ఆదివారం, జనవరి 10, 2021

భలే మంచి చౌక బేరము...

ఆ లక్ష్మీనాధుని కొనుగోలు చేయగల ధనం మానవమాత్రుల వద్ద ఉంటుందా. అయినా నారదుల వారు ఈ సాహసానికి ఒడిగట్టారంటే సాక్షాత్తూ ఆ జగన్నాటక సూత్రధారే తన నాటకం వెనక ఉన్నారన్న ధైర్యమే కదా. శ్రీ కృష్ణ తులాభారం సినిమాలో ఈ సన్నివేశాన్ని చూపించే ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : శ్రీకృష్ణ తులాభారం (1966)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : చిలకమర్తి లక్ష్మీనరసింహం / చందాల కేశవదాసు ?
గానం : ఘంటసాల, సుశీల 
 
భలే మంచి చౌక బేరము
ఇది సమయము మించినన్ దొరుకదు
త్వరన్ గొనుడు సుజనులార
భలే మంచి చౌక బేరము

విలువ ఇంతయని చెప్పుట కలవిగాని బేరము
విలువ ఇంతయని చెప్పుట కలవిగాని బేరము
సలిలజ గర్భాదులౌ ఘనులకందని బేరము
కలుముల చేడియకు సతతము నిలయమైన బేరము
ఫలాపేక్ష రహిత భక్త సులభమైన బేరము

భలే మంచి చౌక బేరము
ఇది సమయము మించినన్ దొరుకదు
త్వరన్ గొనుడు సుజనులార
భలే మంచి చౌక బేరము

మునివరా... తుదకిట్లు ననున్
మోసగింతువా... మునివరా...
ఘనులు స్వాదృశులే ఇటులన్
కరుణమాలిన ఇంకేమున్నది మునివరా...
తుదకిట్లు ననున్
మోసగింతువా... మునివరా...

ధన ధనేతరముల చేతగాని
సాధన శమదమ నియమములకు గాని
లభియింపబోదు సుండీ
ధన ధనేతరముల చేతగాని
సాధన శమదమ నియమములకు గాని
లభియింపబోదు సుండీ
కాదనుకొను డౌననుకొనుడొక మనసు 
నిష్కళంకముగా నొనరించి తృణంబొసగిన 
వెను వెంటనే నడచుచుండు

భలే మంచి చౌక బేరము
ఇది సమయము మించినన్ దొరుకదు
త్వరన్ గొనుడు సుజనులార
భలే మంచి చౌక బేరము

ఏమి సేతు ఎటుబోవుదు ఏ మార్గం అగుపడదే
ఏమి సేతు ఎటుబోవుదు ఏ మార్గం అగుపడదే
నా మనో విభుని దరిచేరగనీడాయెగా మునివరా...
తుదకిట్లు ననున్
మోసగింతువా... మునివరా...

ఓ యాదవులార కనుచు ఊరక నిలుచున్నారు
మీ యజమానిని గొనుడు సుమీ తరిచెడుగా
ఓ యాదవులార కనుచు ఊరక నిలుచున్నారు
మీ యజమానిని గొనుడు సుమీ తరిచెడుగా
పిదప నా ఈ పలుకులు మీ మానసములందు నిడి
దూరంబరయుడు సరుగున తడయగా

భలే మంచి చౌక బేరము
ఇది సమయము మించినన్ దొరుకదు
త్వరన్ గొనుడు సుజనులార
భలే మంచి చౌక బేరము

ఏ విధి సవతులనిక వీక్షింపగలను
ప్రతి వచనంబేవిధాన బలుకగలను
ఎంత జేసితివి ముని
నీవు సత్యవంతుడవని ఎంచి
ఇట్లు పొరబడితిని మునివరా...

ఇదియే తుది సమయము త్వరపడుడు
ఇకెన్నటికినిన్ దొరుకబోదు సరి
ఇదియే తుది సమయము
సదమలాత్ములని ఇటు మరిమరి
నిశ్చయము దప్పకను తెల్పితిగా
సదమలాత్ములని ఇటు మరిమరి
నిశ్చయము దప్పకను తెల్పితిగా
అదృష్టమింతకెవరిదియో విధిగా
అచటికే కనునుగా ముదంబిపుడు

భలే మంచి చౌక బేరము
ఇది సమయము మించినన్ దొరుకదు
త్వరన్ గొనుడు సుజనులార
భలే మంచి భలే మంచి
భలే మంచి చౌక బేరము
 

 

4 comments:

ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

థ్యాంక్స్ శ్యామలీయం గారూ.. ఉదయం మరో మిత్రులు కూడా ఈ పాటను నాటకాలలో మొదట ఉపయోగించినట్లు చెప్పారండీ. కానీ వికీ ఈ పాట రాసినది నాటకాలలోని ప్రార్ధన గీతం "పరబ్రహ్మ పరమేశ్వర" రాసిన చందాల కేశవదాసు గారు అని చెప్తుందండీ.

చిలకమర్తి వారి గయోపాఖ్యానం నాటకాన్నే శ్రీకృష్ణ తులాభారం అనే పేరుతో సినిమాగా తీసారు. మీరజారగలడా పాట ఆ నాటకం లోనిదే.

గయోపాఖ్యానం ఇతివృత్తం కృష్ణార్జున యుద్దం అనుకుంటా కదండీ. మీరు చెప్తున్న నాటకం పారిజాతాపహరణం అయుండవచ్చు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.