బుధవారం, జనవరి 08, 2020

తిరుప్పావై 24 అన్ఱు ఇవ్వులగ...

ధనుర్మాసం లోని ఇరవై నాలుగవ రోజు పాశురము "అన్ఱు ఇవ్వులగ". ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : గోదా గీత మాలిక
సంగీతం : రాధా గోపి
సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్
గానం : వాణీజయరాం 

 
అపుడు మాబలి మువ్వడియంచు
మిన్ను మన్ను గొన్న
పాదములకు మంగళంబు

లంకకు నడచి రావణు
లయము జేయు మహిత
బలశాలి ఔ నీకు మంగళంబు


కపట శకటుని
పరిమార్ప కాలదన్ని
మాతను అలరించు
నీకు మంగళంబు

వత్స రాక్షసు
గిరవాటు వైచినట్టి
మాదు స్వామి
పాదములకు మంగళంబు


హరి అలిగి రాళ్ళు కురియ
ఆలమంద మలుప
కొండనెత్తిన నీకు మంగళంబు

సాధు రక్షణకు అంచును
సర్వకాలమందును దాల్చు
నీ వేలకు మంగళంబు


విన్నవింపగా నీకిది విశ్వరూపా
విన్నవింపగా నీకిది విశ్వరూపా
వచ్చినారము ప్రీతితొ వనజ నయనా
వచ్చినారము ప్రీతితొ వనజ నయనా
    
    
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
 
ఈ ముప్పై రోజుల తమిళ పాశురములను తెలుగు స్క్రిప్ట్ లో అందమైన బాపు గారి బొమ్మలతో కూర్చి చక్కని వ్యాఖ్యానం చేర్చి తెలుగు వన్ వారు అందిస్తున్నారు. వాటిలో నేటి ఇరవై నాలుగవ పాశురం వీడియోను ఇక్కడ చూడవచ్చు. 
 

 
అన్ఱు ఇవ్వులగ మళన్దాయ్! అడి పోత్తి,
శెన్ఱంగు తెన్ఱిలంగై శెత్తాయ్! తిఱల్ పోత్తి,
పొన్ఱ చ్చగడ ముత్తెత్తాయ్ ! పుకழ் పోత్తి,
కన్ఱు కుణిలా వెఱిందాయ్ ! కழల్ పోత్తి,
కున్ఱు, కుడైయా వెడుత్తాయ్ ! గుణమ్ పోత్తి,
వెన్ఱు పగై కెడుక్కుమ్ నిన్ కైయిల్ వేల్ పోత్తి,
ఏన్ఱెన్ఱున్ శేవగమే యేత్తి ప్పఱై కొళ్వాన్,
ఇన్ఱు యామ్ వన్దోం ఇఱంగేలో రెమ్బావాయ్.

  
సూచన : తమిళ అక్షరం ’ழ’/'zha' ను తెలుగులోని ’ఱ’ ’ళ’ అక్షరాలను కలిపి పలికినట్లుగా పలుకవలెను. ఉదా : ழ = ళ, ழி = ళి, ழை = ళై, ழ் = ళ్, ழும்=ళుం

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ పాశురములను శ్రీ ఆచ్చి వేణుగోపాలచార్య గారు పాటలుగా మార్చి వ్రాయగా వి.డి.శ్రీకాంత్ సంగీతంలో నిత్యసంతోషిణి, గాయత్రి గానం చేశారు. నేటి ఇరవై నాలుగవ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : తిరుప్పావై గీతగోపాలం
సంగీతం : వి.డి.శ్రీకాంత్
సాహిత్యం : ఆచ్చి వేణుగోపాలాచార్య
గానం : నిత్య సంతోషిణి, గాయత్రి


అలనాడు బలియింట అందుకొనగ భువిని
కొలతగా వాడిన పదములకు మంగళం
పడతిని చెరబట్ట పసిడి లంకను మసిగ
మార్చిన నీ బాహు శక్తికిదే మంగళం


శకటాసురుని గని చాచి చంపిన నీదు 

అకళంక ప్రతిభకు జయమంగళమ్
వత్సాసురు పైన వడిశెలగ విసురుటకు
కుంచిన పదములకు నిజ మంగళం

సీమలను దాటిన ప్రేమానురాగాలా
గోవర్ధనమునెత్తి గొడుగుగా సరిబట్టి
గోపకుల గోవుల ప్రాపుగా రక్షించ
చూపించు కరుణకు శుభ మంగళమ్


శత్రు సంహారమ్ము జరిపెడి కరములకు
వేలాయుధమునకు జయమంగళం
పరమ మంగళ మౌని గుణగణమ్ములు పాడి
పర సాధించుకొన పడతులము వచ్చాము

అలనాడు బలియింట అందుకొనగ భువిని
కొలతగా వాడిన పదములకు మంగళం
పడతిని చెరబెట్ట పసిడి లంకను మసిగ
మార్చిన నీ బాహు శక్తికిదే మంగళం 

  

9 comments:తమిళ అక్షరం ’ழ’/'zha' ను తెలుగులోని ’ఱ’ ’ళ’ అక్షరాలను కలిపి పలికినట్లుగా పలుకవలెను

ఎంత ప్రయత్నించినను నోరు తిరగదే వారు పలికి నట్లు :

మురుగా తమిழ் కడవుళే :)


జిలేబి---ఆ కళంక ప్రతిభకు జయమంగళమ్ ?

అకళంక ప్రతిభకు ?


జిలేబి

థాంక్స్ జిలేబి గారు పోస్ట్ లో సరిచేశానండీ... హహహ అవునండీ తమిళ అక్షరం పలకడం కాస్త కష్టమే అలవాటయె వరకూ :-)

ఆ విచిత్ర అక్షరం మాటేమో గానీ, స శ ష అక్షరాలు, ప బ , క గ, అక్షరాలను తమిళ వారు కలగా పులగం చేసి పలుకుతారు.

ఆంధ్రలో గోదావరి ప్రాంతం వారు శ ను స లాగా పలుకుతున్నారు.

తెలంగాణాలో శ ను ష లాగా పలుకుతున్నారు.

సరైన ఉచ్చారణ కు గొప్ప ఉదాహరణ. ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారు పాడిన విష్ణు సహస్రనామం. అది జాగ్రత్తగా విని సాధన చేస్తే మంచి ఉచ్చారణ అబ్బుతుంది.

థాంక్స్ ఫర్ ద కామెంట్ అజ్ఞాత గారు. ఎమ్మెస్ గారి విష్ణు సహస్రనామాలు గురించి బాగా చెప్పారండీ, నిజమే రిఫరెన్స్ గా ఉపయోగించుకోవచ్చు. ఇక తెలుగులో ఉచ్చారణ దోషాలు గురించి ఎంత చెప్పినా తక్కువేనండీ.. మీడియా సినిమా వాళ్ళు అంతా కలసి అవే సహజమనేంతగా అలవాటు చేసేశారు.

పై “అజ్ఞాత” గారు ఎవరో తెలిసినవారనిపిస్తోందే 🤔!

తమిళ లిపి లక్షణమేమిటంటే క,గ శబ్దాలకు వాళ్ళ లిపిలో ఒకటే అక్షరం వాడడం. అలాగే కొన్ని ఇతర హల్లులకు కూడా. ఈ విషయం “జిలేబి” గారికి ఇంకా బాగా తెలిసుంటుంది.

గోదావరి ప్రాంతం వారు “శ” ను “స” గా పలుకుతారు అంటున్నారు. ఈ మాట మొదటిసారి వింటున్నాను. ఒకటి, రెండు ఉదాహరణలు ఇవ్వగలరా “అజ్ఞాత” గారూ?

“శ” ను “ష” గా పలకడం అనే ఫాషన్ (జాడ్యమా??). ఇప్పుడు తెలంగాణాకే పరిమితం కాదు లెండి, అన్ని ప్రాంతాలకూ అంటుకుంది. దీంట్లో సినిమా వారు, మీడియా వారు పోషిస్తున్న పాత్ర గణనీయమైనది.

థాంక్స్ ఫర్ ద కామెంట్ నరసింహారావు గారు.. నిజమేనండీ ప్రాంతాలకతీతంగా చాలామంది పలకలేకపోతున్నారు..

జయ కమలాసనా..జయ కమల లోచనా..

థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.