శుక్రవారం, అక్టోబర్ 23, 2015

కంచె - All Lyrics

వైవిధ్యమైన చిత్రాలు తీసే క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కొత్త సినిమా "కంచె" కోసం సిరివెన్నెల గారు అన్ని పాటలూ రాశారు. ఆల్బమ్ లోని ఐదు పాటలూ వేటికవే అన్నట్లు అద్భుతమైన సంగీత సాహిత్యాల మేళవింపుతో అలరించాయి. సంగీత దర్శకుడు చిరంతన్ భట్ పరభాషా గాయకులతో పాడించినందున ఉచ్చారణ విషయంలో మరికాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేదనిపించినా పాటలు మాత్రం మళ్ళీ మళ్ళీ వినాలనిపించాయి. ఈ పాటలు ఆడియో మాత్రమే వినాలంటే రాగాలో ఇక్కడ వినవచ్చు. ఈ సినిమాలోని రెండు యుద్దం పాటల గురించి ఫణీంద్ర గారి విశ్లేషణ ఇక్కడ చదవవచ్చు. సిరివెన్నెల గారి విశ్లేషణ వారి మాటల్లోనే ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కంచె (2015)
సంగీతం : చిరంతన్ భట్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : అభయ్ జోద్ పూర్కర్, శ్రేయఘోషల్

ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివొ..ఏమో
అటు అటు అటు అని నడకలు ఎక్కడికో..ఏమో

ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివొ..ఏమో
అటు అటు అటు అని నడకలు ఎక్కడికో..ఏమో

సడే లేని అలజడి ఏదో ఎలా మదికి వినిపించిందో
స్వరం లేని ఏ రాగంతో చెలిమికెలా స్వాగతమందో

ఇలాంటివేం తెలియకముందే
మనం అనే కథానిక మొదలైందో
మనం అనే కథానిక మొదలైందో

ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివొ..ఏమో
అటు అటు అటు అని నడకలు ఎక్కడికో..ఏమో

ఒక్కొక్క రోజుని ఒక్కొక్క ఘడియగ కుదించ వీలవక
చిరాకు పడి ఎటు పరారైందోయ్ సమయం కనపడక
ప్రపంచమంతా పరాభవంతో తలొంచివెళ్ళిపోదా
తనోటి ఉందని మనం ఏలాగ గమనించం గనక
కలగంటున్న మెలకువలో ఉన్నాం కదా
మనదరికెవ్వరు వస్తారు కదిలించగా
ఉషస్సెలా ఉదయిస్తోందో నిశీధెలా ఎటుపోతుందో
నిదుర ఎప్పుడు నిదురోతుందో
మొదలు ఎలా మొదలవుతుందో

ఇలాంటివేం తెలియకముందే
మనం అనే కథానిక మొదలైందో
మనం అనే కథానిక మొదలైందో

ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివొ..ఏమో
అటు అటు అటు అని నడకలు ఎక్కడికో..ఏమో

పెదాల మీదుగా అదేమీ గల గల పదాల మాదిరిగా
సుధల్ని చిలికిన సుమాల చినుకుల అనేంత మాధురిగా
ఇలాంటివేళకు ఇలాంటి ఊసులు ప్రపంచభాష కదా
ఫలాన అర్ధం అనేది తెలిపే నిఘంటవుండదుగా
కాబోతున్న కళ్యాణ మంత్రాలుగా
వినబోతున్న సన్నాయి మేళాలుగా..  
ఓ సడే లేని అలజడి ఏదో ఎలా మదికి వినిపించిందో
స్వరం లేని ఏ రాగంతో చెలిమికెలా స్వాగతమందో

ఇలాంటివేం తెలియకముందే
మనం అనే కథానిక మొదలైందో
మనం అనే కథానిక మొదలైందో

ఇటు ఇటు ఇటు అని చిటికెలు ఎవ్వరివొ..ఏమో
అటు అటు అటు అని నడకలు ఎక్కడికో..ఏమో


~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~


చిత్రం : కంచె (2015)
సంగీతం : చిరంతన్ భట్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : శంకర్ మహదేవన్, బృందం

ఊరు ఏరయ్యిందీ ఏరు హోరెత్తింది
ఎత్తి కోట పేట ఏకం చేస్తూ చిందాడింది
ఊరు
ఏరయ్యిందీ ఏరు హోరెత్తింది
ఎత్తి కోట పేట ఏకం చేస్తూ చిందాడింది
భేరీలు బూరాలు తప్పెట్లు తాళాలు
హోరెత్తే కోలాహాలంలో..ఓఓ..

 
ఏడేడు లోకాలు ఏలేటి మారేడా
ఊరేగి రావయ్యా మా వాడకీవేళా
పెద్దోళ్ళు పేదోళ్ళు అయినోళ్ళే అవ్వాలా
కానోళ్ళనే మాట లేకుండా పోవాల

తోబుట్టువింటికి సారేట్టుకెళ్ళి
సాకేట్టుకోచ్చావ మా గడపకీ
మాలచ్చి మగడ ఏమిచ్చి పంపాల
మీరిచ్చిందేగా మాకున్నదీ


కదిలేటి రథచక్రమేమన్నదంట
కొడవళ్ళు నాగళ్ళు చేసే పనంతా భూదేవి పూజే కదా
ఏ వేదమైన ఏ వరి సేదమయిన ఆ స్వామి సేవే కదా
కడుపార ఈ మన్ను కన్నోళ్ళె అంతా కులమొచ్చి కాదంటదా
ప్రతి ఇంటి పెళ్ళంటిదీ వేడుకా జనమంతా చుట్టాలే కదా

 
ఏడేడు లోకాలు ఏలేటి మారేడా
ఊరేగి రావయ్యా మా వాడకీవేళా
పెద్దోళ్ళు పేదోళ్ళు అయినోళ్ళే అవ్వాలా
కానోళ్ళనే మాట లేకుండా పోవాల

వజ్రాల వడగళ్ళు సిరిజల్లు కురవాల తారంగవాడే ఈ కేరింతల్లోన
ఈపంచకాపంచకే కంచెలున్నా జరపాల ఈ జాతర
వెయ్యామడలు దాటి సయ్యాటలియ్యాల మా చెలిమి చాటించగా
ప్రతి పల్లె ఈ సంబరం సాక్షిగా మనలాగే ఉండాలనుకోదా

ఏడేడు లోకాలు ఏలేటి మారేడా
ఊరేగి రావయ్యా మా వాడకీవేళా
పెద్దోళ్ళు పేదోళ్ళు అయినోళ్ళే అవ్వాలా
కానోళ్ళనే మాట లేకుండా పోవాల

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~


చిత్రం : కంచె (2015)
సంగీతం : చిరంతన్ భట్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : శ్రేయఘోషల్

నిజమేననీ నమ్మనీ..
ఔనా అనే మనసుని
మనకోసమే ఈ లోకం అని..
నిజమేననీ నమ్మనీ..

కనుపాప లోని ఈ కలల కాంతి
కరిగేది కానే కాదనీ
గతజన్మలన్నీ మరుజన్మలన్నీ
ఈ జన్మగానె మారనీ
నీ చెంతలోనే చూడనీ

నిజమేననీ నమ్మనీ..
ఓ..నిజమేననీ నమ్మనీ..


కాలం అనేదే లేని చోటా..
విలయాల పేరే వినని చోటా..
మనం పెంచుదాం..
ఏకమై ప్రేమగా ప్రేమనీ..

నిజమేననీ నమ్మనీ..ఈఈ..
నిజమేననీ నమ్మనీ..


~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~


చిత్రం : కంచె (2015)
సంగీతం : చిరంతన్ భట్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : విజయ్ ప్రకాష్

భగభగమని ఎగసిన మంటలు ఏ కాంతి కోసమో..
ధగధగమని మెరిసిన కత్తులు ఏ శాంతి కోసమో..


ఏపంటల రక్షణకీ కంచెల ముళ్ళూ
ఏబ్రతుకును పెంచుటకీ నెత్తుటి జల్లు
ఏ స్నేహం కోరవు కయ్యాల కక్షలు
ఏ దాహం తీర్చవు ఈ కార్చిచ్చులు
 
ప్రాణమె పణమై ఆడుతున్న జూదం
ఇవ్వదే ఎపుడూ ఎవరికీ ఎలాంటి గెలుపు
చావులో విజయం వెతుకు ఈ వినోదం
పొందదే ఎపుడూ మేలు కొలుపు మేలుకొలుపు


అంతరాలు అంతమై అంతా ఆనందమై
కలసి మెలసి మనగలిగే కాలం చెల్లిందా
చెలిమి చినుకు కరువై పగల సెగలు కొలువై
ఎల్లలతో పుడమి వొళ్ళు నిలువెల్లా చీలిందా..

నిశి నిషాద కరోన్ముక్త దురిత శరాఘాతం
మృదులాలస స్వప్నాలస హృత్ కపోత పాతం
పృథు వ్యధార్త పృధ్విమాత నిర్ఘోషిత చేతం
నిష్టుర నిశ్వాసంతో నిశ్చేష్టిత గీతం
ఏ విషబీజోద్భూతం ఈ విషాద భూజం

ప్రాణమె పణమై ఆడుతున్న జూదం
ఇవ్వదే ఎపుడూ ఎవరికీ ఎలాంటి గెలుపు
చావులో విజయం వెతుకు ఈ వినోదం
పొందదే ఎపుడూ మేలు కొలుపు మేలుకొలుపు


భగభగమని ఎగసిన మంటలు ఏ కాంతి కోసమో..
ధగధగమని మెరిసిన కత్తులు ఏ శాంతి కోసమో..

 
 
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~


చిత్రం : కంచె (2015)
సంగీతం : చిరంతన్ భట్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : కీర్తి సఘఠియా, బృందం

నీకు తెలియనిదా నేస్తమా
చెంత చేరననే పంతమా
నువ్వు నేనని విడిగా లేమని
ఈ నా శ్వాసని నిను నమ్మించనీ

విద్వేషం పాలించే దేశం ఉంటుందా
విద్వేషం పాలించే దేశం ఉంటుందా
విధ్వంసం నిర్మించే స్వర్గం ఉంటుందా
ఉండుంటే అది మనిషిది అయి ఉంటుందా
అడిగావా భూగోళమా 
నువ్వు చూసావా ఓ కాలమా

రా.. ముందడుగేద్దాం
యుద్ధం అంటే అర్ధం ఇది కాదంటూ
సరిహద్దుల్నే చెరిపే సంకల్పం అవుదాం
..

ప్రేమను మించిందా బ్రహ్మాస్త్రమైనా
ప్రేమను మించిందా బ్రహ్మాస్త్రమైనా
ఆయువు పోస్తుందా ఆయుధమేదైన
రాకాసుల మూకల్లే మార్చద పిడివాదం
రాబందుల రెక్కల సడినే జీవన వేదం

సాధించేదేముంది ఈ వ్యర్థ విరోధం
ఏ సశ్యం పండించదు మరుభూముల సేద్యం
రేపటి శిశువుకు పట్టే ఆశల స్తన్యం
ఈ పూటే ఇంకదు అందాం
నేటి ధైన్యానికి ధైర్యం ఇద్దాం

రా.. ముందడుగేద్దాం
యుద్ధం అంటే అర్ధం ఇది కాదంటూ
సరిహద్దుల్నే చెరిపే సంకల్పం అవుదాం..


అందరికీ సొంతం అందాల లోకం
కొందరికే ఉందా పొందే అధికారం
మట్టితోటి చుట్టరికం మరిపించే వైరం
గుర్తిస్తుందా మనిషికి మనిషితోటి బంధం

ఏ కళ్యాణం కోసం ఇంతటి కల్లోల్లం
నీకు తెలియనిదా నేస్తమా
ఎవ్వరి క్షేమం కోసం ఈ మారణ హోమం
చెంత చేరననే పంతమా

ఖండాలుగా విడదీసే జండాలన్నీ
తలవంచే తలపే అవుదాం
ఆ తలపే మన గెలుపని అందాం.
 

8 comments:

ఆ చిటుక ల పాట fm లో విని బాగా నచ్చి సెర్చ్ చేస్తే ఈ సినిమా లోదని తెలిసింది :)
మనం అనే కథానిక మొదలైందో
మనం అనే కథానిక మొదలైందో..
ఇక్కడ మాత్రం వింటుంటే భలే వుంది ..
రాధిక (నాని)

ఎంత చక్కటి పాట!
చిన్న చిన్న మాటలు పెద్ద పెద్ద భావాలు!
కొంచెం ఫాస్ట్ బీట్, కొంచెం మెలోడీ?
అన్నీ కలిసిన హరివిల్లు!!!
హిట్టవకపోతే తెలుగువాళ్ళకి టేస్టు లేనట్టే.

క్రిష్ అంటే చాలా ఇష్టమే ఐనా..దేశాల మధ్య వైరుధ్యాన్ని జాతుల మధ్య విరోధ భావాన్నీ చూపించటానికి చెసిన ప్రయత్నం చాలా కన్ ఫ్యూజింగ్ గా ఉంది..పాటలు చాలా బావున్నాయి..

థాంక్స్ రాధిక గారు.
థాంక్స్ హరిబాబు గారు, ఆడియో అండ్ మూవీ ఆల్రెడీ మంచ్ టాక్ సొంతం చేస్కున్నాయండీ.
మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు థాంక్స్ శాంతి గారు.

అన్నట్టు వేణూజీ.."నిజమేననీ నమ్మనీ" సాంగ్ జానె జానా(జాన్ బాజ్) పాటని బాగా గురుతు చెసిందండీ..

ధన్యవాదాలు గురువు గారు...... ఇంతమంచి పాటలను..... స్క్రిప్ట్ రూపంలో అందించినందుకు...

థాంక్స్ శాంతి గారు.. ఆ పాట వినలేదు నేను వింటాను..

థాంక్స్ అజారుద్దిన్ గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.