సోమవారం, సెప్టెంబర్ 21, 2009

తారలు దిగి వచ్చిన వేళా

నిన్న సెప్టెంబరు 21 న అక్కినేని గారు తన పుట్టిన రోజు జరుపుకున్న సంధర్భంగా అనుకుంటాను. ఒక టీవీ చానల్ వారు ప్రేమాభిషేకం సినిమా వేసారు. అప్పటి వరకూ రిమోట్ లో ఛానల్ బటన్ కి నా వేలికి పోటీ పెట్టి పందెం వేసి ఆడుకుంటున్న వాడ్ని హఠాత్తుగా ఈ పాట వినపడటం తో అక్కడే ఆగిపోయాను... ఈ సినిమా రిలీజ్ అయిన సమయం లో నేను చాలా చిన్న వాణ్ణి కాని అప్పుడప్పుడే కాస్త ఊహ తెలుస్తుంది. సినిమాల్లో యన్టీఆర్ గారి ఎయన్నార్ గారి స్టెప్పు లు ఇంట్లో వేసి అందరిని అలరించే రోజులు అనమాట. నాన్న నా టాలెంట్ కి ముచ్చట పడి ఒక బెల్ బోటం ప్యాంటు కుట్టిస్తే మనం అదేసుకుని వీర లెవల్ లో హీరోలా ఫీల్ అయి అన్నగారి స్టెప్పులు తెగ వేసే వాళ్ళం.

సరే ఇక ఈ పాట విషయానికి వస్తే నాకు చాలా ఇష్టమైన పాట అప్పట్లో అంతగా తెలిసేది కాదు కానీ సెకండ్ రిలీజ్ లో చూసినపుడు ఈ పాట తెగ నచ్చేసింది. తారలు దిగి వచ్చిన వేళా అంటూ సాగే పాట కి మొదట చక్రవర్తి గారు పలికించే మ్యూజిక్ దాని కి అణుగుణంగా కెమెరా ఎవరో కానీ పెళ్ళికి అలంకరించిన దీపాలనే తారలు గా అద్భుతం గా చూపించారు అనిపించింది. కావాలంటే మీరూ ఓ సారి వీడీయో లో మొదట వచ్చే సీన్స్ చూడండి. ఇక ప్రారంభం లో వొచ్చే బాలు గారి ఆలాపన నాకు చాలా ఇష్టం. అప్పట్లో కాస్త ప్రాక్టీస్ చేసి నేర్చేసుకున్నా కూడా.. ఇంకా ఈ పాట చూశాక మనం కూడా ఏయన్నార్ లా సూటూ బూటు వేసుకుని స్టైల్ గా ఇలా సైడాంగిల్ లో లుక్కులిస్తూ పాట పాడేయాల్రా అని ఓ కోరిక కూడా ఉండేది. మా దోస్తుల్లో కొందరైతే ఈ సినిమా హీరో లా మనక్కూడా క్యాన్సర్ ఉంటే బాగుండు అని అనుకున్నవాళ్ళూ లేకపోలేదు కాని నేనసలే ఇంటిలిజెంట్ కదా అలాటి పిచ్చి కోరికలు కోరితే ఇంట్లో బడిత పూజ చేస్తారు అని తెలుసు కాబట్టి సైలెంట్ గా ఉన్నా :-)

ఇంక ఈ సినిమా గురించి చెప్పాలంటే మాటలు చాలవు. కాస్త ఓవర్ యాక్షన్ భరించ గలిగితే ఈ సినిమాను తెగ ఎంజాయ్ చేయచ్చు. అక్కినేని వారు మొదటి భాగం లో ’హే దేవీ..’ అనుకుంటూ ఎంత ఉషారుగా ప్రేమించేస్తారో జబ్బు గురించి తెలిసాక అంతే విషాదంగా ఆకాశం లోకి చూస్తూ త్యాగం చేసేసి అలరిస్తారు. ఈ సినిమా డైలాగుల క్యాసెట్ మా ఇంట్లో చాలా రోజులే నలిగింది. అందుకే నిన్న సినిమా చూస్తూంటే డైలాగులు వింటుంటే ఒక్కసారి అప్పటి ఙ్ఞాపకాల లోకి వెళ్ళి పోయాను. సినిమా మొదట్లో వచ్చే వాటికన్నా జయసుధ ఇంట్లో ఉండే డైలాగులు కేక. శ్రీదేవి వచ్చినప్పటివి కానీ.. అక్కినేని జయసుధ తో తను ఒంటరి వాడిని కానని మరణం గురించి చెప్తూ "ఒకో సారి కిందుంటుంది ఒకోసారి పై నుంటుంది ఒకోసారి ముందుంటుంది ఒకోసారి వెనకుంటుంది.." అనే సంభాషణలు కానీ అక్కినేని గారి నోటివెంట విని తీరాల్సిందే..

నిజానికి ఈ సినిమాలో పేరు తెచ్చుకున్న పాటలు బోల్డు కానీ నాకు ఈ పాట అంటే చాలా ఇష్టం. ఇంకా వేరే పాటలు అంటే.. మా ఊరి పాట "కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా.." ఈ పాట కోటప్ప కొండ తిరునాళ్ళ లోనే తీసారు అని చెప్పుకునే వాళ్ళు అప్పట్లో కానీ నాకు మళ్ళి ఈ పాట చూసి నిర్ధారించుకునే అవకాశం రాలేదు. ఇంకా "నా కళ్ళు చెబుతున్నాయి..నిను ప్రేమించానని..", "ఆగదూ ఆగదూ.. ఆగితే సాగదు", "వందనం అభివందనం", "దేవీ మౌనమా శ్రీదేవీ మౌనమా", "ఒక దేవుడి గుడి లో.." దేనికదే ఫేమస్. అప్పట్లో బాలు గారు కాస్తంత మిమిక్రీ చేసి అచ్చూ అక్కినేని గారే పాడారా అన్నట్లు పాడేవారు. అదీ ఓ కారణమేమో వందనం లాటి పాటలు అంతగా హిట్ అవడానికి. ఏదేమైనా తారలు దిగివచ్చిన సాహిత్యం వీడియో మీకోసం. అలానే ఆసక్తి వుంటే తెలుగు FM వారి లింక్ కూడా ఇస్తున్నాను మిగిలిన పాటలు వినాలని అనిపిస్తే ఆ లింక్ లో వినగలరు. సాహిత్యం మాత్రం కేవలం ఈ పాటకే ఇస్తున్నా.



ఈ చిత్రం లోని మిగిలిన పాటలు ఇక్కడ ఈ లింక్ పై క్లిక్ చేసి వినవచ్చు

చిత్రం : ప్రేమాభిషేకం,
సాహిత్యం : దాసరి నారాయణరావు
సంగీతం : చక్రవర్తి
గానం : బాలసుబ్రహ్మణ్యం

తారలు దిగివచ్చిన వేళ.....
మల్లెలు నడిచొచ్చిన వేళ.....
చందమామతో ఒక మాట చెప్పాలి.. ఒక పాట పాడాలి...
చందమామతో ఒక మాట చెప్పాలి.. ఒక పాట పాడాలి...

||తారలు||

ఊరంతా ఆకాశానా గోరంత దివ్వెగా
పిడికెడంత గుండెలోనా కొండంత వెలుగుగా
కనిపించే రంగులన్ని సింధూరపు చీరెగా
కనిపించని సిగ్గులన్ని ముసుగేసిన మబ్బుగా
కనిపించే రంగులన్ని సింధూరపు చీరెగా
కనిపించని సిగ్గులన్ని ముసుగేసిన మబ్బుగా
నిలిచిపొమ్మనీ మబ్బుగా... కురిసిపొమ్మనీ వానగా...
విరిసిపొమ్మనీ వెన్నెలగా... మిగిలిపొమ్మనీ నా గుండెగా...
మిగిలిపొమ్మనీ... నా గుండెగా...

చందమామతో ఒక మాట చెప్పాలి.. ఒక పాట పాడాలి...
చందమామతో ఒక మాట చెప్పాలి.. ఒక పాట పాడాలి...
||తారలు||

నీలిరంగు చీకటిలో నీలాల తారగా
చూడనంత శూన్యములో దొరకనంత ఆశగా
వేటాడే చూపులన్ని లోలోని ప్రేమగా
వెంటాడే వలపులన్ని కాబోయే పెళ్లిగా
వేటాడే చూపులన్ని లోలోని ప్రేమగా
వెంటాడే వలపులన్ని కాబోయే పెళ్లిగా
చెప్పిపొమ్మనీ మాటగా... చేసిపొమ్మనీ బాసగా...
చూపిపొమ్మనీ బాటగా... ఇచ్చిపొమ్మనీ ముద్దుగా...
ఇచ్చిపొమ్మనీ... ముద్దుగా

చందమామతో ఒక మాట చెప్పాలి.. ఒక పాట పాడాలి...
చందమామతో ఒక మాట చెప్పాలి.. ఒక పాట పాడాలి...
||తారలు||

శుక్రవారం, సెప్టెంబర్ 04, 2009

ఎవరేమీ అనుకున్నా..

రాజశేఖరుని చూసినపుడల్లా నాకు ఆయన మొండి తనం దాని వెంటనే యస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం లో వచ్చిన బడ్జెట్ పధ్మనాభం సినిమాలోని ఈ పాటా గుర్తొచ్చేస్తాయి. అప్పుడప్పుడూ నాకు కాస్త inspiration ఇంధనం అవసరమైనపుడు వినే ఈ పాట పల్లవి లో ధ్వనించే మొండి తనాన్ని రాజశేఖరుడు అణువణువునా ఒంట బట్టించుకున్నారు అనిపిస్తుంది. ఈ మొండితనం తో తను గెలుచుకున్న హృదయాలు ఎన్నున్నాయో బద్ద వైరం పెంచుకున్న హృదయాలు అన్నే ఉన్నాయి. కానీ ఆయన ఇక లేరు అని తెలుసుకుని "అయ్యో" అనుకోని హృదయం ఒక్కటి కూడా లేదనడం లో అతిశయోక్తి లేదేమో.. రాష్ట్రమంతా స్వచ్చందంగా బంద్ పాటిస్తూ శోక సంద్రం లో మునిగిఉందన్న వార్తలు అది నిజమని నిరూపిస్తున్నాయి. తననుకున్నది సాధించడానికి ఎంతకైనా తెగించే తత్వమే "చెప్పకుండా వెళ్తున్నా.." అని చెప్పి మరీ వెళ్ళిపోయేలా చేసిందని బాధ పడడం తప్ప ఎవరైనా ఏమి చేయగలం. ఆ మహా మనిషి కీ ఆయనతో పాటు ఈ దుర్ఘటనలో మరణించిన వారందరి ఆత్మలకూ శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

ఈ పాట వినడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజ్యాన
రాజు నువ్వే బంటూ నువ్వే మంత్రీ నువ్వే సైన్యం నువ్వే
ఏమైనా ఏదైనా నువ్వేళ్ళే బడి లోన
పలకా నువ్వే బలపం నువ్వే ప్రశ్నా నువ్వే బదులూ నువ్వే..
అన్నీ నువ్వే కావాలి అనునిత్యం పోరాడాలీ..
అనుకున్నది సాధించాలీ...

||ఎవరేమీ||

అవమానాలే ఆభరణాలు.. అనుమానాలే అనుకూలాలు..
సందేహాలే సందేశాలు.. ఛీత్కారాలే సత్కారాలూ...
అనుకోవాలీ.. అడుగేయాలీ ముళ్ళ మార్గాన్ని అణ్వేషించాలీ..
అలుపొస్తున్నా కలలే కన్నాపూల స్వర్గాన్ని అధిరోహించాలీ..
ఎవరికి వారే లోకంలో.. ఎవరికి పట్టని శోకం లో.. నీతో నువ్వే సాగాలీ..

||ఎవరేమీ||

బలమూ నువ్వే.. బలగం నువ్వే.. ఆటా నీదే.. గెలుపూ నీదే..
నారూ నువ్వే .. నీరూ నువ్వే.. కోతా నీకే.. పైరూ నీకే..
నింగీ లోనా తెల్ల మేఘం నల్ల బడితేనే జల్లులు కురిసేనూ..
చెట్టు పైనా పూలూ మొత్తం రాలీ పోతేనే పిందెలు కాసేనూ..
ఒక ఉదయం ముందర చీకట్లూ.. విజయం ముందర ఇక్కట్లూ..
రావడమన్నది మామూలూ..

||ఎవరేమీ||

ఈ ఫోటోను ప్రచురించిన Hindu వారికీ ఇది నా కళ్ళబడేలా చేసిన త్రివిక్రం గారికీ ధన్యవాదాలు.

గురువారం, ఆగస్టు 27, 2009

పద్మవ్యూహం

ఒకప్పుడు శ్రీశ్రీ గారు చాలా డబ్బింగ్ పాటలు రాశారు అని ఆయన శ్రీమతి గారు రాసిన పుస్తకం లో చదివిన గుర్తే కానీ నాకు ఊహ తెలిసినంత వరకూ డబ్బింగ్ పాటల రచయిత అంటే రాజశ్రీ గారే.. రహ్మాన్ సంగీత దర్శకత్వం మొదలు పెట్టిన మొదటి లో స్వర పరచిన ఈ పద్మవ్యూహం సినిమా పాటలు చాలా బాగుంటాయ్. వాటిలో "కన్నులకు చూపందం" "నిన్న ఈ కలవరింత" మరింత ప్రత్యేకం. పాట చూస్తున్నపుడు లిప్ సింక్ లో తేడాలు, డబ్బింగ్ పాటలలో ఉండే చిన్న చిన్న భాషా దోషాలు ఉన్నాకూడా కమ్మనైన సంగీతం వాటిని సులువుగా క్షమించ గలిగే లా చేస్తుంది. కన్నులకు చూపందం పాట సాహిత్యం కూడా చాలా బాగుంటుంది. ఇక రేవతి "ప్రేమ" సినిమా తో పోలిస్తే ఈ సినిమా సమయానికి కాస్త వయసుమీద పడినట్లు అనిపించినా అందంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా లో నాకు నచ్చిన పాటలు మీ కోసం.



చిత్రం : పద్మవ్యూహం
సంగీతం : ఏ.ఆర్.రహ్మాన్
సాహిత్యం : రాజశ్రీ
గానం : బాలు

కన్నులకు చూపందం
కవితలకు ఊహందం
చిరు నవ్వు చెలికందం
సిరిమల్లి సిగకందం

||కన్నులకు||

కిరణాలు రవికందం సెలయేరు భువికందం
మగువలకు కురులందం మమతలకు మనసందం
పుత్తడి కి మెరుపందం పున్నమి కి శశి అందం ||2||
నాదాలు శృతికందం రాగాలు కృతికందం

||కన్నులకు||

వేకువకు వెలుగందం రేయంత అతివందం
వేసవికి వెన్నెలందం ఆశలకు వలపందం
తలపులే మదికందం వయసుకే ప్రేమందం ||2||
పాటకే తెలుగందం శ్రీమతికి నేనందం

||కన్నులకు||



చిత్రం : పద్మవ్యూహం
సంగీతం : ఏ.ఆర్.రహ్మాన్
సాహిత్యం : రాజశ్రీ

నిన్న ఈ కలవరింతా లేదులే..
నేడు చిరుగాలి ఏదో అందెలే..
ఇదియే ప్రేమ అందునా..
వయసే పులకరించెనా..
హృదయం కరిగిపోయెనా.. ఓ మనసా!!

||నిన్న ఈ||

దైవముందంటినీ అమ్మనెరిగాకనే
కలలు నిజమంటినీ ఆశ కలిగాకనే
ప్రేమనే ఒప్పుకున్నా నిన్ను చూశాకనే
పూచినా పువ్వులా నవ్వులే ఓ దినం
వన్నెలా మెరుపులా ఆయువే ఓ క్షణం
సృష్టి ఉన్నంతదాకా ప్రేమయే శాశ్వతం..

||నిన్న ఈ||

నింగి లేకున్ననూ భూమి ఉంటుందిలే..
మాట లేకున్ననూ భాష ఉంటుందిలే..
ప్రేమయే లేక పోతే జీవితం లేదులే..
వాసనే లేకనే పూలు పూయొచ్చులే
ఆకులే ఆడకా గాలి కదలచ్చులే
బంధమే లేకపోతే ప్రేమ జన్మించునే

నిన్న ఈ కలవరింతా లేదులే..

నేడు చిరుగాలి ఏదో అందెలే..

ఇదియే ప్రేమ అందునా..
వయసే పులకరించెనా..
హృదయం కరిగిపోయెనా.. ఓ మనసా!!

||నిన్న ఈ||



చిత్రం : పద్మవ్యూహం
సంగీతం : ఏ.ఆర్.రహ్మాన్
సాహిత్యం : రాజశ్రీ
గానం : పి. సుశీల


కన్నులకు చూపందం
కవితలకు ఊహందం
తీగకే పూలందం
వారికే నేనందం

||కన్నులకు||

వానాగిపోయినను ఆకుపై చుక్కందం
అల చెదిరిపోయిననూ దరి నున్న నురుగందం
చిన్నారి తారకలే రాతిరికి ఓ అందం
చిన్నారి తారకలే రాతిరికి ఓ అందం
శ్రీవారి చూపులకు ఎప్పుడు నేనందం

||కన్నులకు||

అందాల వన్నెలకే అపురూప కురులందం
అనురాగ ముద్దరలే చెరిగిన బొట్టందం
మగువ లో ప్రేమొస్తే మనుగడే ఓ అందం
మగువ లో ప్రేమొస్తే మనుగడే ఓ అందం
నా తోడు నీ వుంటే చీకటే ఓ అందం

||కన్నులకు||

శనివారం, ఆగస్టు 15, 2009

జయ జయ జయ ప్రియ భారత

బ్లాగ్ మితృలందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేశభక్తి గీతాల జాబితా కి అంతులేకున్నా... నన్ను బాగా ఆకట్టుకున్న గీతం దేవులపల్లి వారి "జయ జయ ప్రియభారత ". నేను ఆరవతరగతి లో ఉండగా మా హిందీ మాష్టారు నా గొంతు బావుందని (అప్పట్లో బాగానే ఉండేది లెండి) ఈ పాట, ఇంకా "దేఖ్ తెరే సంసార్ కి హాలత్ క్యా హొగయీ భగవాన్...కిత్‌నా బదల్ గయా ఇన్సాన్..." అనే పాటా నేర్పించారు. ఈ పాట ఎన్ని సార్లు విన్నా నాకు మొదట ఆయనే గుర్తు వస్తారు. ఇదే పాట చిరంజీవి గారి రాక్షసుడు సినిమాలో కూడా ఉపయోగించారు. మామాష్టారు నేర్పిన బాణీ లోనే సినిమా పాట సాగుతుంది. కేవలం సౌందర్యం తోనే కాక ఎన్నుకునే పాత్రలు, వాటిలో లీనమయ్యే తన నటన ద్వారా నన్ను ఆకట్టుకునే కథానాయిక సుహాసిని పై చిత్రీకరించడం నన్ను మరింత అలరించింది.

ఇంకా స్వాతంత్ర దినోత్సవం అంటే వీరుల త్యాగాలు, అలుపెరుగని పోరాటాలు గుర్తిచ్చినా, ఆ తర్వాత గుర్తొచ్చేది బాల్యమే. స్కూల్ లో స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నంత బాగా ఇంకెక్కడా నేనైతే జరుపుకోలేదు (ఈ ఏడు కాస్త వైవిధ్యం ఉంది కానీ దాని గురించి మరో టపాలో). స్కూల్ లో అతి పెద్ద పండగ ఆగస్టు పదిహేను. ఇంట్లో నాన్న ఎర్రకోట పై జండా వందనం విని/చూసి ఆతర్వాత అమ్మా నాన్న వాళ్ళ వాళ్ళ ఆఫీసులకి కేవలం జండా వందనం గురించి వెళ్ళే వాళ్ళు. స్కూల్ లో వారం పదిరోజుల ముందు నుండి ఉన్న హడావిడి ఆ రోజు పతాక స్థాయికి చేరుకునేది.


అద్దెకి తెచ్చిన మైక్ సెట్ లో వేసే "భారత మాతకు జేజేలు..", "పాడవోయి భారతీయుడా..", "నాజన్మభూమి ఎంత అందమైన దేశము..", "చెడు అనవద్దు చెడు కనవద్దు..", గాంధిపుట్టిన దేశమా ఇది.. " లాటి దేశభక్తి గీతాల నేపధ్యం లో క్లాస్ లో అక్కడక్కడా ఊడిపోయిన రంగుకాగితాలని మళ్ళీ అంటిచడం, స్టేజ్ సరిచేయడం, కుర్చీలు గట్రా సర్ధడం ఇత్యాది పనులు చేస్తూ మధ్య మధ్య లో ఈ ఏడు ఏం చాక్లెట్లు తెచ్చారా అని కాస్త పలుకుబడి ఉన్న విధ్యార్ధుల ని ఆరా తీయడం లాటి కార్యక్రమాలతో సందడిగా ఉండేది. ఆ తర్వాత పిల్లలంతా క్రమశిక్షణ తో వరుస క్రమం లో నిలబడటం, పిల్లా పెద్దా జరిపే ప్రార్ధనలు, పెద్దల ఉపన్యాసాలు,పతాకావిష్కరణా, జండావందనం, జణగణమణ గీతం అన్నీ అద్భుతంగా ఉండేవి. ఇప్పుడేమయ్యాయో ఆ ఆనందాలు. పైన చెప్పిన పాటలతో పాటు తర్వాత వచ్చి చేరిన మర్చి పోలేని మరొకొన్ని పాటలు "రేపటి పౌరులం..రేపటి పౌరులం..", "వందే మాతరం.. వందేమాతరం.." ఈ రెండో పాట రాజశేఖర్ నటించిన వందేమాతరం సినిమాలోది అనుకుంటా.. కాస్త యుక్త వయసులో ఉన్నపుడు బోలెడంత ఆవేశాన్ని కలిగించేది.

జయ జయ జయ ప్రియ భారత పాట చిమటమ్యూజిక్ వెబ్సైట్ లో వినడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

చిత్రం : రాక్షసుడు
సంగీతం : ఇళయరాజా (లలితగీతపు బాణీ ని యధాతధంగా ఉపయోగించారు)
సాహిత్యం : దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం : జానకి

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి
జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయనేత్రి
జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయనేత్రి
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి

జయ జయ సశ్యామల సుశ్యామచలాచ్చేలాంచల
జయ జయ సశ్యామల సుశ్యామచలాచ్చేలాంచల
జయ వసంత కుసుమలతా చలిత లలిత చూర్ణకుంతల ఆ..ఆ..
జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళా
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి

జయ దిశాంత గత శకుంత దివ్య గాన పరితోషణ
జయ దిశాంత గత శకుంత దివ్య గాన పరితోషణ
జయ గాయక వైతాళిక గళ విశాల పత విహరణ ఆ..ఆ..
జయ మదీయ మధురగేయ చుంబిత సుందర చరణా

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి
జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయనేత్రి
జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయనేత్రి
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి


చిత్రం "http://www.zabrigraphics.com/graphics/act,categories/cid,46/" నుండి సంగ్రహించబడినది.

ఈ బ్లాగ్ ఎందుకంటే ??

అతిథులకు నమస్కారం. ఓ ఏడాది క్రితం నా ఙ్ఞాపకాలు పదిల పరచుకోవాలని మొదలు పెట్టిన నా బ్లాగ్ లో నా ఙ్ఞాపకాల కంటే పాటల గురించే ఎక్కువ టపాలు ప్రచురించాను. నాకు పాటలంటే అంత ఇష్టం. కానీ నేను ఏవిధమైన సంగీతం నేర్చుకోలేదు కేవలం శ్రోతని మాత్రమే.. అప్పుడప్పుడూ శ్రుతి, రాగం, తాళం లాటి వాటి తో పని లేకుండా పాటలు పాడుకుంటుంటాను. కాలేజి రోజులలో నా సౌండ్ బాగుందని ఒకటి రెండు సార్లు స్టేజ్ పై కూడా పాడనిచ్చారు లేండి అది వేరే విషయం. సరే ఇంత పాటల పిచ్చి ఉన్న నేను పాటల ప్రధానంగా ఒక బ్లాగ్ ప్రారంభిస్తే ఎలా ఉంటుంది అని చాలా రోజులగా ఆలోచించీ..చించీ..చించగా ఇప్పటికి దానికి ఒక కార్య రూపం ఇవ్వగలిగాను. తత్ఫలితమే ఈ బ్లాగు.

నా మరో బ్లాగ్ లో ఇప్పటి వరకూ పోస్ట్ చేసిన పాటలన్నీ ఇక్కడికి కాపీ చేశాను. వాటిని కాస్త సరిచేసి ఇండెక్సింగ్ చేయాలన్న ఆలోచనని ఎప్పటికి ఆచరణ లో పెడాతాను అనే విషయం ఇప్పుడే అడగకండి. ఇక ఈ బ్లాగ్ నుండి ఏమి ఆశించవచ్చు అంటారా? ముఖ్య విభాగాలు చూసిన వారు ఇప్పటికే ఓ అంచనాకి వచ్చి ఉంటారు. ముఖ్యంగా నాకు ఎనభైల లో వచ్చిన తెలుగు పాటలు ఇష్టం, ఇంకా విశ్వనాధ్ గారి పాటలు, వాటితో పాటు బాలమురళీ కృష్ణ గారి శాస్త్రీయ సంగీతమూ విని ఆనందిస్తాను. అలాగే మూడ్ ని పట్టి కొన్ని మాంచి మాస్ మసాలా పాటలూ, అదే చెవితో మైఖేల్ జాక్సన్ లాటి ఆంగ్ల సంగీత కారుల పాటలూ వింటాను (ఇవి చాలా సెలక్టివ్ అనుకోండి).

సో నే వినే పాట లలోనుండి వీలుని పట్టి నాకు నచ్చిన పాటలూ, ఆ పాట వినగానే నా మనసులో కదిలే ఙ్ఞాపకాలు, ఆపాట నాకు అందించే అనుభూతులు అన్నీ మీతో పంచుకుంటాను. ప్రతిపాటకూ సాహిత్యం తప్పని సరిగా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను, ఇంకా లభ్యతని పట్టి ఆడియో / వీడియో లింకు లు, పాటకి సంబందించిన ఇతర వివరాలు కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఓ విధంగా ఇది నా అన్లైన్ సినిమా పాటల పుస్తకం అని చెప్పచ్చనమాట, సరే మరి అలా అలా నా పాటల ప్రపంచం లో విహారించండి ఇక, ప్రస్తుతానికి శలవు.

శనివారం, ఆగస్టు 01, 2009

సిగలో.. అవి విరులో -- మేఘసందేశం

గత రెండు మూడు వారాలు గా ఈ పాట నన్ను వెంటాడుతుంది, ఎంతగా అంటే ఎక్కడో అడుగున పడిపోయిన నా కలక్షన్ లో వెతికి వెతికి వెలికి తీసి తరచుగా మళ్ళీ వినేంతగా. కారణం ఏమిటో తెలియదు కానీ ఈ ఆల్బం ఎందుకో సంవత్సరానికి ఒక్క సారైనా ఇలా బాగా గుర్తొస్తుంది. అప్పుడు ఒక నెల రెండు నెలలు వినేశాక కాస్త మంచి పాటలు ఏమన్నా వస్తే మళ్ళీ అడుగున పడి పోతుంది. కానీ అక్కడే అలా ఉండి పోదు మళ్ళీ హఠాత్తుగా ఓ రోజు ఙ్ఞాపకమొచ్చి మళ్ళీ తనివి తీరా వినే వరకూ అలా వెంటాడూతూనే ఉంటుంది. మంచి సంగీతం గొప్ప తనం అదేనేమో మరి !! ఈ సినిమా గురించి కానీ సంగీతం గురించి కానీ నేను ప్రత్యేకంగా చెప్పగలిగినది ఏమీ లేదు. నాకు బాగా నచ్చే సినిమాల మొదటి జాబితా లో ఉంటుంది. కధ, సంగీతం, నటీనటుల నటన వేటికవే సాటి. ఈ సినిమా గురించి తెలియని వారుంటే తెలుసు కోడానికి నవతరంగం లో ఈ వ్యాసం చదవండి. ఈ ఆల్బం లో పాటలు అన్నీ ఒక దానిని మించి ఒకటి ఉంటాయి. సరే మరి నన్ను వెంటాడుతున్న ఈ పాట ని మీరూ ఓ సారి ఇక్కడ చిమట మ్యూజిక్ లో విని ఆనందించండి. మొన్నేమో కళ్యాణం, ఇప్పుడేమో సిగలు, విరులు, అగరు పొగలు అసలూ... "సంగతేంటి గురూ !!" అని అడగకండేం :-)


చిత్రం: మేఘసందేశం
గానం: కె. జె. ఏసుదాస్
సాహిత్యం :దేవులపల్లి కృష్ణశాస్త్రి
సంగీతం : రమేష్ నాయుడు.

సిగలొ.. అవి విరులో.. అగరు పొగలో.. అత్తరులో..
మగువ సిగ్గు దొంతరలో.. మసలె వలపు తొలకరులో..
సిగలొ.. అవి విరులో.. అగరు పొగలో.. అత్తరులో..
మగువ సిగ్గు దొంతరలో.. మసలె వలపు తొలకరులో..
సిగలొ.. అవి విరులో..

ఎదుట నా ఎదుటా ఏవో సోయగాల మాలికలు..
ఎదుట నా ఎదుటా ఏవో సోయగాల మాలికలు..
మదిలోనా గదిలోనా... మదిలోనా గదిలోనా...
మత్తిలిన కొత్త కోరికలూ...నిలువనీవు నా తలపులు..
మరీ మరీ ప్రియా..ప్రియా...
నిలువనీవు నా తలపులూ.. నీ కనుల ఆ పిలుపులూ..

సిగలొ.. అవి విరులో.. అగరు పొగలో.. అత్తరులో..
మగువ సిగ్గు దొంతరలో.. మసలె వలపు తొలకరులో..
సిగలొ.. అవి విరులో..

జరిగి ఇటు ఒరిగీ... పరవశాన ఇటులే కరిగి
జరిగి ఇటు ఒరిగీ... పరవశాన ఇటులే కరిగి
చిరునవ్వుల అర విడినా.. చిగురాకు పెదవుల మరిగీ..
చిరునవ్వుల అర విడినా.. చిగురాకు పెదవుల మరిగీ..
మరలి రాలేవు నా చూపులూ.. మరీ మరీ ప్రియా ప్రియా
మరలి రాలేవు నా చూపులూ.. మధువుకై మెదలు తుమ్మెదలూ...

సిగలొ.. అవి విరులో.. అగరు పొగలో.. అత్తరులో..
మగువ సిగ్గు దొంతరలో.. మసలె వలపు తొలకరులో..
సిగలొ.. అవి విరులో..

శనివారం, జులై 25, 2009

సీతాకళ్యాణం - వాగ్దానం(1961) సాహిత్యం

ఘంటసాల మాష్టారి గాత్ర మాధుర్యమో, శ్రీ రామ కథ లోని మహత్తో, పెండ్యాల వారి సంగీత మహిమో లేదా అసలు హరికధా ప్రక్రియ గొప్పతనమే అంతో నాకు సరిగా తెలియదు కానీ, ఈపాట ఎన్ని సార్లు విన్నా ఒళ్ళు పులకరిస్తూనే ఉంటుంది. రేలంగి, నాగేశ్వరరావు, కృష్ణకుమారి లపై చిత్రీకరించిన ఈ పాట లో విశేషమేమిటంటే.. చిత్రీకరణ లో ఎక్కడా శ్రీరామ కళ్యాణాన్ని చూపించరు కానీ కనులు మూసుకుని పాట వింటుంటే మాత్రం కళ్యాణ ఘట్టం అంతా కనుల ముందు సాక్షాత్కరిస్తుంది. ఇది రాసినది శ్రీశ్రీ గారు అని మొదటి సారి తెలిసినపుడు చాలా ఆశ్చర్య పోయాను. ఇక పాట విషయానికి వస్తే రేలంగి గారి బాణి లో చిన్న చిన్న చెణుకు లు విసురుతూ నవ్విస్తూ హుషారు గా సాగే కధ లో మనం మైమరచి పోతాం. "రఘూ రాముడూ... రమణీయ..." అని మొదలు పెట్టగనే తెలియకుండానే తన్మయంగా తల ఊపేస్తాం.. "ఎంత సొగసు కాడే.." అంటే అవును కదా అని అనిపించక మానదు... అసలు సొగసు అన్న మాట పలకడం లోనే ఘంటసాల గారు ఆ దివ్య సుందర మూర్తిని సాక్షాత్కరింప చేస్తారు.
మీరెపుడైనా జలపాతాన్ని దూరం నుండి కాకుండా దాని పై నుండి చూశారా... ప్రవాహం అంతా చాలా ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఏదో చిన్న పిల్ల కాలువ లా ప్రవహిస్తూ కనిపిస్తుంది... కాని ఒక్క సారి అంచుకు వెళ్ళి చూడగానే పైనుండి పోటెత్తుతూ ఉదృతంగా హుషారు గా ముందుకు దూకుతూ మనకి కనువిందు చేస్తుంది. ఇంత వర్ణించడమెందుకు చాలా సినిమా లలో జలపాతాల లో ప్రమాదం సీన్ల లో ఇది మీరు గమనించే ఉంటారు. అలానే అప్పటి వరకు నెమ్మదిగా వ్యాఖ్యానంతో సాగే కథ ఒక్క సారిగా "ఇనకుల తిలకుడు నిలకడ గల క్రొక్కారు మెఱుపు వలె నిల్చీ.." అని అంటూ ఆ జలపాతపు దూకుడునంతా తన స్వరం లో చూపించేస్తారు ఘంటసాల గారు. ఇక చివరికి వచ్చే సరికి హెచ్చు స్వరం లో ఒక్క సారి గా "ఫెళ్ళు మనె విల్లు... " అనగానే సీతమ్మవారి సంగతేమో కానీ కధ వింటున్న వారెవ్వరికైనా గుండె ఝల్లు మనక మానదు అంటే అతిశయోక్తి కాదేమో.

పొయిన ఏప్రిల్ లో శ్రీరామ నవమి రోజు ఈ పాట చాలా గుర్తు చేసుకున్నాను అదే రోజు మధురవాణి గారు తన బ్లాగు లో ఈ పాట లింక్ ఇచ్చారు.. దానికి వెంటనే సాహిత్యం ఇద్దామనుకున్నాను కాని ఇన్ని రోజులకి కుదిరింది. మధురవాణి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ అప్ లోడ్ చేయడానికి బద్దకించి, వారి ఈస్నిప్స్ యకౌంట్ నుండే ఎంబెడ్ చేయబడిన పాట ని, ఈ హరికథా సాహిత్యాన్ని ఇక్కడ మీకోసం ఇస్తున్నాను. విని, చదివి ఆనందించండి తప్పులేమన్నా ఉంటే వ్యాఖ్య ద్వారా తెలియచేయండి.



చిత్రం : వాగ్దానం
సంగీతం : పెండ్యాల
గానం : ఘంటసాల
సాహిత్యం : శ్రీశ్రీ

శ్రీ నగజా తనయం సహృదయం
శ్రీ నగజా తనయం సహృదయం
చింతయామి సదయం త్రిజగన్మహోదయం
శ్రీ నగజా తనయం...ఊ..ఊ...

శ్రీ రామ భక్తులారా ఇదీ సీతాకళ్యాణ సత్కథ
నలభై రోజులనుంచీ చెప్పిన కథ చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను
అంచేత కించిత్తు గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు తోస్తుంది
నాయనా కాస్త పాలూ మిరియాలూ ఏమైనా...
చిత్తం.. సిద్దం...

భక్తులారా... సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాలనుంచీ విచ్చేసిన వీరాధి వీరుల్లో..
అందరినీ ఆకర్షించిన ఒకే ఒక్క దివ్య సుందర మూర్తి ఆహ్హ !! అతడెవరయ్యా అంటే...

రఘూరాముడు రమణీయ వినీల ఘన శ్యాముడు..
రమణీయ... వినీల.. ఘన శ్యాముడు..
వాడు నెలరేడు సరిజోడు మొనగాడు..
వాని కనులు మగమీలనేలు రా..
వాని నగవు రతనాల జాలు రా..
వాని కనులు మగమీలనేలు రా..
వాని నగవు రతనాల జాలు రా..
వాని జూచి మగవారలైన మైమరచి మరుల్కొనెడు మరో మరుడు మనోహరుడు..రఘూరాముడు

సనిదనిసగ రిగరి రిగరి సగరి రిగరి సగగరి సనిదని
సగగరి సని రిసనిస రిసనిస నిదపమగరి రఘురాముడు...
ఔనౌను...
సనిస సనిస సగరిరిగరి సరిసనిస..పదనిస..
సనిగనినిస సనిరిసనిదని నిదసనిదపమ గ మ స
నినినినిని..పస పస పస పస...
సఫ సఫ సఫ తద్దీం తరికిటతక...
రఘూరాముడూ రమణీయ వినీల ఘన శ్యాముడు..
శభాష్..శభాష్...

ఆప్రకారంబుగా విజయం చేస్తున్న శ్రీరామచంద్రమూర్తిని అంతఃపుర గవాక్షం నుండీ సీతాదేవి ఓరకంట చూచినదై
చెంగట నున్న చెలికత్తె తో.. ఎంత సొగసుగాడే..ఎంత సొగసుగాడే మనసింత లోనే దోచినాడే... ఎంత సొగసుగాడే...
మోము కలువ రేడే ఏ..ఏ.. ఏ... మోము కలువ రేడే నా నోము ఫలము వీడే...
శ్యామలాభిరాముని చూడగ నామది వివశమాయె నేడే... ఎంత సొగసుగాడే..
ఇక్కడ సీతాదేవి ఇలా పరవశయై ఉండగా..
అక్కడ స్వయం వర సభా మంటపంలో జనక మహీపతి సభాసదులను చూచి
అనియెనిట్లు ఓ యనఘులార నా యనుగు పుత్రి సీతా...
వినయాదిక సద్గుణ వ్రాత.. ముఖ విజిత లలిత జలజాత...
ముక్కంటి వింటి నెక్కిడ జాలిన ఎక్కటి జోదును నేడు
మక్కువ మీరగ వరించి మల్లెల మాల వైచి పెండ్లాడు...ఊ..ఊ...

అని ఈ ప్రకారం జనక మహారాజు ప్రకటించగానే సభలోని వారందరూ ఎక్కడివారక్కడ చల్ల బడి పోయారట...
మహా వీరుడైన రావణాసురుడు కూడా..హా ఇది నా ఆరాధ్య దైవమగు పరమేశ్వరుని చాపము
దీనిని స్పృశించుట యే మహా పాపము అని అనుకొనిన వాడై వెనుదిరిగి పోయాడట తదనంతరంబున...

ఇనకుల తిలకుడు నిలకడ గల క్రొక్కారు మెఱుపు వలె నిల్చీ..
తన గురువగు విశ్వామితృని ఆశీర్వాదము తలదాల్చి...
సదమల మద గజ గమనము తోడ స్వయంవర వేదిక చెంత..
మదన విరోధి శరాసనమును తన కరమున బూనిన యంత...

ఫెళ్ళు మనె విల్లు గంటలు ఘల్లు మనే...
ఘుభిల్లుమనె గుండె నృపులకు..
ఝల్లు మనియె జానకీ దేహమూ...
ఒక నిమేషమ్మునందె.. నయము జయము ను
భయము విస్మయము గదురా... ఆఆ ఆఆ
శ్రీమద్రమారమణ గోవిందో హారి... హారి
భక్తులందరు చాలా నిద్రావస్త లో ఉన్నట్టుగా ఉంది మరొక్కసారి..
జై శ్రీమద్రమారమణ గోవిందో హారి... హారి
భక్తులారా ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి శివ ధనుర్బంగము కావించినాడు...
అంతట..
భూతల నాధుడు రాముడు ప్రీతుండై పెండ్లియాడే..
పృథుగుణ మణి సంఘాతన్ భాగ్యో పేతన్ సీతన్..
భూతల నాధుడు రాముడు ప్రీతుండై పెండ్లియాడే..
శ్రీమద్రమారమణ గోవిందో హారి... హారి

మంగళవారం, జూన్ 30, 2009

అలక పానుపు ఎక్కనేల-శ్రీవారి శోభనం

ఈ సినిమా నాకు పూర్తిగా చూసినట్లు గుర్తు లేదు ఎపుడో ఒక సారి టీవీ లో ఈ పాట వేస్తుంటేనో లేక సినిమా వేస్తుంటే పాట మాత్రమే చూసానో కూడా సరిగా గుర్తు లేదు కాని అప్పట్లో రేడియో లో క్రమం తప్పకుండా నేను వినే కొన్ని పాటలలో ఇదీ ఒకటి. మొదట్లో అంటే మరీ చిన్న తనం లో బామ్మ గారి కామెంట్స్ విని నవ్వుకోడానికి వినే వాడ్ని, కాస్త పెద్దయ్యాక భామ గారి పాట్లు అవగతమై పాట పూర్తి గా అర్ధమయింది :-) ఇక జానకమ్మ గారి గాత్రం గురించి నేనేం చెప్పినా తక్కువే... ఆ దోర నవ్వు దాచకే అని అంటూ ఆవిడ నవ్వే నవ్వు మనకే తెలియకుండా మన పెదవులపై చిరుమందహాసాన్ని నాట్యం చేయిస్తుంది. అంతెందుకు ఆవిడ శీతాకాలం అంటూ గొంతు వణికించడం వింటే ఎంత మండు వేసవి లో ఉన్నా మనకీ చలి వేసి వణుకు పుట్టేస్తుందంటే అతిశయోక్తి కాదేమో... పాటంతా వేటూరి గారు ఎంత అందం గా రాశారో బామ్మ గారి చివరి మూడుపంక్తులు "నులకపానుపు నల్లి బాధ.." అంటూ అంతే కొంటె గా రాశారు. సరే మరి మీరూ ఓ సారి మళ్ళీ విని తరించేయండి.



చిత్రం : శ్రీవారి శోభనం (1985)
సాహిత్యం :వేటూరి
సంగీతం : రమేష్ నాయుడు
గానం : జానకి, ఆనితా రెడ్డి

అలక పానుపు ఎక్కనేల చిలిపి గోరింకా...ఆ..అలక చాలింకా...
బామ్మ: నాకలకేమిటే నీ మొహం ఊరుకో...
అలక పానుపు ఎక్కనేల చిలిపి గోరింకా...ఆ..అలక చాలింకా...
శీతాకాలం సాయంకాలం...మ్...
శీతాకాలం సాయంకాలం...మ్...
అటు అలిగిపోయే వేళా చలికొరికి చంపే వేళా...ఆఆ....
బామ్మ: అందుకే లోపలికి పోతానే తల్లి నన్నొదులు....

||అలకపానుపు||

రామ రామ శబరి బామ్మ నిద్దరేపోదూ..!!
బామ్మ: హూ నువ్విట్టా ఇంతగొంతేసుకుని పాడితే నిద్దరెట్టాపడుతుందే...
రాతిరంతా చందమామ నిదరపోనీదు...ఊ..ఊ...
కంటి కబురా పంప లేనూ...ఊ...
ఇంటి గడపా దాటలేనూ..ఊ..
ఆ దోర నవ్వు దాచకే.. నా నేరమింకా ఎంచకే...
ఆ దోర నవ్వు దాచకే.. ఈ నవ్వు నవ్వి చంపకే...

||అలకపానుపు||

రాసి ఉన్న నొసటి గీత చెరపనేలేరు...
రాయనీ ఆ నుదుటి రాతా రాయనూ లేరూ...
బామ్మ: ఆ రాతే రాసుంటే ఇంట్లో నే వెచ్చగా నిద్రబోయేదాన్ని కదా !!
రాసి ఉన్న నొసటి గీత చెరపనేలేరు...
రాయనీ ఆ నుదుటి రాతా రాయనూ లేరూ...
నచ్చినా మహరాజు నీవూ...
నచ్చితే మహరాణి నేనూ...
ఆ మాట ఏదో తెలిపితే నీ నోటి ముత్యం రాలునా...

బామ్మ:
నులకపానుపు నల్లి బాధ పిల్ల చిలకమ్మా... అల్లరాపమ్మా...
శీతాకాలం సాయంకాలం శీతాకాలం సాయంకాలం...ఊ..||2||
నను చంపకే తల్లీ... జో కొట్టకే గిల్లీ...

||అలకపానుపు||

ఆదివారం, జూన్ 21, 2009

మాటల్తో స్వరాలే షికారు కెళ్తె...

సంగీతాభిమానులందరికీ ప్రపంచ సంగీత దినోత్సవ (June 21st) శుభాకాంక్షలు...

ఈ రోజు ప్రపంచ సంగీత దినోత్సవం అని ఉదయాన్నే తన విషెస్ తో తెలియచేసిన నేస్తానికీ, ఇంకా ఈ పాట తో విషెస్ చెప్పిన మరో నేస్తానికి థ్యాంక్స్ తెలుపుకుంటూ మీ కోసం ఈ పాట.

ఇక్కడ వినండి

చిత్రం : అమ్మచెప్పింది
సంగీతం : కీరవాణి
సాహిత్యం : సుద్దాల అశోక్ తేజ
గానం : ప్రణవి

మాటల్తో స్వరాలే షికారు కెళ్తె గీతం
అందంగా నిశ్శబ్దం తలొంచుకుంటే సంగీతం
సంగీతం తో చేస్తే స్నేహం
పలికిందల్లా గీతం...

||మాటల్తో||

కాగితాలలో నిదురపోయే కమ్మనీ మాటే..
కాస్త లెమ్మనీ ఇళయరాజా ట్యూన్ కడుతుంటే..
పాటల్లె ఎగిరి రాదా.. నీ గుండె గూడైపోదా..
సంగీతం తో చేస్తే స్నేహం
హృదయం లయలే గీతం...

||మాటల్తో||

గోరుముద్దలో కలిపి పెట్టే గారమొక పాట
పాఠశాలలో మొదట నేర్పే పాఠమొక పాటా
ఊయలని ఊపును పాటే
దేవుడిని నేర్పును పాటే..
సంగీతం తో చేస్తే స్నేహం
బ్రతుకంతా ఓ గీతం...

||మాటల్తో||

శుక్రవారం, జూన్ 19, 2009

పల్లెటూరి పిల్లగాడా...పశులగాసే మొనగాడ..

ఒకో సారి హఠాత్తుగా, కారణం తెలియకుండా ఎప్పుడో విన్న పాట, చాలా రోజులుగా అసలు వినని పాట ఒకసారిగా గుర్తొచ్చి అలా ఒకటి రెండు రోజులు వెంటాడుతూ ఉంటుంది. మన మూడ్ కాని ఉన్న పరిసరాలు కానీ పట్టించుకోకుండా పదే పదే అదే హమ్ చేసేస్తాం. నన్ను గత రెండు రోజులుగా అలా వెంటాడుతున్న పాట "మాభూమి" చిత్రం లోని "పల్లెటూరీ పిల్లగాడ.." పాట. నిజానికి ఈ సినిమా గురించి గానీ పాట గురించి గానీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాల కార్మిక వ్యవస్తనంతటినీ కాకున్నా పల్లెల్లో సాధారణంగా కనిపించే పిల్లల గురించి వాళ్ళ శ్రమని కూడా ఎలా దోచుకుంటారో తెలియచేస్తూ హృద్యంగా రాసిన సాహిత్యం ఒక ఎత్తైతే. ఈ పాట పాడిన సంధ్య గారి గాత్రం మరో ఎత్తు. పదునుగా ప్రశ్నిస్తున్నట్లు ఉంటూనే "ఓ..పాల బుగ్గలా జీతగాడ.." అనే చోట... ఓ అని అనడం లో తన స్వరం లో విషాదం తో గుండెలు పిండేస్తారు ఆవిడ.

ఈ చిత్రం గురించి పరిచయం కోసం ఇక్కడ తెలుగుసినిమా లో ఇంకా ఈ చిత్ర రూపకర్తల్లో ఒకరైన నర్సింగరావు గారి గురించి ఇక్కడ మన నవతరంగం లో చూడగలరు. ఈ సినిమాను నేను మొదటి సారి 90 లలో ఎపుడో దూరదర్శన్ లో వేసినపుడు చూసాను అంతకు ముందు పాట విన్నాను కానీ అపుడే మొదటి సారి చూడటం, చూసినపుడు ఏదో నలభైల లో వచ్చిన సినిమా కావచ్చు అని అనుకున్నాను కానీ అన్నగారు చిలకొట్టుడు కొడుతూ ఊపేస్తున్న సమయం లో అంటే 1980 లో విడుదలై ఇంత హిట్ అయింది అని తెలుసుకుని చాలా ఆశ్చర్యపోయాను.

అన్నట్లు, బాల కార్మికులంటే నన్నెప్పటి నుండో తొలుస్తున్న ఓ ప్రశ్న గుర్తొచ్చింది ఇది కేవలం ఇళ్ళలోనో హోటళ్ళలోనో కూలి పని చేసే వారికే వర్తిస్తుందా ? వాణిజ్య ప్రకటనల లోనూ, చలన చిత్రాల లోనూ పని చేసే పసి పిల్లలకు వర్తించదా ఈ బాలకార్మిక చట్టం!! ఆ మాట కొస్తే బండెడు పుస్తకాలను మోసుకు వెళ్ళే మా సంగతేంటి అంటారేమో కాన్వెంట్ పిల్లలు.

ఈ పాట వీడియో ఇక్కడ చూడచ్చు...




వీడియో లో కొన్ని చరణాలు లేవు పూర్తి పాట ఆడియో ఇక్కడ వినండి

Palletoori Pillaga...


చిత్రం : మాభూమి (1980)
సంగీతం : వింజమూరి సీత, గౌతం ఘోష్
సాహిత్యం : సుద్దాల హనుమంతు
గానం : సంధ్య

పల్లెటూరీ పిల్లగాడా!! పశులగాసే మొనగాడ !!
పల్లెటూరీ పిల్లగాడా !! పశులగాసే మొనగాడ !!

పాలు మరచీ ఎన్నాల్లయ్యిందో .. ఓ..పాలబుగ్గలా జీతగాడా..
కొలువు కుదిరీ ఎన్నాల్లయ్యిందో..

చాలి చాలని చింపులంగీ చల్లగాలికి సగము ఖాళీ..
చాలి చాలని చింపులంగీ చల్లగాలికి సగము ఖాళీ..
గోనె చింపూ కొప్పెర పెట్టావా...
ఓ.. పాలబుగ్గలా జీతగాడా..
దాని చిల్లులెన్నో లెక్కాబెట్టేవా..

తాటి గెగ్గలా కాలి జోడూ తప్పటడుగుల నడక తీరు
తాటి గెగ్గలా కాలి జోడూ తప్పటడుగుల నడక తీరు
బాట తో పని లేకుంటయ్యిందా...

ఓ.. పాలబుగ్గలా జీతగాడా..
చేతికర్రే తోడైపోయిందా..

గుంపు తరలే వంపు లోకి కూరుచున్నవు గుండు మీద..
గుంపు తరలే వంపు లోకి కూరుచున్నవు గుండు మీద..
దొడ్డికే నీవు దొరవై పోయావా...
ఓ.. పాలబుగ్గలా జీతగాడా..
దొంగ గొడ్లనడ్డగించేవా...

కాలువై కన్నీరు గారా... కల్ల పై రెండు చేతులాడ..
కాలువై కన్నీరు గారా... కల్ల పై రెండు చేతులాడ..
వెక్కి వెక్కి ఏడ్చెదవదియేలా
ఓ.. పాలబుగ్గలా జీతగాడా..
ఎవ్వరేమన్నారో చెప్పేవా..


మాయదారి ఆవుదూడలు మాటి మాటికి ఎనుగుదుమికి
మాయదారి ఆవుదూడలు మాటి మాటికి ఎనుగుదుమికి
పంట చేను పాడు చేసాయా
ఓ.. పాలబుగ్గలా జీతగాడా..
పాలికాపూ నిన్నే గొట్టాడా..

నీకు జీతము నెలకు కుంచము.. తాలు వడిపిలి కల్తి గాసము
నీకు జీతము నెలకు కుంచము.. తాలు వడిపిలి కల్తి గాసము
కొలువగ శేరు తక్కువ వచ్చాయా...
ఓ.. పాలబుగ్గలా జీతగాడా..
తల్చుకుంటే దుఖం వచ్చిందా..

పల్లెటూరీ పిల్లగాడా !! పశులగాసే మొనగాడ !!
పల్లెటూరీ పిల్లగాడా !! పశులగాసే మొనగాడ !!
పాలు మరచీ ఎన్నాల్లయ్యిందో ..
ఓ..పాలబుగ్గలా జీతగాడా..

కొలువు కుదిరీ ఎన్నాల్లయ్యిందో..
కొలువు కుదిరీ ఎన్నాల్లయ్యిందో..
కొలువు కుదిరీ ఎన్నాల్లయ్యిందో..

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.