మంగళవారం, అక్టోబర్ 29, 2019

కాఫీ దండకం...

ఈ మధ్య ఆరోగ్య రీత్యా రకరకాల టీలని ఆదరిస్తున్నారు కానీ ఒకప్పుడు సౌతిండియా అంతటా కాఫీకే పెద్ద పీట వేసేవారు. మరి అలాంటి కాఫీని సేవించిన జొన్నవిత్తుల గారు ఆ కాఫీని ఏవిధంగా దండకంతో పొగుడుతున్నారో మీరే చూడండి. సాధారణంగా దేవతలకోసం భక్తులు రాసి గానం చేసే ఈ దండకానికి పేరడీగా జొన్నవిత్తుల గారి దండకం కాఫీ ప్రియులందరిని అలరిస్తుందనటంలో ఏ సందేహం లేదు. మిధునం చిత్రంలోని ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మిథునం (2012)
సంగీతం : స్వరవీణాపాణి 
సాహిత్యం : జొన్నవిత్తుల 
గానం : జొన్నవిత్తుల 

అనుదినమ్మును కాఫీయే అసలుకిక్కు..
కొద్దిగానైన పడకున్న పెద్దచిక్కు
కప్పు కాఫీ లభించుటే గొప్పలక్కు
అమృతమన్నది హంబక్కు
అయ్యలారా..ఆఆఆ...

జై కాఫీ... విశ్వాంతరాళంబులోనున్న
బ్రహ్మాండ గోళాలలో నీకు సాటైన
పానీయమే లేదు ముమ్మాటికీ..
అందుకే నిన్ను కట్టేసుకుంటాము మా నోటికీ..
నాల్కతో నీకు జేజేలు పల్కేము నానాటికీ..

ఎర్లీ మార్నింగులో నిద్ర లేవంగనే
పాచి పళ్ళైనయున్ తోమకన్ త్రాగు బెడ్ కాఫీ
కోసంబు పెండ్లాముపై రంకెలేయించకే బెస్టు టేస్టీశ్వరీ..

ఫ్రెష్షు కాఫీశ్వరీ నెస్సు కేఫీశ్వరీ జిహ్వకున్
సిద్ధి చేకూర్చవే బ్రూకు బాండేశ్వరీ...
లోక ప్రాణేశ్వరి ప్రాణ దానేశ్వరి గంటగంటా
ప్రతీ ఇంట ఉప్పొంగవే ఉష్ణ పానేశ్వరీ..

స్టీలు ఫిల్టర్ల పళ్ళెంబులోనున్న రంధ్రాలలో నుండి
నీ సారమంతా సుతారంగా జారంగ నోరూర
చూడంగ నా సామిరంగా నిజంగానె చచ్చేవిధంగా..
కాస్త తాగన్ పునర్జన్మ వచ్చే విధంగా..

ప్రొద్దు ప్రొద్దున్నే నీ పొందు లేకున్న
మూడంతా పాడయ్యి టైమంత వేస్టయ్యి
కచ్చెక్కి పిచ్చెక్కి అశ్లీల సంభాషణల్ చేసి
కాంటాక్ట్సు సర్వంబు నాశమ్ము కావించుకొంటారుగా...
అందుకే నిన్ను అర్జంటుగా తెచ్చుకొంటారుగా..
దాచుకొంటారుగా కాచుకొంటారుగా చచ్చినట్టింక
ఇచ్చేంత సేపందరున్ వేచి ఉంటారుగా...

కాఫీనంతెత్తు పైనుంచి ఓకప్పులోవంచి
ఆ కప్పులోనుంచి ఈ కప్పులో పోసి
అట్నుంచి ఇంట్నుంచి ఇట్నుంచి అట్నుంచి
బాగా గిలక్కొట్టుచున్ నుర్గు ఉప్పొంగగా
తెచ్చి ఇస్తారుగా..

గొప్ప నిష్టాగరిష్టుల్ బరిస్తాలలోనన్
గరిష్టంబుగా కాఫీ తాగేందుకిష్టంబుగా పోవుగా..
షాపు మూసేయ వాపోవుగా..
సర్వ కాఫీ రసాంగీ సుదాంగీ శుభాంగీ
ప్రభాంగీ నమస్తే నమస్తే నమస్తే నమః

*~*~*~*~*~*~*~*~*~*~*

ఐతే సినిమాలో స్థలాభావం వల్లన అయుండచ్చు ఎడిట్ చేసి కొంత భాగాన్ని మాత్రమే ఉపయోగించారు.  ఈ కాఫీ దండకం పూర్తి పాఠం జొన్నవిత్తుల గారి హావభావాలతో ఈ పాడుతా తీయగా వీడియోలో ఇక్కడ చూడండి. ఎరుపు రంగులో ఉన్నవి సినిమాలో లేని పంక్తులు.


అనుదినమ్మును కాఫీయే అసలుకిక్కు..
కొద్దిగానైన పడకున్న పెద్దచిక్కు
కప్పు కాఫీ లభించుటే గొప్పలక్కు
అమృతమన్నది హంబక్కు
అయ్యలారా..ఆఆఆ...

జై కాఫీ... విశ్వాంతరాళంబులోనున్న
బ్రహ్మాండ గోళాలలో నీకు సాటైన
పానీయమే లేదు ముమ్మాటికీ..
అందుకే నిన్ను కట్టేసుకుంటాము మా నోటికీ..
నాల్కతో నీకు జేజేలు పల్కేము నానాటికీ..

ఎర్లీ మార్నింగులో నిద్ర లేవంగనే
పాచి పళ్ళైనయున్ తోమకన్ త్రాగు బెడ్ కాఫీ
కోసంబు పెండ్లాముపై రంకెలేయించకే బెస్టు టేస్టీశ్వరీ..

ఫ్రెష్షు కాఫీశ్వరీ నెస్సు కేఫీశ్వరీ జిహ్వకున్
సిద్ధి చేకూర్చవే బ్రూకు బాండేశ్వరీ...
లోక ప్రాణేశ్వరి ప్రాణ దానేశ్వరి గంటగంటా
ప్రతీ ఇంట ఉప్పొంగవే ఉష్ణ పానేశ్వరీ..

స్టీలు ఫిల్టర్ల పళ్ళెంబులోనున్న రంధ్రాలలో నుండి
నీ సారమంతా సుతారంగా జారంగ నోరూర
చూడంగ నా సామిరంగా నిజంగానే చచ్చేవిధంగా..
కాస్త తాగన్ పునర్జన్మ వచ్చే విధంగా..

ప్రొద్దు ప్రొద్దున్నే నీ పొందు లేకున్న
మూడంతా పాడయ్యి టైమంత వేస్టయ్యి
కచ్చెక్కి పిచ్చెక్కి అశ్లీల సంభాషణల్ చేసి
కాంటాక్ట్సు సర్వంబు నాశంబు కావించుకొంటారుగా...
అందుకే నిన్ను అర్జంటుగా తెచ్చుకొంటారుగా..
దాచుకొంటారుగా కాచుకొంటారుగా చచ్చినట్టింక
ఇచ్చేంత సేపందరున్ వేచి ఉంటారుగా...

మాతృగర్భంబులోనుండు పిండస్త జీవుండు
ఆ తల్లి త్రాగేటి కాఫీని సేవింపగా వేచి యుండంచు
శాస్త్రజ్ఞులెన్నో ప్రమాణంబులన్ చూపెగా

ఈ కాఫీ పానీయంబున్ గూర్చి
వేవేల సంవత్సరాల్ క్రిందటే
రుషుల్ వేదాలలో గొప్పగా చెప్పి యున్నారుగా..

ఎంత అప్రాచ్యమైనట్టి పానీయమైనన్
మునుల్ సమ్మతించారుగా
కాఫీత్రాగంగనే వాణి ఉల్లాసమున్ చెంది
ఆ కచ్చేరీ వీణపై కాఫీ రాగంబు పల్కించుగా

ఇంత కాఫీని పోయంగనే
ఎంత ముక్కోపి ఐనన్
ప్రశాంతుండుగా మారుగా
కర్మలన్ జేయు సత్ బ్రాహ్మలైనా
నినున్ కొంత సేవింపకున్
తద్దినం మంత్రముల్ పెద్దగా చెప్పగాలేరుగా

పిత్రుదేవాళికిన్ పెట్టు పిండాలపై
నినున్ కొంత సంప్రోక్షణన్ చేసినన్
వారికిన్ దివ్య కైలాస వాసంబు కల్పించు
వీసాలు శీఘ్రంబె వచ్చేనుగా

దేశ దేశాలలోనుండి నీ గింజలన్ దెచ్చి
రంజిల్ల వేయించి బాగా పొడిన్ చేసి జల్లించి
దట్టించి డబ్బాలు సీసాలలో నింపుకుంటాముగా

శోభనం వేళ ఓ వెండి గ్లాసందు
క్షీరంబులో ఇంత ఇన్స్టంటు బ్రూ వేసి
పందారలా నవ్వు నవ్వేసి కుర్రాడికిచ్చేస్తే
తెల్లారెదాకింక ధిల్లాన ధిల్లానగా

కాఫీనంతెత్తు పైనుంచి ఓకప్పులోవంచి
ఆ కప్పులోనుంచి ఈ కప్పులో పోసి
అట్నుంచి ఇంట్నుంచి ఇట్నుంచి అట్నుంచి
బాగా గిలక్కొట్టుచున్ నుర్గు ఉప్పొంగగా
తెచ్చి ఇస్తారుగా..

గొప్ప నిష్టాగరిష్టుల్ బరిస్తాలలోనన్
గరిష్టంబుగా కాఫీ తాగేందుకిష్టంబుగా పోవుగా..
షాపు మూసేయ వాపోవుగా..

అబ్బ నీలోని ఆవిర్లు వేవేల వేవిళ్ళు
గుమ్మెత్తు నీ స్మెల్లు గమ్మత్తుగా గిల్లు
మా ఇల్లు నీ వల్ల శోభిల్లుగా
దిల్లు మొత్తంబు రంజిల్లుగా

రోజు మొత్తంబులో వందసార్లైన
ఇంగ్లీషు ముద్దిచ్చి రక్షించవే కాఫి కామేశ్వరీ
యూతు జేకొట్టి లాగించు ఓ కోల్డు కాఫీశ్వరీ
నిన్ను వర్ణించి లాగించ నేనె సరైనట్టి వాడన్
చికోరీ సఖీ..

నీవు ముద్దాడుచున్ నాలింగనము జేసుకోగానే
మా పంచ ప్రాణాలు చైతన్యమౌనే జగన్నాయకీ
నవ్య పానీయ నారీ వయ్యారీ నమస్తే
రుచిన్ మస్తుగా గల్గు ప్యారీ మిఠారీ సలామే
నుర్గు నవ్వుల్ల బ్యూటీ వణక్కమ్
డికాషన్ ప్రెట్టీ నీకు ముక్కోటి శాల్యూట్సివే

స్ట్రాంగు కాఫీ సఖీ పొంగి లంఘించవే
లైటు కాఫీ ప్రియా లవ్వు పొంగించవే
కోల్డు కాఫీ చెలీ గోల్డు బ్యాండెయ్యవే
బ్లాకు కాఫీ డియర్ ఒక్క బైటీయ్యవే

సర్వ కాఫీ రసాంగీ సుధాంగీ శుభాంగీ
ప్రభాంగీ నమస్తే నమస్తే నమస్తే నమః
కాఫీ జనా సుఖినోభవంతూ బాసూ
శీఘ్రమేవ కాఫీ ప్రాప్తిరస్తూ..

 

2 comments:

కాఫి దండకం అద్భుతహ..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.