బుధవారం, ఫిబ్రవరి 13, 2013

శీతవేళ రానీయకు రానీయకూ

దదాపు రెండున్నరేళ్ళ తర్వాత నిన్న నా ఐపాడ్ ని జాగ్రత్తగా బయటకు తీసి రీఛార్జ్ చేసి ఎప్పటిలాగే షఫుల్ ప్లేలో నాఐపాడ్ నాకోసం ఏం పాట వినిపిస్తుందా అని ఆత్రంగా ఎదురు చూస్తూ వింటే తను నాకోసం ఎన్నుకున్న పాట ఇది. “శీతవేళ రానీయకు రానీయకూ శిశిరానికి చోటీయకు చోటీయకూ” అంటూ పాడటం మొదలెట్టేసరికి ఔరా అనుకుంటూ పాటతో పాటే పెదవులపై అనుకోకుండా ఓ చిన్న చిరునవ్వు వికసించింది :-) ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట తరచూ వినే పాట కూడా. ఈ సంధర్బంలో వినడం మాత్రం తనకు రానివ్వద్దని తనగురించి ప్రాధేయపడుతుందో నన్ను హెచ్చరిస్తూందో కానీ భలే ఎన్నుకుంది అనిపించింది. 

ఈ సినిమా పాటల గురించి ఏం చెప్పను ప్రతిపాటా ఒక ఆణిముత్యమే. రమేష్ నాయుడి గారి బెస్ట్ వర్క్, ప్రత్యేకించి ఈ పాటకి సాహిత్యానికి తగినట్టుగా సంగీతం కూడా భలే కరెక్ట్ గా అమరింది, ఇందులో నాకు వాళ్ళిద్దరి సాన్నిహిత్యం కూడా భలే నచ్చుతుంది. చరణాల మధ్య పల్లవి పాడేప్పుడు ఒకళ్ళుపాడుతుంటే మరొకరు రాగంతీస్తూ సపోర్ట్ చేయడం అద్భుతంగా కుదురుతుంది. బహుశా చిత్రీకరించడం కష్టమని వదిలేశారో చిత్రం నిడివి దృష్టిలో పెట్టుకుని కత్తెరకి బలిచేశారోకానీ ఈ పాట వీడియో ఇంతవరకూ నేను చూడలేదు. సినిమాలోకానీ డివిడిలో కానీ ఎక్కడా రాలేదని అంటూంటారు.

ఈ పాట గురించి అక్కిరాజు భట్టిప్రోలు గారు చాలా చక్కని వ్యాఖ్యానం తన బ్లాగ్ లో రాసుకున్నారు ఒక్కసారి వీలు చేసుకుని అది ఇక్కడ చదవండి. పాటని ఎప్పుడెప్పుడు ఏ ఏ సంధర్భాలలో వినాలో ఎలా అర్ధంచేస్కోవాలో బహుచక్కగా వివరించారు తను. ఈ పాట ఆడియో రాగా లో ఇక్కడ వినవచ్చు.

పాడింది ఇద్దరే కదా ఆ మూడవ రంగు ఎవరి స్వరం ? ఎక్కడినుండి వచ్చిందని ఆశ్చర్యపడుతున్నారా :-) మొదటిది ఏసుదాసు గారి స్వరం రెండవది సుశీలమ్మ స్వరం మూడవ రంగు ఇద్దరూ కలిపి పాడినది. అందుకే ఈ పాట నాకు ఇంకా ఎక్కువ ఇష్టం.

చిత్రం : మేఘసందేశం
సాహిత్యం : దేవులపల్లి కృష్ణశాస్త్రి
సంగీతం : రమేష్ నాయుడు
గానం : ఏసుదాస్, సుశీల

శీతవేళ రానీయకు – రానీయకూ
శిశిరానికి చోటీయకు – చోటీయకూ
శీతవేళ రానీయకు – రానీయకూ
శిశిరానికి చోటీయకు – చోటీయకూ
ఎద లోపల పూలకారు
ఏ నాటికీ పోనీయకూ
శీతవేళ రానీయకు – రానీయకూ
శిశిరానికి చోటీయకు – చోటీయకూ

ఉగ్రమైన వేసంగి గాడ్పులు
ఆగ్రహించి పై బడినా అదరి పోవకూ
అదరి పోవకూ
ఉగ్రమైన వేసంగి గాడ్పులు
ఆగ్రహించి పై బడినా అదరి పోవకూ
అదరి పోవకూ
ఒక్కుమ్మడిగా వర్షా మేఘం
వెక్కి వెక్కి రోదించినా
లెక్క చేయకూ – లెక్క చేయకూ

శీతవేళ రానీయకు – రానీయకూ
శిశిరానికి చోటీయకు – చోటీయకూ
శీతవేళ రానీయకు – రానీయకూ
శిశిరానికి చోటీయకు – చోటీయకూ

చైత్రంలో తొగరెక్కిన కొత్త కోర్కెలు
శరత్తులో కైపెక్కే తీయని కలలు
చైత్రంలో తొగరెక్కిన కొత్త కోర్కెలు
శరత్తులో కైపెక్కే తీయని కలలు
మనసారా తీర్చుకో – మనుగడ పండించుకో
లోకానికి పొలిమేరను – నీలోకం నిలుపుకో

శీతవేళ రానీయకు – రానీయకూ
శిశిరానికి చోటీయకు – చోటీయకూ
శీతవేళ రానీయకు – రానీయకూ
శిశిరానికి చోటీయకు – చోటీయకూ

ఉదయాన మగత నిదర చెదరిపోవు వేళ
మబ్బులలో ప్రతి తారక మాయమయే వేళ
ముసలితనపుటడుగుల సడి ముంగిట వినబడెనా
ముసలితనపుటడుగుల సడి ముంగిట వినబడెనా
వీట లేడనీ చెప్పించూ – వీలు కాదనీ పంపించూ
వీలు కాదనీ పంపించు.

శీతవేళ రానీయకు – రానీయకూ
శిశిరానికి చోటీయకు – చోటీయకూ
ఎద లోపల పూలకారు
ఏ నాటికీ పోనీయకూ...
శీతవేళ రానీయకు – రానీయకూ
శిశిరానికి చోటీయకు – చోటీయకూ

7 comments:


ఇందులో అన్నిపాటలూ బావున్నా.. ఇది మాత్రం కొంచెమెక్కువ ఇష్టం.. ఎన్నిసార్లు స్వగతాన చెప్పుకుని ఉంటానో, "శీతవేళ రానీయకూ.. శిశిరానికి చోటీయకూ" అని!
థాంక్స్, వేణూ.. ఇంకో మంచిపాటకి :)

మంచి పాట గుర్తు చేసారు వేణు గారు.నాకు మాత్రం ఈ మూవీలో "సిగలో అవి విరులో" పాట కొంచెం ఎక్కువ ఇష్టం.
"చిత్రీకరించడం కష్టమని వదిలేశారో చిత్రం నిడివి దృష్టిలో పెట్టుకుని కత్తెరకి బలిచేశారోకానీ ఈ పాట వీడియో ఇంతవరకూ నేను చూడలేదు" చూడనందుకే మీకు ఈ పాట ఇంతగా నచ్చిందేమో :P

ఏమో నిషీ ఈ సినిమాలో పాటలు మాత్రం ఏది వింటున్నా నాకు ఈపాట మిగిలిన పాటలకంటే కొంచెం ఎక్కువ ఇష్టం అనిపిస్తుంటుంది :-) థాంక్స్ ఫర్ ద కామెంట్.

మెహక్ గారు ధన్యవాదాలండీ :-) హహహ అలా అంటారా లేదండీ అన్నిసార్లూ చూడం కనుక చూసినా ఈ ఇష్టం అంతే ఉండేదేమో :-) సిగలో అవి విరులో పాట కూడా ఇష్టమేనండీ దాని గురించి ఇదివరకే ఓసారి పోస్టేశాను :-)

ఈ సినిమాలో ఏ పాట విన్నా అదే బాగా నచ్చేస్తుందనిపిస్తుంది. నిజం!

శీతవేళ రానీయకు.. తరచూ స్వగతాన చెప్పుకునే మాట. కరెక్ట్ నిషీ..

థాంక్స్ కొత్తావకాయగారు :-)

ప్రేమకు పదాలు పొదిగి నీతో చెప్పాలని వున్నా..
ఆ పదాల పరిమితిలో బందీ అయిపొతుందెమో అని ఆగిపోయాను

ఎందుకో మీ అందరికీ ఇష్టంలేని, ఇష్టపడని మెసేజ్ పెడుతున్నానేమో అనిపిస్తోంది అయినా లోపల దాచలేను..
నాకెందుకో ఈ పాత(సాహిత్యం కాదుసుమీ) నచ్చదు.
నిజం చెప్పాలంటే, మేఘసందేశం సినిమాలో ఈ పాట ఉన్నట్టుకూడా ఇప్పుడే తెలిసింది.
నాకు తెలిసిందల్లా అప్పట్లో ఆకాశవాణి రికార్డ్ ఐన బి. కే. వెంకటేష్ గారు, ఆర్. ఛాయాదేవిగారి గళంలో తేనెలూరిన గానం మాత్రమే.. (చిత్తరంజన్ గారు అనుకుంటా స్వర లాస్యం చేశారు).
ఆపాట సంగీతం, గాత్రం, సుమనోహరం
ఎందుకో రమేష్ నాయుడుగారు పాట మొదటినుంచి త్వరత్వరగా పరిగెత్తించారేమో అనిపించింది వినగానే..
ఈ పాట అభిమానులు దయచేసి క్షమించండి, ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే
రమేష్ నాయుడుగారు, పుహళేంది గార్ల సంగీతం అంటే.. ఎంతో ఇష్టం నాకు.

థాంక్స్ ఫర్ ద కామెంట్ అండీ.. రేడియో వర్షన్ నేనెపుడూ వినలేదండీ.. బహుశా వింటే మా అందరికీ అది కూడా నచ్చవచ్చేమో... మీరన్న బాణీ ఇదేనా ఓ సారి చూడండి. https://www.youtube.com/watch?v=ffYJV4pIB9Y

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.