చిత్రం : శ్రీ వినాయక విజయం(1979)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : దేవులపల్లి
గానం : పి.సుశీల
ఎవరవయ్యా.. ఎవరవయ్యా..
ఏ దివ్య భువి నుండి దిగీ..
ఈ అమ్మ ఒడిలోన ఒదిగీ..
ఎవరవయ్యా.. ఎవరవయ్యా..
ఏ దివ్య భువి నుండి దిగీ..
ఈ అమ్మ ఒడిలోన ఒదిగీ..
ఎవరవయ్యా...
ఆ కనుల వెలిగేవి ఏ జ్యోతులో గాని
ఆ కనుల వెలిగేవి ఏ జ్యోతులో గాని
ఆ నవులు పలికేవి ఏ వేద మంత్రాలో
వేల్పులందరిలోనా తొలి వేల్పువో ఏమో
పూజలలో మొదటి పూజ నీదేనేమో !
పూజలలో మొదటి పూజ నీదేనేమో !
ఎవరవయ్యా.. ఎవరవయ్యా..
ఏ దివ్య భువి నుండి దిగీ..
ఈ అమ్మ ఒడిలోన ఒదిగీ..
ఎవరవయ్యా..
చిట్టిపొట్టి నడకలూ జిలిబిలి పలుకులూ
చిట్టిపొట్టి నడకలూ జిలిబిలి పలుకులూ
ఇంతలో ఔరౌర ఎన్నెన్ని విద్యలో
ఎన్నెన్ని వింతలో...
ఎన్నెన్ని కోరికలు నిండి నే కన్న
ఎన్నెన్నో స్వప్నాలు పండి..
చిన్నారి ఈ మూర్తివైనావో
ఈరేడు లోకాలు ఏలేవో
ఈరేడు లోకాలు ఏలేవో
ఎవరవయ్యా.. ఎవరవయ్యా..
ఏ దివ్య భువి నుండి దిగీ..
ఈ అమ్మ ఒడిలోన ఒదిగీ..
ఎవరవయ్యా.. ఎవరవయ్యా..
ఎవరవయ్యా.. ఎవరవయ్యా..
~*~*~*~*~*~*~*~*~*~
పై పాటలో బాల వినాయకుడ్ని చూశారు కదా... ఇపుడు గజముఖుడిని చూడండి... కుమారస్వామి, విఘ్నేశ్వరుడు ఇద్దరూ తమ తండ్రి యొక్క అర్ధనారీశ్వర తత్వాన్ని స్థుతిస్తూ చివరికి విశ్వరూప సందర్శనమిచ్చిన ఆ లయకారుడిని ఎలా ప్రార్ధిస్తున్నారో మీరూ చూసి తరించండి. అందరకూ ఈశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు.. ఈ ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు...
చిత్రం : శ్రీ వినాయక విజయం(1979)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : వీటూరి
గానం : శైలజ, రమేష్
ఒక వంక వరనీల కబరీ భరమ్ము
ఒక వంక ఘన జటాజూట భరితమ్ము
ఒక వంక మణి మయోజ్వల కుండలాలు
ఒక వంక భయద పన్నగ భూషణాలు
ఒక కంట కారుణ్య అవలోకనాలు
ఒక కంట విస్ఫులింగ గచ్ఛటాలు
ఒక వంక రమణీయ కాంచనాంబరము
ఒక వంక నిర్వికారము దిగంబరము
ఒక పదమ్మున ప్రణయ నాట్య విన్యాసమ్ము
ఒక పదమ్మున ప్రళయ తండవ విజృంభణము
విశ్వ శ్రేయార్ధకము సృష్టి పరమార్ధమ్ము
శక్తి శివ శక్తుల సంగమ స్వరూపమ్ము
సర్వ రక్షాకరము దుష్ట పీడా హరము
అనశ్వరము శుభకరము అర్ధనారీశ్వరము
శ్రీమన్మహా దేవదేవా ! అమేయ ప్రభావా ! భవా !
భవ్య కారుణ్య భావా ! శివా !
భవానీ ప్రియా ! చిన్మయానంద హృదయా అద్వయా !
దివ్య పంచాక్షరీ వేద మంత్రాలయా ! అవ్వయా !
ప్రకృతీ పురుషులై శక్తియున్ నీవు ఆధార చక్రాన విహరించి
సంరక్తితో సృష్టి గావించి పాలించవే
సూర్య చంద్రాగ్నులే నీదు నేత్రాలుగా !
నాల్గు వేదాలు నీ శంఖు నాదాలుగా !
భూమి నీ పాద పీఠమ్ముగా గంగయే నీ శిరో రత్నమ్ముగా
తేజమే నీకు నీరాజనమ్ముగా
వాయువే వింజామరమ్ముగా నభము ఛత్రమ్ముగా
పంచ భూతాలు సతతమ్ము సేవించగా
సప్తపాదోనిధుల్ సుప్త శైలేంద్రముల్
సర్వ లోకాలు తీర్థాలు నీ కుక్షిలో
సదా ప్రక్షిప్తమై యుండవే !
విశ్వరూపా ! నమో వేద భువన ప్రదీపా !
సంతతానంద కేళీకలాపా !
జగద్ గీత కీర్తీ ! లసత్ భూత వర్తీ !
సదానందమూర్తీ ! నమో దేవతా చక్రవర్తీ
నమస్తే.. ! నమస్తే.. !! నమః.. !!!
2 comments:
బిలీటెడ్ విషెస్ వేణూజీ..
థాంక్స్ శాంతి గారు :-)
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.