శ్రీరస్తు శుభమస్తు
సత్కథాలహరికీ.. హరికీ ..
ఆగమలతల కొసల విరిసినా విరికి... హరికీ
కోటి కొంగుల ముడుల పుణ్యంబు సిరికీ... హరికీ
సిరికీ... హరికీ.. శ్రీరస్తు శుభమస్తు

యత్ర శ్రీకృష్ణ సంకీర్తనమ్..
తత్ర శుభమంగళ సంవర్తనమ్... అని ఆర్యోక్తి..
అలాంటి సర్వమంగళ మోహనాకారుడైన శ్రీకృష్ణుడి అనేకానేక లీలా వినోదములలో... రుక్మిణీ కల్యాణ సత్కథా మధురాతి మధురమైనది.. అందలి నాయికామణి...
ఆ రమణీ..
లలిత పల్లవపాణి నీలసుందరవేణి...
అందాల పూబోణి... ఆ రుక్మిణీ...
అందాల పూబోణి... ఆ రుక్మిణీ...

కనులవి తెరచిన చాలు.. యదునందను అందమె గ్రోలూ
కరములు కదలిన చాలు.. కరివరదుని పదముల వ్రాలు
పెదవులు మెదిలిన చాలు.. హరిజపముల తపములదేలు
ఉల్లమంతా నల్లనయ్యే.. వలపు ఓపని వెల్లువయ్యే..

అంతలో..

యదుకేసరితో హరితో గిరితో
మన వియ్యము గియ్యము కూడదని
శిశుపాలుని పాలొనరింతునని
తన సోదరుడాడిన మాటవినీ..
దిగులుగొనీ.. దిక్కెవ్వరనీ.. 

తలపోసి తలపోసి తెలవారగా..
తనువెల్ల తపనలో తడియారగా..
తలపోసి తలపోసి తెలవారగా..
తనువెల్ల తపనలో తడియారగా..
ప్రళయమే రానున్నదని ఎంచెను..
ప్రణయ సందేశమాస్వామీ కంపెనూ..

ఆ లలిత పల్లవపాణి.. నీల సుందర వేణి..
అందాల పూబోణి ఆ రుక్మణీమణికి..
శ్రీరస్తు శుభమస్తు..
శ్రీరస్తు శుభమస్తు.

అగ్రజుడైన రుక్మి తన పంతమే తనదిగా
శిశుపాలునికిచ్చి వివాహము జరిపింప నిశ్చయింపగా
ఆ చిన్నారి రుక్మిణీ.. 

రానన్నాడో... తానై రానున్నాడో...
ప్రభువు ఏమన్నాడో.. ఏమనుకున్నాడో
అని మనసున విలవిలలాడు తరుణంబున

అది గ్రహించని చెలికత్తెలా రుక్మిణీదేవికీ...

తిలకము దిద్దిరదే... కళ్యాణ తిలకము దిద్దిరదే
చేలముగట్టిరదే... బంగారు చేలముగట్టిరదే
బాసికముంచిరదే... నుదుటను బాసికముంచిరదే
పదములనలదిరదే... పారాణి పదములనలదిరదే...
పారాణి పదములనలదిరదే...

ఇవ్విదమ్మున అలంకరింపబడిన రుక్మిణిదేవీ...
శిలపై అశువులుబాయు బలిపశువు చందంబున...
అందంబును ఆనందంబును వీడి...
డెందంబున కుందుచుండగా...

అదిగో వచ్చెను వాడే హరి శ్రీహరీ
అదిగో వచ్చెను వాడే హరి శ్రీహరీ
శ్రీరుక్మిణీ హృదయప్రణయాక్షరీ
అదిగో వచ్చెను వాడె...

వచ్చీ వైరుల ద్రుంచి.. వరరత్న మై నిల్చి
వనితా మనోరధము దీర్చీ.. రథము బూన్చి
జయవెట్ట జనకోటి.. వెడలే రుక్మిణి తోటి
అదిగో అదిగో వాడే హరి శ్రీహరి..

స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా...
న్యాయేన మార్గేన మహిమ్ మహీశాః...
గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యమ్
లోకా సమస్తా సుఖినో భవంతు...
 

శుక్రవారం, సెప్టెంబర్ 13, 2013

ఇంతకూ నువ్వెవరూ !!

సినీ ప్రపంచంలో ఒకోసారి కొత్తవాళ్ళు భలే మెరిపిస్తారు, దదాపు అందరూ కొత్తవాళ్ళే పని చేసిన “స్నేహితుడా” సినిమా లోని ఈ పాట అలాంటి వాటిలో ఒకటి. ఈ సినిమా పూర్తిగా చూసే అవకాశం నాకు ఇప్పటివరకూ దొరకలేదు కానీ ఈ పాటమాత్రం కొన్ని వందల సార్లు విన్నాను. సంగీత దర్శకులు, పాటల రచయిత సినిమా దర్శకుడు అంతా కొత్తవాళ్ళే అయినా శ్రేయఘోషల్ ఈ పాటకి ప్రాణం పోసింది. మీరూ ఓ సారి వినండి. ఆడియో మాత్రమే వినాలంటే రాగాలో ఇక్కడ వినవచ్చు. వీడియో ఈ క్రింద చూడగలరు.


చిత్రం : స్నేహితుడా
సంగీతం : శివరామ్ శంకర్
సాహిత్యం : భాషాశ్రీ
గానం : శ్రేయా ఘోషల్

Who who who who are you
Who who who who are you

ఇంతకూ నువ్వెవరూ వరసకు నాకెవరూ
అంతగా గుచ్చిగుచ్చి చెప్పేటందుకు నేనెవరూ
ఇంతకూ ముందెవరూ ఇంతగా నాకెవరూ
చెంతకు వచ్చి వచ్చి చెప్పినవారే లేరెవరూ
ఒక నిముషం కోపముతో మరు నిముషం నవ్వులతో
నను మురిపిస్తావు మరిపిస్తావు ఎందుకో
నీ పంతము ఏమిటనీ ఏ బంధము మనది అని
నేను ఆలోచిస్తే బదులే దొరకదు ఎంతకూ

ఇంతకూ నువ్వెవరూ వరసకు నాకెవరూ
అంతగా గుచ్చిగుచ్చి చెప్పేటందుకు నేనెవరూ

ఆఆఆఆఆ.అ.అ.అ.ఆఆఆఆఅ

ఎందుకో ఏమిటో నేను చెప్పలేను గానీ
కలిసావు తియ్యనైన వేళ
చనువుతో చిలిపిగా నీవే మసలుతుంటే నాతో
మరిచాను గుండెలోని జ్వాలా
ఓ తొలకరి స్నేహమా నేస్తమా ఏమి మాయో ఇది
నీ అడుగుల నీడలో కాలమే నిలిచి చూస్తున్నదీ

ఇంతకూ నువ్వెవరూ వరసకు నాకెవరూ
అంతగా గుచ్చిగుచ్చి చెప్పేటందుకు నేనెవరూ

ఎవరనీ చూడక నాకై పరుగు తీస్తూ ఉంటే
నీ తీరే ఆశ రేపె నాలో
నువ్వలా కసురుతూ నాకే అదుపు నేర్పుతుంటే
చూసాలే నన్ను నేను నీలో
ప్రియమైన సమయమా గమనమా చెప్పవే అతనికి
ఈ చిరు చిరు పయనమే మధురమై నిలిచిపోతుందనీ

ఇంతకూ నువ్వెవరూ వరసకు నాకెవరూ
అంతగా గుచ్చిగుచ్చి చెప్పేటందుకు నేనెవరూ
ఒక నిముషం కోపముతో మరు నిముషం నవ్వులతో
నను మురిపిస్తావు మరిపిస్తావు ఎందుకో
నీ పంతము ఏమిటనీ ఏ బంధము మనది అని
నేనాలోచిస్తే బదులే దొరకదు ఎంతకూ

సోమవారం, సెప్టెంబర్ 02, 2013

నేనేనా ఆ నేనేనా...

కళ్యాణికోడూరి(కళ్యాణిమాలిక్) కంపొజిషన్ నాకు చాలా నచ్చుతుంది. నా మిత్రులలో కొందరు తనవన్నీ మెలోడీస్ ఆల్మోస్ట్ అన్ని పాటలు ఒకేలాగా ఉంటాయ్ అని కంప్లైంట్ చేసినవాళ్లు కూడా లేకపోలేదు. కానీ నాకు మాత్రం తన పాటలు వేటికవే స్లైట్ వేరియేషన్ తో ఎక్కువకాలం గుర్తుండిపోయేలా ఉంటాయ్ అని అనిపిస్తుంటుంది. "అంతకుముందు ఆ తరువాత" సినిమా కోసం తను కంపోజ్ చేసిన ఈ "నేనేనా ఆ నేనేనా" అనే పాట కూడా అలాగే నాకు చాలా నచ్చేసింది. ఈపాట ప్రారంభంలో వచ్చే మ్యూజిక్ బిట్ చాలాబాగుంది. సిరివెన్నెల గారి సింపుల్ సాహిత్యం సినిమాలోని సన్నివేశాన్ని పాత్రల మనోభావాల్ని సున్నితంగా మన కళ్ళముందు పెడుతుంది. ఈమెలోడికి శ్రీకృష్ణ సునీతల స్వరం చక్కగా అమరింది. పూర్తిపాట ఆడియో లింక్ దొరకలేదు మీకెవరికన్నా తెలిస్తే కామెంట్స్ లో ఇవ్వగలరు. యూట్యూబ్ లో పూర్తిపాట ఇక్కడ వినవచ్చు. సిరివెన్నెల గారి చేతిరాతలో ఈ పాట లిరిక్స్ ఇక్కడ చూస్తూ పాట వినవచ్చు.


 
చిత్రం : అంతకుముందు ఆతరువాత
సాహిత్యం : సిరివెన్నెల
సంగీతం : కళ్యాణి కోడూరి(కళ్యాణిమాలిక్)
గానం : శ్రీకృష్ణ, సునీత

నేనేనా ఆ నేనేనా!
నా నుంచి నేనే వేరయ్యానా!!
ఉన్నానా నేనున్నానా!
ఉన్నానుగా అంటున్నానా!!
వెళ్ళొస్తానంటూ ఆ నిజం
ఓ జ్ఞాపకంలా మారిపోతున్నా
ఏం చేశాననీ ఏం చూస్తున్నాననీ
అనుకోని ఆ క్షణం.
నేనేనా ఆ నేనేనా!
నా నుంచి నేనే వేరయ్యానా!!

గాలిలో మేడ గాల్లోనే ఉంటుంది
నేలకేనాడు దిగిరాదనీ.
నీటిలో నీడ నీళ్ళల్లో కరిగింది
చేతికందేది కాదే అనీ
చెప్పాలా ఎవరో కొత్తగా
అది నమ్మలేనీ వింతకాదనీ
ఏం చేశాననీ ఏం చూస్తున్నాననీ
అనుకోని ఆ క్షణం
నేనేనా ఆ నేనేనా!
నా నుంచి నేనే వేరయ్యానా!!

ఆఅ.ఆఆఆఆఆఆఆఆ...

నన్ను నాలాగ చూపించవే అంటూ
నిలువుటద్దాన్ని నిందించనా
నేను తనలాగ ఏనాడు మారానో
నాకు నేనింక కనిపించనా
అద్దంలో లోపం లేదనీ
నా చూపులోనే శూన్యముందనీ
ఏం చేశాననీ ఏం చూస్తున్నాననీ
అనుకోని ఆ క్షణం
నేనేనా ఆ నేనేనా!
నా నుంచి నేనే వేరయ్యానా!!

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.