ఈ రోజు కాత్యాయనీ దేవి అవతారంలో దుర్గమ్మ తన భక్తులను అనుగ్రహించనున్నది. ఈ రోజు అమెరికా అమ్మాయి చిత్రంలోని ఒక చక్కని పాట తలచుకుందాం. తెలుగింట కోడలిగా అడుగు పెట్టిన విదేశీ వనిత ఇక్కడ శివాలయంలో పొందిన అనుభూతిని చక్కని పాటగా మలిచారు. ఈ పాత్ర ధరించిన ఫ్రెంచ్ యువతి దేవయాని నిజ జీవితంలో కూడా నాట్యం నేర్చుకుని అందులో చేసిన కృషికి పద్మశ్రీ ని అందుకోవడం విశేషం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : అమెరికా అమ్మాయి (1976)
సంగీతం : జి.కె. వెంకటేశ్
సాహిత్యం : సినారె
గానం : సుశీల
ఆ..ఆ..ఆ..
ఆనంద తాండవమాడే
ఆనంద తాండవమాడే శివుడు
అనంతలయుడు చిదంబర నిలయుడు
ఆనంద తాండవమాడే
నగరాజసుత చిరునగవులు చిలుకంగ
నగరాజసుత చిరునగవులు చిలుకంగ
సిగలోన వగలొలికి ఎగిరి ఎగిరి దూకంగ సురగంగ
ఆనంద తాండవ మాడే శివుడు
అనంతలయుడు చిదంబర నిలయుడు
ఆనంద తాండవమాడే
ప్రణవనాదం ప్రాణం కాగా
ప్రకృతిమూలం తానం కాగా
భువనమ్ములే రంగ భూమికలు కాగా
భుజంగ భూషణుడు అనంగ భీషణుడు
పరమ విభుడు గరళధరుడు
భావ రాగ తాళ మయుడు సదయుడు
ఆనంద తాండవ మాడే శివుడు
అనంతలయుడు చిదంబర నిలయుడు
ఆనంద తాండవమాడే
ఏమి శాంభవ లీల ఏమా తాండవహేల
ఏమి శాంభవ లీల ఏమా తాండవహేల
అణువణువులోన దివ్యానంద రసడోల
సురగరుడులు ఖేచరులు విద్యాధరులు
సురగరుడులు ఖేచరులు విద్యాధరులు
నిటల తట ఘటిత నిజకర కమలులై
నిలువగా పురహరాయని పిలువగా కొలువగా
ఆనంద తాండవమాడే
ధిమి ధిమి ధిమి ధిమి డమరుధ్వానము దిక్తటముల మార్మోయగా
కిణకిణ కిణ కిణ మణి నూపురముల ఝణత్కారముల మ్రోయగా
విరించి తాళము వేయగా
హరి మురజము మ్రోయింపగా
ప్రమధులాడగా అప్సరలు పాడగా
ఆడగా పాడగా ఆనంద తాండవమాడే
2 comments:
ఈ మూవీలో పాడనా తెనుగుపాట, ఆమె తోటి మాటుంది సాంగ్స్ కూడా చాలా చాలా బావుంటాయండి..
అవును శాంతి గారు అవి కూడా నాకిష్టమైన పాటలే.. థాంక్స్ ఫర్ ద కామెంట్.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.