ఆదివారం, నవంబర్ 22, 2009

మాలిష్ - మల్లెపువ్వు

రావుగోపాల్రావు గారి గురించి నేను ఇపుడు ప్రత్యేకంగా చెప్పగలిగేది ఏమీ లేదు భీకరమైన రూపం లేకున్నా ఆహర్యం, డైలాగ్ డెలివరీతో ప్రతినాయక పాత్రకి ప్రత్యేక గుర్తింపు తెచ్చారాయన. ముత్యాలముగ్గు సినిమాలో సెగట్రీ అంటూ పరమ కిరాతకమైన డైలాగ్ సైతం నిమ్మళంగా చెప్పి వెన్నులో వణుకు పుట్టించినా, వేటగాడు లో ప్రాసల పరోఠాలు తినిపించినా ఆయనకే చెల్లింది. ఆ ప్రాసలు ఇదిగో ఇక్కడ చూడండి.



ఈ విలనిజం ఒక ఎత్తైతే నాకు ఆయన మంచివాడుగా చేసిన సాధారణమైన, హాస్య పాత్రలు కూడా చాలా నచ్చుతాయి. వాటిలో ఈ మాలీష్ పాత్ర ఒకటి. మల్లెపువ్వు చిత్రం లో గురువా అంటూ శోభన్‍బాబుకు సాయం చేసే ఓ మాలిష్ చేసుకునే మంచివాడి పాత్రలో అలరిస్తారు. ఆ పాత్రలో తన పై చిత్రీకరించిన ఈ పాట నా చిన్నపుడు నాకు నచ్చే హాస్యగీతాలలో ఒకటి. ఇదే తరహా మాలీష్ పాత్రలో ’పట్నంవచ్చిన పతివ్రతలు’ సినిమా లో తాగుబోతుగా మరింత రక్తి కట్టించారు. ఈ సినిమా లో ఇతను మాలీష్ చేయించుకునే వాళ్ళని వాళ్ళ ఊరిని పొగిడి డబ్బులు తీసుకుని ఆ డబ్బుతో తాగి వచ్చి వాళ్ళనీ వాళ్ళ ఊరిని తిడుతూ బోలెడు హాస్యాన్ని అందిస్తారు. నూతన్ ప్రసాద్ ని తిడుతూ అనుకుంటా మీది కాకినాడ అయితే ఏటి మీ కాకినాడ గొప్ప.. మాది బెజవాడ.. దాని గొప్పదనం ముందు మీఊరెంత, మీ ఊళ్ళో సిటీ బస్సులు రోడ్ మీద నడుస్తాయ్ అదే మా బెజవాడ లో మనుషులమీద నుండి నడస్తాయ్ తెలుసా.. అసలు ఎంత గొప్పోడైనా మా బెజవాడ మురుక్కాలవల వెంబడి ముక్కు మూసుకోకుండా నడవగలరా.. అని ఏకి పారేసి నవ్విస్తారు.

ఇలాటిదే ఇంకోటి ’దేవత’ సినిమాలో నరసయ్య బాబాయ్ పాత్ర ఊరిమంచిని కోరుకునే ఊరిపెద్దగా ఉంటూ "కొంపా గోడూ లో కొంప నాకిచ్చేసి గోడు మా బామ్మకిచ్చేయ్.. పొలం పుట్ర లో పొలం నాకిచ్చేసి పుట్ర మా బామ్మకిచ్చేయ్.." అనే ఆకతాయి తో "అలాగే రా మీ ఆస్తీ పాస్తీ పంచేసి ఆస్తి మీ బామ్మకిచ్చేసి పాస్తి నీకిచ్చేస్తాను.." అని మోహన్ బాబు లాంటి ఆకతాయిల ఆటకట్టించే పాత్ర లో అలరిస్తారు. ఇంకా ఘరానా మెగుడు లో చిరు కి గురువు + మామ గారిలా, జానకిరాముడు లోనూ, కొన్ని సినిమాల్లో పెళ్ళాం చాటు మొగుడు గా కూడా కొన్ని పాత్రలు వేసి బాగా ఆకట్టుకున్నారు. ఇంకా కొన్ని సినిమాలు గుర్తు రావడం లేదు. ఏదేమైనా ఈ మాలిష్ పాటలో రావుగోపాల్రావు గారిని చూసి మీరు కూడా ఆనందించండి మరి. పాడినది స్వర ’చక్రవర్తి’ గారట, ఆ స్వరం కూడా హాస్యాన్ని కురిపిస్తుంది.



చిత్రం : మల్లెపువ్వు
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : ఆరుద్ర
గానం : చక్రవర్తి

మాలీష్... మాలీష్...
జుంబాంబ జుంబాంబ బాంబ బాంబ ఝుం
జుంబాంబ జుంబాంబ బాంబ బాంబ ఝుం
అరె హా హా...మాలీష్...
అరె హే హే హో హా మాలీష్...
రాందాస్ మాలీష్...నిమ్నూన్ మాలీష్
చాలంజీ మాలీషు... చాన్నాళ్ళ సర్వీసు...
హెయ్..చాలంజి మాలీషు... చాన్నాళ్ళ సర్వీసు...
రాందాసు మాలీషండోయ్...మాలీష్...
మాలీష్..మాలీష్..మాలీష్....మాలీష్. మా మా....

అరె హా అరె హో
మాలీషు చేస్తుంటె బాలీసు మీద నువ్వు తొంగున్న హాయుంటది...
అరెహా తల మీద చెయ్యేసి జుంబాంబ దరువేస్తె డుం..డుం..డుం...
తల మీద చెయ్యేసి జుంబాంబ దరువేస్తె రంబొచ్చి రమ్మంటదీ...
అరె ఒళ్ళంత జిల్లంటదీ..హా..ఓహో..ఒ అనిపిస్తదీ...
అరె ఒళ్ళంత జిల్లంటదీ...షమ్మ..ఓహో..ఒ అనిపిస్తదీ...
అమ్మ తోడు.. నిమ్మ నూనే...అంట గానే.. తస్సదియ్యా...
అమ్మ తోడు నిమ్మ నూనే...అంట గానే తస్సదియ్యా...
అబ్బోసి తబ్బిబ్బులే....మాలీష్..

మాలీష్... మాలీష్...
రాందాస్ మాలీష్...నిమ్నూన్ మాలీష్
జుంబాంబ జుంబాంబ బాంబ బాంబ ఝుం
జుంబాంబ జుంబాంబ బాంబ బాంబ ఝుం

అరె హో..తల బిరుసు బుఱ్ఱైన మన చేయి పడగానె మహ తేలికైపోతదీ...
అరె హా... పొద్దంత పని చేసి ఒళ్ళంత బరువైతె మాలీషు మందౌతదీ..
అరె సంపంగి నూనుంది రాజ్జా....అరె సమ్మ సమ్మ గుంటాది రాజా..
అరె సంపంగి నూనుంది రాజా...మహ సమ్మ సమ్మ గుంటాది రాజా..
హ చెవిలోన.. చమురేసీ..చెయి మూసి.. గిలకొడితే...హమ్మా....
హబ్బ....చెవిలోన చమురేసి..చెయి మూసి గిలకొడితే సంగీతమినిపిస్తదీ...
సా..సరి..గా..అ మా..పా..మద..పని..మసా...
సరిగమపదనిని..సరిగమపదనిని..సా....

జుంబాంబ జుంబాంబ బాంబ బాంబ ఝుం
జుంబాంబ జుంబాంబ బాంబ బాంబ ఝుం
అరె హో మాలీష్...అరె హో మాలీష్...
హెయ్..చాలంజి మాలీషు... చాన్నాళ్ళ సర్వీసు...
రాందాసు మాలీషండోయ్...మాలీష్...మాలీష్..
రాందాస్ మాలీష్...నిమ్నూన్ మాలీష్

13 comments:

యెంత యాదృచ్చికం!!! ఇప్పుడే 'ప్యాసా' గురించి టపా రాసి కూడలికి వస్తే 'మల్లెపూవు' లో పాట గురించి మీ పోస్ట్... జానీ వాకర్ ని చూస్తూ నేను కూడా రావు గోపాల రావు నే గుర్తు చేసుకున్నాను.. మంచి పాట..

"ఇదే తరహా మాలీష్ పాత్రలో ’పట్నంవచ్చిన పతివ్రతలు’ సినిమా లో తాగుబోతుగా మరింత రక్తి కట్టించారు. ఈ సినిమా లో ఇతను మాలీష్ చేయించుకునే వాళ్ళని వాళ్ళ ఊరిని పొగిడి డబ్బులు తీసుకుని ఆ డబ్బుతో తాగి వచ్చి వాళ్ళనీ వాళ్ళ ఊరిని తిడుతూ బోలెడు హాస్యాన్ని అందిస్తారు. నూతన్ ప్రసాద్ ని తిడుతూ అనుకుంటా మీది విజీనగరం అయితే ఏటి మీ విజీనగరం గొప్ప.. మాది బెజవాడ.. దాని గొప్పదనం ముందు మీఊరెంత, మీ ఊళ్ళో సిటీ బస్సులు రోడ్ మీద నడుస్తాయ్ అదే మా బెజవాడ లో మనుషులమీద నుండి నడస్తాయ్ తెలుసా.. అసలు ఎంత గొప్పోడైనా మా బెజవాడ మురుక్కాలవల వెంబడి ముక్కు మూసుకోకుండా నడవగలరా.. అని ఏకి పారేసి నవ్విస్తారు."

మీరు రెండు సన్నివేశాలు కలిపేసినట్లున్నారు.ఈ సినేమాలో నూతన్ ప్రసాద్ ది కాకినాడ (తూ.గొ బుఱ్ఱ)

మురళి గారు నిజమే ఎంత యాదృచ్చికం!!! నేను రెండు వారాలు గా వాయిదా వేస్తూ ఈ రోజు కాస్త ఖాళీ దొరికి ప్రచురించాను.

సూర్యుడు గారు, సినిమా చూసి చాన్నాళ్ళై మరచినట్లున్నాను మీరు చెప్పాక గుర్తొస్తుంది, సరిచేశాను. నెనర్లు.

రావుగోపాలరావు విలన్లలో హీరో. కామెడీ విలనిజానికి అతడి తరవాతే ఎవరైనా.
ఆ మాలిష్ పాట పాడింది చక్రవర్తే (సంగీత దర్శకుడు).

చదువరి గారు నెనర్లు. ఆయన విలన్ల లో హీరో అని భలే చెప్పారు సార్. ఓ చక్రవర్తి గారేనా ఆయన డబ్బింగ్ గొంతు అసలు కనపడదు పాటలో. టపా సరిచేశాను.

మొత్తానికి మంచి కామెడీ పాట గుర్తుచేసారు. చాలాకాలానికి మళ్ళీ రావ్ గోపాల్ రావ్ గురించి చదివాను. బాగారాసారు వేణు గారు.

జయ గారు నెనర్లు. ఆ మహానటుడిగురించి నే ప్రస్తావించినది ఒక అంశం మాత్రమేనండీ, నవతరంగం లాటి చోట్ల ఎవరైనా విశదంగా రాస్తే చదవాలని నేనూ ఎదురుచూస్తున్నా.

వేణు గారు మీరు భలే భలే పాటలు అందిస్తారండి
WWW.THOLIADUGU.BLOGSPOT.COM

విలన్ల పాత్రలకి ప్రసిద్ధి చెందినవాళ్లు ఉన్నట్లుండి ఓ సినిమాలో మంచి మనిషిగా నటిస్తే ప్రేక్షకులు బోల్డు 'ఇదై' పోతూ ఆ పాత్రంటే తెగ సానుభూతి కుమ్మరించేస్తూ చూస్తారు :-) అందుకేననుకుంటా, మొదట్లో ప్రతినాయకులుగా నటించిన అనేకమంది నటులు తర్వాత్తర్వాత సాత్విక పాత్రలకి షిఫ్టైపోయి విజయవంతమయ్యారు. రావు గోపాలరావు, సత్యనారాయణ, ఎస్వీ రంగారావు, కోట శ్రీనివాసరావుల నుండి నేటి శాయాజీ షిండే దాకా .. ఒకరా ఇద్దరా.

రావు గోపాలరావు సొంతగా తీసిన సినిమాల్లో చాలా మంచి పాత్రలు ధరించాడు. 'స్టేషన్ మాస్టర్' వాటిలో ఒకటి.

కార్తీక్ గారు నెనర్లు.

అబ్రకదబ్ర గారు నెనర్లు. మీరుచెప్పినది కరెక్టే కానీ సానుభూతి సరైన పదం కాదేమో... చెడ్డవాడు మంచి వాడుగా మారాలి అనే కోరిక అంతర్లీనంగా ఉండటం ఒక కారణమై ఉండచ్చు. సో చిరు, మోహన్‍బాబు, శ్రీకాంత్, శ్రీహరి లాంటి విలన్లు హీరోలు గా మారడానికి కూడా ఇదే కారణమయి ఉంటుంది అనిపిస్తుంది మీరు చెప్పాక..

సాదారణంగా విలన్ ఏదైనా సినిమాలో మంచి పాత్ర పోషించినా నాకు సినిమా చూస్తున్నంత సేపు టెన్షన్గా ఉంటుంది. ఆ పాత్ర మంచివాడు అని మిగతా పాత్రలు నమ్మినప్పుడు అతడు ఎక్కడ మల్లి విలన్ గా మారి వాళ్ళ గొంతు కోస్తాడో అని ఒకటే ఇదిగా ఉంటుంది. మొత్తానికి సినిమా అంటా పూర్తి అయ్యాక మా చెడ్డ రిలీఫ్ గా ఉంటుంది.

శ్రీనివాస్ గారు నెనర్లు, హ హ మీరు సినిమాలో ఎంత లీనమై చూస్తారో తెలుస్తుంది దీన్ని బట్టి :-)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.