మంగళవారం, డిసెంబర్ 10, 2013

ఆ చింత నీకేలరా.. స్వామీ నీ చెంత నేనుండగా..

అతను తేరగా వచ్చే మామగారి ఆస్థితో ఆడంబరాలను అనుభవించాలని ఆలోచనతో పెళ్ళిచేసుకుని తప్పని పరిస్థితులలో దానికి దూరమై తోడల్లుడు ఆ ఆస్థిని హారతికర్పూరం చేసేస్తున్నాడని అలాఅయితే తనవాటా ఏమీ మిగలదని దిగులు పడుతుంటాడు. ఆమె శ్రమైక జీవన సౌందర్యాన్ని నమ్ముకుని తండ్రి తాలూకు లక్షల ఆస్థిని వదులుకుని ప్రేమించి పెళ్ళిచేసుకున్న భర్త స్వశక్తితో సంపాదించిన దానితోనే తృప్తిగా బ్రతుకుదామని ఆలోచన ఉన్న అమ్మాయి భర్తకూడా అలాంటి ఉన్నతమైన ఆలోచనలే ఉన్నవాడని నమ్మిన మనిషి.

అలాంటి ఆమె తన భర్తతో ఆల్పమైన ఆడంబరాలకన్నా మేలైన సుఖసంతోషాలు మనసొంతమని చెప్తూ ఆస్థిపై దిగులు వీడమని బుజ్జగిస్తూ సాగే సంధర్బంలో వచ్చేపాట. పోతన గారి “మందార మకరంద” పద్యాన్ని అందంగా ఉపయోగించుకుని చక్కని సాహిత్యంతో వేటూరి, విశ్వనాథ్, కె.వి.మహదేవన్ లు కలిసి సృష్టించిన ఈ చక్కని పాట శుభోదయం సినిమా లోనిది. ఆ సినిమాలోని “కంచికి పోతావా కృష్ణమ్మా”, “గంధము పూయరుగా” పాటల మరుగున కాస్త తక్కువ పేరు తెచ్చుకున్నా ఈ పాట సాహిత్యం, చిత్రీకరణ, సంగీతం అన్నీ వేటికవే అన్నట్లు ఉంటాయి.

నాకు చాలా చాలా ఇష్టమైన పాట, చూడడం మరీ మరీ ఇష్టం. మొదటి చరణంలో సరసాలు సగ పాలు, నీ తోడు, పెరుగుమీగడ అంటూ వేటూరి వారు అలరిస్తే రెండో చరణంలో వెన్నెలమ్మ వన్నెలమ్మ ఏవంకలేని నెలవంక లాంటిమాటలతో గారడి చేస్తారు. ఈ అందమైన పాట చూడాలంటే ఎంబెడ్ చేసిన పూర్తి సినిమా వీడియోలో ఒకగంటా పదహారు నిముషాల వద్దకు ఫార్వార్డ్ చేసి కానీ లేదా ఈ లింక్ పై క్లిక్ చేసి కానీ చూడవచ్చు. ఆడియో మాత్రమే వినాలని అనుకున్నవారు ఇక్కడ వినవచ్చు.


చిత్రం : శుభోదయం
సాహిత్యం : వేటూరి
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : సుశీల

మందార మకరంద మాధుర్యమునదేలు
మధుపంబు పోవునే మదనములకు
నిర్మల మందాకినీ వీచికల తూగు
రాయంచ చనునే తరంగిణులకూ...

ప్చ్.. అదిగాదు వాడక్కడ చేరి మొత్తం..

ఆ .. ఆ చింత నీకేలరా
ఆ చింత నీకేలరా
ఆ చింత నీకేలరా
స్వామీ నీ చెంత నేనుండగా
ఆ చింత నీకేలరా

సొంతమైన ఈ సొగసులేలక ..
పంతమేల పూబంతి వేడగ
సొంతమైన ఈ సొగసులేలక ..
పంతమేల పూబంతి వేడగ
ఆ చింత నీకేలరాఆఆ...

సరసాల మనుగడ సగపాలు చేసీ
వరసైన నా ఈడు నీ తోడు పెట్టీ
సరసాల మనుగడ సగపాలు చేసీ
వరసైన నా ఈడు నీ తోడు పెట్టీ
అరుదైన మురిపాల పెరుగు మీగడలన్ని
కరిగించి కౌగిళ్ళ తినిపించగా

ఆ .. ఆ చింత నీకేలరా
నీ చెంత నేనుండగా
ఆ చింత నీకేలరా

ఆవంక ఆ వెన్నెలమ్మ..
ఈ వంక ఈ వన్నెలమ్మా
ఆవంక ఆ వెన్నెలమ్మా..
ఈ వంక ఈ వన్నెలమ్మా
ఏ వంక లేని నెలవంక నేనమ్మ..
నీకింక అలకెందుకమ్మా !

చ్చ్.. చ్చ్.. చ్చ్.... అయ్యో !
లలిత రసాల పల్లవకారియైచొక్కు
కోయిల చేరునే కుటజములకు
పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరమరుగునే
సాంద్ర నిహారములకు..
వినుత గుణశీల మాటలు వేయునేలాఆఆ...

..ఆ చింత నీకేలరా
స్వామీ నీ చెంత నేనుండగా
ఆ చింత నీకేలరా

8 comments:

మీరన్నట్టే బాగుంది :)
థాంక్స్ వేణుజీ.

ఇది బాగుందండి.. కంచికి పోతావా,గంధము పుయ్య్రరు గా ఎక్కువగా విన్నవి... రాధిక(నాని)

నాగార్జున, శాంతిగారు, రాధికగారు ధన్యవాదాలండీ.

ఈ సినిమా లో పాటలన్నీ బాగుంటాయి వేణూ జీ ..మందార మకరంద అంటూ మొదలవుతుంటే చాలా బాగుంటుంది ..

అవును వంశీ .. థాంక్స్ ఫర్ ద కామెంట్.

nenu movie chudaledu kani e song padedanni :) ippatiki na mp3 lo e song vundi

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.