గురువారం, నవంబర్ 15, 2012

లాలీ లాలీ జోలాలి...

చంద్రబోస్ పాటలలో చాలాసార్లు తను సినీరంగంలో ప్రవేశించగలగడానికి కారణమైన ప్రాస కోసం ప్రయాస పడినట్లు కనిపించినా కొన్ని సార్లు అందులోనే చక్కని సాహిత్యాన్ని కూడా గమనించవచ్చు ముఖ్యంగా పాటకోసం తను ఎన్నుకునే థీం నాకు బాగా నచ్చుతుంది. డమరుకం సినిమాలోని ఈ లాలిపాటని గమనించండి ఎంత బాగారాశారో.

ఏ అమ్మకైనా తన బుజ్జాయికన్నా ప్రియమైన వాళ్ళెవరుంటారు చెప్పండి తను చేసే ప్రతిపని ఆ అమ్మకి అపురూపమే కదా ఇదే భావనని పల్లవి లోనూ మొదటి చరణంలోను వివరించిన చంద్రబోస్ రెండవ చరణంలో ఆ బుజ్జాయికోసం చేసే ప్రతిపనిని అమ్మ ఎంత ప్రేమగా ఇష్టంగా శ్రద్దగా చేస్తుందో చెప్తారు. తన  ఇష్ట దైవానికి అభిషేకించి పూజ చేసి నైవేద్యం పెట్టేటప్పుడు ఎలా చేస్తుందో బుజ్జాయికి చేసే పనులు కూడా అలాగే చేస్తుందట. ఆ చిన్నారి చిట్టి కేరింతలతో నట్టింటనడయాడుతుంటే తన ఇల్లు సాక్షాత్తు కైలాసమల్లే మారిపోయిందని మురిసిపోతుందట. అమ్మ మనసును ఎంత చక్కగా ఆవిష్కరించారో కదా. ఇంత చక్కని సాహిత్యానికి ఆకట్టుకునే దేవీశ్రీ సంగీతం, గోపికా పూర్ణిమ గాత్రం చక్కగా సరిపోయాయి. ఈ చక్కని లాలిపాట మీరు కూడా రాగాలో ఇక్కడ వినండి.  

ఈటపా ఈమధ్యే అమ్మగా ప్రమోషన్ పొందిన ఓ ప్రియనేస్తానికి అంకితం... ఈపాట గురించి పోస్ట్ వేయమని అడిగిన ఆ నేస్తం గారి అన్నగారికి కూడా :-)


చిత్రం: డమరుకం
గాయని: గోపిక పూర్ణిమ
గీత రచయిత: చంద్రబోస్
సంగీత దర్శకుడు: దేవీశ్రీప్రసాద్

ఆరి..రారి..రారో.. తరి..రారి రారి..రారో..
ఆరి..రారి..రారో.. తరి..రారి రారి..రారో..

లాలీ లాలీ జోలాలి అంటూ లాలించాలీ ఈగాలీ
లాలీ లాలీ జోలాలి వింటూ లోకాలన్నీ ఊగాలీ
నీతో ఆడాలంటూ నేలా జారేనంట జాబిల్లీ...
నీలా నవ్వలేనంటు తెల్లబోయి చూసేనంట సిరిమల్లి…..

లాలీ లాలీ జోలాలి అంటూ లాలించాలీ ఈగాలీ
లాలీ లాలీ జోలాలి వింటూ లోకాలన్నీ ఊగాలీ

ఆరి..రారి..రారో.. తరి..రారి రారి..రారో..
ఆరి..రారి..రారో... రారో...
ఆరి..రారి..రారో.. తరి..రారి రారి..రారో..
ఆరి..రారి..రారో... రారో...

బోసిపలుకే నువు చిందిస్తూ ఉంటే బొమ్మరిల్లాయే వాకిలీ..
లేత అడుగే నువు కదిలిస్తూ ఉంటే లేడి పిల్లాయే లోగిలీ..
నీ చిన్ని పెదవంటితే పాల నదులెన్నో ఎదలోన పొంగి పొరలీ..
నిను కన్న భాగ్యానికే తల్లి పదవొచ్చి మురిసింది ఈ ఆలీ..

లాలీ లాలీ జోలాలి అంటూ లాలించాలీ ఈగాలీ
లాలీ లాలీ జోలాలి వింటూ లోకాలన్నీ ఊగాలీ

లాల నీకే నే పోసేటి వేళా.. అభిషేకంలా అనిపించేరా...
ఉగ్గు నీకే నే కలిపేటి వేళా.. నైవేద్యంలా అది ఉంది రా...
సిరిమువ్వ కట్టే వేళా.. మాకు శివ పూజే గురుతొచ్చే మరల మరలా..
కేరింత కొట్టే వేళా.. ఇల్లే కైలాసంలా మారే నీవల్ల...

లాలీ లాలీ జోలాలి అంటూ లాలించాలీ ఈగాలీ
లాలీ లాలీ జోలాలి వింటూ లోకాలన్నీ ఊగాలీ

శుక్రవారం, అక్టోబర్ 26, 2012

పాలగుమ్మి విశ్వనాథం గారికి నివాళి.

అమ్మదొంగా నిన్ను చూడకుంటే, మా ఊరు ఒక్కసారి పోయిరావాలి లాంటి అద్భుతమైన లలిత గీతాలను రచించి స్వరపరచి గానం చేసిన లలిత సంగీత స్వర చక్రవర్తి పాలగుమ్మి విశ్వనాథంగారు తన తొంభైమూడవఏట నిన్న గురురువారం (అక్టోబర్ 25) రాత్రి కన్నుమూశారు. వారితో ఒకే ఒక్కసారి ఫోన్ లో మాట్లాడినా ఎవరో అపరిచిత అభిమాని అని అనుకోకుండా ఆత్మీయంగా ఆయన పలకరించిన తీరును మరువలేను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

పుస్తకం.నెట్ లో వారికి నివాళి : http://pustakam.net/?p=12761

ఆ రెండు పాటలు సాహిత్యం తెలుసుకుని వినాలనుకుంటే ఈ బ్లాగులోని పాత టపాలను ఇక్కడ చూడండి.
అమ్మదొంగా నిన్ను చూడకుంటే ఇక్కడ  మాఊరు ఒక్కసారి పోయిరావాలి ఇక్కడ చూడండి.
హిందూ పేపర్ లో ఈ వార్త ఇక్కడ చూడచ్చు. 
ఈనాడు వార్త

బుధవారం, అక్టోబర్ 24, 2012

నేస్తమా నేస్తమా..

కొత్తపాటల్లో లిరికల్ వాల్యూస్ వెతుక్కోడం చాలా కష్టమౌతున్న ఈ రోజుల్లో వచ్చిన ఈ పాటలో ముఖ్యంగా పల్లవి భాస్కరభట్ల పాటలా కాక కవితలా రాశారనిపించింది. దానికి చక్కని దేవీశ్రీప్రసాద్ సంగీతం, అందమైన శ్రీకృష్ణ & హరిణిల స్వరం తోడై ఈ మధ్య నేను తరచుగా వినే పాటలలో ఈపాటను ముందుంచేలా చేశాయి. మీరూ వినండి. పూర్తి పాట ఆడియో రాగాలో ఇక్కడ వినవచ్చు.


చిత్రం : మరుకం (2012)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
రచన : భాస్కరభట్ల రవికుమార్
గానం : శ్రీకృష్ణ , హరిణి

నేస్తమా నేస్తమా నువ్వె కోయిలై వాలతానంటే
తోటలా మారనా నీకోసం
ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరుతానంటే
తూరుపై చూడనా నీకోసం
నేననే పేరులో నువ్వు , నువ్వనే మాటలో నేను
ఈ క్షణం ఎంత బాగుందో ప్రేమలాగా
ఓ హో ప్రేమకే రూపమే ఇచ్చి దానికే ప్రాణమే పోస్తే
ఉండదా నిండుగా మనలాగా..ఆ ..ఆ

ఓహనేస్తమా నేస్తమా నువ్వె కోయిలై వాలతానంటే
తోటలా మారనా నీకోసం
ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరుతానంటే
తూరుపై చూడనా నీకోసం

నువ్వంటే ఎంతిష్టం.. సరిపోదే ఆకాశం..
నాకన్నా నువ్విష్టం .. చూసావా ఈ చిత్రం..
కనుపాపలోన నీవే కల ..ఎద ఏటిలోన నువ్వే అల
క్షణ కాలమైనా చాల్లె ఇలా ..అది నాకు వెయ్యేళ్ళే ..
ఇక ఈ క్షణం.. కాలమే.. ఆగిపోవాలి.. ఓ..

నేస్తమా నేస్తమా నువ్వె కోయిలై వాలతానంటే
తోటలా మారనా నీకోసం
ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరుతానంటే
తూరుపై చూడనా నీకోసం

అలుపొస్తే తల నిమిరే చెలినవుతా నీకోసం..
నిదరొస్తే తల వాల్చే ఒడినవుతా నీకోసం..
పెదవంచు పైన నువ్వే కదా..
పైటంచు మీద నువ్వే కదా..
నడుమొంపు లోన నువ్వే కదా..
ప్రతి చోట నువ్వేలే..
అరచేతిలో.. రేఖలా.. మారిపోయావే ... ఓ

నేస్తమా నేస్తమా నువ్వె కోయిలై వాలతానంటే
తోటలా మారనా నీకోసం
ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరుతానంటే
తూరుపై చూడనా నీకోసం

బుధవారం, అక్టోబర్ 10, 2012

దులపర బుల్లోడో..

ఖంగుమని మోగే భానుమతమ్మ గారి కంచుకంఠంలో ఏపాటైనాసరే ఓ ప్రత్యేకతని సంతరించుకుంటుంది. ఇక అదే ఇలా ఆకతాయికుర్రాళ్ళకి బుద్దిచెప్పే పాటంటే ఇహ ఆలోచించనే అక్కరలేదు ఆవిడ గొంతులో “దులపర బుల్లోడో..” అని వినగానే అలాంటి ఆకతాయిల గుండెల్లో రైళ్ళు పరిగెట్టాల్సిందే :-) తెలుగు సినిమా బ్రాండెడ్ దెయ్యం సాంగ్ “నిను వీడను నేనే” పాట ఉన్న అంతస్థులు సినిమాలోనిదే ఈ పాట కూడా. భానుమతి గారి అభినయం ఆవిడకి వంతపాడే రేలంగి, రమణారెడ్డిలతో కలిసి చూడడానికి కూడా మాంచి సరదాగా ఉంటూంది ఈ పాట. యూట్యూబ్ పనిచేయనివాళ్ళు ఆడియో చిమటా మ్యూజిక్ లో ఇక్కడ వినవచ్చు.
  

చిత్రం : అంతస్థులు
సంగీతం : కె.వి.మహదేవన్
రచన : కొసరాజు
గానం : భానుమతి

దులపర బుల్లోడో.. హోయ్ హోయ్...
దులపర బుల్లోడో దుమ్ము దులపర బుల్లోడా
చిలిపి కళ్లతో షికార్లు కొట్టే మలప రాములను పిలక బట్టుకొని
వన్.. టూ.. త్రీ... చెప్పి...

॥దులపర బుల్లోడో॥

సిరిగల చుక్కల చీర కట్టుకొని
జవాది కలిపిన బొట్టు పెట్టుకొని ॥ సిరిగల॥
వరాల బొమ్మ ముద్దులగుమ్మ
కాలేజీకి కదిలిందంటే వెకిలివెకిలిగా
వెర్రివెర్రిగా వెంటపడే రౌడీల పట్టుకొని... పట్టుకొని
తళాంగు త థిగిణ తక తోం తోం అని (2)
॥దులపర బుల్లోడో॥

సాంప్రదాయమగు చక్కని పిల్ల
సాయంకాలం సినిమాకొస్తే..
వస్తే ॥ సాంప్రదాయమగు॥
అదే సమయమని ఇంతే చాలునని
పక్క సీటులో బైఠాయించుకొని.. ఎట్టా
చీకటి మరుగున చేతులు వేసే
శిఖండిగాళ్లను ఒడిసి పట్టుకొని
చింతబరికెను చేత పట్టుకొని (2)
॥దులపర బుల్లోడో॥

రోడ్డు పట్టని కారులున్నవని
మూడంతస్తుల మేడలున్నవని (2)
డబ్బు చూచి ఎటువంటి ఆడది
తప్పకుండా తమ వల్లో పడునని
ఈలలు వేసి సైగలు చేసే
గోల చేయు సోగ్గాళ్ళను బట్టి... పట్టి
వీపుకు బాగా సున్నం పెట్టి (2)
॥దులపర బుల్లోడో॥

మాయమర్మం తెలియని చిన్నది
మంగళగిరి తిరనాళ్లకు పోతే... పోతే
॥మాయమర్మం॥
జనం ఒత్తిడికి సతమతమౌతూ
దిక్కుతోచక తికమక పడితే అయ్యయ్యో
సందు చూసుకొని సరసాలకు
దిగు గ్రంధసాంగులను కాపు వేసుకొని
రమా రమణ గోవిందా... (2)
॥దులపర బుల్లోడో॥

బుధవారం, అక్టోబర్ 03, 2012

శ్యామసుందరా ప్రేమమందిరా

ఆదినారాయణరావు గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన భక్తతుకారం సినిమాలోని పాటలు అన్నీ కూడా సూపర్ హిట్సే, ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాటలు. ఇందులోని ఈ "శ్యామసుందరా ప్రేమమందిరా" పాటంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం. తత్వాలతో కూడి పల్లెపదం/జానపదంలా అనిపించే ఈపాట ఎప్పుడు విన్నా నాకు తెలియకుండానే గొంతు కలిపేస్తాను.
 
దాశరధి గారి సాహిత్యంలో "అణువణువు నీ ఆలయమేరా నీవే లేని చోటులేదురా", "అహము విడిచితే ఆనందమురా", "సాధన చేయుమురానరుడా సాధ్యముకానిది లేదురా", "అణిగిమణిగి ఉండేవాడే అందరిలోకి ఘనుడు". "దొడ్డమానులను కూల్చుతుఫాను గడ్డిపరకను కదల్చగలదా", "బుడగవంటి బ్రతుకు ఒక చిటికెలోన చితుకు" వంటి మాటలు జీవితాంతం గుర్తుంచుకోవలసిన సత్యాలు. ఆదినారాయణరావు గారి బాణిలో ఆమాటలు అలా అలవోకగా నోటికి వచ్చేస్తాయి. రామకృష్ణ గారి స్వరం కూడా ప్రత్యేకంగా ఉండి ఆకట్టుకుంటుంది.
 
ఆడియోలో ఒకే పాటగా విడుదలైనా సినిమాలో ఈ పాట మొదటి రెండు చరణాలు ఒకసారి మిగిలిన రెండు చరణాలు వేరే పాటలా వస్తాయి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. చివరి రెండు చరణాలు పడవెళ్ళిపోతోందిరా పాటగా ఇక్కడ చూడవచ్చు.  


చిత్రం: భక్త తుకారాం (1973)
సంగీతం: ఆదినారాయణరావు
సాహిత్యం: దాశరథి
గానం: రామకృష్ణ

శ్యామ సుందరా ప్రేమ మందిరా
నీ నామమే వీనుల విందురా
నీ నామమే వీనుల విందురా..
శ్యామసుందరా ...

అణువణువు నీ ఆలయమేరా.. నీవే లేని చోటు లేదురా
అణువణువు నీ ఆలయమేరా నీవే లేని చోటు లేదురా
నేనని నీవని లేనే లేదూ నీకు నాకు బేధమే లేదు

||శ్యామ సుందరా||
సుఖ దుఃఖాలకు నిలయం దేహం ఈ దేహము పై ఎందుకు మోహం
అహము విడిచితే ఆనందమురా అన్నిట మిన్నా అనురాగమురా
భక్త తుకారాం బోధలు వింటే తొలగిపోవును శోకమురా

||శ్యామ సుందరా||
సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా (2)
అలవాటైతే విషమే అయినా హాయిగా త్రాగుట సాధ్యమురా..
హాయిగ త్రాగుట సాధ్యమురా
సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా

కాలసర్పమును మెడలో దాల్చి పూల మాలగా తలచ వచ్చురా...
పూల మాలగా తలచ వచ్చురా
ఏకాగ్రతతో ధ్యానము చేసి లోకేశ్వరునే చేరవచ్చురా..
లోకేశ్వరునే చేరవచ్చురా

దాస తుకారాం తత్వ బోధతో తరించి ముక్తిని పొందుమురా..
తరించి ముక్తిని పొందుమురా

సాధన చేయుమురా నరుడా సాధ్యము కానిది లేదురా

ఓహోహో హొయ్యారె హొయ్యారే హొయ్ హొయ్యా.. హొహోయ్..
ఓహోహో హొయ్యారె హొయ్యారే హొయ్ హొయ్యా.. 


అణిగిమణిగి ఉండేవారే అందరిలోకి ఘనులు హొహోయ్ (2)
దొడ్డమానులను కూల్చు తుఫాను గడ్డి పరకను కదల్చగలదా.. కదల్చగలదా
చిన్న చీమలకు చక్కెర దొరుకును గొప్ప మనిషికి ఉప్పే కరువు.. ఉప్పే కరువు
అణకువ కోరే తుకారామునీ మనసే దేవుని మందిరము.. మనసే దేవుని మందిరము
హోయ్ అణిగిమణిగి ఉండేవారే అందరిలోకి ఘనులు హొహోయ్
అణిగిమణిగి ఉండేవారే అందరిలోకి ఘనులు

హైలెస్సా హైలెస్సా హైలెస్సా
హైలెస్సా హైలెస్సా హైలెస్సా

పడవెళ్ళిపోతోందిరా...ఆ ఆ ఆ ఆ ఓ ఓ ...
పడవెళ్ళిపోతుందిరా ఓ మానవుడా దరి చేరే దారేదిరా
నీ జీవితము కెరటాల పాలాయెరా
పడవెళ్ళిపోతోందిరా..
హైలెస్సా హైలెస్సా హైలెస్సా..
హైలెస్సా హైలెస్సా హైలెస్సా..

తల్లిదండ్రి అతడే నీ ఇల్లు వాకిలతడే(2)
ఆ పాండురంగడున్నాడురా ఆ ఆ ... నీ మనసు గోడు వింటాడురా
నీ భారమతడే మోసేనురా ఓ యాత్రికుడా నిన్నతడే కాచేనురా..
పడవెళ్ళిపోతోందిరా.....

బుడగవంటి బ్రతుకు ఒక చిటికెలోన చితుకు(2)
ఇది శాశ్వతమని తలచేవురా ఆ ఆ...
నీవెందుకని మురిసేవురా..
నువు దరిజేరే దారి వెదకరా ఓ మానవుడా హరినామం మరువవద్దురా..
పడవెళ్ళిపోతుందిరా ఆ ఆ......

హైలెస్సా హైలెస్సా హైలెస్సా
హైలెస్సా హైలెస్సా హైలెస్సా
హైలెస్సా హైలెస్సా హైలెస్సా

శనివారం, ఆగస్టు 04, 2012

పకడో పకడో - జులాయి

రామజోగయ్య శాస్త్రి గారు రాసే ప్రతిపాట ఆణిముత్యం కాకపోవచ్చు కానీ అవకాశమొచ్చినపుడు మాత్రం చక్కని వ్యవహారికంతోనే కుర్రకారుకి అర్ధమయ్యేలా అటు సందేశాన్ని ఇటు జోష్ ని కలిపి ఇవ్వడానికి ఆయన కలాన్ని భలే ఉపయోగిస్తుంటారు. ఈకాలం కుర్రకారును చేరుకోడంకోసమంటూ హిందీ ఇంగ్లీష్ పదాలను అలవోకగా వాడేసినా ఈపాటలు బాగుంటుంటాయి. అలాంటి ఒక పాట త్వరలో రాబోతున్న ’జులాయి’ సినిమాలోని ఈ పాట. ఈ పాటలోని రెండో చరణం నుండి నాకు బాగా నచ్చింది. సినిమాలో మాల్గాడి శుభతో పాడించిన దేవీశ్రీప్రసాద్ ప్రమోషనల్ వీడియోలో మాత్రం తనే పాడారు. నాకు ఇద్దరు పాడినవీ నచ్చాయి. మాల్గాడిశుభ వర్షన్ ఆడియోలో వినాలనుకున్న వారు రాగాలో ఇక్కడ వినండి. ఇచ్చిన వీడియోలో దేవీశ్రీప్రసాద్ పాడినది ఉంది.
  

చిత్రం : జులాయి
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : మాల్గాడిశుభ/దేవీశ్రీప్రసాద్

పకడో పకడో పకడో పకడో పకడో పకడో పకడో పకడో
దౌడో దౌడో నిన్ను ఆపేదెవడో ఛల్ పకడో పకడో
పకడో పకడో పకడో పకడో పకడో పకడో పకడో పకడో
రేపో మాపో కాదు నేడే నేడే తేల్చు తాడో పేడో..

ముసుగున దాగి ఉన్నదెవడో
పరుగున దూకి వాణ్ణి పకడో
ఫికరిక ఛోడో.. బారికేడ్స్ తోడో
మాస్కులన్ని లాగేయ్ రో..
నలుగురిలోన నువ్వు ఒకడో
లేక నువ్వు కోటిమంది కొక్కడో
గోడచాటు షాడో.. మిష్టరీకో ఫాడో..
లెక్కలన్ని తేల్చేయ్ రో..
హే విక్రమార్క సోదరా వీరపట్టు పట్టరా..
ఆటుపోటు దాటరా రిస్కో గిస్కో ఉస్కో పకడో..

పకడో పకడో పకడో పకడో పకడో పకడో పకడో పకడో
దౌడో దౌడో నిన్ను ఆపేదెవడో ఛల్ పకడో పకడో

నిన్న నువ్వు మిస్సయింది పకడో..
రేపు నీకు ప్లస్సయ్యేది పకడో..
ఒంటరైన జీరో.. వాల్యూ లేనిదేరో..
దాని పక్క అంకెయ్ రో..
గెలుపను మేటరుంది ఎక్కడో..
దాన్ని గెలిచే గుట్టు పకడో
టాలెంటుంది నీలో.. ఖుల్లం ఖుల్ల ఖేలో..
బ్యాటూ బంతీ నువ్వేరో..
చెదరని ఫోకస్సే.. సీక్రెట్ ఆఫ్ సక్సెస్సై
అర్జునుడి విల్లువై
యారో మారో యాపిల్ పకడో

పకడో పకడో పకడో పకడో పకడో పకడో పకడో పకడో
దౌడో దౌడో నిన్ను ఆపేదెవడో ఛల్ పకడో పకడో
పకడో పకడో పకడో పకడో పకడో పకడో పకడో పకడో
రేపో మాపో కాదు నేడే నేడే తేల్చు తాడో పేడో..

Journey of a million mile starts with the single step
i'll put in everything i got, not a single left
I won’t stop till i reach the top, and if i burn out
I will rise from the ashes
you cant stop this no matter what happens
Things in my life keep over lapping
We keep pushing no matter of distraction
Step back when u see me in action.

హే జిందగీ జీనేకా పల్స్ పకడో
విక్టరీకా హైట్సు పీక్స్ పకడో
పట్టుకుంటే గోల్డయి ప్లాటినం ఫీల్డయి
లైఫు నీకు దక్కాల్రో..
నీలో ఏదో స్పార్కు ఉంది ఎక్కడో
ఆరాతీసి దాని ట్రాక్ పకడో
ఆటలన్ని మానేయ్
యాక్షనే నీ భాషై
ఫుల్ తడాఖ చూపాల్రోయ్
పెట్టుకున్న గోల్ నీ కొట్టకుంటే క్రైమనీ
వాడుకుంటు టైమునీ
ఏ దిల్ సే తేరే దిల్ కో పకడో..
పకడో పకడో పకడో పకడో పకడో పకడో పకడో పకడో
దౌడో దౌడో నిన్ను ఆపేదెవడో ఛల్ పకడో పకడో
పకడో పకడో పకడో పకడో పకడో పకడో పకడో పకడో
రేపో మాపో కాదు నేడే నేడే తేల్చు తాడో పేడో..
 
---ప్రమోషనల్ వీడియో కోసం స్వల్పంగా మార్చిన మొదటి చరణం ఇక్కడ..---

హే జిందగీ జీనేకా పల్స్ పకడో
విక్టరీకా హైట్సు పీక్స్ పకడో
ఫికరిక ఛోడో.. బారికేడ్స్ తోడో
బౌండరీస్ దాటేయ్ రో..
లైట్నింగ్ లోన స్పీడు పకడో..
లైఫ్ లో ఉన్న జాయ్ పకడో
చూడు చూడు ఫ్రెండో..
హ్యాపినెస్ విండో..
ముందరుంది ట్రై చేయ్ రో..
పెట్టుకున్న గోల్ నీ కొట్టకుంటే క్రైమనీ
వాడుకుంటు టైమునీ
దిల్ సే తేరే దిల్ కో పకడో..

గురువారం, జూన్ 21, 2012

స్వరములు ఏడైనా రాగాలెన్నో

సుశీలమ్మ స్వరంలోని స్పష్టత నాకు చాలా ఇష్టం, స్పష్టత అనేదానికి సంగీతపరంగా మరో టెక్నికల్ పదముందో లేదో నాకు తెలియదు కానీ తను పాడిన చాలా పాతపాటలలో తనగళం సరైన పిచ్ లో చాలా క్లియర్ గా వినిపిస్తుంటుంది. అలాంటి పాటలలో రమేష్ నాయుడు గారు స్వరపరచిన ఈ “స్వరములు ఏడైనా” పాట నేను తరచుగా వినే సుశీలమ్మ పాటలలో ఒకటి. సినారె గారు సాహిత్యమందించిన ఈ పాటలోని చివరి చరణం నాకు చాలా ఇష్టం. ఈ పాట వీడియో దొరకలేదు చిమట మ్యూజిక్ లో ఇక్కడ వినవచ్చు. అది ఓపెన్ అవలేదంటే ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.  


చిత్రం: తూర్పుపడమర (1976)
గానం: పి.సుశీల
సాహిత్యం: సినారె (సి.నారాయణరెడ్డి)
సంగీతం: రమేష్ నాయుడు

స్వరములు ఏడైనా రాగాలెన్నో
స్వరములు ఏడైనా రాగాలెన్నో
హృదయం ఒకటైనా భావాలెన్నో

స్వరములు ఏడైనా రాగాలెన్నో
స్వరములు ఏడైనా రాగాలెన్నో

అడుగులు రెండైనా నాట్యాలెన్నో
అడుగులు రెండైనా నాట్యాలెన్నో
అక్షరాలు కొన్నైనా కావ్యాలెన్నెన్నో

స్వరములు ఏడైనా రాగాలెన్నో
స్వరములు ఏడైనా రాగాలెన్నో

జననములోనా కలదు వేదనా
మరణములోనూ కలదు వేదనా
జననములోనా కలదు వేదనా..
మరణములోనూ కలదు వేదనా
ఆ వేదన లోనా ఉదయించే
నవ వేదాలెన్నో నాదాలెన్నెన్నో నాదాలెన్నో

స్వరములు ఏడైనా రాగాలెన్నో..
స్వరములు ఏడైనా రాగాలెన్నో

నేటికి రేపొక తీరని ప్రశ్న
రేపటికీ మరునాడొక ప్రశ్న
కాలమనే గాలానికి చిక్కీ...ఆఅ.ఆఆఆఆఅ..
కాలమనే గాలానికి చిక్కీ
తేలని ప్రశ్నలు ఎన్నెన్నో ఎన్నెన్నో

స్వరములు ఏడైనా రాగాలెన్నో..
స్వరములు ఏడైనా రాగాలెన్నో

కనులున్నందుకు కలలు తప్పవు
కలలున్నపుడు పీడ కలలు తప్పవు
కనులున్నందుకు కలలు తప్పవు
కలలున్నపుడు పీడ కలలు తప్పవు
కలల వెలుగులో కన్నీరొలికే
కలల వెలుగులో కన్నీరొలికే
కలతల నీడలు ఎన్నెన్నో..ఎన్నెన్నో..

శుక్రవారం, జూన్ 15, 2012

మోహనరాగం పాడే కోయిల

భారత రన్నింగ్ సంచలనం అశ్విని నాచప్ప తెలుగులో నటించిన తొలిచిత్రం 'అశ్విని' అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సినిమా తన జీవిత కథ ఆధారంగా ఉషాకిరణ్ మూవీస్ వారు నిర్మించారు. సినిమా అందరూ చూసినా లేకపోయినా అందులోని అద్భుతమైన కీరవాణి సంగీతం మాత్రం మర్చిపోలేము. “సానపట్టు పట్టకుంటె వజ్రమైన అదొట్టిరాయిరా.. ఆనకట్ట కట్టు లేని ఏటికైనా చరిత్రలేదురా”, “చెయ్ జగము మరిచి జీవితమే సాధనా.. నీ మదిని తరచి చూడడమే శోధన” ఈ రెండు పాటలు మాంచి Inspiring గా ఉండి చాలామంది జిం ప్లేలిస్ట్ లో ఇప్పటికే చోటు సంపాదించుకుని ఉంటాయి, వాటి గురించి మరో పోస్ట్ లో చెప్పుకుందాం. అయితే వాటి మరుగున పడి కొంచెం తక్కువ ప్రాచుర్యాన్ని పొందిన ఒక మంచి మెలోడీ ఈ “మోహనరాగం పాడే కోయిల కొమ్మల్లో” పాట. నాకు సీజనల్ గా కొన్ని పాటలు వినడం అలవాటు. అంటే నేను ఎన్నుకుని కాదు గుర్తొచ్చిన పాటలు కొన్ని రోజులు రిపీట్ చేయడమనమాట. అలా నా ప్లేలిస్ట్ లో ఒక నాలుగురోజులనుండి రిపీట్ అవుతున్న ఈ పాట మీతో పంచుకోవాలని ఈ ప్రయత్నం. ఇందులో సింపుల్ అండ్ బ్యూటిఫుల్ అన్నట్లుండే ఆర్కెస్ట్రేషన్ నాకు చాలా ఇష్టం. ఈ పాట సాహిత్యం ఎవరు రాశారో తెలియదు మీకు తెలిస్తే చెప్పగలరు. వీడియో దొరకలేదు ఆడియో ఉన్న యూట్యూబ్ లింక్ ఇస్తున్నాను. అదిపనిచేయకపోతే ఆడియో ఇక్కడ వినవచ్చు.చిత్రం : అశ్విని 1991
సంగీతం : ఎమ్.ఎమ్.కీరవాణి
సాహిత్యం : ??
గానం : ఎస్.పి.బాలు, చిత్ర

మోహనరాగం పాడే కోయిల కొమ్మల్లో
కోయిల పాడే పాటకు పల్లవి కొండల్లో
అరవిచ్చినా
సుమలేఖలు చూశా
మనసెందుకో
మధువేళలలో
మారాకులే తొడిగే.ఏ.ఏ.ఏ

మోహనరాగం పాడే కోయిల కొమ్మల్లో
కోయిల పాడే పాటకు పల్లవి కొండల్లో

దివిలో తారనీ ఒడిలోనే చేరనీ
నదిలో పొంగునీ కడలి ఎదలో చేరనీ
సూటిపోటీ సూదంటి మాటల్తోటీ
నీతో ఎన్నాళ్ళింకా సరే సరిలే
అన్నావిన్నా కోపాలే నీకొస్తున్నా
మళ్ళీ ఆమాటంటా అదే విధిలే
సయ్యాటలెందుకులే.ఏ.ఏ.ఏ...

మోహనరాగం పాడే కోయిల కొమ్మల్లో
కోయిల పాడే పాటకు పల్లవి కొండల్లో

మనసే నీదనీ చిలిపి వయసే అన్నదీ
వనిలో ఆమని వలచి వచ్చే భామిని
ఆకాశంలో ఉయ్యాలే ఊగేస్తుంటే
నీలో అందాయెన్నో హిమగిరులూ
జాబిల్లల్లే వెన్నెల్లో ముంచేస్తుంటే
నీలో చూశానెన్నో శరత్కళలూ
ఆమాటలెందుకులే.ఏ.ఏ.ఏ

మోహనరాగం పాడే కోయిల కొమ్మల్లో
కోయిల పాడే పాటకు పల్లవి చుక్కల్లో
అరవిచ్చినా
సుమలేఖలు చూశా
మనసెందుకో
మధువేళలలో
మారాకులే తొడిగే.ఏ.ఏ.ఏ

సోమవారం, జూన్ 04, 2012

ఏ దివిలో విరిసిన పారిజాతమో

గాన గంధర్వుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం గారికి పుట్టినరోజు మేలు తలపులు తెలుపుకుంటూ, తను పాడిన పాటలలో నాకు చాలా ఇష్టమైన పాట మీ అందరికోసం. ఆడియో ఇక్కడ వినండి. ఇదే పాట బాలుగారికి కూడా ఇష్టమని ఎక్కడో చదివిన గుర్తు కానీ ఎక్కువసార్లు ఇంటర్వూలలో అడిగితే మాత్రం ఇలా ఏదో ఒక పాట నాకు ఇష్టమైనదని చెప్పలేననే అంటూంటారు.చిత్రం : కన్నెవయసు (1973)
సంగీతం : సత్యం
సాహిత్యం : దాశరథి
గానం : బాలు

ఏ దివిలో విరిసిన పారిజాతమో !
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో !
నా మదిలో నీవై నిండిపోయెనే..
ఏ దివిలో విరిసిన పారిజాతమో !
ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో !
నీ రూపమే దివ్య దీపమై
నీ నవ్వులే నవ్యతారలై
నా కన్నుల వెన్నెల
కాంతి నింపెనే..

|| ఏ దివిలో ||

పాలబుగ్గలను లేత సిగ్గులు
పల్లవించగా రావే!
నీలి ముంగురులు పిల్లగాలితో
ఆటలాడగా రావే!
పాలబుగ్గలను లేత సిగ్గులు
పల్లవించగా రావే!
నీలి ముంగురులు పిల్లగాలితో
ఆటలాడగా రావే!
కాలి అందియలు ఘల్లు ఘల్లుమన
రాజహంసలా రావే!

|| ఏ దివిలో ||

నిదుర మబ్బులను మెరుపు తీగవై
కలలు రేపినది నీవే
బ్రతుకు వీణపై ప్రణయరాగములు
ఆలపించినది నీవే
నిదుర మబ్బులను మెరుపు తీగవై
కలలు రేపినది నీవే
బ్రతుకు వీణపై ప్రణయరాగములు
ఆలపించినది నీవే
పదము పదములో మధువులూరగా
పదము పదములో మధువులూరగా
కావ్యకన్యవై రావే!

|| ఏ దివిలో ||

ఆదివారం, మే 20, 2012

కుర్రాడనుకుని కునుకులు తీసే..

తను నవ్వుతో చంపేస్తుంది/చంపేస్తాడు అని మీరు చాలా సార్లు వినే ఉంటారు కదా, ఎక్కడో తారసపడిన నవ్వును చూసి కూడా అనుకుని ఉండచ్చు "హబ్బా కిల్లింగ్ స్మైల్ రా బాబు" అని. అలాంటి నవ్వు వినాలనుకుంటున్నారా ఐతే బాలు తన కెరీర్ కొత్తలో (1977) పాడిన ఈ పాట వినండి. తన స్వరం ఎంత లేతగా స్వచ్చంగా హాయిగా ఉంటుందో పాటలో అక్కడక్కడ వచ్చే నవ్వు అంతే బాగుంటుంది. "చిలకమ్మ చెప్పింది" సినిమాలోని ఈ పాటలో అంత చక్కని బాలు స్వరానికి తగినట్లుగా నటించినది రజనీకాంత్, ఇక పాట చూసిన అమ్మాయిలు ప్రేమలో పడకుండా ఉండగలిగి ఉండే వారంటారా అప్పట్లో. వీడియో చూసి మీరే చెప్పండి. 

పట్నంనుండి డ్యూటీ నిమిత్తం తన ఊరొచ్చి నివాసం ఉంటున్న హీరో రజనీవి అన్నీ కుర్రచేష్టలని తనో మెచ్యూరిటీ లేని కుర్రాడని సులువుగా కొట్టిపారేసి మనసులో ప్రేమ ఉన్నా బయటపడనివ్వకుండా బెట్టుచేసే హీరోయిన్ సంగీతని చూసి రజనీ పాడేపాట ఇది. ఈ సినిమా అక్కడక్కడా కాస్త బోరుకొట్టినా మొత్తంగా బాగానే ఉంటుంది చివర్లో మరో కథానాయిక శ్రీప్రియ నిర్ణయం ఆరోజుల్లో చాలా ధైర్యంగా తీసుకున్న నిర్ణయమనే చెప్పాలి. చక్కని తెలుగులొ ఆత్రేయగారు అందించిన సాహిత్యానికి ఎమ్మెస్ విశ్వనాథన్ గారు సంగీతమందించారు. ఈ పాట మీకోసం. ఆడియో మాత్రమే వినాలనుకున్న వారు ఇక్కడ వినవచ్చు.

 
చిత్రం : చిలకమ్మ చెప్పింది..(1977)
సంగీతం :  M.S.విశ్వనాథన్
రచన : ఆత్రేయ
గానం : బాలు

కుర్రాడనుకుని కునుకులు తీసే..
హహ వెర్రిదానికీ.. పిలుపూ..

కుర్రాడనుకుని కునుకులు తీసే..
వెర్రిదానికీ పిలుపు ఇదే నా మేలుకొలుపూ..ఊ..!!

మల్లెలు విరిసే మధువులు కురిసే
లేత సోయగమున్నది నీకు
మల్లెలు విరిసే మధువులు కురిసే
లేత సోయగమున్నది నీకు
దీపమంటీ రూపముంది..
దీపమంటీ రూపముంది..
కన్నె మనసే చీకటి చేయకు..
కన్నె మనసే చీకటి చేయకు..

కుర్రాడనుకుని కునుకులు తీసే..
వెర్రిదానికీ పిలుపు ఇదే నా మేలుకొలుపూ..ఊ..!!

మత్తును విడిచీ.. మంచిని వలచీ..
తీపికానుక రేపును తలచీ..
కళ్ళు తెరిచి.. ఒళ్ళు తెలిసీ..
మేలుకుంటే మేలిక మనకూ..
మేలుకుంటే మేలిక మనకూ..

కుర్రాడనుకుని కునుకులు తీసే..
వెర్రిదానికీ పిలుపూ.. ఇదే నా మేలుకొలుపూ..ఊ..

వెన్నెల చిలికే వేణువు పలికే
వేళ.. నీ కిది నా తొలిపలుకు
వెన్నెల చిలికే వేణువు పలికే
వేళ.. నీ కిది నా తొలిపలుకు
మూగదైనా రాగవీణ..
మూగదైనా రాగవీణ..
పల్లవొకటే పాడును చివరకు..
పల్లవొకటే పాడును చివరకు.

కుర్రాడనుకుని కునుకులు తీసే..
వెర్రిదానికి పిలుపు ఇదే నా మేలుకొలుపు

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.