మంగళవారం, డిసెంబర్ 22, 2009

మిడిసిపడే దీపాలివి !!

అప్పట్లో దూరదర్శన్ చిత్రలహరిలో ఒకటి రెండు సార్లు ఈ పాట చూసిన గుర్తు. చంద్రమోహన్ నల్లశాలువా ఒకటి కప్పుకుని ఏటి గట్టున అటు ఇటు తిరుగుతూ తెగ పాడేస్తుంటాడు. అతనికోసం కాదు కానీ నాకు చాలా ఇష్టమైన ఏసుదాస్ గారి గొంతుకోసం ఈ పాటను శ్రద్దగా వినే వాడ్ని. లిరిక్స్ కూడా చాలా బాగున్నాయ్ అనిపించేది. నా ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం డిపార్ట్మెంట్ డే సంధర్బంగా జరిగిన పాటలపోటీలో నేను తప్పక పాల్గొనాలి అని మావాళ్ళంతా డిసైడ్ చేశారు. ర్యాగింగ్ పీరియడ్ లో బలవంతంగా నాతో పాడించిన పాటలను కాస్తో కూస్తో రాగయుక్తంగా పాడేసరికి నే బాగా పాడతాను అనే అపోహలో ఉండేవారు. సరే ఏ పాటపాడాలి అని తర్జన భర్జనలు పడటం మొదలుపెట్టాను. జేసుదాస్ పాటే పాడాలి అని మొదటే నిర్ణయించుకున్నాను కానీ ’ఆకాశదేశానా’, ’మిడిసిపడే’ పాటలలో ఏదిపాడాలి అని తేల్చుకోలేక చివరికి నా ఆప్తమితృడికి పాటలు రెండూ వినిపించి సలహా అడిగితే నీగొంతుకు ’మిడిసిపడే’ బాగ సూట్ అవుతుంది అదే అని ఖాయం చేసేసుకో అని చెప్పాడు. నాకు కూడా అదినిజమే అనిపించింది. అదీకాక "ఆకాశదేశాన" లోని సంగతులు సరిగా పాడలేకపోతున్నాను అని స్పష్టంగా తెలుస్తుంది.

అలా మొదటి సారి ఈ పాట పూర్తి సాహిత్యాన్ని సంగ్రహించి శ్రద్దగా నేర్చుకోవడం జరిగింది. పోటీ రోజు రానే వచ్చింది నాకు పాట పాడటం వచ్చినా సాహిత్యం సరిగా గుర్తుండేది కాదు. అదీకాక అందరి ముందు నుంచొని పాడవలసి వచ్చినపుడు మైండ్ బ్లాంక్ అయి అసలు గుర్త్తొచ్చేది కాదు. ఈ సారి ఎలా అయినా గెలవాలని పాట రాసుకుని పేపర్ చేతిలో పెట్టుకుని వెళ్ళాను. నా గొంతుకు కాస్తగాంభీర్యత జోడించి బోలెడంత విషాదాన్ని నింపి సీరియస్ గా పాడటం మొదలు పెట్టాను. అప్పటివరకూ కాస్త అల్లరి చేస్తున్నవారు సైతం నిశ్శబ్దంగా పాటలోలీనమై వినడం మొదలుపెట్టారు, మొదటి చరణం పూర్తైంది శ్రోతల కళ్ళలో ప్రశంస స్పష్టంగా కనిపించింది, రెండవచరణం మొదలు పెట్టాక అందులో చివరి లైన్లు ఎప్పుడూ గుర్తుండేవే అన్నధైర్యంతో పేపర్ మడిచి లోపల పెట్టేశాను కానీ అక్కడికి వచ్చేసరికి హఠాత్తుగా ఆ లైన్లు మర్చి పోయి తడబడిపోయాను. మళ్ళీ పేపర్ తీసి పాట పూర్తి చేయవలసి వచ్చింది. జడ్జిలు నువ్వు ఆ పేపర్ పెట్టుకోకుండా తడబడాకుండా పాడితే ప్రైజ్ నీదే అయి ఉండేది, పైన చెప్పిన కారణాల వలన నిన్ను నాలుగో స్థానానికి నెట్టేయవలసి వచ్చింది అని వ్యాఖ్యానించారు. 

ఈపాట ఎప్పుడు విన్నా ఆనాటిసంఘటన అంతా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. నా క్లాస్ మేట్ ఒక అమ్మాయి అయితే వీడికి ఏదో చాలా పే..ద్ద ఫ్లాష్ బ్యాక్ ఉండి ఉంటుంది అందుకే ఇంత విషాదగీతాన్ని భావయుక్తంగా పాడుతున్నాడు అనుకుందిట. తరువాత రోజుల్లో నాకు మంచి నేస్తమయ్యాక "అసలు సంగతేంటి గురూ.." అని అడిగింది అంత స్టోరీ లేదమ్మా అని చెప్పాను. ఇంజనీరింగ్ లో కాదుకానీ తర్వాత రోజులో ఈపాట పాడుకోదగిన అనుభవాలు కొన్ని ఎదురయ్యాయి కాని ఎక్కువ కాలం బాధించలేదనుకోండి అది వేరే విషయం. ఇంతకీ విషయం ఏమిటంటే పాట చాలా బాగుంటుంది, వేటూరి గారి సాహిత్యం ఆకట్టుకుంటే రాజా సంగీతం హృదయాన్ని సున్నితంగా స్పృశిస్తుంది. ఇక ఏసుదాస్ గారి గొంతు మరింత వన్నెచేకూర్చింది అని చెప్పాల్సిన పనేలేదు.

చిత్రం : ఆస్తులు అంతస్తులు
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : కె.జె.ఏసుదాస్

మిడిసి పడే దీపాలివి
మిన్నెగసి పడే కెరటాలివి
మిడిసి పడే దీపాలివి
మిన్నెగిసి పడే కెరటాలివి
వెలుగు పంచలేవు ఏ దరిని చేరుకోవు
వెలుగు పంచలేవు ఏ దరిని చేరుకోవు
ఈ జీవితమే ఒక గమ్యం లేని నావ
సుఖ దుఃఖాలే ఏకమైన రేవులో

||మిడిసి||

బావి లోతు ఇంతని తెలుసు
నదుల లోతు కొంతే తెలుసు
ఆడ గుండె లోతు ఎంతో లోకం లో యెవరికి తెలుసు
ఏ నిమిషం ప్రేమిస్తుందో ఏ నిమిషం పగబడుతుందో
ఎప్పుడెలా మారుతుందో తెలిసిన మగవాడు లేడు
రాగం అనురాగం ఎర వేసి జత చేరి
కన్నీట ముంచుతుందిరా

||మిడిసి||

పాము విషం సోకిన వాడు ఆయువుంటె బతికేస్తాడు
కన్నె వలపు కరిచిన వాడు నూరేళ్ళకి తేరుకోడు
సొగసు చూసి మనసిచ్చావా బందీగా నిలబడతావు
నీ కలలే విరిగిననాడూ కలతే నీ తోడవుతుంది
లేదు ఏ సౌఖ్యం రవ్వంత సంతోషం ఈ ఆడదాని ప్రేమలో

||మిడిసి||

ఇదే పాట కథానాయిక పాడినది ఇక్కడ చూడండి. రెండు సాహిత్యాలు వేటికవే సాటి అన్నట్లు ఉన్నాయి. ఇదికూడా వేటూరిగారే రాశారేమో తెలియదు. ఈ పాటను కామెంట్ ద్వారా అందించిన తృష్ణ గారికి ధన్యవాదాలు.

 

అలుపు రాని కెరటాలివి
ఏ గెలుపు లేని హృదయాలివి
వయసు ఊరుకోదు ఆ వలపుమాసిపోదు
ఏనాడైనా తెరచాప లేని నావ
చేరగలిగేనా తను కోరుకున్న రేవుకి

||అలుపు||

ప్రేమించిన ఆడ మనసు ప్రాణమైన అర్పిస్తుంది
ప్రేమ విలువ తెలియకపోతే ఆడదెపుడు అర్ధం కాదు
తనువులోని అందం గాని మనసులోని మర్మం గానీ
నమ్మిన మగవాడి ముందు ఏ ఆడది దాచలేదు
లేదు నా నేరం...ఏముందో తెలిపావో
శిరసొంచి మొక్కుతానులే

||అలుపు||

ఆడదంటే అమృత హృదయం
తల్లితనమే సృష్టికి మూలం
పైట చాటు రొమ్ము వెనుక అమ్మ మనసు దాగుంటుంది
కన్నీటిని దాచుకుంటూ చిరునవ్వును పంచిస్తుంది
తను సీతై నిప్పుల పడిలో రామవాక్కు నిలబెడుతుంది
నాడు ఈనాడు ఆ రాత ఎద కోత
రవ్వంత మారలేదులే

||అలుపు||

13 comments:

Very good song.. Chandramohan with black shawl.. I am trying to recollect the story..someone amputated his hands for supporting lover..i think rich girl and poor boy.. something like this..

"తర్వాత రోజులో ఈపాట పాడుకోదగిన అనుభవాలు కొన్ని ఎదురయ్యాయి కాని ఎక్కువ కాలం బాధించలేదనుకోండి అది వేరే విషయం."
I think that's the beauty of that age! :))
అయితే మీరు పాటగాడు కూడానన్నమాట! good to know..

పాట మాత్రం చాలా బావుంటుంది.. రాజేంద్రప్రసాద్, రమ్య కృష్ణ మెయిన్ రోల్స్ కదూ?!

thanks for sharing it with us.. :-)

:) మీకు బహుమతి వచ్చేదని అని ఆయన చెబితే సరిపోతుందేమిటి?
బ్లాగ్జడ్జిలు చెప్పద్దు? కాయితం ముందుపెట్టుకు పాడి, ఇక్కడ పెట్టండి మరి.

Good song...there is a female version to this song..and obviously i like the female verion and those lyrics are also very nice ones...will put it in my post if i find it in my files.

writing it here only...

రెండు సాహిత్యలు వేటి కవే సాటి...

female version సాహిత్యం:

అలుపు రాని కెరటాలివి
ఏ గెలుపు లేని హృదయాలివి
వయసు ఊరుకోదు ఆ వలపుమాసిపోదు
ఏనాడైనా తెరచాప లేని నావ
చేరగలిగేనా తను కోరుకున్న రేవుకి

ప్రేమించిన ఆడ మనసు ప్రాణమైన అర్పిస్తుంది
ప్రేమ విలువ తెలియకపోతే ఆడదెపుడు అర్ధం కాదు
తనువులోని అందం గాని మనసులోని మర్మం గానీ
నమ్మిన మగవాడి ముందు ఏ ఆడది దాచలేదు
లేదు నా నేరం...ఏముందో తెలిపావో
శిరసొంచి మొక్కుతానులే

ఆడదంటే అమృత హృదయం
తల్లితనమే సృష్టికి మూలం
పైట చాటు రొమ్ము వెనుక అమ్మ మనసు దాగుంటుంది
కన్నీటిని దాటుకుంటూ చిరునవ్వును పంచిస్తుంది
తను సీతై నిప్పుల పడిలో రామవాక్కు నిలబెడుతుంది
నాడు ఈనాడు ఆ రాత ఎద కోత
రవ్వంత మారలేదులే
link for download:
http://www.divshare.com/download/9886243-2bc

మురళి గారు నెనర్లు. ఏమో సార్ నాకు ఈ పాట తప్ప సినిమా గురించి ఏ మాత్రం తెలీదు.

నిషిగంధ గారు నెనర్లు. "I think that's the beauty of that age! :))" ఇంత కరెష్టుగా చెప్పాక ఇంకేమంటాం అవును అంటాం :-) పాటగాడ్ని కాదులెండి అది కేవలం అపోహ మాత్రమే అని ముందే చెప్పాను కదా... ఆముదంచెట్టు టైపు అనమాట :-) సినిమా గురించి నాకు తెలీదండి. రాజెంద్రప్రసాద్ చంద్రమోహన్ ఉంటారనుకుంటా..

ఊకదంపుడు గారు నెనర్లు. హన్నా అలా పాడి వినిపించేస్తే నిజాలు తెల్సిపోవుటండీ అప్పుడు నా బాకా నేనే ఊదుకోడానికి, మీ భాషలో చెప్పాలంటే నా ఊక నేనే దంచుకోడానికి వీలు పడుతుందా :-) అయినా స్కూల్లోనూ కాలేజిలోనూ నే పాడిన కొన్ని బిట్స్ మళ్ళీ పాడి రికార్డ్ చేసి వినిపించాలన్న అలోచనకు నాంది పలికారు. త్వరలో ప్రయత్నిస్తాను.

తృష్ణ గారు నెనర్లు. చాలా చాలా థ్యాంక్స్ అండీ ఈ ఫిమేల్ వర్షన్ నేను ఇదే మొదటి సారి వినడం. ఆ పాటను ఇక్కడే ఇచ్చినందుకు ధన్యవాదాలు. నిజమే రెండు సాహిత్యాలు దేనికవే సాటి అన్నట్లు ఉన్నాయి.

అబ్బ, అప్పుడెప్పుడో ఈ పాట ఒక వూపు ఊపేసిందనుకోండి తెలుగు దేశాన్ని! సినిమా ఫెయిలే కానీ పాట హిట్టే! ఆ పాట మొత్తం నోటికి వచ్చేదాకా దూరదర్శన్ వాళ్ళు సినిమా వేసి వేసి చంపారు అప్పట్లో!

రాజేంద్ర ప్రసాద్ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ గురించి చంద్రమోహన్ నల్ల శాలువా కప్పుకుని పాడటం తమాషా!

నేను యేసుదాసు గారి అభిమానిని.. ధన్యవాదాలు..

సుజాత గారు, శివచెరువు గారు నెనర్లు.

వేణూ శ్రీకాంత్ గారు,
బాగుందండి. నిజంగా మీరు చెప్పిన విషయాలు వింటే మీ కాలేజిలోని సంఘటన నేను చూస్తున్న అనుభూతి కలిగింది.

రాంగోపాల్ గారు నెనర్లు, నచ్చినందుకు సంతోషం.
మీకూ మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.

I like this song very much - Than q -

థాంక్స్ ఫర్ ద కామెంట్ శర్మ గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.