శ్రావణ శుక్రవారం సంధర్బంగా గోమాత విశిష్టతను తెలిపే ఈ చక్కని పాటను తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమె వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కొవచ్చు. ఎంబెడ్ చేసినది ఘంటసాల గారు పాడిన పాట. ఇందులోని మొదటి చివరి చరణాలతో సుశీల గారితో కలిసి పాడిన పాట ఇక్కడ వినవచ్చు.
చిత్రం : గోవుల గోపన్న (1968)
సంగీతం : ఘంటసాల
సాహిత్యం : కొసరాజు రాఘవయ్య చౌదరి
గానం : ఘంటసాల, సుశీల
వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా
గోమాతను నేనేరా నాతో సరి పోలవురా
కల్లా కపటం ఎరుగని గంగి గోవును నేను
ఏది చెప్పినా కాదని ఎదురు చెప్పలేను
పారేసిన గడ్డి తిని బ్రతుకు గడుపుతున్నాను
పరుల సేవకే సర్వం త్యాగం చేస్తున్నాను
వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా
కమ్మనైన గుమ్మపాలు కడవలతో ఇస్తున్నా
నా దూడల కాదని మీ కడుపులు నిండిస్తున్నా
వయసుడిగిన నాడు నన్ను కటిక వాని పాల్జేస్తే
ఉసురు కోల్పోయి మీకే ఉపయోగిస్తున్నాను
వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా
నా బిడ్డలు భూమి చీల్చి దుక్కి దున్నుతున్నవోయి
నా ఎరువున పైరు పెరిగి పంట పండుతున్నదోయి
నా చర్మమే మీ కాలికి చెప్పులుగా మారునోయి
నా ఒళ్లే ఢంకాలకు నాదం పుట్టించునోయి
వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా
నా కొమ్ములే దువ్వెనలై మీ తల చిక్కులను తీర్చు
నే కల్పించిన విభూది మీ నొసటను రాణించు
నా రాకయే మీ ఇంట్లో శుబములెన్నో కలిగించు
నా చేయుతయే చివరకు వైతరణిని దాటించు
వినరా వినరా నరుడా తెలుసుకోర పామరుడా
గోమాతను నేనేరా నాతో సరి పోలవురా
2 comments:
చక్కని పాట..మీ కుటుంబానికి ఆ అమ్మవారి అశీస్సులు సంపూర్ణం గా ఉండాలని ఆకాంక్ష..
థ్యాంక్స్ ఫర్ ద విషెస్ శాంతి గారు.. మీకు మీ కుటుంబానికీ కూడా అమ్మవారి ఆశీస్సులు అందాలని కోరుకుంటున్నాను.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.