ఆదివారం, అక్టోబర్ 25, 2009

కుహు కుహూ కూసే కోయిల

కొన్ని పాటలు వింటున్నపుడు ఆ పాటలు మనం మొదటి సారి విన్నప్పటి పరిస్థితులు లేదా ఆ పాటను తరచుగా విన్నప్పటి పరిస్థితులు అలా సినిమా రీళ్ళలా కదులుతూ ఉంటాయి. పాట తో పాటు అప్పటి వాతావరణం, పక్కన ఉన్న వ్యక్తులు, ఙ్ఞాపకాలూ అన్నీ కాన్వాస్ పై అలా కదులుతుంటాయి. నాకైతే ఒకోసారి ఆ సమయం లో పీల్చిన గాలి తో సహా గుర్తొస్తుంటుంది. ఈ పాట అలాటి పాటలలో ఒకటి. ఎనభైలలో విజయవాడ వివిధభారతి కార్యక్రమం లో తరచుగా వినే ఈ పాట ముందు వచ్చే కోయిల కుహు కుహు లూ, అందమైన సంగీతం విన్న మరుక్షణం ఏదో తెలియని మధురమైన అనుభూతికి లోనవుతాను. సాయంత్రం మొక్కలకు నీళ్ళుపోసేప్పుడు అప్పటి వరకూ ఎండకి ఎండిన మట్టి నుండి వచ్చే మధురమైన సువాసన ముక్కుపుటాలకు తాకిన అనుభూతికి గురౌతాను.

పాట రాసినది వేటూరి గారే అనుకుంటాను నెట్ లో వెతికితే ఆయన పేరుతోనే దొరికింది. మంచి సాహిత్యానికి, ఆహ్లాదకరమైన బాణీ , దానికి తేనెలూరు కోయిల గొంతు లాంటి జానకి గారి గాత్రం తోడైతే సంగీత ప్రియులకు పండగే కదా మరి.. ఇంతవరకూ ఈ పాట నేను వీడియో లో చూడలేదు, అప్పట్లో రేడియో లోనూ ఇప్పుడు ఆన్లైన్ లోనూ వినడమే, చాలా ఆహ్లాదకరమైన పాట మీరూ విని ఆనందించండి.

01 Kuhu kuhu koose...


చిత్రం : డబ్బు డబ్బు డబ్బు
గానం : జానకి
సంగీతం : శ్యాం
సాహిత్యం : వేటూరి

కుహు కుహూ.. కూసే.. కోయిల నాతో నీవు వచ్చావని..
నీతో వసంతాలు తెచ్చావని...
బాగుందటా... జంటా బాగుందటా..
పండాలటా... మన ప్రేమే పండాలటా..

కుహు కుహూ... కుహు కుహూ...

నీడగ నీ వెంట నే జీవించాలంట...ఓ ఓ ఓ.. ఓ బావా
నీడగ నీ వెంట నే జీవించాలంట...ఓ ఓ ఓ.. ఓ బావా
నీహృదయం లోన.. మరుమల్లెల వానా..
నీహృదయం లోనా.. మరుమల్లెల వానా..
కురిసి..మురిసి..పులకించాలంటా...
కురిసీ..మురిసీ..పులకించాలంటా...

కుహు కుహూ... కుహు కుహూ...

గుండెల గుడిలోనా... నా దైవం నీ వంటా...ఓ ఓ ఓ.. ఓ బావా
గుండెల గుడిలోనా... నా దైవం నీ వంటా...ఓ ఓ ఓ.. ఓ బావా
నీ కన్నుల వెలిగే.. హారతి నేనంట..
నీ కన్నుల వెలిగే.. హారతి నేనంట..
కలసి... మెలసి... తరియించాలంట...
కలసీ... మెలసీ... తరియించాలంట...

కుహు కుహూ.. కూసే.. కోయిల నాతో నీవు వచ్చావని..
నీతో వసంతాలు తెచ్చావని...
బాగుందటా... జంటా బాగుందటా..
పండాలటా... మన ప్రేమే పండాలటా..

9 comments:

80 లలో విజయవాడ..? అరే మా ఊరా? మరి చెప్పారు కాదేం?

నేనూ ఈ మధ్యనే మీ బ్లాగ్ చూస్తున్నా కాబట్టి పాత టపాలు చదవలేదు..

పాట బాగుంటుందండీ..చాలా సార్లు విన్నాను రేడియో లో. కాని మీరు ఈ పాటకు రాసిన ముందు మాటలు చాలా బాగున్నాయండీ.

తృష్ణ గారు నెనర్లు. అది విజయవాడ కేంద్రం గురించి చెప్పానండీ. అప్పట్లో మా ఊరు నరసరావుపేట. ప్రస్తుతం గుంటూరు లో స్థిరపడ్డాం. విజయవాడ కూడా నాకు బాగా తెలుసు ఎందుకంటే అక్కడ రెండేళ్ళు ఇంటర్ చదివాను.

వేణు బలే మంచి పాట ఆ పాట కు ముందు మంచి మాట..
అవును నాకు కూడా కొన్ని పాటలు వింటే అప్పటి పూల గాలి తో సహా గుర్తు వస్తాయి..
అవును ఈ పాట "డబ్బు డబ్బు డబ్బు" నా? అదేమి సినిమా, ఏదో జయసుధా, సుజాత, దాసరి అలా గుర్తొస్తున్నారు.. కాని వివరం గా గుర్తు రావటం లేదు, ఈ పాట మాత్రం తెగ వినే వాళ్ళము. ఆ టైం లో చాలా పాటలుండేవి వైశాలి అనుకుంటా "ప్రేమ జీవన నాదం పంచమం ఈ వేదం" అని ఒక పాట, సింధూర పువ్వు లో ఒక పాట వచ్చేది "సింధూర పువ్వా తేనె చిందించ రావా" బలే వుండేయి.. ఇంకా ఇంకా చాలా పాటలు అలా తెగ గుర్తొచ్చేస్తున్నాయి

భావన గారు నెనర్లు. మీరు చెప్పిన రెండు పాటలు కూడా నాకు ఇష్టమైన పాటలేనండీ.. సింధూరపువ్వా తేనే చిందించ రావా పాట అయితే ఒక సమయం లో సరైన కాపీ దొరకక చాలా రోజులు వెతికి వెతికి పట్టుకున్నాను. అది కూడా త్వరలో పోస్ట్ చేస్తాను.

నేను విన్నదే కానీ ఎప్పుడూ పాడలేదు. ఈ మధ్య మా క్లోజ్ ఫ్రెండ్ ఒకరు పాడుతుంటే అందరు "ఎక్కడా వినలేదు మీరే వ్రాసేసారా" అని ఏడిపించారు.

"నీళ్ళుపోసేప్పుడు అప్పటి వరకూ ఎండకి ఎండిన మట్టి నుండి వచ్చే మధురమైన సువాసన ముక్కుపుటాలకు తాకిన అనుభూతికి " నిజం కదా. నాకూ చాలా ఇష్టం ఆ భూసింధూరపు పరిమళం. నిజానికి వాన చికును పడి ఆ సువాసనలని చిరుగాలి మోసుకుపోతుంటే ఇంకా ఆస్వాదిస్తాను.

abba meeku ee paatalanni ekkada dorukuthaayandi baabu.. maaku maatharam emanna kaavalanTe mee blogki vachesthamoch..

ఉషగారు నెనర్లు, నిజమే నండి ఈ పాట బాగుంటుంది కానీ అంతగా ప్రాచుర్యాన్ని పొందలేదు. మీరు చెప్పినట్లు సువాసనలు మోసుకు వచ్చే చిరుగాలి నాకు చాలాఇష్టం.

కార్తీక్ గారు నెనర్లు. పాటలపై నాకున్న ఇష్టమే ఇలా ఎక్కడ దొరికిన పాటలు వదలకుండా వినేలా చేస్తుంది.

ఈ పాట చాలా బావుంటుంది. సినిమా మాత్రం యావరేజే, ఏడుపు సినిమా. రాధిక, మురళీమోహన్, ప్రతాప్ పోతన్, ప్రభాకర రెడ్డి, రాజసులోచన మొదలైనవారు. పాటను గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.

ప్రసీద గారు నెనర్లు. ఓ అవునా సినిమా గురించి అస్సలేమీ తెలియదండి. నాకు ఈ పాట మాత్రం చాలా ఇష్టం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.