అత్తారింటికి దారేది చిత్రం కోసం "సుమంగళి" చిత్రంలోని "కాటమరాయుడా" పాటను రీమిక్స్ చేశారు. నిజానికి ఇది దశావతారాలను అచ్చతెలుగు పదాలతో వర్ణించే ఒక అద్భుతమైన జానపదం. పాట అర్థంతో పని లేకుండా దీన్ని ఒక సరదా సన్నివేశం కోసం ఉపయోగించడం కాస్త నొచ్చుకునేలా చేసినా. పాట మాత్రం సూపర్ హిట్టే. ఈ పాట వీడియో కన్నా పవన్ పాడిన తీరు ఆ ఎనర్జీ చూడడానికి బావుంటుంది నాకు ఆ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. పాట రాసినది యడ్ల రామదాసు గారని నెట్ లో అక్కడక్కడ ఉంది కానీ సమగ్రమైన సమాచారం లేదు.
చిత్రం : అత్తారింటికి దారేది (2013)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : రాయలసీమ జానపదం (ఎడ్ల రామదాసు ??)
గానం : పవన్ కళ్యాణ్
హేయ్.. కాటమ రాయుడా కదిరీ నరసింహుడా..అ
కాటమ రాయుడా కదిరీ నరసింహుడా..ఆ
కాటమ రాయుడా కదిరీ నరసింహుడా..
మేటైన ఏటగాడ నిన్నేనమ్మీతిరా..
మేటైన ఏటగాడ నిన్నేనమ్మీతిరా..
బేట్రాయి సామిదేవుడా నన్నేలినోడ..
బేట్రాయి సామిదేవుడా
సేపకడుపు చీరిబుట్టితీ..
రాకాసి దాన్ని కోపాన తీసికొట్టితీ.. హెహె హోయ్..
బేట్రాయి సామిదేవుడా నన్నేలినోడ..
బేట్రాయి సామిదేవుడా
ఓటిమన్ను నీల్లలోన ఎలసి ఏగమే తిరిగి..
ఓటిమన్ను నీల్లలోన.. హ్ హొహొయ్
బాపనోల్ల సదువులెల్ల బెమ్మదేవరకిచ్చినోడ
బాపనోల్ల సదువులెల్ల బెమ్మదేవరకిచ్చినోడ
బేట్రాయి సామిదేవుడా నన్నేలినోడ..
బేట్రాయి సామిదేవుడా
సేపకడుపు చీరిబుట్టితీ..
రాకాసి దాన్ని కోపాన తీసికొట్టితీ.. హొయ్ హొయ్..
బేట్రాయి సామిదేవుడా నన్నేలినోడ..
బేట్రాయి సామిదేవుడా ఆఆహోయ్యా...
~*~*~*~*~*~*~*~*~*~*~*~
ఇక పవన్ కళ్యాణ్ అండ్ త్రివిక్రం ప్రభావితమై రీమిక్స్ చేయించిన వర్షన్ సుమంగళి చిత్రంలోని గౌరీపతి శాస్త్రి గారు పాడిన వర్షన్. ఈ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు. సుమంగళి పోస్టర్ తో మరో ఆడియో ఉంది కానీ అది సుమంగళి చిత్రంలోనిది కాదేమో అని నా అభిప్రాయం. వీడియోలో లిరిక్, పాటల పుస్తకం లో లిరిక్ అండ్ పవన్ వాడిన లిరిక్ ఈ మూడు మ్యాచ్ అవడంతో నేనీ అభిప్రాయానికి వచ్చాను.
చిత్రం : సుమంగళి (1940)
సంగీతం : నాగయ్య
సాహిత్యం : రాయలసీమ జానపదం (ఎడ్ల రామదాసు ??)
గానం : గౌరీపతి శాస్త్రి
కాటమ రాయుడా కదిరీ నరసిమ్ముడా..
కాటమ రాయుడా కదిరీ నరసిమ్ముడా..
మేటైన ఏటగాడ నిన్నేనమ్మీతిరా..
మేటైన ఏటగాడ నిన్నేనమ్మీతిరా..
బేట్రాయి సామిదేవుడా నన్నేలినోడ..
బేట్రాయి సామిదేవుడా
సేపకడుపు చేరిబుట్టితీ..
రాకాసి గాన్ని కోపాన తీసికొట్టితీ..
సేపకడుపు చేరిబుట్టితీ..
రాకాసి గాన్ని కోపాన తీసికొట్టితీ..
ఓపినన్ని నీళ్ళలోన ఎలసి ఏగ తిరిగినీవు..
ఓపినన్ని నీళ్ళలోన..
బాపనోళ్ళ సదువులెల్ల బెమ్మదేవరకిచ్చినోడ
బాపనోళ్ళ సదువులెల్ల బెమ్మదేవరకిచ్చినోడ
బేట్రాయి సామిదేవుడా
~*~*~*~*~*~*~*~*~*~*~*~
ఇక ఈ పాట జానపద రూపం ఇలా వుంటుంది. ఈ సాహిత్యానికి సరిపడ ఆడియో నాకు ఎక్కడా కనిపించలేదు కనుక ప్రస్తుతానికి సాహిత్యంతో సరిపెడుతున్నాను ముందు ముందు ఆడియో/వీడియో దొరికితే అప్డేట్ చేస్తాను. ఈ పాటకు తెలుగు వెలుగు పత్రికలో వచ్చిన వివరణతో కూడిన విశేషాలను సుజాత గారి బ్లాగ్ పోస్ట్ లో ఇక్కడ చూడవచ్చు.
బేట్రాయి సామి దేవుడా - నన్నేలినోడ
బేట్రాయి సామి దేవుడా
కాటేమి రాయుడా - కదిరినరసిమ్మడా
మేటైన వేటుగాడ నిన్నే నమ్మితిరా
మేటైన వేటుగాడ నిన్నే నమ్మితిరా
బేట్రాయి...
శాప కడుపు సేరి పుట్టగా - రాకాసిగాని
కోపామునేసి కొట్టగా
ఓపినన్ని నీల్లలోన వలసీ వేగామె తిరిగి
బాపనోల్ల సదువులెల్ల బెమ్మదేవరకిచ్చినోడ
బేట్రాయి...
తాబేలై తాను పుట్టగా ఆ నీల్లకాడ
దేవాసురులెల్లకూడగా
దోవసూసి కొండకింద దూరగానే సిల్కినపుడు
సావులేని మందులెల్ల దేవర్లకిచ్చినోడ
బేట్రాయి...
అందగాడనవుదులేవయా - గోపాల గో
విందా రచ్చించా బేగరావయా
పందిలోన సేరి కోర పంటితోనె ఎత్తి భూమి
కిందు మిందు సేసినోడ సందమామ నీవె కాద
బేట్రాయి...
నారసిమ్మ నిన్నె నమ్మితి - నానాటికైన
కోరితి నీ పాదమే గతీ
ఓరి నీవు కంబాన సేరి ప్రహ్లాదు గాచి
కోరమీస వైరిగాని గుండె దొర్లసేసినోడ
బేట్రాయి...
బుడుత బాపనయ్యవైతివి
ఆ శక్కురవరితి నడిగి భూమి నేలుకుంటివీ
నిడువు కాళ్ళోడివై అడుగు నెత్తిపైన బెట్టి
తడవు లేక లోకమెల్ల మెడిమతోటి తొక్కినోడ
బేట్రాయి...
రెండుపదులు ఒక్కమారుతో ఆ దొరలనెల్ల
సెండాడినావు పరశుతో
సెండకోల బట్టి కోదండరామసామికాడ (సెండకోల = గండ్రగొడ్డలి)
బెండు కోల సేసికొనీ కొండకాడకేగినోడ (బెండు కోల = శక్తి తగ్గించుకుని, సముద్రం దగ్గర గొడ్డలి విసిరేసి అంత మేరా సముద్రాన్ని వెనక్కి
జరిపిన ఘట్టం)
బేట్రాయి...
రామదేవ రచ్చించరావయా సీతమ్మతల్లి
శ్యామసుందర నిన్ను మెచ్చగా
సామి తండ్రిమాట గాచి ప్రేమ భక్తినాదరించి
ఆమైన లంకనెల్ల దోమగాను సేసినోడ
బేట్రాయి...
దేవకీదేవి కొడుకుగా ఈ జగములోన
దేవుడై నిలిచినావురా
ఆవూల మేపుకొనీ ఆడోళ్ళాగూడుకొనీ
తావుబాగ సేసుకొనీ తక్కిడి బిక్కిడి సేసినోడ (తక్కిడి బిక్కిడి = మోసం)
బేట్రాయి...
ఏదాలూ నమ్మరాదనీ ఆ శాస్త్రాలా
వాదాలూ బాగ లేవనీ
బోధనలూ సేసికొనీ బుద్ధూలు సెప్పుకొనీ
నాదావినోదుడైన నల్లనయ్య నీవెకాద
బేట్రాయి...
కలికి నా దొరవు నీవెగా ఈ జగములోన
పలికినావు బాలశిశువుడా
చిల్లకట్టు పురములోన సిన్నీ గోపాలుడౌర
పిల్లంగోవి సేతబట్టి పేట పేట తిరిగినోడ..
బేట్రాయి...
4 comments:
కొత్త వెర్షన్ చాలా బావుంది అనిపించింది ఇప్పటివరకు ఈ పాటే ..
హహహ అంతా పవన్ ఎనర్జీ మహిమండీ :-) థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..
ఇది రాయలసీమ జానపదం. ఒక్కొక్క చోట ఒక్కొక్క మాదిరి పదప్రయోగం ఉంటుంది. కృష్ణ సంగీతం అన్న ఆల్బమ్ లో మంగళంపల్లి వారు పాడిన పాట క్రింది లింక్ లో దొరుకుతుంది. https://wynk.in/music/song/betrayee-sami/hu_2165579
అలాగే అదే పాట మనసువిని బ్లాగ్ లో కూడా కనిపిస్తుంది.
https://manasuwini.blogspot.com/2020/11/blog-post_25.html
థ్యాంక్స్ భవానీ ప్రసాదు గారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.