వంశీ,ఇళయరాజా ల కాంబినేషన్లో చాలా మంచి పాటలున్నాయన్న విషయం మనకి తెలిసిందే వాటిల్లో ఓ ఆణిముత్యం లాంటి పాట ఇపుడు మీకు పరిచయం చేయబోతున్నాను. “శ్రీ కనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్” సినిమా పేరు వింటేనే నేను ఒక చిత్రమైన అనుభూతికి లోనవుతాను. తొంభైల తర్వాత అశ్లీలత పాళ్లు హెచ్చడంతో క్రమంగా కనుమరుగైన ఈ రికార్డింగ్ డాన్సులు ఒక కళారూపం అని కూడా చెప్పుకోవచ్చేమో. యూట్యూబ్ లు టీవీలూ వీడియోలు లేని ఆకాలంలో సినిమా హీరో హీరోయిన్స్ గెటప్పూ, మానరిజమ్స్ తో సహా స్టెప్స్ ని స్టేజి మీద ప్రదర్శించి, ఆకాశంలో అందని తారల్లా తెరమీద మాత్రమే వెలిగే సినిమా తారలని కళ్ళముందు నిలబెట్టే ఈ డాన్సుట్రూపులు తొంభైల వరకూ కూడా తెలుగు వారి ప్రతి ముఖ్యమైన వేడుకలోనూ పాలుపంచుకుంటూ ఒక వెలుగు వెలిగాయ్. వీటి నేపధ్యంలో వంశీ అల్లుకున్న ఓ పిరికి వాడి ప్రేమకథే ఈ సినిమా.
ఈ సినిమాలో నాకు ఎక్కువగా ఇష్టమైన పాట “వెన్నెలై పాడనా”, సాధారణంగా డెబ్బై ఎనభైలలో వచ్చిన పాటలు చిత్రీకరణ చూడడానికి నేను కొంచెం భయపడతాను. ఎంతో అందమైన పాటలను చాలా చిత్ర విచిత్రంగా భరించలేని నటీనటులపై చిత్రీకరించి భయపెడతారు. ఐతే ఈ పాట మాత్రం నాకు పాటతో పాటు చిత్రీకరణ సైతం మనసులో ముద్రించుకు పోయింది. కుమ్మరి చక్రం, మగ్గం, రాట్నం లాంటి వాటి చుట్టూ పల్లె వాతావరణాన్ని ప్రతిభింబిస్తూ ఇలా కూడా చిత్రించ వచ్చా అనిపించేలా తీయడం ఒక్క వంశీ గారికే చెల్లింది.
ఇక ఈ పాట రచయిత గురించి వెతుకుతుంటే నాకొక ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఈ ట్యూన్ సిద్దమయ్యాక పాటల రచయితకి ఫాల్స్ లిరిక్స్ ఇవ్వడం కోసం స్వతహాగా భావుకుడు రచయిత అయిన వంశీగారు మధ్యమధ్యలో ఇళయరాజా గారు కొన్ని పదాలు అందిస్తుండగా రాశారట. పాట బాగుందని దానినే ఫైనల్ వర్షన్ గా ఉంచేశారని అందుకే టైటిల్స్ లో వంశీ ఇళయరాజాల పేర్లు పాటల రచయితల కార్డ్ లో ఉంటాయని వంశీగారే ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లుగా పాతబంగారం ఫోరంలో చదివాను. ఐతే లలనామణి, తలలోమణి, నవలామణి లాంటివి వంశీగారివేలే అనిపించినా రెండో చరణంలో ప్రమిద కాంతిపువ్వు ప్రమద చిలుకునవ్వు, ఉలిశిలఖేలనము లాంటివి నిజంగా వంశీగారు రాసినవేనా అనిపిస్తాయి.
ఇక ఆ చక్కని సాహిత్యానికి బాలు జానకి గార్లు తమ స్వరంతో జీవం పోశారు. నిజానికి వాళ్ళిద్దరూ కొన్ని పాటలను శ్రద్దగా కష్టపడి పాడినట్లు తెలియనివ్వరు ఆ పాటలు వాళ్ళు పాడలేదు పాటతో స్వరాలతో ఆడుకున్నారు అనిపిస్తుంటుంది ఇదీ అలాంటి పాటే జాగ్రత్తగా గమనించి చూడండి. ఈ పాటలో మధ్యలో అక్కడక్కడ బాలుగారు నవ్వే నవ్వు మగవాళ్ళకి మాకే "ఆహా ఏం నవ్వాడ్రా బాబు" అనిపిస్తుంది ఇక అప్పట్లో ఆ నవ్వు విన్న అమ్మాయిల పరిస్థితి గురించి ఏం చెప్పమంటారు :-)
ఈ పాట వీడియో కింద ఎంబెడ్ చేస్తున్నాను ఆడియో మాత్రం వినాలంటే రాగాలో ఇక్కడ వినవచ్చు. సంధర్బానుసారంగా ఎక్కువగా పాత పాటలను లైట్ గా రీమిక్స్ చేసి ఈ సినిమాకు ఉపయోగించుకున్నా ఈ సినిమా కోసమే సిద్దం చేస్కున్న ఈ పాటతో పాటు “ఏనాడు విడిపోని” అన్న మరో పాట కూడా చాలా బాగుంటుంది. ఆ పాట గురించి రేపటి టపాలో. ఈ రెండు టపాలు ఈ వారాంతం పెళ్ళి చేసుకుని ఓ ఇంటివాడవబోతున్న ఓ ఆత్మీయ మిత్రుడికి అంకితం.
చిత్రం: శ్రీకనకమాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్
సంగీతం : ఇళయరాజ
సాహిత్యం : వంశీ,ఇళయరాజ
గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, జానకి
వెన్నెలై పాడనా
నవ్వులే పూయనా
మల్లెలే పొదగనా
పూవులో.. మ్ నవ్వులో.. మ్ మువ్వలా.. మ్ హూ..
ఒంపులో.. హ సొంపులో.. హ కెంపులా.. ఆహా..
కలకల పొదలో కిలకిల కధనం
ముసిముసి రొదలో అలసట మధురం
పొద్దులో మీటనా
ముద్దులే నాటనా
హద్దులే దాటనా
ఇవ్వనా.. హ యవ్వనం.. హ పువ్వునై.. అహహ
గువ్వనై.. హో గవ్వనై.. హో నవ్వనా.. అహ్హహ్హ
లలనామణినై తలలోమణినై
నవలామణినై చింతామణినై
వెన్నెలై పాడనా
నవ్వులే పూయనా
మల్లెలే పొదగనా
నీ.. నిసరీ..
సా.. సరిగా..
పనిసా.. సమగ సరిగ..
పనిపా.. గపమ గమరీ..
మనినిని పససస నిరిరిరీ
గగగమ నిసరిమగ
పససస నిరిరిరీ గా..
మదసని
గసమగ పనిసని సా..
లీలగా తూగుతూ ఏమిటో దేహమె
వేడుకా ధారలే దాహమై కోరిన
పాడుతూ వేడినా కోరుతూ పాడినా
భేషజం చూపుతూ దోహదం చేయవు
మోవికెంపు బాధ గుండె మువ్వ గాధ
పొద్దు పువ్వులాగ నవ్వుతుంది చూడు
వెలుతురు.. మ్ నేత్రమే.. మ్ సోకని ప్రాంగణము
గాలికే.. హ ఊపిరి.. హ పూసే పరిమళము
తకధిమి తరిగడతత్తోం..
తకధిమి తరిగడతత్తోం..
తకధిమి తరిగడతత్తోం..
తరిగడతత్తోం.. తరిగడతత్తోం.. తకతోం..
తకధిమి తరిగడతత్తోం..
తకధిమి తరిగడతత్తోం..
తకధిమి తరిగడతత్తోం..
తరిగడతత్తోం.. తరిగడతత్తోం.. తకతోం..
చందనం పూయనా పూలలో రాజుకి
నోచిన నోముకే పూచినా రోజుకి
సుందరం ధూపమే వేయనా పూజకి
జాలిగా గాలిలో వీచినా మోజుకి
ప్రమిద కాంతి పువ్వు
ప్రమద చిలుకు నవ్వు
కలికి కలలు రాసే కధల పురము వాసి
బ్రతుకున.. మ్ పలికిన.. మ్ కిలకల కూజితము హహహ
మధురమై.. హ మొలవనీ.. హ ఉలిశిల ఖేలనము
పొద్దులో మీటనా
ముద్దులే నాటనా
హద్దులే దాటనా
9 comments:
ఈ వారాంతం పెళ్ళి చేసుకుని ఓ ఇంటివాడవబోతున్న మీ (మన) ఆత్మీయ మిత్రుడికి నా నుంచి కూడా శుభాభినందనలు !
ఆత్మీయ మిత్రుడికి శుభాకాంక్షలు :)
ఆత్మీయ మిత్రుడికి శుభాభినందనలు :-)
ఈ సినిమాలో ఈ పాట ఒక్కటి తప్ప ఇంకేమీ నచ్చవ్.. నాకెందుకో ఈ హీరోయిన్‌లో వై.విజయ పోలికలు చాలా కనిపిస్తాయి! :)
శ్రావ్య, ఫోటాన్, నిషీ థాంక్స్ ఫర్ యువర్ కామెంట్స్ అండ్ విషెస్ :-)
శాంతి గారు You made my day.. మీ కామెంట్స్ నాకు చాలా చాలా నచ్చాయండీ. Welcome to my blog and many thanks for taking time to visit old posts and writing such a nice comment and for all the encouragement.
నిషీ అన్నట్లు ఇందాక చెప్పడం మర్చిపోయాను మీరు ఈ సినిమా అభిమానుల మనోభావాలు దెబ్బతీసే అవకాశం ఉంది జరబద్రం :-) హహహ ఏమో హీరోయిన్ వై.విజయ బంధువేనేమో.. ఈ సినిమా గురించి మాటాడేటప్పుడు నేటివిటీ/ఒరిజినాలిటీ పేరుతో సర్దుకుపోవాల్సిన విషయాలలో హీరోయిన్ ను కూడా కలిపేయచ్చేమో :-))
"దోహదం చేయవూ..." దగ్గర జానకి ఎక్స్ ప్రెషన్ కోసం వింటానండీ ఈ పాట!!
ఇక పిక్చరైజేషన్ అయితే, మగ్గం సీన్... అసలు ఎన్ని షాట్స్ తీశాక ఓకే అయ్యిందో కదా అనిపిస్తూ ఉంటుంది, చూసినప్పుడల్లా... చక్కని పోస్ట్... లిరిక్స్ 'సిరివెన్నెల' వేమో అని నాకో డౌట్...
థాంక్స్ మురళి గారు, అవునండి అలాంటి expressions జానకమ్మగారు అలవోకగా ఇచ్చేస్తారు. లిరిక్స్ చూస్తే సిరివెన్నెల గారివిలాగానే కనిపిస్తున్నాయ్ కానీ పాటల క్రెడిట్స్ లో వంశీ గారి పేరు కూడా వేసుకున్నారు కనుక ఆయనే రాశారేమో అనుకుంటున్నానండీ.
అవును వేణుగారు.. ఇళయరాజా వంశీ గారి కాంబినేషన్ లో ఎన్నో స్వప్న రాగాలు గుండెని తాకుతాయి.. గోపెమ్మ చేతిలో గోరు ముద్ద, ఈ చైత్రవీణ, ఆవేశమంతా ఆలాపనేలే.. తలచుకుంటుంటే ఎన్నో.. బాపు బొమ్మలు వెలిగే సూర్యుడిని తిలకంగా దిద్దుకుంటే ఆయన శిష్యుడైన వంశీ కలలరాణులు అమావాశ్య చంద్రుడిని నుదుట దిద్దుకుంటుంటారు.. ఎంత అందంగా ఉన్నా ఆ నల్ల సింధూరం ఆ భావకుడి మనసులోని అలజడికి అద్దంలా అనిపిస్తుంది నాకు.. ఇదే మొదటిసారి మీ బ్లాగ్ చూడడం.. వెన్నెల్లో గోదారిలా ముందుకి సాగిపొండి.. అభినందనలు..
జ్ఞాపకాలు చాలా తమాషా అయినవి వేణు గారు.. కొన్ని ఆనందంతో కనురెప్ప అంచుని తాకితే, మరికొన్ని విషాదంతో చెక్కిలిని వర్షంలా తడిపేస్తాయి.. అందుకేనేమో నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి అన్నారు.. మీ అన్ని పోస్ట్స్ మీద నా ఫీలింగ్స్ express చేయాలని అనిపించింది. కానీ కనిపించని భావాలు పలికించి లాభం లేదు కదండీ.. మీ ధన్యవాదాలు అందుకోవాలని ఉన్నా అంత పేషన్స్ లేక పోవడం వల్ల అన్నిటికి కలిపి ఒకే అభినందన.. అమావాశ్య చంద్రుడు లో “కళకే కళ ఈ అందము” అన్న పాటంత బావున్నాయి..
నా కామెంట్స్ తెలుగులో కనిపించాలని పాతవి ఇలా తెలుగులో రీపోస్ట్ చేస్తున్నానండీ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.