మిత్రులందరకూ ముఖ్యంగా సాక్షాత్ లక్ష్మీ స్వరూపులైన స్త్రీమూర్తులకు వరలక్ష్మీ వ్రతం సంధర్బంగా శుభాకాంక్షలు.. అందరూ వ్రతం బాగా జరుపుకున్నారని ఆశిస్తాను. ఈ సంధర్బంగా లక్ష్మీ కటాక్షం సినిమాలోని ఈ శ్లోకాన్ని గుర్తు చేసుకుందామా. వరలక్ష్మి మనని వీడిపోకుండా ఉండాలంటే మనం చేయకూడని పనులు అలాగే ఎలాంటి చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అనే విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం : ఎస్.పి.కోదండపాణి
సాహిత్యం : చిల్లర భవన్నారాయణ
గానం : జానకి
శుక్రవారపు పొద్దు సిరిని విడువద్దు
దివ్వెనూదగ వద్దు బువ్వనెట్టద్దు
తోబుట్టువుల మనసు కష్టపెట్టద్దు
తొలిసంజె మలిసంజె నిదుర పోవద్దు
మా తల్లి వరలక్ష్మి నిను వీడదపుడు..
మా తల్లి వరలక్ష్మి నిను వీడదపుడు..
ఇల్లాలు కంటతడి పెట్టనీ ఇంట
కల్లలాడని ఇంట గోమాత వెంట
ముంగిళ్ళ ముగ్గుల్లో పసుపు గడపల్లో..
పూలల్లో పాలల్లో.. పూలల్లొ పాలల్లొ ధాన్య రాశుల్లో..
మా తల్లి మహలక్ష్మి స్థిరముగానుండు..
మా తల్లి మహలక్ష్మి స్థిరముగానుండు.
~*~*~*~*~*~*~*~
అలాగే ఈ పర్వదినాన చెంచులక్ష్మి సినిమా లో విష్ణుమూర్తి లక్ష్మీ దేవి లపై చిత్రీకరించిన ఈ చక్కని డ్యూయట్ కూడా తలచుకుందామా... సాలూరి వారి సంగీతం చాలా హాయిగా సాగుతుంది అలాగే ఘంటసాల, జిక్కి గార్ల గాత్రం ఈ మెలోడీకి మరింత మాధుర్యాన్ని అద్దింది అనిపిస్తుంది. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.
చిత్రం : చెంచులక్ష్మి (1958)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
సాహిత్యం : ఆరుద్ర
గానం : ఘంటసాల, జిక్కి
ఆఆఆఅ...
ఆనందమాయే అలినీలవేణీ
ఆనందమాయే అలినీలవేణీ
అరుదెంచినావా అందాల దేవీ..
ఆనందమాయే అలినీలవేణీ
అరుదెంచినావా అందాల దేవీ..
ఓఓఓఓఓఓఓఓఓఓఓ
అనువైన వేళ అనురాగ శోభ
హరి ప్రేమ పూజా నా భాగ్యమాయే
అలనాటి నోము కల నేడు పండే
అరుదైన హాయి నాలోన నిండే
ఆనందమాయే అసమాన తేజ
అపురూపమైనా అందాల దేవా
ఆనందమాయే అసమాన తేజ
ఆఆ... సొగసైన రూపే సోలించు చూపే
సగమైన కనుల సంతోష నిధులే
నగుమోము పైన నడయాడు కళలే
అగుపించగానే మగువరో నాలో
ఆనందమాయే అలినీలవేణీ
అరుదెంచినావా అందాల దేవీ..
ఆనందమాయే అలినీలవేణీ
ఓఓఓఓ...
ఎనలేని స్వామీ నిను చేరబోతే
నును లేత ప్రేమా నను సాగనీదే
తనువేమో నీకై తపియించు నిలచీ
మనసేమో నీలో మునుపే కలిసే
ఆనందమాయే అసమాన తేజ
అపురూపమైనా అందాల దేవా
ఆనందమాయే అలినీలవేణీ
అరుదెంచినావా అందాల దేవీ..
ఆనందమాయే అలినీలవేణీ...
2 comments:
అ శ్రావణ లక్ష్మి మీ ఇంట సిరులవాన కురిపించాలని ఆశిస్తూ..శుభాకాంక్షలు..
థాంక్స్ శాంతి గారు... మీకు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.