బుధవారం, అక్టోబర్ 14, 2009

యాతమేసి తోడినా..

జాలాది గారి కలం నుండి జాలువారిన ఈ పాట నాకు నచ్చిన పాటల్లో ఒకటి, మొన్న ఈటీవీ ఝుమ్మంది నాదం కార్యక్రమం లో బాలు గారు ఈ పాట గురించి చెప్పిన దగ్గర నుండి నన్ను మరింత గా వెంటాడుతుంది, సరే బ్లాగేస్తే ఓ పనైపోతుంది లే అని ఈ ప్రయత్నం. చిన్నతనం లో నేను రామారావు కి వీర ఫ్యాన్ కం ఏసి ని. అయితే నేను ఆరోతరగతి లోనో ఏడులోనో ఉన్నపుడు అప్పట్లో కాలేజి లో చదివే మా జోసఫ్ బావ "ఠాట్ రామారావు ఏంటిరా వాడు ముసలోడు అయిపోయాడు ఇప్పుడు అంతా చిరంజీవిదే హవా, ఖైదీ చూశావా, గూండా చూశావా, సూపర్ డ్యాన్స్ లు ఫైట్ లు గట్రా..." అని ఫుల్ ఎక్కించేసి చిరు సినిమాలు చూపించేసి నన్ను చిరంజీవి ఫ్యాన్ గా మార్ఛేశాడు. మా బావ మాటల ప్రభావంతో సినిమాలు చూసిన నేను కూడా ఆహా కేక అని మురిసిపోయాను అప్పట్లో కానీ తర్వాత తర్వాత నిజంగా నచ్చేశాడు అనుకోండి అది వేరే విషయం.

ఆ సమయం లోనే చిరంజీవి మొదట నటించిన సినిమా గా ప్రాణం ఖరీదు గురించి తెలుసు అంతే కానీ ఇక ఆ సినిమా గురించిన వివరాలు ఏమీ తెలియవు. ఎనిమిదిలో ఉన్నపుడనుకుంటా రేడియోలో ఈ పాట వేస్తే అహా మా చిరంజీవి సినిమా పాట సూపర్ అని చెవులు రిక్కించి విన్నాను. ఉన్న తుప్పొదిలి పోయింది, ఒక్క సారి చిరు ని ఇలా చెట్టుకు ఆనుకుని కూర్చుని ఈ పాట పాడుతున్నట్లు కొంచెం ఊహించుకుని.. ఒద్దులే మన డ్యాన్సింగ్ హీరోని ఇలా ఊహించుకోడం కష్టం అని మానేశా.. కానీ చిన్నప్పటి నుండి మనకి ఏడుపు పాటలు స్లో సాంగ్స్ అంటే ఉన్న ఇష్టం వల్ల పాట ట్యూన్ అలా మనసులో గుర్తుండి పోయింది. నిజం చెప్పద్దూ అప్పుడు అసలు సాహిత్యం గురించి పట్టించు కోలేదు.

కానీ మరి కాస్త ఊహ తెలిసాక జాలాది గారు ఉపయోగించిన జానపదాలు వాటిని బాలు తన స్వరం లో పలికించిన తీరు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. ఇక అప్పటి నుండి ఎందుకు రా ఈ ఏడుపు పాట అని ఎందరు అన్నా నేను తరచుగా వినే పాటల్లో ఇదీ ఒకటైంది. జాలాది గారు చిన్న చిన్న పదాలతో లోతైన భావాన్ని అవలీలగా పలికించేశారు. సాధారణంగా చక్రవర్తి గారి సంగీతం అనగానే మంచి మాస్ బీట్ సాంగ్స్ మొదట గుర్తొస్తాయి కానీ ఈ పాట సంగీతం ఒక సారి గమనించండీ ఆహా మన చక్రవర్తి గారేనా అనిపిస్తుంది. ఇంచుమించు ఇవే మాటలు మొన్న బాలు గారు కూడా అన్నారు. ఈ సినిమా గురించి నేను ఇపుడే తెవికి లో చదివి తెలుసుకున్నాను కథ పెద్ద ఆసక్తి కరంగా ఏమీ లేదు, మరి హిట్టో ఫ్లాపో తెలీదు. ఏదేమైనా ఓ మంచి పాట మీ కోసం.
చిత్రం : ప్రాణం ఖరీదు
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : జాలాది
గానం : యస్.పి.బాలసుబ్రహ్మణ్యం.

యాతమేసి తోడినా ఏరు ఎండదూ...
పొగిలి పొగిలి ఏడ్సినా పొంత నిండదూ...
||యాతమేసి||
దేవుడి గుడిలోదైనా పూరి గుడిశ లోదైనా
గాలి ఇసిరి కొడితే...
ఆ దీపముండదు ఆ దీపముండదు

||యాతమేసి తోడినా||

పలుపు తాడు మెడకేస్తే పాడి ఆవురా...
పసుపు తాడు ముడులేస్తే ఆడదాయె రా...
||పలుపు తాడు||
కుడితి నీళ్ళు పోసినా...అది పాలు కుడుపుతాదీ...
కడుపు కోత కోసినా...అది మనిషి కే జన్మ ఇత్తాదీ...
బొడ్డు పేగు తెగిపడ్డా రోజు తలుసుకో...
గొడ్డు కాదు ఆడదనే గుణం తెలుసుకో...

||యాతమేసి తోడినా||

అందరూ నడిసొచ్చిన తోవ ఒక్కటే...
సీము నెత్తురులు పారే తూము ఒక్కటే...
||అందరూ||
మేడ మిద్దెలో ఉన్నా... సెట్టునీడ తొంగున్నా...
నిదర ముదర పడినాకా...
పాడె ఒక్కటే వల్లకాడు ఒక్కటే...
కూత నేర్సినోళ్ళ కులం కోకిలంట రా..
ఆకలేసి అరిసినోళ్ళు కాకులంట రా...

||యాతమేసి తోడినా||


యూట్యూబ్ వీడియో అందించిన amritar83 గారికి ధన్యవాదాలు.

13 comments:

బలే పాట కదు.. ఇలాంటి పాటలు కొన్ని అలా గుర్తు వుండి పోతాయి. ఇంకో పాట సినిమా గుర్తు లేదు విషాదమైన పాట కాదు కాని బలే భావుకత ఇంకా జీవిత సత్యాలు వుంటాయి,
నవ్వు వచ్చిందంటే గల గల
ఏడుపొచ్చిందంటే వల వల
గోదారి పాడింది గలగలా
దానిమీద నెరెండ మిలా మిలా
తెలుసా మీకు చాలా పాత పాట. నాకు చాలా వరకు పాత గుర్తు వుంది ఏ సినిమా లోదో మాత్రం గుర్తు లేదు.
ఇంకా తూర్పూ వెళ్ళే రైలు లో కూడా పాటలు బాగుంటాయి.
అన్ని రంగుల గురించి చీరలలో కలిపి ఒక పాట వుంటుంది..
మంచి పాట గుర్తు చేసేరు.

నెనర్లు భావన గారు. నవ్వు వచ్చిందంటే గల గల పాట నేను చాలా సార్లు విన్నానండీ. నా కలక్షన్ లో ఉండాలి వెతికి లిరిక్స్ పోస్ట్ చేస్తాను. తూర్పు వెళ్ళే రైలు లో మీరు చెప్పిన పాట "చుట్టూ చెంగావి చీర.." లిరిక్స్ ఇవిగో..

చిత్రం : తూర్పూ వెళ్ళే రైలు
సంగీతం : యస్ పి బి
సాహిత్యం : ఆరుద్ర
గానం : యస్ పి బి

చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మా
చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మా
బొట్టూ కాటుక పెట్టి నే కట్టే పాటను చుట్టి
ఆశపడే కళ్ళళ్ళో ఊసులాడు వెన్నెలబొమ్మ

||చుట్టూ||

తెల్ల చీరకందం నువ్వే తేవాలే చిట్టెమ్మా
నల్ల చీర కట్టుకున్నా నవ్వాలే చిన్నమ్మా
ఎర్ర చీర కట్టుకుంటే సందెపొద్దు నువ్వమ్మా
పచ్చ చీర కట్టుకుంటే పంట చేను సిరివమ్మా

||చుట్టూ||

నేరేడు పళ్ళ రంగు జీరాడే కుచ్చిళ్ళు
ఊరించే ఊహల్లో తేలాడే పరవళ్ళు
వంగ పండు రంగులోన పొంగుతాయి సొగసుల్లు
వన్నె వన్నె చీరల్లోనా నీ ఒళ్ళే హరివిల్లు

||చుట్టూ||

భావన గారు "నవ్వు వచ్చిందంటే కిల కిల " పాటను తృష్ణ గారు తన బ్లాగ్ లో పెట్టారండీ నేను ఇపుడే చూశాను, మీరు ఇక్కడ చూడవచ్చు. http://trishnaventa.blogspot.com/2009/07/blog-post_09.html

సాహిత్యం అందించిన తృష్ణ గారికీ, పాట అందించిన రావుగారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ.. చిన్న సవరణ లతో ఈ పాట ఇక్కడ.

ఈ లింక్ లో పాట వినవచ్చు. http://www.esnips.com/doc/c4b33132-1550-4af3-92fc-e18e5a0475dd/Sneham---Navvu-vachindante-kila-kila

చిత్రం: స్నేహం
సంగీతం : కెవి మహదేవన్
సాహిత్యం : ఆరుద్ర
గానం : బాలసుబ్రహ్మణ్యం

నవ్వు వచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటె వల వల ||నవ్వు||
గొదారి పాడింది గల గలా.. ||2||
దానిమీద నీరెండ మిల మిల

||నవ్వు వచ్చిందంటే||

నది నిండా నీళ్ళు ఉన్నా మనకెంత ప్రాప్తమన్నా(2)
కడవైతే కడివెడు నీళ్ళే గరిటైతే గరిటెడు నీళ్ళే(2)
ఎవరెంత చేసుకుంటే...
ఎవరెంత చేసుకుంటే అంతే కాదా దక్కేది

నవ్వు వచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటె వల వల..

ధర తక్కువ బంగారానికి ధాటి ఎక్కువ
నడమంత్రపు అధికారానికి గోతులెక్కువా ఆ అ ఆఆఅ
ధర తక్కువ బంగారానికి ధాటి ఎక్కువ
నడమంత్రపు అధికారానికి గోతులెక్కువా
కొత్త మతం పుచ్చుకుంటె గుర్తులెక్కువ
చేతకానమ్మకే చేష్టలెక్కువ
చెల్లని రూపాయికే గీతలెక్కువా

నవ్వువచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటె వల వల..

తమసొమ్ము సొమవారం ఒంటిపొద్దులుంటారు
మందిసొమ్ము మంగళవారం ముప్పొద్దుల తింటారు
తమసొమ్ము సొమవారం ఒంటిపొద్దులుంటారు
మందిసొమ్ము మంగళవారం ముప్పొద్దుల తింటారు
పరులకింత పెట్టినదే
పరులకింత పెట్టినదే పరలోకం పెట్టుబడి
నవ్వు వచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటె వల వల
గోదారి పాడింది గల గల
కధలెన్నొ చెప్పింది ఇలా ఇలా...

నవ్వు వచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటె వల వల
నవ్వు వచ్చిందంటే కిలకిల
ఏడుపొచ్చిందంటె వల వలా

మంచి పాటలు వేణూ శ్రీకాంత్ గారు

thankyou venu gaaru for the link and your visit.I like this particular song for its fabulous lyrics..particularly these lines..
నది నిండా నీళ్ళు ఉన్నా మనకెంత ప్రాప్తమన్నా
కడవైతే కడివెడు నీళ్ళే గరిటైతే గరిటెడు నీళ్ళే
ఎవరెంత చేసుకుంటే...
ఎవరెంత చేసుకుంటే అంతే కాదా దక్కేది..

థ్యాంక్స్ వేణు, తృష్ణ. నాకిష్టమైన పాటలు లిరిక్స్ తో సహా ఇచ్చినందుకు. ఎంత మంచి పాటలు కదు. నాకు కూడా తృష్ణ కు ఇష్టమైన చరణమంటే ఇష్టం. స్నేహం లో ఇంకో అధ్బుతమైన పాట వుంటుంది. "నీవుంటే వేరే కనులెందుకు నీ కంటే వేరే బతుకెందుకు" అని. అసలు బాపు గారి స్నేహం సినిమానే బాగుంటుంది అట. నేను చూడలేదు :-(

నేస్తం గారు నెనర్లు.

తృష్ణ గారు నిజమేనండీ చాలా మంచి లిరిక్స్. మరో సారి ధన్యవాదాలు.

భావన గారు నెనర్లు, "నీవుంటే వేరే కనులెందుకు నీ కంటే వేరే బతుకెందుకు" వావ్, చదివి ఒక ఐదు నిముషాలు అలా ఉండి పోయానండీ.. ఇంత మంచి పాటని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.

ఈ పాట ఇప్పటికీ మా అంత్యాక్షరి సమయంలో "య"కి వాడతాను. ఒకప్పుడు అంతా బట్టియం ఇప్పుడు మాత్రం పల్లవి వరకే...

నేను కూడా ఈ పాటని య కి వాడతాను ఉష గారు.

satyanarayana gaaru ee pata paadedi(render) movie Lo.........
movie baane vuntundi.......

Naaku chaala anubandham yi rendu paatalatho..manasu baagalenappudu idi gurthu vacchedi..
Thanks for the lyrics

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.