సోమవారం, డిసెంబర్ 16, 2013

తక ధిమి తక ధిమి తక

బాలచందర్ గారి సినిమాలంటే కథ, పాత్రలు, చిత్రీకరణ అంతా వేరే ఏదో లోకంలోకి తీసుకెళ్ళినట్లుగా అనిపిస్తుంది బహుశా అప్పటి రోజుల్లోని కథలను ప్రతిభింబిస్తూ రియలిస్టిక్ గా ఉండేవేమో. ముఖ్యంగా తన సినిమాల్లో స్త్రీపాత్రలు వైవిధ్యంగా ఉండి చాలా కాలం గుర్తుండిపోతాయి. “ఇదికథకాదు” లో జయసుధ కూడా అలా చాలా కాలం గుర్తుండే పాత్ర. నాకు ఈ సినిమా గుర్తుంది మాత్రం ఇందులోని మాట్లాడే బొమ్మ వలన.

కొంచెం ఊహ తెలిసాక అసలు ఈ సినిమా ఏవిటి అని ఆలోచిస్తే ఇపుడు గుర్తుంచుకునే కారణాలు వేరే అయినా అప్పట్లో గుర్తుండిపోయింది మాత్రం మాట్లాడేబొమ్మ. అలాగే కమల్ బొమ్మలా నటిస్తూ పాడే ఈ పాట కూడా నాకు భలే గుర్తు తకధిమితక అంటూ సరదాగా మొదలైనా తర్వాత ఇల్లేంటో గుమ్మం ఏంటో అసలీ లిరిక్స్ ఏంటిరా బాబు అనుకుని లైట్ తీస్కున్నా.

కాలేజ్ కి వచ్చాక అనుకుంటా ఓసారి ఈ పాట ఎపుడో మళ్ళీ శ్రద్దగా విన్నపుడు పాట సాహిత్యం మొత్తం సరిగా అర్ధమై ఏం రాశారురా బాబు వాటే లిరిక్స్ అనుకుని ఆత్రేయ గారికి మనసులోనే నమస్కారం చేసుకున్నాను. బాగున్న లైన్స్ కోట్ చేయాలనుకుని కూడా ఏ రెండు లైన్సూ పిక్ చేసుకుని ఇతర లైన్స్ కు అన్యాయం చేయలేక చేయడంలేదు. గ్రేట్ ఫిలాసఫీని పాజిటివ్ యాటిట్యూడ్ ని నింపే ఈ ఇన్స్పైరింగ్ సాంగ్ మీకోసం. ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినండి. ఎంబెడ్ చేయబడిన వీడియోలో పాట ఆడియో పూర్తిగా ఉన్నప్పటికీ సగం నుండి వీడియో మాత్రం మిక్స్ అయిపోయింది.  



చిత్రం : ఇది కధ కాదు
సంగీతం : ఎమ్మెస్ విశ్వనాథన్
సాహిత్యం : ఆత్రేయ
గానం : బాలు, సదన్

తకధిమితక ధిమితకధిమి తకధిమి తక ధింధిం
జత జత కొక కధ ఉన్నది చరితైతే ఝం ఝం
తకధిమితక ధిమితకధిమి తకధిమి తక ధింధిం
జత జత కొక కధ ఉన్నది చరితైతే ఝం ఝం

ఒక ఇంటికి ముఖ ద్వారం ఒకటుంటే అందం
ఒక మనసుకు ఒక మనసని అనుకుంటే స్వర్గం
ఒక ఇంటికి ముఖ ద్వారం ఒకటుంటే అందం
ఒక మనసుకు ఒక మనసని అనుకుంటే స్వర్గం

తకధిమితక ధిమితకధిమి తకధిమితక ధింధిం
జత జత కొక కధ ఉన్నది చరితైతే ఝం ఝం

ఈ లోకమొక ఆట స్థలము ఈ ఆట ఆడేది క్షణమూ
ఈ లోకమొక ఆట స్థలము ఈ ఆట ఆడేది క్షణమూ
ఆడించు వాడెవ్వడైనా ఆడాలి ఈ కీలుబొమ్మా
ఆడించు వాడెవ్వడైనా ఆడాలి ఈ కీలుబొమ్మా

ఇది తెలిసీ తుది తెలిసీ ఇంకెందుకు గర్వం
తన ఆటే గెలవాలని ప్రతి బొమ్మకు స్వార్ధం
ఇది తెలిసీ తుది తెలిసీ ఇంకెందుకు గర్వం
తన ఆటే గెలవాలని ప్రతి బొమ్మకు స్వార్ధం

తకధిమితక ధిమితకధిమి తకధిమితక ధింధిం
జత జత కొక కధ ఉన్నది చరితైతే ఝం ఝం

వెళ్తారు వెళ్ళేటి వాళ్ళు చెప్పేసెయ్ తుది వీడుకోలూ
ఉంటారు రుణమున్న వాళ్ళూ వింటారు నీ గుండె రొదలు
కన్నీళ్ళ సెలయేళ్ళు కాకూడదు కళ్ళు
కలలన్నీ వెలుగొచ్చిన మెలుకువలో చెల్లు

ఏనాడు గెలిచింది వలపూ.. తానోడుటే దాని గెలుపూ
ఏనాడు గెలిచింది వలపూ.. తానోడుటే దాని గెలుపూ
గాయాన్ని మాన్పేది మరుపు.. ప్రాణాల్ని నిలిపేది రేపూ
గాయాన్ని మాన్పేది మరుపు.. ప్రాణాల్ని నిలిపేది రేపు

ప్రతి మాపూ ఒక రేపై తెరవాలి తలుపు
ఏ రేపో ఒక మెరుపై తెస్తుందొక మలుపు
ప్రతి మాపూ ఒక రేపై తెరవాలి తలుపు
ఏ రేపో ఒక మెరుపై తెస్తుందొక మలుపు

తకధిమితక ధిమితకధిమి తకధిమితక ధింధిం
జత జత కొక కధ ఉన్నది చరితైతే ఝం ఝం
ఒక ఇంటికి ముఖ ద్వారం ఒకటుంటే అందం
ఒక మనసుకు ఒక మనసని అనుకుంటే స్వర్గం

3 comments:

నాకు చాల ఇష్టమైన పాటండి...!
i love these lines..
"వెళ్తారు వెళ్ళేటి వాళ్ళు చెప్పేసెయ్ తుది వీడుకోలూ
ఉంటారు రుణమున్న వాళ్ళూ వింటారు నీ గుండె రొదలు
కన్నీళ్ళ సెలయేళ్ళు కాకూడదు కళ్ళు
కలలన్నీ వెలుగొచ్చిన మెలుకువలో చెల్లు"

ఆల్ ద వర్ ల్డ్ ఈస్ ఏ స్టేజ్, యెండ్ ఆల్ ద మెన్ యెండ్ వుమెన్ మేర్లీ ప్లేయెర్స్: దె హావ్ దైర్ ఎగ్జిట్ యెండ్ ఎంట్రన్సెస్; యెండ్ వన్ మాన్ ఇన్ హిస్ టైం ప్లేస్ మెనీ పార్ట్స్, హిస్ యాక్ట్స్ బీయింగ్ 7 ఏజెస్...అన్న విలియం షేక్స్ ఫియర్ కోట్ ని హృద్యమైన మాటల్లో తెలిపిన పాట ఇది అనిపిస్తుంది వేణూజీ..

థాంక్స్ తృష్ణగారు.. సాహిత్యం అంతా బాగుంటుందండీ..

థాంక్స్ శాంతిగారు.. మంచి కోట్ గుర్తుచేశారండీ..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.