ఆదివారం, అక్టోబర్ 25, 2009

కుహు కుహూ కూసే కోయిల

కొన్ని పాటలు వింటున్నపుడు ఆ పాటలు మనం మొదటి సారి విన్నప్పటి పరిస్థితులు లేదా ఆ పాటను తరచుగా విన్నప్పటి పరిస్థితులు అలా సినిమా రీళ్ళలా కదులుతూ ఉంటాయి. పాట తో పాటు అప్పటి వాతావరణం, పక్కన ఉన్న వ్యక్తులు, ఙ్ఞాపకాలూ అన్నీ కాన్వాస్ పై అలా కదులుతుంటాయి. నాకైతే ఒకోసారి ఆ సమయం లో పీల్చిన గాలి తో సహా గుర్తొస్తుంటుంది. ఈ పాట అలాటి పాటలలో ఒకటి. ఎనభైలలో విజయవాడ వివిధభారతి కార్యక్రమం లో తరచుగా వినే ఈ పాట ముందు వచ్చే కోయిల కుహు కుహు లూ, అందమైన సంగీతం విన్న మరుక్షణం ఏదో తెలియని మధురమైన అనుభూతికి లోనవుతాను. సాయంత్రం మొక్కలకు నీళ్ళుపోసేప్పుడు అప్పటి వరకూ ఎండకి ఎండిన మట్టి నుండి వచ్చే మధురమైన సువాసన ముక్కుపుటాలకు తాకిన అనుభూతికి గురౌతాను.

పాట రాసినది వేటూరి గారే అనుకుంటాను నెట్ లో వెతికితే ఆయన పేరుతోనే దొరికింది. మంచి సాహిత్యానికి, ఆహ్లాదకరమైన బాణీ , దానికి తేనెలూరు కోయిల గొంతు లాంటి జానకి గారి గాత్రం తోడైతే సంగీత ప్రియులకు పండగే కదా మరి.. ఇంతవరకూ ఈ పాట నేను వీడియో లో చూడలేదు, అప్పట్లో రేడియో లోనూ ఇప్పుడు ఆన్లైన్ లోనూ వినడమే, చాలా ఆహ్లాదకరమైన పాట మీరూ విని ఆనందించండి.

01 Kuhu kuhu koose...


చిత్రం : డబ్బు డబ్బు డబ్బు
గానం : జానకి
సంగీతం : శ్యాం
సాహిత్యం : వేటూరి

కుహు కుహూ.. కూసే.. కోయిల నాతో నీవు వచ్చావని..
నీతో వసంతాలు తెచ్చావని...
బాగుందటా... జంటా బాగుందటా..
పండాలటా... మన ప్రేమే పండాలటా..

కుహు కుహూ... కుహు కుహూ...

నీడగ నీ వెంట నే జీవించాలంట...ఓ ఓ ఓ.. ఓ బావా
నీడగ నీ వెంట నే జీవించాలంట...ఓ ఓ ఓ.. ఓ బావా
నీహృదయం లోన.. మరుమల్లెల వానా..
నీహృదయం లోనా.. మరుమల్లెల వానా..
కురిసి..మురిసి..పులకించాలంటా...
కురిసీ..మురిసీ..పులకించాలంటా...

కుహు కుహూ... కుహు కుహూ...

గుండెల గుడిలోనా... నా దైవం నీ వంటా...ఓ ఓ ఓ.. ఓ బావా
గుండెల గుడిలోనా... నా దైవం నీ వంటా...ఓ ఓ ఓ.. ఓ బావా
నీ కన్నుల వెలిగే.. హారతి నేనంట..
నీ కన్నుల వెలిగే.. హారతి నేనంట..
కలసి... మెలసి... తరియించాలంట...
కలసీ... మెలసీ... తరియించాలంట...

కుహు కుహూ.. కూసే.. కోయిల నాతో నీవు వచ్చావని..
నీతో వసంతాలు తెచ్చావని...
బాగుందటా... జంటా బాగుందటా..
పండాలటా... మన ప్రేమే పండాలటా..

శుక్రవారం, అక్టోబర్ 16, 2009

నీవుంటే -- స్నేహం (1977) by Bapu

ఈ సినిమా ను దానిలోని పాటలను తన వ్యాఖ్యల ద్వారా నాకు పరిచయం చేసిన కృష్ణగీతం బ్లాగర్ భావన గారికి, పాటలను అందించిన స్వరాభిషేకం బ్లాగర్ రమేష్ గారికి, తృష్ణవెంట బ్లాగర్ తృష్ణ గారికి, దీప్తిధార బ్లాగర్ సిబిరావు గారికి ధన్య వాదాలు తెలుపుకుంటూ, ఇంత మంచి పాటలను నా బ్లాగ్ లో పెట్టకుండా ఉండలేక ఈ పాటల సాహిత్యాన్నీ, వినడానికి వీలుగా వీడియో మరియూ ఆడియో లింకు లను ఇక్కడ పొందుపరుస్తున్నాను. అందరికి మరో మారు ధన్యవాదాలు. నీవుంటే వేరే కనులెందుకూ అంటూ సాగే పాట పల్లవి ఎంత మధురంగా ఉందో.. సినారే గారికి నిజంగా హ్యాట్సాఫ్. ఆహ్లాదకరమైన సంగీతాన్నందించిన కె.వి.మహదేవన్ గారికి డబల్ హ్యాట్సాఫ్...



చిత్రం : స్నేహం.
సంగీతం : కె.వి.మహదేవన్.
సాహిత్యం : సి.నారాయణరెడ్డి.
గానం: యస్.పి. బాలసుబ్రహ్మణ్యం

నీవుంటే వేరే కనులెందుకూ
నీ కంటె వేరే బ్రతుకెందుకూ
నీ బాటలోని.. అడుగులు నావె
నా పాటలోనీ.. మాటలు నీవె

||నీవుంటె వేరే కనులెందుకూ
నీ కంటె వేరే బ్రతుకెందుకూ
నీ బాటలోని.. అడుగులు నావె
నా పాటలోనీ.. మాటలు నీవె
నీవుంటే వేరే కనులెందుకూ||

నా ముందుగ నువ్వుంటే తొలిపొద్దు
నువ్వు చెంతగ లేకుంటే చీకటీ
నా ముందుగ నువ్వుంటే తొలిపొద్దు
నువ్వు చెంతగ లేకుంటే చీకటీ
నీ చేయి తాకితే..తీయని వెన్నెల
చేయి తాకితే.. తీయని వెన్నెల
అలికిడి వింటేనే తొలకరి ఝల్లు

||నీవుంటే వేరే..||

నిన్న రాతిరి ఓ.. కలవచ్చిందీ
ఆ కలలో ఒక దేవత దిగివచ్చిందీ
నిన్న రాతిరి ఓ..కలవచ్చిందీ
ఆ కలలో ఒక దేవత దిగివచ్చిందీ
చందమామ కావాలా.. ఇంద్రధనవు కావాలా
అమ్మ నవ్వు చూడాలా.. అక్క ఎదురు రావాలా
చందమామ కావాలా.. ఇంద్రధనువు కావాలా
అమ్మ నవ్వు చూడాలా.. అక్క ఎదురు రావాలా
అంటు అడిగిందీ దేవత అడిగిందీ
అప్పుడు నేనేమన్నానో తెలుసా

వేరే కనులెందుకనీ నీకంటే..వేరే బ్రతుకెందుకనీ
లాలాల లాల లలలలలాల...
లాలాల లాల లలలలలాల.

*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*
ఇదే చిత్రం లోని మరో అందమైన పాట


చిత్రం: స్నేహం
సంగీతం : కెవి మహదేవన్
సాహిత్యం : ఆరుద్ర
గానం : బాలసుబ్రహ్మణ్యం

నవ్వు వచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటె వల వల ||నవ్వు||
గొదారి పాడింది గల గలా.. ||2||
దానిమీద నీరెండ మిల మిల

||నవ్వు వచ్చిందంటే||

నది నిండా నీళ్ళు ఉన్నా మనకెంత ప్రాప్తమన్నా(2)
కడవైతే కడివెడు నీళ్ళే గరిటైతే గరిటెడు నీళ్ళే(2)
ఎవరెంత చేసుకుంటే...
ఎవరెంత చేసుకుంటే అంతే కాదా దక్కేది

నవ్వు వచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటె వల వల..

ధర తక్కువ బంగారానికి ధాటి ఎక్కువ
నడమంత్రపు అధికారానికి గోతులెక్కువా ఆ అ ఆఆఅ
ధర తక్కువ బంగారానికి ధాటి ఎక్కువ
నడమంత్రపు అధికారానికి గోతులెక్కువా
కొత్త మతం పుచ్చుకుంటె గుర్తులెక్కువ
చేతకానమ్మకే చేష్టలెక్కువ
చెల్లని రూపాయికే గీతలెక్కువా

నవ్వువచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటె వల వల..

తమసొమ్ము సొమవారం ఒంటిపొద్దులుంటారు
మందిసొమ్ము మంగళవారం ముప్పొద్దుల తింటారు
తమసొమ్ము సొమవారం ఒంటిపొద్దులుంటారు
మందిసొమ్ము మంగళవారం ముప్పొద్దుల తింటారు
పరులకింత పెట్టినదే
పరులకింత పెట్టినదే పరలోకం పెట్టుబడి
నవ్వు వచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటె వల వల
గోదారి పాడింది గల గల
కధలెన్నొ చెప్పింది ఇలా ఇలా...

నవ్వు వచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటె వల వల
నవ్వు వచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటె వల వలా


యూట్యూబ్ వీడియో అందచేసిన hyderabadee గారికి ధన్యవాదాలు.

గురువారం, అక్టోబర్ 15, 2009

ఓ రెండు హాస్య సన్నివేశాలు..

యాతమేసి తోడినా ఏరు ఎండదు అంటూ నిన్న విషాదం లో ముంచేశాను కదా, నా బ్లాగ్ లో మరీ ఇంత విషాదాన్ని మొదటి పేజి గా ఉంచడం ఇష్టం లేక నాకు నచ్చిన ఓ రెండు హాస్య సన్నివేశాలను ఇక్కడ ఉంచుతున్నాను. మొదటిది "బావగారు బాగున్నారా" సినిమా లోనిది. ఇందులో బ్రహ్మం హాస్యం అలరిస్తుంది, దాని తర్వాత నాకు నచ్చే హాస్యం కోట శ్రీనివాసరావు, శ్రీహరి కాంబినేషన్ లోనిది. ప్రత్యేకించి ఈ సన్నివేశం లో శ్రీహరి మూత తీయడానికి నానా హైరానా పడుతుంటే కోట పక్కనుండి "నరం బెణుకుద్ది.. నరం బెణుకుద్ది..." అని శ్రీహరితో అనే మాటలు, "తీసేస్తాడు.. తీసేస్తాడు.." అంటూ శ్రీహరిని సమర్ధిస్తూ చెప్పే డైలాగ్స్ నవ్వు తెప్పిస్తాయి. ఇంకా చివర్లో "నా వెదవతనం తో పోలిస్తే నీ వెదవతనం ఒక వెదవతనమట్రా.." లాంటి మాటలతో ఇద్దరూ భలే నవ్విస్తారు. ఈ సినిమాకి వీరిద్దరి హాస్యం ప్రత్యేక ఆకర్షణ.



ఇక రెండవది మెగాస్టార్ మరో ఫ్లాప్ మూవీ "డాడీ.." లోనిది. నటీ నటులు అంతా సీరియస్ గా మాట్లాడుతూనే మనల్ని భలే నవ్వించేస్తారు. మిస్ కమ్యునికేషన్ ఎలాంటి గజిబిజి కి దారి తీస్తుందో ఈ సన్నివేశం ఒక ఉదాహరణ. ఇంచు మించు ఇలాంటిదే మిమిక్రీ కేసట్ లలో ఒక జోక్ వినిపిస్తారు. అది రెండు రేడియో స్టేషన్ లు ఒక రేడియో స్టేషన్ లో వచ్చే పశువుల పెంపకం మరో స్టేషన్ లో వచ్చే సౌందర్య పోషణ రెండు మిక్స్ అయిపోయి పండించే హాస్యం సన్నివేశం. ఇక ఈ సన్నివేశం కాస్త ఇబ్బందికరం గా అనిపించినా మంచి హాస్యాన్ని అందిస్తుంది. సన్నివేశానికి ఉపోద్ఘాతం ఏమిటంటే యంయస్. నారాయణ & కో తీసే మోటార్ బైక్ యాడ్ లో నటించడానికి ఒక హీరో కావాలని అతనిని ఇంటికి రమ్మని చెప్పి అతని కోసం ఎదురు చూస్తుంటారు, అదే సమయం లో చిరు, రాజేంద్ర ప్రసాద్ అద్దె ఇంటికోసం వస్తారు, ఇక మీరే చూసి నవ్వుకోండి.




యూట్యూబ్ వీడియో అందించిన తెలుగుఒన్ మరియూ gani000 లకు ధన్యవాదాలు.

బుధవారం, అక్టోబర్ 14, 2009

యాతమేసి తోడినా..

జాలాది గారి కలం నుండి జాలువారిన ఈ పాట నాకు నచ్చిన పాటల్లో ఒకటి, మొన్న ఈటీవీ ఝుమ్మంది నాదం కార్యక్రమం లో బాలు గారు ఈ పాట గురించి చెప్పిన దగ్గర నుండి నన్ను మరింత గా వెంటాడుతుంది, సరే బ్లాగేస్తే ఓ పనైపోతుంది లే అని ఈ ప్రయత్నం. చిన్నతనం లో నేను రామారావు కి వీర ఫ్యాన్ కం ఏసి ని. అయితే నేను ఆరోతరగతి లోనో ఏడులోనో ఉన్నపుడు అప్పట్లో కాలేజి లో చదివే మా జోసఫ్ బావ "ఠాట్ రామారావు ఏంటిరా వాడు ముసలోడు అయిపోయాడు ఇప్పుడు అంతా చిరంజీవిదే హవా, ఖైదీ చూశావా, గూండా చూశావా, సూపర్ డ్యాన్స్ లు ఫైట్ లు గట్రా..." అని ఫుల్ ఎక్కించేసి చిరు సినిమాలు చూపించేసి నన్ను చిరంజీవి ఫ్యాన్ గా మార్ఛేశాడు. మా బావ మాటల ప్రభావంతో సినిమాలు చూసిన నేను కూడా ఆహా కేక అని మురిసిపోయాను అప్పట్లో కానీ తర్వాత తర్వాత నిజంగా నచ్చేశాడు అనుకోండి అది వేరే విషయం.

ఆ సమయం లోనే చిరంజీవి మొదట నటించిన సినిమా గా ప్రాణం ఖరీదు గురించి తెలుసు అంతే కానీ ఇక ఆ సినిమా గురించిన వివరాలు ఏమీ తెలియవు. ఎనిమిదిలో ఉన్నపుడనుకుంటా రేడియోలో ఈ పాట వేస్తే అహా మా చిరంజీవి సినిమా పాట సూపర్ అని చెవులు రిక్కించి విన్నాను. ఉన్న తుప్పొదిలి పోయింది, ఒక్క సారి చిరు ని ఇలా చెట్టుకు ఆనుకుని కూర్చుని ఈ పాట పాడుతున్నట్లు కొంచెం ఊహించుకుని.. ఒద్దులే మన డ్యాన్సింగ్ హీరోని ఇలా ఊహించుకోడం కష్టం అని మానేశా.. కానీ చిన్నప్పటి నుండి మనకి ఏడుపు పాటలు స్లో సాంగ్స్ అంటే ఉన్న ఇష్టం వల్ల పాట ట్యూన్ అలా మనసులో గుర్తుండి పోయింది. నిజం చెప్పద్దూ అప్పుడు అసలు సాహిత్యం గురించి పట్టించు కోలేదు.

కానీ మరి కాస్త ఊహ తెలిసాక జాలాది గారు ఉపయోగించిన జానపదాలు వాటిని బాలు తన స్వరం లో పలికించిన తీరు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. ఇక అప్పటి నుండి ఎందుకు రా ఈ ఏడుపు పాట అని ఎందరు అన్నా నేను తరచుగా వినే పాటల్లో ఇదీ ఒకటైంది. జాలాది గారు చిన్న చిన్న పదాలతో లోతైన భావాన్ని అవలీలగా పలికించేశారు. సాధారణంగా చక్రవర్తి గారి సంగీతం అనగానే మంచి మాస్ బీట్ సాంగ్స్ మొదట గుర్తొస్తాయి కానీ ఈ పాట సంగీతం ఒక సారి గమనించండీ ఆహా మన చక్రవర్తి గారేనా అనిపిస్తుంది. ఇంచుమించు ఇవే మాటలు మొన్న బాలు గారు కూడా అన్నారు. ఈ సినిమా గురించి నేను ఇపుడే తెవికి లో చదివి తెలుసుకున్నాను కథ పెద్ద ఆసక్తి కరంగా ఏమీ లేదు, మరి హిట్టో ఫ్లాపో తెలీదు. ఏదేమైనా ఓ మంచి పాట మీ కోసం.




చిత్రం : ప్రాణం ఖరీదు
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : జాలాది
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం.

యాతమేసి తోడినా ఏరు ఎండదూ...
పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదూ...
||యాతమేసి||
దేవుడి గుడిలోదైనా పూరి గుడిశ లోదైనా
గాలి ఇసిరి కొడితే...
ఆ దీపముండదు ఆ దీపముండదు

||యాతమేసి తోడినా||

పలుపు తాడు మెడకేస్తే పాడి ఆవురా...
పసుపు తాడు ముడులేస్తే ఆడదాయె రా...
||పలుపు తాడు||
కుడితి నీళ్ళు పోసినా...అది పాలు కుడుపుతాదీ...
కడుపు కోత కోసినా...అది మనిషి కే జన్మ ఇత్తాదీ...
బొడ్డు పేగు తెగిపడ్డా రోజు తలుసుకో...
గొడ్డు కాదు ఆడదనే గుణం తెలుసుకో...

||యాతమేసి తోడినా||

అందరూ నడిసొచ్చిన తోవ ఒక్కటే...
సీము నెత్తురులు పారే తూము ఒక్కటే...
||అందరూ||
మేడ మిద్దెలో ఉన్నా... సెట్టునీడ తొంగున్నా...
నిదర ముదర పడినాకా...
పాడె ఒక్కటే వల్లకాడు ఒక్కటే...
కూత నేర్సినోళ్ళ కులం కోకిలంట రా..
ఆకలేసి అరిసినోళ్ళు కాకులంట రా...

||యాతమేసి తోడినా||


యూట్యూబ్ వీడియో అందించిన amritar83 గారికి ధన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.