శుక్రవారం, ఆగస్టు 22, 2014

సిరి కథ...

ఈరోజు శ్రావణ శుక్రవారం సంధర్బంగా "మహానగరంలో మాయగాడు" సినిమాలో లక్ష్మీ దేవి గురించిన ఈ సిరికథ గుర్తు చేసుకుందామా. భయమే మన శత్రువనీ... మిగిలిన సప్తలక్ష్ములను విధివశాత్తు కోల్పోయినా ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యలక్ష్మిని మాత్రం పోగొట్టుకోకూడదని, ధైర్యం ఉంటే మిగిలిన సప్త లక్ష్ములూ తమంత తామే తిరిగి వస్తారని బోధించే ఈ కథ చాలా బాగుంటుంది. మీరూ చూసీ వినీ గుర్తుంచుకోండి. ఈ పాట ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.



చిత్రం : మహానగరంలో మాయగాడు (1984) 
సంగీతం : సత్యం 
సాహిత్యం : ఆత్రేయ 
గానం : బాలు, సుశీల

శ్రీ గజ వదనం భవతరణం 
శ్రీ గజ వదనం భవతరణం 
సేవిత దేవగణం శితజన పోషణం
శ్రీ గజ వదనం...
శ్రీ మద్రమారమణ గోవిందో హరి.. 
నేనిప్పుడు చెప్పబోయేది హరికథ కాదు.. ఏవిటయ్యా అంటే సిరి కథ.. 
మానవుడు జీవితంలో ఏమైనా పోగొట్టుకోవచ్చు కానీ.. 
ఏపరిస్థితుల్లోనూ పోగొట్టుకోకూడనిదీ ఒక్కటే ఒక్కటి ఉన్నది.. 
ఏవిటయ్యా అది ?? 
ఏవిటంటే సావధాన చిత్తులై ఆలకించండి... 

అమరావతి పట్టణమేలుచుండె అమరేశుండను రేడూ.. 
అతనెలాంటి వాడయ్యా... 
భూపాలుడు.. అనుపమ సద్గుణ శీలుడూ.. 
భూపాలుడు.. ఆశ్రిత సజ్జన లోలుడూ..
అపర కుబేరుడు అభినవ కర్ణుడు భూపాలుడు..
అతని యశము దశ దిశలు పాకగా దేవతలదిగని బిక్కురు మనగా.. 
ఆ మహారాజు గొప్పతనానికి అసూయపడ్డ దేవతలు ఏం చేశారయ్యా అంటే.. 
శనిని పిలిచినారు శనైశ్చరుని పిలిచినారు..
శనిని పిలిచినారు శనైశ్చరుని పిలిచినారు..
ఆ మనుజేశుని మహిమను కనుగొని రమ్మనీ.. నేడే పొమ్మనీ 
ధరణికంపినారు.. శనిని ధరణికంపినారు.. 

అహో భూపతీ వింటిని నీ కీర్తీ..
అవనీశుడను అభ్యాగతుడను భవతి భిక్షాం దేహీ..
భవతి భిక్షాం దేహీ..
బ్రాహ్మణోత్తమా అభివందనము 
మీ సత్కారము నా నిత్యధర్మము 
బ్రాహ్మణోత్తమా అభివందనము 

నిలు నిలు తనయా నీకీ తొందర తగదయ్యా.. 
నిలు నిలు తనయా నీకీ తొందర తగదయ్యా.. 
ఎవరమ్మా నీవు నన్నెందులకిటులాపెదవు.. 
ధాన్య లక్ష్మిని నేను ధారపోయకు నన్నూ.. 
ధాన్య లక్ష్మిని నేను ధారపోయకు నన్నూ.. 
ఆ కపట బ్రాహ్మణుడు కుటిల శనైశ్చరుడూ... 
నీ కలిమిని కీర్తిని దోచ వచ్చినాడూ.. 
శని ఐనను హరి ఐనను ముని ఐనను దేహి అనుచు ముంగిట నిలవన్..
వెనుకాడి ఆడితప్పుట ఇనకులమున లేదు లేదు ఎరుగవె తల్లీ.. 
ఇదే నీ నిర్ణయమైన కుదరదు నీ ఇంట నేను కొలువుండటన్.. 
ఇది నీ విధి అనుకొందున్.. పృధివీశా.. పోవుచుంటి ప్రీతుండగుమా.. 
పృధివీశా.. పోవుచుంటి ప్రీతుండగుమా.. 
పృధివీశా.. పోవుచుంటీ.. 
అని ధాన్యలక్ష్మి ఇల్లు వీడి వెళ్ళిపోయినదట..

అంతట శని.. ఓ మహరాజా ఆశ్రితభోజా
ఓ మహరాజా ఆశ్రితభోజా.. ధాన్యమును ఒసగిన చాలా.. 
ధనమునీయవలదా.. ఆఆఅ...
పొరపాటాయెను భూసురా.. సరగున తెచ్చెద ధనమూ.. 

ధరణీశా ఆగు ఆగు ధనలక్ష్మిని నేను.. 
ధరణీశా ఆగు ఆగు ధనలక్ష్మిని నేను..
శనికి నన్ను ఇవ్వకుమా.. వినుము నాదు హితము.. 
మాట తప్పలేను నీ మాటను వినలేను.. 
విడలేను దాన గుణము... వినుము నాదు శపధము..

అనగానే ధనలక్ష్మి కూడా ధాన్యలక్ష్మి దారినే వెళ్ళిపోయిందట.. 
శని అడిగింది అడగకుండా అడుగుతున్నాడటా మహరాజు అడిగింది అడిగినట్లే ఇచ్చాడటా.. 
ఆవిధంగా అష్టలక్ష్ముల్లో ఏడుగురు లక్ష్ములు వెళ్ళిపోయారటా.. తదనంతరమున.. 

రాజా ఇచ్చినంతనే గొప్పనుకోకు ఇచ్చి ఏమి ఫలము.. 
నీవు ఇచ్చి ఏమి ఫలము.. 
ఇన్ని సిరులతో ఒంటరిగా నే ఎటుల వెళ్ళగలను
రాజభటులను వెంట పంపమందురా.. 
భటులు వచ్చినంత నాకు రాదు ధైర్యము.. 
ధీరుడవూ నీవే నా వెంట నడువుము 
చిత్తం తృటిలో వచ్చెదన్.. 

ఓయీ రాజా... అన్ని లక్ష్ములను నిర్లక్ష్యపరిచితివి నీవు.. 
అన్ని లక్ష్ములను నిర్లక్ష్యపరిచితివి నీవు..
నేనుమాత్రమూ నీకు అండగా ఏల ఉండవలయు 
ఎవరు తల్లీ నీవు.. 
ధైర్య లక్ష్మిని నేను 
నమో ధైర్య లక్ష్మీ నమో ధీర లక్ష్మీ నమో వీర లక్ష్మీ నమో..
నీవు నాఅండగా దండగా నున్న మరే లక్ష్మీ లేకున్న 
నాకెట్టి లోపమ్ము రాదన్న ధైర్యమ్ముతో
సప్త లక్ష్మీ వియోగమ్ము సైతమ్ము నిర్లక్ష్యమున్ జేసితిన్.. 
రాజ్యమున్ గీజ్యమున్ పోయినన్ గానీ నిను నేను పోనిత్తునా 
పేదరికమునైనా భరియింపగలనుగాని పిరికినై జీవింతునా.. 
కాన నాయింట నిలకడై నీ ఉండగా గీటు గీచితిని ఇది దాటరాదు 
సూర్య చంద్రుల పై ఆన.. చుక్కలఆన.. నీ పదముల ఆన
నా నిత్య సత్య వ్రతమ్ముపై ఆన సకల దేవతల ఆన.. ఆఆఅ
అని ధైర్యలక్ష్మినే బంధించిన రాజు ధైర్యమునకు శని గుండె ఝల్లుమని.. 
ఇక తన పని చెల్లదనీ.. అదృశ్యుడైనాడట.. 
శ్రీ మద్రమారమణ గోవిందో హారి.. 

అటుపైన నగరు విడిచి వెళ్ళిన ఏడుగురు లక్ష్ములు ధైర్యలక్ష్మి లేనందున 
దిక్కుతోచక భయభ్రాంతులై నగరుకే వెనుదిరిగి వచ్చినారట..
ఒక్క ధైర్యలక్ష్మినే కాపాడుకున్న ఆ మహారాజుకు
మిగిలిన అన్ని లక్ష్ములు తమంతట తామే సమకూరిన ఈ శుభసమయంలో
శ్రీ మద్రమారమణ గోవిందో హారి..
మహా భక్తులారా ఈ సిరికథ మనకి భోధించే మహత్తర సత్యం ఏమిటయ్యా అంటే.. 

భయమే నీ శత్రువు ఓ మనిషీ భయమే నీ మృత్యువు.. 
కష్ట నష్టములు కలిగిన వేళ ఆపదలేవో పైబడు వేళ 
ఉన్నవి అన్నీ కోలుపోయినా ఉండవలసినది గుండె ధైర్యమూ.. 
ధైర్యమే ఐశ్వర్యమూ.. ఓ మనిషీ ధైర్యమే నీ విజయమూ.. 
ఏదీ అందరూ ఒక్కసారి .. ధైర్యే సాహసే లక్ష్మీ.. 


3 comments:

శ్రీమన్మహాలక్ష్మి చేర వచ్చిందీ సౌభాగ్య శోభల వరము తెచ్చింది...
కొంగు బంగరు తల్లి కోరి వచ్చిందీ
మంగళారతులిచ్చి ఎదురెగరండీ

ఈ పాట ఏ మూవీ లోనిదో దయచేసి తెలుపగలరు.

నాకూ తెలియదు స్వర్ణమల్లిక గారు.. సమాచారం సేకరించడానికి ప్రయత్నిస్తున్నాను. తెలిసిన వెంటనే పంచుకుంటాను.

స్వర్ణమల్లిక గారు ఈ పాట శుక్రవారం మహాలక్ష్మి అనే చిత్రంలోనిదటండీ.. సినిమా మరియూ పాట గురించిన వివరాలు ఇక్కడ చూడవచ్చు http://www.aptalkies.com/movie.php?id=7155&title=Sukravaram%20Mahalakshmi%20(1992)

ఈ పాట చూడాలంటే ఇక్కడ చూడవచ్చు.
http://youtu.be/cuRuUCixl-k?t=1h36m02s

ఈ వివరాలందించిన ఓ నేస్తానికి బ్లాగ్ముఖతా ధన్యవాదాలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.