బుధవారం, డిసెంబర్ 09, 2009

మల్లెలు పూసే... వెన్నెల కాసే...

బాలు గారు పాడిన ఈ పాట నాకు చాలానచ్చే పాటలలో ఒకటి. హిందీలో కిషోర్ కుమార్ గారి పాటలలో సాహిత్యం, ట్యూన్ ఒక అందమైతే కిషోర్ కలిపే సంగతులు మరింత అందాన్నిస్తాయి. మెలొడీ + హిందీ అస్వాదించలేనంత చిన్న వయసు లోకూడా నేను కిషోర్ పాటలు ఈ జిమ్మిక్కుల కోసం వినే వాడ్ని. ఉదాహరణ కి దూరదర్శన్ లో ఆదివారం ఉదయం వచ్చే రంగోలీ లో ఈ పాట ఎక్కువగా వేసే వాడు. "చలాజాతాహూ కిసీకే దిల్ మే..." ఈ పాటలో మధ్య మధ్యలో కిశోర్ విరుపులు సాగతీతలు భలే ఉండేవి. ఇలాంటివే ఇంకా చాలా పాటలు ఉన్నాయ్.


ఇక ప్రస్తుతానికి వస్తే ఇంటింటి రామాయణం లోని ఈ పాటను కూడా బాలు తన స్వరంతోనే నవరసాలు పలికించేస్తారు. అక్కడక్కడ పదాలు పలకడం, సాగతీయడం లాటి సంగతులు పాటకు మరింత అందాన్ని ఇస్తాయి. "మల్లెలు పూసే వెన్నెలకాసే" అని వింటే మనకి నిజంగా వెన్నెల్లో తడిచినంత హాయైన అనుభూతి కలుగుతుందనడం అతిశయోక్తి కాదేమో. "ముసి ముసి నవ్వులలో.." అన్నచోట విరిసీ విరియని మొగ్గలా చిన్న నవ్వును మనమీద చిలకరిస్తారు.. చివరికి వచ్చే సరికి "పెనవేయి" అన్న మాట ఎంత బాగా పలుకుతారో ఆ అనుభూతి వింటే గానీ తెలియదు. వేటూరి వారి సాహిత్యం అందంగా అలరిస్తే, రాజన్ నాగేంద్ర గారి సంగీతం ఆహ్లాదకరంగా సాగిపోతుంది. మొత్తం మీద విన్నాక ఒక అందమైన అనుభూతిని మిగిల్చే ఈ పాట మన అందరి కోసం ఇక్కడ, మీరుకూడా విని ఆనందించండి.


పాట వినాలంటే ఇక్కడ నొక్కి వినండి

చిత్రం : ఇంటింటి రామాయణం(1979)
సంగీతం: రాజన్ నాగేంద్ర
సాహిత్యం : వేటూరి
గానం : యస్ పి బాలసుబ్రహ్మణ్యం

మల్లెలు పూసే.. వెన్నెల కాసే.. ఈ రేయి హాయిగా
మల్లెలు పూసే.. వెన్నెల కాసే.. ఈ రేయి హాయిగా
మల్లెలు పూసే.. వెన్నెల కాసే.. ఈ రేయి హాయిగా
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా...
మల్లెలు పూసే.. వెన్నెల కాసే.. ఈ రేయి హాయిగా

ముసి ముసి నవ్వులలో గుస గుస లాడినవే...
నా తొలి మొజులే.. నీ విరజాజులై
ముసి ముసి నవ్వులలో గుస గుస లాడినవే...
నా తొలి మోజులే.. నీ విరజాజులై

మిస మిస వన్నెలలో మిల మిల మన్నవిలే
నీ బిగి కౌగిలిలో జాబిలి రాత్రులే
కాటుకలంటుకున్న కౌగిలింత లెంత వింతలె

మనసులు పాడే మంతనమాడే ఈ పూట జంటగా
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా...
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా

హాహా..ఆ..హాహా...హా...ఆ....ఆ.......

తొలకరి కోరికలే తొందర చేసినవే
ఈ విరి శయ్యకే ఆవిరి తీరగా

తొలకరి కోరికలే తొందర చేసినవె
ఈ విరి శయ్యకే ఆవిరి తీరగా
సొగసరి కానుకలే సొద పెడుతున్నవిలే
యే తెర చాటునో ఆ చెఱ వీడగా..
అందిన పొందులోనె అందలేని విందులీయవె

కలలిక పండే కలయిక నేడే కావాలి వేయిగా
మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా...
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా

మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా...
మల్లెలు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా

image courtesy tollywoodsingers.com

14 comments:

బాలుగారి గళంలో భావవ్యక్తీకరణ చాలా అద్భుతంగా ఉంటుందండి. బాగా రాశారు.

బాలు గొంతు మహిమ అనుకుంటా మామూలు పదాలు కూడా ఎక్కడలేని అందాలను సంతరించుకుంటాయి! రెండో చరణంలో 'తొలకరి కోరికలే తొందర చేసినవే' దగ్గర కూడా విరుపు భలే ఉంది! ఆనాటి ఆయన లేతగొంతులో ఇంత మంచి పాటని మళ్ళీ వినిపించినందుకు థాంక్సులు :-)

నాకు బాగా నచ్చిన పాటలలో ఇది ముందు వరుసలో ఉంటుంది. బాలు గారు చాలా పాటలలో అక్కడక్కడా నవ్వడం, కొన్ని పదాలు సాగతీయడం చేయడం ద్వారా పాటకి మరింత అందాన్ని తీసుకు వస్తారు. ఈ పాటలో బాలు గారి లేత గొంతులోని తాజాదనం మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇదే సినిమాలోని "వీణ వేణువైన" పాట కూడా నాకు చాలా ఇష్టం. మంచి పాటని పరిచయం చేసినందుకు నెనర్లు.

ఈ పాట నాకు అత్యంత ఇష్టమైన పాటల్లో ఒకటి. నిజంగా చెప్పాలంటే చాలా శృంగారపరమైన పాట, కానీ ఎంత లలితంగా సున్నితంగా ఉంటుందో. తెలుగు పదాలతో చమక్కులు చెయ్యటంలో, సున్నితమైన పదాలని అల్లి అంతులేని భావాలకి ఆకృతి ఇవ్వటంలో వేటూరికి సమకాలీనులు ఎవరూ లేరు.

డెభ్భై, ఎనభ్భైల్లో పాటలు కొన్ని ఆణిముత్యాలు. బాలు గొంతు పరంగా చూస్తే అద్భుతం అనిపిస్తుంది నాకు. ఇప్పటికీ కొన్ని పాటలు తనే పాడగలడు అనిపిస్తుంది.

శిశిర గారు నెనర్లు. భావవ్యక్తీకరణ అన్న పదం అస్సలు గుర్తు రాలేదండీ టపా రాసేప్పుడు. నేను అప్పుడప్పుడు అలా పదాలు దొరక్క ఆగిపోతాను. మొత్తంమీద ఒక్క ముక్కలో భలే చెప్పారు.

నిషిగంధ గారు నెనర్లు. నిజమేనండీ మాములు పదాలు కూడా కొత్త అందాలను సంతరించుకుంటాయి.

శ్రీనివాస్ గారు నెనర్లు. నిజమే తనదైన మెరుపులు జోడించి పాటకు కొత్త అందాన్ని తీసుకువస్తారు. ’వీణ వేణువైన..’ మరో మంచి పాట గుర్తు చేశారు ధన్యవాదాలు.

పద్మ గారు నెనర్లు. వేటూరి గారి గురించి చక్కగా చెప్పారు. నాకూ 80 లలో పాడిన బాలు గారి గొంతు చాలా ఇష్టం.

నిజంగా చాలా మంచిపాట. బాలు గారి గళం లో గోదావరి తిరిగినన్ని వంపులూ సొంపులూ, విరుపులూ మెరులూ కనిపించే పాట. భాష మీద ఉన్న పట్టూ, నిరంతర సాధనే ఇలాంటి అద్భుతాలకి కారణం. ఈ సినిమాలో 'వీణ వేణువైనా పాట కూడా చాలా బావుంటుంది.

ప్రసీదగారు నెనర్లు. "భాష మీద ఉన్న పట్టూ, నిరంతర సాధనే ఇలాంటి అద్భుతాలకి కారణం. " బాగా చెప్పారు.

ఈ పాట వింటుంటే నిజంగానే మల్లెల వానలో తడిసిపోయిన తృప్తి నిస్తుందండి. చాలా మంచిపాట.

మీ సరిగమల గలగలలు బాగున్నాయండి .

జయ గారు, మాలాకుమార్ గారు నెనర్లు.

వేణు, మునుపు ఒక యాడ్ వుండేది. అన్ని పళ్ళు గ్రైండర్ లో వేసి గిరగిరా తిప్పి గ్లాసులోకి వంచితే ఒక అరటిపండు వస్తుంది బాక్ గ్రౌండ్ లో "బననా బనానా బానానా మేక్స్ ధోస్ బాడీస్ సింగ్" ఆ పద్దతిగా పైనున్న వ్యాఖ్యలన్నీ కలేసి వచ్చే మాటల హారం నా వ్యాఖ్యగా తీసుకుని "మరువం మరువం ఉషావనం మీ సీరియల్ పుణ్యమా అని గుర్తుచేసుకున్న పాటలను నా సరిగమలగలగలలలో ఓ కొత్త టపాగా వేసుకుంటున్నాను.." అని పాడేసుకుని మరో టపా వ్రాసేయండి. నేను కూడా ఇదే ప్రహసనం చేసి "వేణు వేణు సరిగమల గలగలలు నాతో వ్రాయించే మరో భాగం.." అని సాగిపోతాను.

భావవ్యక్తీకరణ, భాషాపటిమ తెలిసిన వ్యక్తి కనుక ఏ పదం ఎలా పలకాలో మన భావుకుల హృదయాల్లో తీగె మీటాలో తెలిసిన మనిషి బాలు. థాంక్స్, ఈ పాట గురించి తాజా విశ్వమిత్ర కామేంట్స్లో నేనూ నిన్ననే వ్రాసాను.

ఉష గారు నెనర్లు. అలాగే పాడేసుకుంటాను :-) ఈ పాట గురించి మీ కామెంట్లలో ప్రస్తావించినది ఇపుడే చూశాను.

అద్భుతమైన పాట... నాకు చాలా ఇష్టం..మీ సరిగమలు గలగలలు నాకు చాలా ఇష్టం

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.