ఆదివారం, మే 10, 2020

ప్రియతమా...

జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రం విడుదలై నిన్నటికి ముప్పై ఏళ్ళైందట. ఈ సంధర్భంగా ఆ సినిమాలోని ఒక మంచి మెలోడీని తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. మొదట ఫ్లాప్ టాక్ తో విడుదలై తుఫానులో చిక్కుకుని బాక్సాఫీస్ సైతం వెల వెలబోయి తుఫాన్ కాస్త తగ్గుముఖం పట్టగానే కలెక్షన్స్ తుఫాన్ ప్రారంభించిన సినిమా ఇది. వేటూరి గారి కలం వెర్సటాలిటీ తెలియాలంటే ఈ ఆల్బమ్ లోని పాటలన్నీ వింటే చాలు :-)
 
అప్పట్లో మా నరసరావుపేట సంధ్యా థియేటర్(ఇప్పటి శారదాంబ) లో విడుదలైనట్లు గుర్తు. ఇప్పుడంటే అంతా ఆన్లైన్ బుకింగ్స్ కానీ అప్పట్లో  సినిమా టిక్కెట్లు సంపాదించడం మామూలు విషయం కాదు. ఇక చిరంజీవి సినిమాకైతే మొదటి వారం రావడానికి ఫ్యామిలీస్ అండ్ పెద్దవాళ్ళు భయపడేవారు. బాక్సాఫీస్ దగ్గర చిన్న సైజ్ యుద్ద వాతావరణం కనిపించేది.

ఈ సినిమా టిక్కెట్లు దొరకక నేను రెండు సార్లు వెనుదిరిగినట్లు నాకు గుర్తు. అప్పట్లో అసలు ఒంటరిగా సినిమాకి వెళ్ళడానికి ఇంట్లో పర్మిషన్ దొరకడమే కష్టం. అలాంటిది టిక్కెట్లు దొరక్క వెనక్కి వచ్చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. మొదటి రెండు సార్లు క్యూలో పోరాడలేక కాస్త మంచి వాళ్ళలా కనపడిన మగవాళ్ళ దగ్గరో లేదంటే ఆడవాళ్ళ క్యూ దగ్గరో అమాయకపు ఫేస్ పెట్టుకుని ఒక్కటిక్కెట్ అంటూ బతిమిలాడినా కానీ నా పప్పులు ఉడకలేదు.

దాంతో ఇక ఇలా లాభం లేదని మూడో సారి ఇంట్లో చెప్పకుండా టిక్కెట్ కు మాత్రం సరిపోయేలా పోగేసుకున్న డబ్బుతో ఓ పాత చొక్కా హవాయి చెప్పులు వేస్కుని ఇంకా పడుతున్న వర్షాల వల్ల చిత్తడి నేలలో దాదాపు ఒకటిన్నర కి.మీ. నడిచెళ్ళాను. బాక్సాఫీస్ లో జరిగిన తొక్కిసలాటలో ఊడిన బొత్తాలు, తెగిన చెప్పుల గురించి అస్సలు పట్టించుకోకుండా పడిన కష్టమంతా మర్చిపోయి సినిమాను బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశాను.

తిరిగి ఇంటికి వెళ్ళేప్పుడు సినిమా మత్తు దిగి మధ్యాహ్నానికి వాన వెలిసి ఎండ మొదలై కాలే కడుపుకు నడి నెత్తిన చుర్రుమనే ఎండ కూడా తోడవగా తెగిన చెప్పులతో ఈడ్చుకుంటూ ఇంటికి నడిచి వెళ్ళిన గుర్తు. ఇప్పుడు స్విచ్చి నొక్కితే వేలకొద్దీ సినిమాలు వేలి చివరనుండడం చూస్తే అప్పట్లో ఓ సినిమా చూడ్డానికి ఇంత కష్టపడ్డామా అని ఆశ్చర్యమేస్తుంది. ఐతే పడిన కష్టానికి పెట్టిన డబ్బుకీ ఒకటికి రెండింతలు వసూల్ అనిపించే సినిమాలు అరుదుగా వస్తాయి. జగదేక వీరుడు అతిలోక సుందరి సరిగ్గా అలాంటి సినిమా, నేనింత కష్టపడి చూసిన ఏకైక సినిమా కూడా ఇదే. 


చిత్రం : జగదేకవీరుడు అతిలోకసుందరి (1990)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి

ప్రియతమా నను పలకరించు ప్రణయమా
అతిథిలా నను చేరుకున్న హృదయమా
బ్రతుకులోని బంధమా పలుకలేని భావమా
మరువలేని స్నేహమా మరలిరాని నేస్తమా
ప్రియతమా.. ప్రియతమా.. ప్రియతమా


ప్రియతమా నను పలకరించు ప్రణయమా
అతిథిలా నను చేరుకున్న హృదయమా
ఎదుటవున్న స్వర్గమా చెదిరిపోని స్వప్నమా
కనులలోని కావ్యమా కౌగిలింత ప్రాణమా
ప్రియతమా.. ప్రియతమా.. ప్రియతమా..

నింగి వీణకేమో నేల పాటలొచ్చె
తెలుగు జిలుగు అన్నీ తెలిసి
పారిజాతపువ్వు పచ్చి మల్లె మొగ్గ
వలపె తెలిపే నాలో విరిసి

మచ్చలెన్నో ఉన్న చందమామకన్నా
నరుడే వరుడై నాలో మెరిసే
తారలమ్మకన్నా చీరకట్టుకున్న
పడుచుతనమే నాలో మురిసే


మబ్బులన్నీ వీడిపోయి కలిసే నయనం తెలిసే హృదయం
తారలన్నీ దాటగానే తగిలే గగనం.. రగిలే విరహం
రాయలేని భాషలో ఎన్ని ప్రేమలేఖలో
రాయిలాంటి గొంతులో ఎన్ని మూగపాటలో
అడుగే పడక గడువే గడిచి పిలిచే


ప్రియతమా నను పలకరించు ప్రణయమా
అతిథిలా నను చేరుకున్న హృదయమా

ప్రాణవాయువేదో వేణువూదిపోయే
శృతిలో జతిలో నిన్నే కలిపి
దేవగానమంత ఎంకి పాటలాయే
మనసు మమత అన్నీ కలిసి


వెన్నెలల్లె వచ్చి వేదమంత్రమాయే
బహుశా మనసా వాచా వలచి
మేనకల్లే వచ్చి జానకల్లే మారె
కులము గుణము అన్నీ కుదిరి

నీవులేని నింగిలోన వెలిగే ఉదయం విధికే విలయం
నీవులేని నేలమీద బ్రతుకే ప్రళయం మనసే మరణం
వానవిల్లు గుండెలో నీటికెన్ని రంగులో
అమృతాల విందులో ఎందుకిన్ని హద్దులో
జగమే అణువై యుగమే క్షణమై మిగిలే

ప్రియతమా నను పలకరించు ప్రణయమా
అతిథిలా నను చేరుకున్న హృదయమా
బ్రతుకులోని బంధమా పలుకలేని భావమా
కనులలోని కావ్యమా కౌగిలింత ప్రాణమా
ప్రియతమా.. ప్రియతమా.. ప్రియతమా

ప్రియతమా నను పలకరించు ప్రణయమా
అతిథిలా నను చేరుకున్న హృదయమా
 

8 comments:

ఎందుకో తెలిదు ఈ పాటలో జానకమ్మ గారి గొంతు వింటుంటే ఏదో తెలియని అనుభూతి చెందుతాను తెలుగు చిత్ర సీమలో ఒక అద్బుతమైన కళాఖండాం ఈ చిత్రం

వేణు గారు మీది నరసరావుపేట అండి ?
మాది నరసరావుపేటే ప్రకాష్ నగర్

అవునండీ.. ఆ గాత్రంలో మాధుర్యం అలాంటిది.. ఇక ఇళయరాజా గారి సంగీతం గురించి చెప్పనే అక్కర్లేదు. నా చిన్నప్పుడు నర్సరావుపేటలో ఉండే వాళ్ళం అండీ ఇపుడు గుంటూర్ షిఫ్ట్ అయిపోయాం. థ్యాంక్స్ ఫర్ ద కామెంట్.

థియేటర్లో పాతిక సార్లు కుమ్మించుకున్నాం సోదరా
ఏ పాటలో ఎన్ని సార్లు జీన్స్ ఎన్నిసార్లు బ్యాగీ ప్యాంటు మార్చాడు ఇత్యాదివి పుస్తకాలుగా రాసి ప్రచురించాం కూడా సోదరా

హహహహ పాతిక సార్లా.. సౌండ్ లేదు సోదరా... నేనే మూడు నాలుగు సార్లో చూసుంటాను అంతే. హహహ బ్యాగీ ప్యాంటులు జీన్సులు అప్పట్లో మాములు ట్రెండ్ కాదు కదా :-) థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ సోదరా..

మీరేమో వేటూరిని "వేణూళ్ల" పొగుడుతున్నారు. అక్కడొకాయన వేటూరి పేరెత్తితే వేసేస్తా ఊసేస్తా అంటున్నాడు. ఏమీ అర్థం కావట్లేదు!

వేణూళ్ళ ప్రయోగం బావుంది సూర్య గారు. నేను పొగిడినా వేరొకరు తెగిడినా అవి మా ఇష్టాయిష్టాలే తప్ప వేటూరి వారి విద్వత్తు వీసమెత్తు పెరగదు తరగదు కదండీ. ఎవరి అభిప్రాయాలు వారివి.

nice to see many people talking about JVAS film,
nice to see this songs lyric being posted srikanth garu

థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ సర్. ఆ సినిమా ఎవర్ గ్రీన్ అండీ. ఇంకా ముందు ముందు తరాలు కూడా మాట్లాడుకోవడం ఖచ్చితంగా చూస్తాము.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.