గురువారం, నవంబర్ 15, 2012

లాలీ లాలీ జోలాలి...

చంద్రబోస్ పాటలలో చాలాసార్లు తను సినీరంగంలో ప్రవేశించగలగడానికి కారణమైన ప్రాస కోసం ప్రయాస పడినట్లు కనిపించినా కొన్ని సార్లు అందులోనే చక్కని సాహిత్యాన్ని కూడా గమనించవచ్చు ముఖ్యంగా పాటకోసం తను ఎన్నుకునే థీం నాకు బాగా నచ్చుతుంది. డమరుకం సినిమాలోని ఈ లాలిపాటని గమనించండి ఎంత బాగారాశారో.

ఏ అమ్మకైనా తన బుజ్జాయికన్నా ప్రియమైన వాళ్ళెవరుంటారు చెప్పండి తను చేసే ప్రతిపని ఆ అమ్మకి అపురూపమే కదా ఇదే భావనని పల్లవి లోనూ మొదటి చరణంలోను వివరించిన చంద్రబోస్ రెండవ చరణంలో ఆ బుజ్జాయికోసం చేసే ప్రతిపనిని అమ్మ ఎంత ప్రేమగా ఇష్టంగా శ్రద్దగా చేస్తుందో చెప్తారు. తన  ఇష్ట దైవానికి అభిషేకించి పూజ చేసి నైవేద్యం పెట్టేటప్పుడు ఎలా చేస్తుందో బుజ్జాయికి చేసే పనులు కూడా అలాగే చేస్తుందట. ఆ చిన్నారి చిట్టి కేరింతలతో నట్టింటనడయాడుతుంటే తన ఇల్లు సాక్షాత్తు కైలాసమల్లే మారిపోయిందని మురిసిపోతుందట. అమ్మ మనసును ఎంత చక్కగా ఆవిష్కరించారో కదా. ఇంత చక్కని సాహిత్యానికి ఆకట్టుకునే దేవీశ్రీ సంగీతం, గోపికా పూర్ణిమ గాత్రం చక్కగా సరిపోయాయి. ఈ చక్కని లాలిపాట మీరు కూడా రాగాలో ఇక్కడ వినండి.  

ఈటపా ఈమధ్యే అమ్మగా ప్రమోషన్ పొందిన ఓ ప్రియనేస్తానికి అంకితం... ఈపాట గురించి పోస్ట్ వేయమని అడిగిన ఆ నేస్తం గారి అన్నగారికి కూడా :-)


చిత్రం: డమరుకం
గాయని: గోపిక పూర్ణిమ
గీత రచయిత: చంద్రబోస్
సంగీత దర్శకుడు: దేవీశ్రీప్రసాద్

ఆరి..రారి..రారో.. తరి..రారి రారి..రారో..
ఆరి..రారి..రారో.. తరి..రారి రారి..రారో..

లాలీ లాలీ జోలాలి అంటూ లాలించాలీ ఈగాలీ
లాలీ లాలీ జోలాలి వింటూ లోకాలన్నీ ఊగాలీ
నీతో ఆడాలంటూ నేలా జారేనంట జాబిల్లీ...
నీలా నవ్వలేనంటు తెల్లబోయి చూసేనంట సిరిమల్లి…..

లాలీ లాలీ జోలాలి అంటూ లాలించాలీ ఈగాలీ
లాలీ లాలీ జోలాలి వింటూ లోకాలన్నీ ఊగాలీ

ఆరి..రారి..రారో.. తరి..రారి రారి..రారో..
ఆరి..రారి..రారో... రారో...
ఆరి..రారి..రారో.. తరి..రారి రారి..రారో..
ఆరి..రారి..రారో... రారో...

బోసిపలుకే నువు చిందిస్తూ ఉంటే బొమ్మరిల్లాయే వాకిలీ..
లేత అడుగే నువు కదిలిస్తూ ఉంటే లేడి పిల్లాయే లోగిలీ..
నీ చిన్ని పెదవంటితే పాల నదులెన్నో ఎదలోన పొంగి పొరలీ..
నిను కన్న భాగ్యానికే తల్లి పదవొచ్చి మురిసింది ఈ ఆలీ..

లాలీ లాలీ జోలాలి అంటూ లాలించాలీ ఈగాలీ
లాలీ లాలీ జోలాలి వింటూ లోకాలన్నీ ఊగాలీ

లాల నీకే నే పోసేటి వేళా.. అభిషేకంలా అనిపించేరా...
ఉగ్గు నీకే నే కలిపేటి వేళా.. నైవేద్యంలా అది ఉంది రా...
సిరిమువ్వ కట్టే వేళా.. మాకు శివ పూజే గురుతొచ్చే మరల మరలా..
కేరింత కొట్టే వేళా.. ఇల్లే కైలాసంలా మారే నీవల్ల...

లాలీ లాలీ జోలాలి అంటూ లాలించాలీ ఈగాలీ
లాలీ లాలీ జోలాలి వింటూ లోకాలన్నీ ఊగాలీ

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.