గురువారం, ఆగస్టు 22, 2013

ఏనాడు విడిపోని ముడివేసెనే..

కొన్ని పాటలు చూడడానికన్నా ముందే బాగా వినడానికి అలవాటుపడిపోతాము దాంతో ఆ పాట గురించి మన మనసులో ఒక ఊహా చిత్రం ఏర్పడిపోతుంది. ఈ పాట గురించి కూడా నాకు అలాంటి ఒక అందమైన ఊహా చిత్రమే మనసులో ముద్రించుకుపోయింది. చిన్నపుడు సినిమా మొదటిసారి చూసినపుడు ఈ పాట గురించి పెద్దగా పట్టించుకోలేదు కానీ తరువాత తరువాత ఈపాట వినేకొద్ది చాలా నచ్చేసింది అలాగే తెరమీద అప్పుడేం చూశానో గుర్తులేకుండా నా ఊహలు మాత్రమే మిగిలిపోయాయి. 

ఇంత ఉపోధ్ఘాతమెందుకు చెప్పానంటే ఈ పాట చూడడం కన్నా కనులు మూసుకుని వినడం నాకు చాలా ఇష్టం. అలా ఎన్నిసార్లు రిపీటెడ్ గా విన్నానో లెక్కలేదు. సిరివెన్నెల గారు రాసిన ఈ పాట సాహిత్యం చాలా అందంగా ఉంటుంది. ఇళయరాజా గారి బాణి గోదారి మీద చల్లని గాలుల్లో పడవ ప్రయాణంలా సుతిమెత్తగా హాయిగా సాగుతుంది. ప్రారంభమే పక్షుల కిల కిలా రావాలతో చాలా చక్కగా ప్రారంభమవుతుంది, మొదటి చరణం ముందు వచ్చే ఫ్లూట్ బిట్ కూడా భలే ఉంటుంది. 

స్వాతిముత్యం సినిమాలో నేపధ్యసంగీతంలో ఊపయోగించిన ఒక మ్యూజిక్ బిట్ వంశీ గారికి బాగా నచ్చి అదే ట్యూన్ లో కావాలని చెప్పి మరీ ఇళయరాజా గారితో ఈ పాటకి ట్యూన్ చేయించుకున్నారట. బాలు గారి గొంతు కాస్త జలుబు చేసినట్లు అనిపిస్తుంది కానీ అదే అందంగా ఉంటుంది ఇక జానకి గారు ఎప్పటిలాగే పాట మూడ్ కి తగ్గట్లు బ్రహ్మాండంగా పాడారు. 

ఈ చక్కని పాట ఆడియో మాత్రం వినాలంటే రాగాలో ఇక్కడ వినవచ్చు వీడియో కూడా చూడాలంటే ఇక్కడ చూడవచ్చు. ఈ పాటంటే అమితమైన ఇష్టంగల నా ఆత్మీయ మిత్రుడు.. ఇళయరాజా కి భక్తుడు, వంశీకి వీరాభిమాని కూడా... ఈ వారాంతంలో తన పెళ్ళి సంధర్బంగా ఈ టపా తనకి అంకితం.  


చిత్రం: శ్రీకనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్
సంగీతం : ఇళయరాజ
సాహిత్యం : సిరివెన్నెల
గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, జానకి

ఏనాడు విడిపోని ముడి వేసెనే
నీ చెలిమి తోడు ఈ పసుపు తాడు
నీ చెలిమి తోడు ఈ పసుపు తాడు
ఈ మధుర యామినిని


ఏ జన్మ స్వప్నాల అనురాగమో
ఏ జన్మ స్వప్నాల అనురాగమో
పూసినది నేడు ఈ పసుపు తాడు
పూసినది నేడు ఈ పసుపు తాడు
ఈ సుధల ఆమనిని

ఏనాడు విడిపోని ముడి వేసెనే
ఏనాడు విడిపోని ముడి వేసెనే

సా...గామ గమ గామ గమరీ..
సారి నిరి సారి నిసనీ..
సాదాదరీ.. రీగాగపా..


మోహాన పారాడు వేలి కొనలో
నీ మేను కాదా చైత్ర వీణ
వేవేల స్వప్నాల వేడుకలలో
నీ చూపు కాదా పూల వాన

రాగసుధ పారే అలల శ్రుతిలో
స్వాగతము పాడే ప్రణయము
కలకాలమూ కలగానమై
నిలవాలి మన కోసము... ఈ మమత


ఏనాడు విడిపోని ముడి వేసెనే
ఏనాడు విడిపోని ముడి వేసెనే

నీ మోవి మౌనాన మదన రాగం
మోహాన సాగే మధుప గానం
నీ మోవి పూసింది చైత్ర మోదం
చిగురాకు తీసే వేణు నాదం

పాపలుగ వెలిసే పసిడి కలకు
ఊయలను వేసే క్షణమిదే
రేపన్నదీ ఈ పూటనే
చేరింది మన జంటకు... ముచ్చటగ


ఏనాడు విడిపోని ముడి వేసెనే
ఏనాడు విడిపోని ముడి వేసెనే
నీ చెలిమి తోడు ఈ పసుపు తాడు
పూసినది నేడు ఈ పసుపు తాడు
ఈ మధుర యామినిని
ఏనాడు విడిపోని ముడి వేసెనే
ఏనాడు విడిపోని ముడి వేసెనే

బుధవారం, ఆగస్టు 21, 2013

వెన్నెలై పాడనా...

వంశీ,ఇళయరాజా ల కాంబినేషన్లో చాలా మంచి పాటలున్నాయన్న విషయం మనకి తెలిసిందే వాటిల్లో ఓ ఆణిముత్యం లాంటి పాట ఇపుడు మీకు పరిచయం చేయబోతున్నాను. “శ్రీ కనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్” సినిమా పేరు వింటేనే నేను ఒక చిత్రమైన అనుభూతికి లోనవుతాను. తొంభైల తర్వాత అశ్లీలత పాళ్లు హెచ్చడంతో క్రమంగా కనుమరుగైన ఈ రికార్డింగ్ డాన్సులు ఒక కళారూపం అని కూడా చెప్పుకోవచ్చేమో. యూట్యూబ్ లు టీవీలూ వీడియోలు లేని ఆకాలంలో సినిమా హీరో హీరోయిన్స్ గెటప్పూ, మానరిజమ్స్ తో సహా స్టెప్స్ ని స్టేజి మీద ప్రదర్శించి, ఆకాశంలో అందని తారల్లా తెరమీద మాత్రమే వెలిగే సినిమా తారలని కళ్ళముందు నిలబెట్టే ఈ డాన్సుట్రూపులు తొంభైల వరకూ కూడా తెలుగు వారి ప్రతి ముఖ్యమైన వేడుకలోనూ పాలుపంచుకుంటూ ఒక వెలుగు వెలిగాయ్. వీటి నేపధ్యంలో వంశీ అల్లుకున్న ఓ పిరికి వాడి ప్రేమకథే ఈ సినిమా.

ఈ సినిమాలో నాకు ఎక్కువగా ఇష్టమైన పాట “వెన్నెలై పాడనా”, సాధారణంగా డెబ్బై ఎనభైలలో వచ్చిన పాటలు చిత్రీకరణ చూడడానికి నేను కొంచెం భయపడతాను. ఎంతో అందమైన పాటలను చాలా చిత్ర విచిత్రంగా భరించలేని నటీనటులపై చిత్రీకరించి భయపెడతారు. ఐతే ఈ పాట మాత్రం నాకు పాటతో పాటు చిత్రీకరణ సైతం మనసులో ముద్రించుకు పోయింది. కుమ్మరి చక్రం, మగ్గం, రాట్నం లాంటి వాటి చుట్టూ పల్లె వాతావరణాన్ని ప్రతిభింబిస్తూ ఇలా కూడా చిత్రించ వచ్చా అనిపించేలా తీయడం ఒక్క వంశీ గారికే చెల్లింది.

ఇక ఈ పాట రచయిత గురించి వెతుకుతుంటే నాకొక ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఈ ట్యూన్ సిద్దమయ్యాక పాటల రచయితకి ఫాల్స్ లిరిక్స్ ఇవ్వడం కోసం స్వతహాగా భావుకుడు రచయిత అయిన వంశీగారు మధ్యమధ్యలో ఇళయరాజా గారు కొన్ని పదాలు అందిస్తుండగా రాశారట. పాట బాగుందని దానినే ఫైనల్ వర్షన్ గా ఉంచేశారని అందుకే టైటిల్స్ లో వంశీ ఇళయరాజాల పేర్లు పాటల రచయితల కార్డ్ లో ఉంటాయని వంశీగారే ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లుగా పాతబంగారం ఫోరంలో చదివాను. ఐతే లలనామణి, తలలోమణి, నవలామణి లాంటివి వంశీగారివేలే అనిపించినా రెండో చరణంలో ప్రమిద కాంతిపువ్వు ప్రమద చిలుకునవ్వు, ఉలిశిలఖేలనము లాంటివి నిజంగా వంశీగారు రాసినవేనా అనిపిస్తాయి.

ఇక ఆ చక్కని సాహిత్యానికి బాలు జానకి గార్లు తమ స్వరంతో జీవం పోశారు. నిజానికి వాళ్ళిద్దరూ కొన్ని పాటలను శ్రద్దగా కష్టపడి పాడినట్లు తెలియనివ్వరు ఆ పాటలు వాళ్ళు పాడలేదు పాటతో స్వరాలతో ఆడుకున్నారు అనిపిస్తుంటుంది ఇదీ అలాంటి పాటే జాగ్రత్తగా గమనించి చూడండి. ఈ పాటలో మధ్యలో అక్కడక్కడ బాలుగారు నవ్వే నవ్వు మగవాళ్ళకి మాకే "ఆహా ఏం నవ్వాడ్రా బాబు" అనిపిస్తుంది ఇక అప్పట్లో ఆ నవ్వు విన్న అమ్మాయిల పరిస్థితి గురించి ఏం చెప్పమంటారు :-)  

ఈ పాట వీడియో కింద ఎంబెడ్ చేస్తున్నాను ఆడియో మాత్రం వినాలంటే రాగాలో ఇక్కడ వినవచ్చు. సంధర్బానుసారంగా ఎక్కువగా పాత పాటలను లైట్ గా రీమిక్స్ చేసి ఈ సినిమాకు ఉపయోగించుకున్నా ఈ సినిమా కోసమే సిద్దం చేస్కున్న ఈ పాటతో పాటు “ఏనాడు విడిపోని” అన్న మరో పాట కూడా చాలా బాగుంటుంది. ఆ పాట గురించి రేపటి టపాలో. ఈ రెండు టపాలు ఈ వారాంతం పెళ్ళి చేసుకుని ఓ ఇంటివాడవబోతున్న ఓ ఆత్మీయ మిత్రుడికి అంకితం.

 

చిత్రం: శ్రీకనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్
సంగీతం : ఇళయరాజ
సాహిత్యం : వంశీ,ఇళయరాజ
గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, జానకి

వెన్నెలై పాడనా
నవ్వులే పూయనా
మల్లెలే పొదగనా

పూవులో.. మ్ నవ్వులో.. మ్ మువ్వలా.. మ్ హూ..
ఒంపులో.. సొంపులో.. కెంపులా.. ఆహా..
కలకల పొదలో కిలకిల కధనం
ముసిముసి రొదలో అలసట మధురం

పొద్దులో మీటనా
ముద్దులే నాటనా
హద్దులే దాటనా
ఇవ్వనా.. యవ్వనం.. పువ్వునై.. అహహ
గువ్వనై.. హో గవ్వనై.. హో నవ్వనా.. అహ్హహ్హ
లలనామణినై తలలోమణినై
నవలామణినై చింతామణినై

వెన్నెలై పాడనా 
నవ్వులే పూయనా
మల్లెలే పొదగనా

నీ.. నిసరీ..
సా.. సరిగా..
పనిసా.. సమగ సరిగ..
పనిపా.. గపమ గమరీ..
మనినిని పససస నిరిరిరీ
గగగమ నిసరిమగ
 పససస నిరిరిరీ గా..
మదసని
గసమగ పనిసని సా..

లీలగా తూగుతూ ఏమిటో దేహమె
వేడుకా ధారలే దాహమై కోరిన
పాడుతూ వేడినా కోరుతూ పాడినా
భేషజం చూపుతూ దోహదం చేయవు
మోవికెంపు బాధ గుండె మువ్వ గాధ
పొద్దు పువ్వులాగ నవ్వుతుంది చూడు
వెలుతురు.. మ్ నేత్రమే.. మ్ సోకని ప్రాంగణము
గాలికే.. ఊపిరి.. పూసే పరిమళము

తకధిమి తరిగడతత్తోం..
తకధిమి తరిగడతత్తోం..
తరిగడతత్తోం.. తరిగడతత్తోం.. తకతోం..
తకధిమి తరిగడతత్తోం..
తకధిమి తరిగడతత్తోం..
తరిగడతత్తోం.. తరిగడతత్తోం.. తకతోం..

చందనం పూయనా పూలలో రాజుకి
నోచిన నోముకే పూచినా రోజుకి
సుందరం ధూపమే వేయనా పూజకి 
జాలిగా గాలిలో వీచినా మోజుకి
ప్రమిద కాంతి పువ్వు
ప్రమద చిలుకు నవ్వు
కలికి కలలు రాసే కధల పురము వాసి
బ్రతుకున.. మ్ పలికిన.. మ్ కిలకల కూజితము హహహ
మధురమై.. మొలవనీ.. ఉలిశిల ఖేలనము 

పొద్దులో మీటనా
ముద్దులే నాటనా
హద్దులే దాటనా

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.