మిత్రులందరకూ ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షాలు. శ్రీకృష్ణమాయ సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : శ్రీ కృష్ణమాయ (1958)
సంగీతం : టి.వి.రాజు
సాహిత్యం : వారణాసి శీతారామశాస్త్రి
గానం : ఘంటసాల
శ్రీమద్రమారమణ గోవిందో హారి
కలడు కుచేలుండను విప్రోత్తముడొకడు
కలడు కుచేలుండను విప్రోత్తముడొకడు
వారికి కల్గెను చింతగూర్చు సంతానమనంతముగా
మరి దొరకదు కబళము
చిరుపాపలకు ఎంత ఘోరమకటా
పాపం కుచేలుడు కడిపెడు బిడ్డలను కన్నాడు
కడిపెడు బిడ్డలన్ గనియు కర్మ వశంబటులుంటజేసి
ఆ బుడతల పెట్టి పోతలకు
పుట్టవు చారెడు నూకలైనా..ఆఆఅ...
ఇలా సంసార బాధలు పడుతూ ఉండగా ఒకనాడు ఇల్లాలు కుచేలుడి భార్య తన భర్త దగ్గరకు చేరి..
వినుడీ నామొర దయగనుడీ
వినుడీ నామొర దయగనుడీ
పసిపాపల గతినేనోపగ జాలను
వినుడీ నామొర దయగనుడీ
మీ బాల్యమిత్రుడగు గోపాలునీ
మీ బాల్యమిత్రుడగు గోపాలునీ
గోపాలునీ దరిజేరి మనగతి నెరిగింపుడు
వినుడీ నామొర దయగనుడీ
అని ప్రార్ధించిందట.
అంత కుచేలుడు తన భార్యమాటలు విన్నవాడై ద్వారకకు వెళ్ళాడు.
అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మిత్రుని జూచి ఎదురేగి.
గట్టిగ మిత్రుని కౌగిట జేర్చెను
ఎట్టెటులుంటివి మిత్రమ
గట్టిగ మిత్రుని కౌగిట జేర్చెను
ఎట్టెటులుంటివి మిత్రమ
నీ సంతతి అంతయు సౌఖ్యమా
నీ యిల్లాలనుకూలమా...ఆఆఆఅ..
అంటూ ఆ భక్త నందనుడు ప్రశ్నించాడు
తర్వాత తన భార్య రుక్మిణి వైపు తిరిగి దేవీ..
భూసురవర్యుడీతడు
సుబుద్ధిమహాత్మడనుంగు మిత్రుడు
ఏ చేసిన పుణ్యమూలమున
చేకూరె నాకొక బాల్యమిత్రుడై...
వేసటచెందె నీతడుఊఊ,
వేసటచెందె నీతడుఊఊ,
సుపేశకరంబుల పాదమొత్తగా
దాసుడనుంటి నేనిచట
దాసివి నీవును రమ్ము నెచ్చెలీ
ఆఆఅ...ఆఆఆఆ....
అని పిలిచాడు
పిలిచీ ఆ కౌస్తుభ ధారి తానే కాకుండా తన భార్య చేత కూడా పాదాలు వత్తించుచూ ఇలా అన్నాడు
మిత్రమా నాకేమి యిత్తువు కానుక
మిత్రమా నాకేమి యిత్తువు కానుక
ఇన్ని నాళ్ళకు కళ్ళబడితివి
ఇన్ని నాళ్ళకు కళ్ళబడితివి
వెన్నెలాయెను నాదు మనసు
మిత్రమా నాకేమి ఇత్తువు కానుక
ఆఆఆ....ఆఆఆఆ.....
అని అడిగాడు.
అప్పుడు కుచేలుడు
తన కొంగున ఉన్న గుప్పెడు అటుకులూ తీసి సిగ్గుతో తన మిత్రుని దోసిట్లో పోశాడు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ పరమానందం పొంది. రుక్మిణికి ఒక పలుకైనా పెట్టకుండా అన్నీ తనే తినేశాడు. అలా తినగానే కుచేలుని దారిద్ర్యం అంతా తీరిపోయింది.
అప్పుడు కుచేలుడు మహదానందం పొంది ఆ దివ్యమూర్తి పాదాలపై పడ్డాడు పడ్డవాడై
నీదయ తెలియగ తరమా
నీదయ తెలియగ తరమా
నీరజ నయనా క్షీరాభ్దిశయనా
నీదయ తెలియగ తరమా
ఇహ అక్కడ కుచేలుడి ఇంటినిండా ధనదాన్యాదులు రాశులు పోసున్నాయ్ అప్పుడు కుచేలుని భార్యా బిడ్డలు అందరూ ఆ భక్త వత్సలుని తలచి ఇలా ప్రార్ధిస్తున్నారు
దీన బాంధవా
దీన బాంధవా దేవా
దీన బాంధవా దేవా
నీ దయ కలిగెనా మా పైన
నీ దయ కలిగెనా మా పైన
పేదరికమ్మది తొలగె
పెన్నిధులే ఒరిగె
నీ దయ కలిగెనులే దేవా
దీన బాంధవా దేవా
దీన బాంధవా
దీన బాంధవా
దీన బాంధవా
ఇలా ప్రార్ధిస్తూ ఉండగా కుచేలుడు తన ఇంట్లో ప్రవేశించాడు. తారా పుత్రుల వదనంలో వెలుగును చూచి తన్మయుడై పోయాడు... కనుక...
శ్రీహరి నమ్మిన వారికి వేరె
కరువేమున్నది జగతీ
శ్రీహరి నమ్మిన వారికి వేరె
కరువేమున్నది జగతీ
గుప్పెడు అటుకులే గొప్పగ జేసి
కురిపించెను సిరులను శౌరి
శ్రీమద్రమా రమణ గోవిందో హరి
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.