బ్లాగ్ మితృలందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేశభక్తి గీతాల జాబితా కి అంతులేకున్నా... నన్ను బాగా ఆకట్టుకున్న గీతం దేవులపల్లి వారి "జయ జయ ప్రియభారత ". నేను ఆరవతరగతి లో ఉండగా మా హిందీ మాష్టారు నా గొంతు బావుందని (అప్పట్లో బాగానే ఉండేది లెండి) ఈ పాట, ఇంకా "దేఖ్ తెరే సంసార్ కి హాలత్ క్యా హొగయీ భగవాన్...కిత్‌నా బదల్ గయా ఇన్సాన్..." అనే పాటా నేర్పించారు. ఈ పాట ఎన్ని సార్లు విన్నా నాకు మొదట ఆయనే గుర్తు వస్తారు. ఇదే పాట చిరంజీవి గారి రాక్షసుడు సినిమాలో కూడా ఉపయోగించారు. మామాష్టారు నేర్పిన బాణీ లోనే సినిమా పాట సాగుతుంది. కేవలం సౌందర్యం తోనే కాక ఎన్నుకునే పాత్రలు, వాటిలో లీనమయ్యే తన నటన ద్వారా నన్ను ఆకట్టుకునే కథానాయిక సుహాసిని పై చిత్రీకరించడం నన్ను మరింత అలరించింది.
ఇంకా స్వాతంత్ర దినోత్సవం అంటే వీరుల త్యాగాలు, అలుపెరుగని పోరాటాలు గుర్తిచ్చినా, ఆ తర్వాత గుర్తొచ్చేది బాల్యమే. స్కూల్ లో స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నంత బాగా ఇంకెక్కడా నేనైతే జరుపుకోలేదు (ఈ ఏడు కాస్త వైవిధ్యం ఉంది కానీ దాని గురించి మరో టపాలో). స్కూల్ లో అతి పెద్ద పండగ ఆగస్టు పదిహేను. ఇంట్లో నాన్న ఎర్రకోట పై జండా వందనం విని/చూసి ఆతర్వాత అమ్మా నాన్న వాళ్ళ వాళ్ళ ఆఫీసులకి కేవలం జండా వందనం గురించి వెళ్ళే వాళ్ళు. స్కూల్ లో వారం పదిరోజుల ముందు నుండి ఉన్న హడావిడి ఆ రోజు పతాక స్థాయికి చేరుకునేది.
అద్దెకి తెచ్చిన మైక్ సెట్ లో వేసే "భారత మాతకు జేజేలు..", "పాడవోయి భారతీయుడా..", "నాజన్మభూమి ఎంత అందమైన దేశము..", "చెడు అనవద్దు చెడు కనవద్దు..", గాంధిపుట్టిన దేశమా ఇది.. " లాటి దేశభక్తి గీతాల నేపధ్యం లో క్లాస్ లో అక్కడక్కడా ఊడిపోయిన రంగుకాగితాలని మళ్ళీ అంటిచడం, స్టేజ్ సరిచేయడం, కుర్చీలు గట్రా సర్ధడం ఇత్యాది పనులు చేస్తూ మధ్య మధ్య లో ఈ ఏడు ఏం చాక్లెట్లు తెచ్చారా అని కాస్త పలుకుబడి ఉన్న విధ్యార్ధుల ని ఆరా తీయడం లాటి కార్యక్రమాలతో సందడిగా ఉండేది. ఆ తర్వాత పిల్లలంతా క్రమశిక్షణ తో వరుస క్రమం లో నిలబడటం, పిల్లా పెద్దా జరిపే ప్రార్ధనలు, పెద్దల ఉపన్యాసాలు,పతాకావిష్కరణా, జండావందనం, జణగణమణ గీతం అన్నీ అద్భుతంగా ఉండేవి. ఇప్పుడేమయ్యాయో ఆ ఆనందాలు. పైన చెప్పిన పాటలతో పాటు తర్వాత వచ్చి చేరిన మర్చి పోలేని మరొకొన్ని పాటలు "రేపటి పౌరులం..రేపటి పౌరులం..", "వందే మాతరం.. వందేమాతరం.." ఈ రెండో పాట రాజశేఖర్ నటించిన వందేమాతరం సినిమాలోది అనుకుంటా.. కాస్త యుక్త వయసులో ఉన్నపుడు బోలెడంత ఆవేశాన్ని కలిగించేది.
చిత్రం : రాక్షసుడు
సంగీతం : ఇళయరాజా (లలితగీతపు బాణీ ని యధాతధంగా ఉపయోగించారు)
సాహిత్యం : దేవులపల్లి కృష్ణశాస్త్రి
గానం : జానకి
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి
జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయనేత్రి
జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయనేత్రి
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి
జయ జయ సశ్యామల సుశ్యామచలాచ్చేలాంచల
జయ జయ సశ్యామల సుశ్యామచలాచ్చేలాంచల
జయ వసంత కుసుమలతా చలిత లలిత చూర్ణకుంతల ఆ..ఆ..
జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళా
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి
జయ దిశాంత గత శకుంత దివ్య గాన పరితోషణ
జయ దిశాంత గత శకుంత దివ్య గాన పరితోషణ
జయ గాయక వైతాళిక గళ విశాల పత విహరణ ఆ..ఆ..
జయ మదీయ మధురగేయ చుంబిత సుందర చరణా
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి
జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయనేత్రి
జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయనేత్రి
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి
9 comments:
అభినందనలు.. మంచి మంచి పాటల పరిచయాల కోసం ఎదురు చూస్తూ ఉంటామండి..
Thanks for giving us a great song, which is forgotten these days !
can you please tell me where the 2nd song in the movie is from, and the link. I'm not able to find it anywhere by googling.Atleast if I know the movie name, I can get the song.
http://www.youtube.com/watch?v=jrp-OAQSI8g&feature=related
మురళి గారు, అఙ్ఞాత గారు నెనర్లు.
U started new blog, which is useful to us. NicO
మంచి పని చేస్తున్నారు ఇక నుండి మంచి మంచి పాటలు ఈ సైట్ లో లభ్యం అన్నమాట
కాస్త ఆలస్యంగా చూసానండి. పైన అందరిదే నా మాటాను.
గీతాచార్య గారు, నేస్తం గారు, ఉష గారు నెనర్లు.
చాల ఆలస్యంగా చూసాను .ఈ పాట నాకు చాల ఇష్టం మా ఆరో తరగతిలో ప్రేయర్ సాంగ్ పాడేవాళ్ళం.థాంక్సండీ .
చిన్ని గారు నెనర్లు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.