శనివారం, డిసెంబర్ 13, 2014

అందాల హృదయమా...

అనురాగ దేవత చిత్రంలోని ఒక చక్కని పాట ఈరోజు మీకోసం... బాలు గారు హీరోకి తగినట్లుగా స్వల్పంగా స్వరాన్ని మార్చే పాడే విధానం అప్పట్లో చాలా ఆకట్టుకునేది ముఖ్యంగా సినిమా చూస్తున్నపుడే కాక పాట విన్నపుడు కూడా గాయకుడు కాకుండా నటుడు మాత్రమే గుర్తొచ్చేవాడు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడ్ చేసిన వీడియో మొదటి చరణం మాత్రమే రెండవ చరణం ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అనురాగదేవత (1982)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు

ఆ..ఆ..ఆఅ..అ ఆ..అ ఆ..అ ఆ అ ఆ ఆ
అందాల హృదయమా.. అనురాగ నిలయమా
అందాల హృదయమా.. అనురాగ నిలయమా
నీ గుండెలోని తొలిపాట
వినిపించు నాకు ప్రతిపూట
వెంటాడు నన్ను ప్రతిచోట..

అందాల హృదయమా.. అనురాగ నిలయమా
అందాల హృదయమా.. అనురాగ నిలయమా

 
ఏ పాటకైనా ఆ ఆ... కావాలి రాగము..ఊ..ఊ
ఏ జంటకైనా ఆ ఆ...కలవాలి యోగము..
జీవితమెంతో తీయనైనదనీ..
మనసున మమతే మాసిపోదనీ
తెలిపే నీతో సహవాసం
వలచే వారికి సందేశం

అందాల హృదయమా.. అనురాగ నిలయమా
అందాల హృదయమా.. అనురాగ నిలయమా


మనసున్న వారికే ఏ..ఏ.. మమతాను బంధాలు
కనులున్న వారికే..ఏ..ఏ.. కనిపించు అందాలు
అందరి సుఖమే నీదనుకుంటే..
నవ్వుతూ కాలం గడిపేస్తుంటే..
ప్రతి ౠతువు ఒక వాసంతం
ప్రతి బ్రతుకు ఒక మధుగీతం

అందాల హృదయమా.. అనురాగ నిలయమా
అందాల హృదయమా.. అనురాగ నిలయమా
నీ గుండెలోని తొలిపాట
వినిపించు నాకు ప్రతిపూట
వెంటాడు నన్ను ప్రతిచోట..



శుక్రవారం, డిసెంబర్ 12, 2014

ఏ రాగమో?.. ఇది ఏ తాళమో?..

ఆత్రేయ గారి చక్కని సాహిత్యం సత్యం గారి కమ్మనైన బాణిలో ఒదిగిపోతే ఇలా ఆహ్లాదకరమైన పాటగా మారుతుంది. ఆలూమగల అనురాగాన్ని ఎంత చక్కని మాటల్లో చెప్పారో మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : అమర దీపం (1977)
సంగీతం : సత్యం
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు, సుశీల

ఏ రాగమో?.. ఇది ఏ తాళమో?..
ఏ రాగమో?.. ఇది ఏ తాళమో?
అనురాగాని కనువైన శృతి కలిపినాము
ఆఁహాఁ.. ఊఁహూఁ.. 
ఆఁహాఁ.. ఉఁహూఁ

ఏ రాగమో?.. ఇది ఏ తాళమో?
ఏ రాగమో?.. ఇది ఏ తాళమో?
మన కళ్యాణ శుభవేళ మోగించు మేళమో
ఏ రాగమో?.. ఇది ఏ తాళమో?..

ఎదలో మెదిలే..  సంగతులన్నీ..
పలికెను సంగీతమై.. పలికెను సంగీతమై..
కలిసిన కన్నుల.. మెరిసేకలలే..
వెలిసెను గమకములై... వెలిసెను గమకములై..
హొయలైన నడకలే లయలైనవి..
చతురాడు నవ్వులే గతులైనవి..
సరిసరి అనగానే..  మరిమరి కొసరాడు
మురిపాలె మన జంట స్వరమైనది..

ఏ రాగమో?.. ఇది ఏ తాళమో?
మన కళ్యాణ శుభవేళ మోగించు మేళమో
ఏ రాగమో?...ఇది ఏ తాళమో?..

విరికన్నె తనకు..  పరువమే కాదు..
పరువూ కలదన్నది... పరువూ కలదన్నది..
భ్రమరము తనకు అనుభవమే కాదు..
అనుబంధముందన్నది... అనుబంధముందన్నది..
కోకిలమ్మ గుండెకు గొంతున్నది..
కొమ్మలో దానికి గూడున్నది..
సరి మగవానికి సగమని తలపోయు
మన జంటకేజంట సరి ఉన్నది..

ఏ రాగమో.. ఇది ఏ తాళమో
అనురాగాని కనువైన శృతి కలిపినాము
ఏ రాగమో.. ఇది ఏ తాళమో..


గురువారం, డిసెంబర్ 11, 2014

నిలువుమా నిలువుమా నీలవేణీ...

అమరశిల్పి జక్కన లోని ఓ మధుర గీతం ఈరోజు మీకోసం. సాలూరి వారి సంగీతం అంటే ఎంత శ్రావ్యమైన గీతమో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా.. నాకు చాలా ఇష్టమైన ఈ పాట మీరూ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : అమరశిల్పి జక్కన (1964)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : సముద్రాల (సీనియర్)
గానం : ఘంటసాల, సుశీల

నిలువుమా నిలువుమా నీలవేణీ
నీ కన్నుల నీలినీడ నా మనసు నిదురపోనీ
నిలువుమా నిలువుమా నీలవేణీ

అడుగడుగున ఆడే లేనడుమూ సొంపులా
అడుగడుగున ఆడే లేనడుమూ సొంపులా
తడబడే అడుగుల నటనల మురిపింపులా
తడబడే అడుగుల నటనల మురిపింపులా

సడిసేయక ఊరించే...
సడిసేయక ఊరించే... ఒయారపు ఒంపులా
కడకన్నుల ఇంపులా గడసరి కవ్వింపులా
నడచిరా నడచిరా నాగవేణీ
నీ కన్నుల నీలినీడ నా మనసూ నిదురపోనీ

అద్దములో నీ చెలువు తిలకించకు ప్రేయశీ..

అలిగేవూ నీ సాటి చెలిగా తలపోసి
అలిగేవూ నీ సాటి చెలిగా తలపోసి
నా ఊర్వశి రావే రావే అని పిలువనా
నా ఊర్వశి రావే రావే అని పిలువనా

ఆ సుందరి నెర నీటూ నీ గోటికి సమమౌనా
నా చెలి నిను మదీ దాచుకోనీ

నీ కన్నుల నీలినీడ నా మనసూ నిదురపోనీ.


బుధవారం, డిసెంబర్ 10, 2014

జాణవులె వరవీణవులె...

బాలకృష్ణ సినిమాలో పాటలు విడుదలయ్యాయట విందాం అని మొదటి సారి విన్నపుడు ఈ పాట బొత్తిగా ఆశ్చర్య పరిచింది. ఒక సారి విన్నాక జిక్కీ గారి గళంలో ఇళయరాజా గారి సంగీతం పదే పదే వెంటాడుతూ హమ్ చేసుకోడానికి అలవాటు పడిపోయాను. నేనిష్టపడే పాటలలో ఒకటైన ఈపాట మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఆదిత్య 369 (1991)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జిక్కి, ఎస్. పి. శైలజ

ఆ... ఆ... ఆ.... ఆ.... ఆ...
నెరజాణవులె.. వరవీణవులె కిలికించితాలలో ఆ హ హ
జాణవులె మృదుపాణివిలె మధుసంతకాలలో...
కన్నులలో... సరసపు వెన్నెలలె..
సన్నలలో ...గుసగుస తెమ్మెరలె
మోవిగని మొగ్గగని.. మోజుపడిన వేళలో..

 
జాణవులె ..వరవీణవులే.. కిలికించితాలలో ఆ హ హ
జాణవులె.. మృదుపాణివిలె ..మధుసంతకాలలో...

 
మోమటుదాచీ మురిపెము పెంచే లాహిరిలో...
ఆ హ హ ఓ హొ హొ హో
మూగవుగానే మురళిని వూదే వైఖరిలో..
చెలి వొంపులలో హంపికళ ఊగే ఉయ్యాల
చెలి పై యెదలో తుంగ అలా పొంగే ..ఈ వేళ
మరియాదకు విరిపానుపు సవరించవేమిరా..

 
జాణవులె ..వరవీణవులే.. కిలికించితాలలో ఆ హ హ
జాణవులె.. మృదుపాణివిలె ..మధుసంతకాలలో...
కన్నులలొ సరసపు వెన్నెలలె..
సన్నలలొ గుసగుస తెమ్మెరలె...
మోవిగని మొగ్గగని ..మోజుపడిన వేళలో...
జాణవులె ..వరవీణవులే.. కిలికించితాలలో ఆ హ హ 
నెరజాణవులె.. మృదుపాణివిలె ..మధుసంతకాలలో.. 

చీకటి కోపం చెలిమికి లాభం కౌగిలిలో...
ఆ హ హ ఓ హొ హొ హో
వెన్నెల తాపం ...వయసుకు ప్రాణం ఈ చలిలో...
చెలి నా రతిలా ..హారతిలా నవ్వాలీవేళ..
తొలి సోయగమే.. ఓ సగము.. ఇవ్వాలీవేళ...
పరువానికి.. పగవానికి.. ఒక న్యాయమింక సాగునా...

జాణవులె.. వరవీణవులే.. కిలికించితాలలో ఆ హ హ 
జాణవులె.. మృదుపాణివిలె.. మధుసంతకాలలో...
కన్నులలో సరసపు వెన్నెలలె.. 
సన్నలలో గుసగుస తెమ్మెరలె...
మోవిగని మొగ్గగని ..మోజుపడిన వేళలో...
జాణవులె ..వరవీణవులే.. కిలికించితాలలో ఆ హ హ
జాణవులె.. మృదుపాణివిలె.. మధుసంతకాలలో...


మంగళవారం, డిసెంబర్ 09, 2014

భలే ఛాన్స్ లే...

భలే ఛాన్స్ అంటూనే ఇల్లరికంలో పడే పాట్లను సరదాగా చెప్పే ఈ హాస్య గీతం తెలియని తెలుగు వారు ఉండరేమో. ఇటువంటి పాటలకు పెట్టింది పేరైన సత్యంగారు పాడగా రేలంగి గారి అభినయం మాంచి ఎంటర్టైన్మెంట్ ని ఇస్తుంది. నాకు చాలా ఇష్టమైన ఈపాట మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఇల్లరికం (1959)
సంగీతం : టి. చలపతిరావు
సాహిత్యం : కొసరాజు
గానం : మాధవపెద్ది సత్యం

ఛాన్స్ భలే ఛాన్స్..

భలే ఛాన్స్ లే
భలే ఛాన్స్ లే భ లే ఛాన్స్ లే
లలలాం లలలాం లక్కీ చాన్స్ లే
భలే చాన్స్ లే
ఇల్లరికంలో వున్నమాజా... 
ఇల్లరికంలో వున్న మజా
అది అనుభవించితే తెలియునులే
భలే ఛాన్స్ లే

 
అత్తమామలకు ఒక్క కూతురౌ...అదృష్ట యొగం పడితే
అత్తమామలకు ఒక్క కూతురౌ...అదృష్ట యొగం పడితే
బావమరుదులే లేకుంటే...ఇంటల్లుడిదేలే అధికారం
భలే చన్స్ లే
గంజిపోసినా అమృతంలాగా...కమ్మగవుందనుకొంటే
బహు కమ్మగవుందంకొంటే
ఛీ...ఛా...ఛీ... ఛా యన్నా
చిరాకు పడక దులపరించుకొని...పొయ్యేవాడికి
భలే ఛాన్స్ లే

ఇల్లరికంలో వున్నమజా...
ఇల్లరికంలో వున్నమజా...
అది అనుభవించితే తెలియునులే
భలే ఛాన్స్ లే...

జుట్టుపట్టుకొని బైటికీడ్చినా..చూరుపట్టుకొని వేలాడీ..ఈ...ఈ...
జుట్టుపట్టుకొని భైటి కీడ్చినా...చూరుపట్టుకొని వేలాడీ
దుషణ భూషణ తిరస్కారములు...ఆశీసులుగా తలచేవాడికి
భలే ఛాన్స్ లే...అహా..అహా..

భలే ఛాన్స్ లే...
భలే ఛాన్స్ లే భలే ఛాన్స్ లే
లలలాం లలలాం లక్కీ ఛాన్స్ లే
భలే ఛాన్స్ లే

ఇల్లరికంలో వున్నమజా...
ఇల్లరికంలో వున్నమజా ..
అది అనుభవించితే తెలియునులే
భలే ఛాన్స్ లే....

అణిగీ మణిగీ వున్నామంటే...అంతా మనకే చిక్కేది
అణిగీ మణిగీ వున్నామంటే...అంతా మనకే చిక్కేది
మామ లోభి అయి కూడబెట్టితే...మనకే కాదా దక్కేది
అది మనకే కాదా దక్కేది...
ఇహ మనకే కాదా దక్కేది...
అది మనకే ...ఇహ మనకే అది మనకే
మనకే మనకే మనకే...
మ మ మ మనకే...



సోమవారం, డిసెంబర్ 08, 2014

కావాలంటే ఇస్తాలే...

నన్ను ఏ.ఎమ్.రాజా గారికి అభిమానిగా మార్చేసిన పాట ఇది. సాలూరి వారి స్వర సారధ్యంలో తను పాడిన విధానం దానికి అన్నగారి అభినయం వహ్వా ఎన్ని విధాలుగా వర్ణించి చెప్పినా తక్కువే అసలు వర్ణించడానికి మాటలు చాలవు అంతే. నాకు చాలా ఇష్టమైన ఈ పాటను మీరూ ఆస్వాదించండి. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : మిస్సమ్మ (1955)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : పింగళి
గానం : ఏ. ఎం. రాజా

ఆ...  ఆ... ఆ... ఆ..
ఈ నవనవాభ్యుదయ విశాల సృష్టిలో...
ఓ... ఓ.. ఓ... ఓ..
ఈ నవనవాభ్యుదయ విశాల సృష్టిలో
చిత్రములన్నీ నావేలే
కావాలంటే ఇస్తాలే.. నావన్నీ ఇక నీవేలే
కావాలంటే ఇస్తాలే.. నావన్నీ ఇక నీవేలే

ఆ.. ఆ.. ఆ.. ఆ..
తళుకు తళుకుమని తారలు మెరిసే
నీలాకాశము.. నాదేలే
ఎల్లరి మనముల కలవర పరిచే
జిలిబిలి జాబిలి.. నాదేలే

కావాలంటే ఇస్తాలే.. నావన్నీ ఇక నీవేలే
కావాలంటే ఇస్తాలే.. నావన్నీ ఇక నీవేలే

 

ఆ.. ఆ.. ఆ.. ఆ...
ప్రశాంత జగమును హుషారు చేసే
వసంత ఋతువు.. నాదేలే
పూవుల ఘుమ ఘుమ చల్లగ విసిరే
మలయమారుతము.. నాదేలే

కావాలంటే ఇస్తాలే... నావన్నీ ఇక నీవేలే
కావాలంటే ఇస్తాలే... నావన్నీ ఇక నీవేలే



ఆదివారం, డిసెంబర్ 07, 2014

నా మనసే ఒక తెల్లని కాగితం...

అర్ధాంగి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈరోజు తలచుకుందాం. సుశీల గారి మధురగళం ఈ పాటకు మరింత అందాన్నిచ్చింది. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : అర్ధాంగి (1977)
సంగీతం : టి. చలపతిరావు
సాహిత్యం : సినారె
గానం : సుశీల

నా మనసే ఒక తెల్లని కాగితం
నీ వలపే తొలి వెన్నెల సంతకం
నా మనసే ఒక తెల్లని కాగితం
నీ వలపే తొలి వెన్నెల సంతకం
అది ఈనాడైనా ఏనాడైనా.. నీకే నీకే అంకితం..

నా మనసే ఒక తెల్లని కాగితం
నీ వలపే తొలి వెన్నెల సంతకం

తెరచిన నా కన్నులలో ఎపుడు నీ రూపమే
మూసిన నా కన్నులలో ఎపుడు నీ కలల దీపమే
తెరచిన నా కన్నులలో ఎపుడు నీ రూపమే
మూసిన నా కన్నులలో ఎపుడు నీ కలల దీపమే
కనులే కలలై.. కలలే కనులై
కనులే కలలై.. కలలే కనులై
చూసిన అందాలు అనుబంధాలు.. 
అవి నీకే నీకే అంకితం

నా మనసే ఒక తెల్లని కాగితం
నీ వలపే తొలి వెన్నెల సంతకం

నిండిన నా గుండెలలో ఎపుడూ నీ ధ్యానమే
పండిన ఆ ధ్యానంలో ఎపుడూ నీ ప్రణయ గానమే
నిండిన నా గుండెలలో ఎపుడూ నీ ధ్యానమే
పండిన ఆ ధ్యానంలో ఎపుడూ నీ ప్రణయ గానమే
ధ్యానమే గానమై.. గానమే ప్రాణమై
ధ్యానమే గానమై.. గానమే ప్రాణమై
పలికిన రాగాలు అనురాగాలు.. 
అవి నీకే నీకే అంకితం

నా మనసే ఒక తెల్లని కాగితం
నీ వలపే తొలి వెన్నెల సంతకం


శనివారం, డిసెంబర్ 06, 2014

ప్రియతమా తమా సంగీతం...

వంశీ అండ్ ఇళయరాజా కాంబినేషన్లో బెస్ట్ ఆల్బమ్ అనదగినది ఆలాపన. అందులోని ఓ చక్కని పాట ఈరోజు గుర్తు చేసుకుందామా... మంచి హుషారైన ట్యూన్ కి తగ్గట్టు జానకి గారు పాడిన విధానం ఈ పాటను వేరే రేంజ్ కి తీస్కెళ్ళిపోయింది. ఈ పాట వీడియో దొరకలేదు... ఎంబెడ్ చేసినది యూట్యూబ్ జ్యూక్ బాక్స్ అది పనిచేయకుంటే ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఆలాపన (1986)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : జానకి

తతతతరతరత్త తతరరతరతరత్త
ప్రియతమా తమా సంగీతం
విరిసె సుమములై వసంతం
అడుగుల సడే మయూరం
అడుగుకో వయ్యారం
పలికిన పదం సరాగం
జరిగెలే పరాగం
 
ప్రియతమా తమా సంగీతం
విరిసె సుమములై వసంతం
తరతరతరతరత్త తతరరతరతరత్త

రేగే రాగాలన్ని నాలో ఉయ్యాలూగెలే.. హాయ్..
మళ్ళి మళ్ళి నన్ను మత్తెక్కిస్తున్నాయిలే.. హాయ్..
హోయ్.. రేగే రాగాలన్ని నాలో ఉయ్యాలూగెలే.. హాయ్..
మళ్ళి మళ్ళి నన్ను మత్తెక్కిస్తున్నాయిలే.. హాయ్..
నాలోన లీలగా నాద స్వరాలుగా..
పూసింది లాలస పున్నాగలా
రేయంత ఎండాయె నా గుండెలో..
రేరాణి వెన్నెల్లలో..
ఈ మోహమెందాక పోతున్నదో
ఈ దేహమింకేమి కానున్నదో
వలపులే పిలువగా...

ప్రియతమా తమా సంగీతం
విరిసె సుమములై వసంతం
తరతరత్తర తరరరర తరతరత్తర...

పూలే తేనైపోయి నాలో వాగై పొంగెలే.. హోయ్..
నిన్నే నిన్నే కోరి నాట్యాలనే చేసెనే.. హోయ్..
హో..  పూలే తేనైపోయి నాలో వాగై పొంగెలే.. హోయ్..
ఏయ్..నిన్నే నిన్నే కోరి నాట్యాలనే చేసెనే.. హా..
నా పాన్పు పంచుకో..  ఈ బాధ తీర్చిపో
శివ రాతిరవ్వనీ ఈ రాతిరీ
తేనెల్లు పొంగాలి చీకట్లలో..
కమ్మన్ని కౌగిళ్ళలో..
నీ తోడు కావాలి ఈ జన్మకి
నే నీడనవుతాను నీ దివ్వెకి
పెదవులో..  మధువులా...

ప్రియతమా తమా సంగీతం
విరిసె సుమములై వసంతం
తరతరత్తర తతతతర తరరరర తరతరత్తర...

అడుగుల సడే మయూరం
అడుగుకో వయ్యారం
పలికిన పదం సరాగం
జరిగెలే పరాగం
ప్రియతమా తమా సంగీతం
విరిసె సుమములై వసంతం
తరతరత్తర తతతతర తరరరర తరతరత్తర

శుక్రవారం, డిసెంబర్ 05, 2014

కోరికలే గుర్రాలైతే.. ఊహలకే రెక్కలు వస్తే...

నాకు రేడియో వినిపించిన పాటలలో మరొక పాట ఇది. ఇంట్లో ఏ పని చేస్తున్నా పెద్దగా డిస్ట్రబ్ చేయకుండా నేపధ్యంలో ఇటువంటి సత్యం గారి పాటలన్నీ చాలా స్మూత్ గా అలా సాగిపోతూండేవి. ఇప్పటికీ ఒక్కోరోజు ఈ పాట వింటూంటే అప్పటి జ్ఞాపకాలేవో అలా తెమ్మెరలా స్పృశించి వెళ్ళిపోతుంటాయి. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : కోరికలే గుర్రాలైతే (1979)
సంగీతం : సత్యం
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : సుశీల

ఓ..హో.. ఆహాహహా.. ఆహహా.. ఓహొహో..

కోరికలే గుర్రాలయితే.. ఊహలకే రెక్కలు వస్తే
అదుపే లేని మనసునకు.. అందని స్వర్గం ఏముంది
అదుపే లేని మనసునకు.. అందని స్వర్గం ఏముంది

కోరికలే గుర్రాలయితే.. ఊహలకే రెక్కలు వస్తే
అదుపే లేని మనసునకు.. అందని స్వర్గం ఏముంది
అదుపే లేని మనసునకు.. అందని స్వర్గం ఏముంది

 

తన ఇంట సిరితోట పూచేనని.. తన దారి విరిబాట అయ్యేనని
దినదినము తియ్యని పాటేనని.. తా గన్న కలలన్ని పండేనని
సరదాలన్నీ చవి చూడాలని.. సంబరపడుతుంది
సరదాలన్నీ చవి చూడాలని.. సంబరపడుతుంది
సంపదలన్నీ తనకే కలవని.. పండుగ చేస్తుంది
ఓ..ఓ..ఓ..ఓ..

కోరికలే గుర్రాలయితే.. ఊహలకే రెక్కలు వస్తే
అదుపే లేని మనసునకు.. అందని స్వర్గం ఏముంది
అదుపే లేని మనసునకు.. అందని స్వర్గం ఏముంది

 
జాబిల్లి తనకున్న విడిదిల్లని.. వెన్నెల్లు పన్నీటి జలకాలని
హరివిల్లు రతనాల జడబిళ్ళని.. తారకలు మెడలోని హారాలని
ఆకాశాన్ని దాటేయాలని.. నిచ్చెన వేస్తుంది
ఆకాశాన్ని దాటేయాలని.. నిచ్చెన వేస్తుంది
ఈ లోకాలన్ని గెలిచేయాలని.. ముచ్చట పడుతుంది..
ఓ..ఓ..ఓ..ఓ..

కోరికలే గుర్రాలయితే.. ఊహలకే రెక్కలు వస్తే
అదుపే లేని మనసునకు.. అందని స్వర్గం ఏముంది
అదుపే లేని మనసునకు.. అందని స్వర్గం ఏముంది

కోరికలే గుర్రాలయితే.. ఊహలకే రెక్కలు వస్తే..


గురువారం, డిసెంబర్ 04, 2014

సిపాయీ.. సిపాయీ..

నాకు రేడియో పరిచయం చేసిన పాటలలో ఇదీ ఒకటి. నా పేరు ఉందన్న కారణంతో "నా మది నిన్ను పిలిచింది" పాటన్నా, రఫీ గారి స్వరం అన్నా అప్పటికే బోలెడు ఇష్టం ఉండడంతో ఈ పాట తెగ వినేవాడ్ని. ఇప్పుడు వింటూన్నా కూడా చిన్నప్పుడు వింటూ పొందిన ఆ ఆనందం గుర్తొస్తూ ఉంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : అక్బర్ సలీం అనార్కలి (1978)
సంగీతం : సి.రామచంద్ర 
సాహిత్యం : సినారే
గానం : మహమ్మద్ రఫీ, పి.సుశీల

సిపాయీ.. సిపాయీ..
సిపాయీ.. సిపాయీ..
నీకై ఎంత ఎంత వేచి వేచి ఉన్నానో...
ఈ వాలుకనులనడుగు అడుగు చెపుతాయీ..
సిపాయీ.. ఓ..సిపాయీ..

హసీనా.. హసీనా..
నీకై ఎంత ఎంత వేగి వేగి పోయానో
ఈ పూలమనసునడుగు అడుగు ఇకనైనా..
హసీనా.. ఓ.. హసీనా..

జడలోని మల్లెలు జారితే... నీ ఒడిలో ఉన్నాననుకున్నా..
చిరుగాలిలో కురులూగితే.. చిరుగాలిలో కురులూగితే..
నీ చేయి సోకెనని అనుకున్నా..
 
ఆ.. మల్లెలలో కదలాడినవి నా కలవరింపులే..
ఆ గాలిలో.. చెలరేగినవి.. ఆ గాలిలో చెలరేగినవి..
నా నిట్టూరుపులే...
హసీనా.. ఓ.. హసీనా..
నీకై ఎంత ఎంత వేచి వేచి ఉన్నానో...
ఈ వాలుకనులనడుగు అడుగు చెపుతాయీ..
సిపాయీ.. ఓ..సిపాయీ..

తడి ఇసుకను గీసిన గీతలు.. అల తాకితే మాసి పోతాయి..
ఎదలోన వ్రాసిన లేఖలు.. ఎదలోన వ్రాసిన లేఖలు..
బ్రతుకంతా వుండి పోతాయి..
ఆ.. లేఖలలో ఉదయించినవి నా భాగ్యరేఖలే..
మన ఊపిరిలో పులకించినవి.. మన ఊపిరిలో పులకించినవి..
వలపు వాకలే.. సిపాయీ...
సిపాయీ.. ఓ..సిపాయీ..

నీకై ఎంత ఎంత వేగి వేగి పోయానో
ఈ పూలమనసునడుగు అడుగు ఇకనైనా..
హసీనా.. ఓ.. హసీనా..
సిపాయీ.. ఓ..సిపాయీ..
హసీనా.. ఓ.. హసీనా..



నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.