శనివారం, జులై 25, 2009

సీతాకళ్యాణం - వాగ్దానం(1961) సాహిత్యం

ఘంటసాల మాష్టారి గాత్ర మాధుర్యమో, శ్రీ రామ కథ లోని మహత్తో, పెండ్యాల వారి సంగీత మహిమో లేదా అసలు హరికధా ప్రక్రియ గొప్పతనమే అంతో నాకు సరిగా తెలియదు కానీ, ఈపాట ఎన్ని సార్లు విన్నా ఒళ్ళు పులకరిస్తూనే ఉంటుంది. రేలంగి, నాగేశ్వరరావు, కృష్ణకుమారి లపై చిత్రీకరించిన ఈ పాట లో విశేషమేమిటంటే.. చిత్రీకరణ లో ఎక్కడా శ్రీరామ కళ్యాణాన్ని చూపించరు కానీ కనులు మూసుకుని పాట వింటుంటే మాత్రం కళ్యాణ ఘట్టం అంతా కనుల ముందు సాక్షాత్కరిస్తుంది. ఇది రాసినది శ్రీశ్రీ గారు అని మొదటి సారి తెలిసినపుడు చాలా ఆశ్చర్య పోయాను. ఇక పాట విషయానికి వస్తే రేలంగి గారి బాణి లో చిన్న చిన్న చెణుకు లు విసురుతూ నవ్విస్తూ హుషారు గా సాగే కధ లో మనం మైమరచి పోతాం. "రఘూ రాముడూ... రమణీయ..." అని మొదలు పెట్టగనే తెలియకుండానే తన్మయంగా తల ఊపేస్తాం.. "ఎంత సొగసు కాడే.." అంటే అవును కదా అని అనిపించక మానదు... అసలు సొగసు అన్న మాట పలకడం లోనే ఘంటసాల గారు ఆ దివ్య సుందర మూర్తిని సాక్షాత్కరింప చేస్తారు.
మీరెపుడైనా జలపాతాన్ని దూరం నుండి కాకుండా దాని పై నుండి చూశారా... ప్రవాహం అంతా చాలా ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఏదో చిన్న పిల్ల కాలువ లా ప్రవహిస్తూ కనిపిస్తుంది... కాని ఒక్క సారి అంచుకు వెళ్ళి చూడగానే పైనుండి పోటెత్తుతూ ఉదృతంగా హుషారు గా ముందుకు దూకుతూ మనకి కనువిందు చేస్తుంది. ఇంత వర్ణించడమెందుకు చాలా సినిమా లలో జలపాతాల లో ప్రమాదం సీన్ల లో ఇది మీరు గమనించే ఉంటారు. అలానే అప్పటి వరకు నెమ్మదిగా వ్యాఖ్యానంతో సాగే కథ ఒక్క సారిగా "ఇనకుల తిలకుడు నిలకడ గల క్రొక్కారు మెఱుపు వలె నిల్చీ.." అని అంటూ ఆ జలపాతపు దూకుడునంతా తన స్వరం లో చూపించేస్తారు ఘంటసాల గారు. ఇక చివరికి వచ్చే సరికి హెచ్చు స్వరం లో ఒక్క సారి గా "ఫెళ్ళు మనె విల్లు... " అనగానే సీతమ్మవారి సంగతేమో కానీ కధ వింటున్న వారెవ్వరికైనా గుండె ఝల్లు మనక మానదు అంటే అతిశయోక్తి కాదేమో.

పొయిన ఏప్రిల్ లో శ్రీరామ నవమి రోజు ఈ పాట చాలా గుర్తు చేసుకున్నాను అదే రోజు మధురవాణి గారు తన బ్లాగు లో ఈ పాట లింక్ ఇచ్చారు.. దానికి వెంటనే సాహిత్యం ఇద్దామనుకున్నాను కాని ఇన్ని రోజులకి కుదిరింది. మధురవాణి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ అప్ లోడ్ చేయడానికి బద్దకించి, వారి ఈస్నిప్స్ యకౌంట్ నుండే ఎంబెడ్ చేయబడిన పాట ని, ఈ హరికథా సాహిత్యాన్ని ఇక్కడ మీకోసం ఇస్తున్నాను. విని, చదివి ఆనందించండి తప్పులేమన్నా ఉంటే వ్యాఖ్య ద్వారా తెలియచేయండి.



చిత్రం : వాగ్దానం
సంగీతం : పెండ్యాల
గానం : ఘంటసాల
సాహిత్యం : శ్రీశ్రీ

శ్రీ నగజా తనయం సహృదయం
శ్రీ నగజా తనయం సహృదయం
చింతయామి సదయం త్రిజగన్మహోదయం
శ్రీ నగజా తనయం...ఊ..ఊ...

శ్రీ రామ భక్తులారా ఇదీ సీతాకళ్యాణ సత్కథ
నలభై రోజులనుంచీ చెప్పిన కథ చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను
అంచేత కించిత్తు గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు తోస్తుంది
నాయనా కాస్త పాలూ మిరియాలూ ఏమైనా...
చిత్తం.. సిద్దం...

భక్తులారా... సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాలనుంచీ విచ్చేసిన వీరాధి వీరుల్లో..
అందరినీ ఆకర్షించిన ఒకే ఒక్క దివ్య సుందర మూర్తి ఆహ్హ !! అతడెవరయ్యా అంటే...

రఘూరాముడు రమణీయ వినీల ఘన శ్యాముడు..
రమణీయ... వినీల.. ఘన శ్యాముడు..
వాడు నెలరేడు సరిజోడు మొనగాడు..
వాని కనులు మగమీలనేలు రా..
వాని నగవు రతనాల జాలు రా..
వాని కనులు మగమీలనేలు రా..
వాని నగవు రతనాల జాలు రా..
వాని జూచి మగవారలైన మైమరచి మరుల్కొనెడు మరో మరుడు మనోహరుడు..రఘూరాముడు

సనిదనిసగ రిగరి రిగరి సగరి రిగరి సగగరి సనిదని
సగగరి సని రిసనిస రిసనిస నిదపమగరి రఘురాముడు...
ఔనౌను...
సనిస సనిస సగరిరిగరి సరిసనిస..పదనిస..
సనిగనినిస సనిరిసనిదని నిదసనిదపమ గ మ స
నినినినిని..పస పస పస పస...
సఫ సఫ సఫ తద్దీం తరికిటతక...
రఘూరాముడూ రమణీయ వినీల ఘన శ్యాముడు..
శభాష్..శభాష్...

ఆప్రకారంబుగా విజయం చేస్తున్న శ్రీరామచంద్రమూర్తిని అంతఃపుర గవాక్షం నుండీ సీతాదేవి ఓరకంట చూచినదై
చెంగట నున్న చెలికత్తె తో.. ఎంత సొగసుగాడే..ఎంత సొగసుగాడే మనసింత లోనే దోచినాడే... ఎంత సొగసుగాడే...
మోము కలువ రేడే ఏ..ఏ.. ఏ... మోము కలువ రేడే నా నోము ఫలము వీడే...
శ్యామలాభిరాముని చూడగ నామది వివశమాయె నేడే... ఎంత సొగసుగాడే..
ఇక్కడ సీతాదేవి ఇలా పరవశయై ఉండగా..
అక్కడ స్వయం వర సభా మంటపంలో జనక మహీపతి సభాసదులను చూచి
అనియెనిట్లు ఓ యనఘులార నా యనుగు పుత్రి సీతా...
వినయాదిక సద్గుణ వ్రాత.. ముఖ విజిత లలిత జలజాత...
ముక్కంటి వింటి నెక్కిడ జాలిన ఎక్కటి జోదును నేడు
మక్కువ మీరగ వరించి మల్లెల మాల వైచి పెండ్లాడు...ఊ..ఊ...

అని ఈ ప్రకారం జనక మహారాజు ప్రకటించగానే సభలోని వారందరూ ఎక్కడివారక్కడ చల్ల బడి పోయారట...
మహా వీరుడైన రావణాసురుడు కూడా..హా ఇది నా ఆరాధ్య దైవమగు పరమేశ్వరుని చాపము
దీనిని స్పృశించుట యే మహా పాపము అని అనుకొనిన వాడై వెనుదిరిగి పోయాడట తదనంతరంబున...

ఇనకుల తిలకుడు నిలకడ గల క్రొక్కారు మెఱుపు వలె నిల్చీ..
తన గురువగు విశ్వామితృని ఆశీర్వాదము తలదాల్చి...
సదమల మద గజ గమనము తోడ స్వయంవర వేదిక చెంత..
మదన విరోధి శరాసనమును తన కరమున బూనిన యంత...

ఫెళ్ళు మనె విల్లు గంటలు ఘల్లు మనే...
ఘుభిల్లుమనె గుండె నృపులకు..
ఝల్లు మనియె జానకీ దేహమూ...
ఒక నిమేషమ్మునందె.. నయము జయము ను
భయము విస్మయము గదురా... ఆఆ ఆఆ
శ్రీమద్రమారమణ గోవిందో హారి... హారి
భక్తులందరు చాలా నిద్రావస్త లో ఉన్నట్టుగా ఉంది మరొక్కసారి..
జై శ్రీమద్రమారమణ గోవిందో హారి... హారి
భక్తులారా ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి శివ ధనుర్బంగము కావించినాడు...
అంతట..
భూతల నాధుడు రాముడు ప్రీతుండై పెండ్లియాడే..
పృథుగుణ మణి సంఘాతన్ భాగ్యో పేతన్ సీతన్..
భూతల నాధుడు రాముడు ప్రీతుండై పెండ్లియాడే..
శ్రీమద్రమారమణ గోవిందో హారి... హారి

10 comments:

డౌన్లోడ్ కి విఫలయత్నం చేశానండి.. నాక్కూడా చాలా ఇష్టమైన పాట.. పెళ్లి పాటను తలచుకున్నారు.. ఏమిటండీ విశేషం? :-)

గొప్ప పాటని గుర్తుచేసారు, చక్కని వ్యాఖ్యతో!
సాహిత్యంలో చిన్నచిన్న దిద్దుబాట్లు:

"మగమీలమేలు రా" కాదు - "మగమీలనేలు రా"

"ముక్కంటి వింటి నెక్కిట జాలిన యక్కటి జోదును" - "ముక్కంటి వింటి నెక్కిడ జాలిన ఎక్కటి జోదును"

"సద ఫల మద గజ గమనము" - "సదమల మద గజ గమనము"

"బృహుగుణ మణి సంజాతన్" - "పృథు గుణమణి సంఘాతన్"

నెనర్లు మురళి గారు, విశేషమేమి లేదండీ.. రామనవమి నుండి ప్రయత్నిస్తుంటే ఇప్పటికి కుదిరింది అంతే. మధురవాణి గారి బ్లాగ్ లో డౌన్ లోడ్ చేసే లింక్ ఉందండి. http://rapidshare.com/files/216888793/Seetha_kalyanam_Harikatha_Madhuravaani.blogspot.mp3
ఇది ప్రయత్నించి చూడండి.

భైరవభట్ల గారు సవరణలు సూచించినందుకు నెనర్లు సార్. వెంటనే సరి చేసాను. ఆ చేత్తోనే వాటి అర్ధాలు కూడా చెప్పగలరా... ముఖ్యంగా "పృథు గుణమణి సంఘాతన్" అంటే ఏమిటి. మదగజగమనం అర్ధమైంది కానీ సదమల ఎందుకు చేర్చబడిందో అర్ధంకాలేదు. అలానే మగమీలనేలు... ఈ పదముల కి పూర్తి అర్థం తెలియకపోడమే నా తప్పుల వెనుక కారణం.

పృథు గుణమణి సంఘాత - గొప్ప గుణాలనే మణుల సమాహారమైనది
సదమల - సత్+అమల = మంచి శ్రేష్ఠమైన
ఎక్కటి జోదు - అసహాయశూరుడు
మగ మీలు - మగ చేపలు. వాని కనులు మగ మీలను ఏలు - అంటే అతని కనులు మగ చేపలని ఓడిస్తాయి అని.

ఈ పాటలో "ఫెళ్ళుమనె విల్లు..." అన్నది కరుణశ్రీ పద్యం. "భూతల నాథుడు రాముడు..." అన్నది పోతన పద్యం.

భైరవభట్ల కామేశ్వర రావు గారు, నా అభ్యర్దన మన్నించి అర్ధం తెలియ చేసినందుకు ధన్యవాదములు. ఇప్పుడు ఈ పాటను మరింత బాగా అస్వాదించగలుగుతున్నాను. అవి రెండూ పద్యములు అని తెలుసుకోడం బాగుంది.

బాగుందండి. ధన్యవాదాలు పోస్టు చేసినందుకు.

నరసింహ గారు, బొల్లోజు బాబా గారు వ్యాఖ్యానించినందుకు నెనర్లు.

వేణు గారు, మంచి పాటని మళ్ళ గుర్తుచేసినందుకు అభినందనలు. అలాగే కామేశ్వర శర్మ గారికి కూడా, అర్థాలు చెప్పినందుకు

ధన్యవాదాలు లక్ష్మిగారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.