బుధవారం, ఫిబ్రవరి 19, 2014

తప్పట్లోయ్ తాళాలోయ్..

ముద్దుగారే యశోదా ముంగిట ముత్యము నువ్వూ
విశ్వనాథ్ గారి లేటెస్ట్ సినిమా శుభప్రదంలో ఈ పాట చాలా బాగుంటుంది, శివకేశవులు ఒకటేనంటూ పోలికలు చూపే ప్రయత్నం చేసిన చరణం కానీ పల్లవిలోని వాక్యాలు కానీ చక్కని సాహిత్యం, ఈ సినిమాలో పాటలన్నీ కూడా ఒకప్పటి విశ్వనాథ్ సినిమాలతో పోల్చలేకపోయినా ఈకాలం స్టాండర్డ్స్ కి చక్కని సంగీత సాహిత్యాల మేళవింపే. రౌతుకొద్దీ గుర్రమనే సామెత మోటుగా ఉన్నా దర్శకుడిని బట్టే పాటల రచయిత ప్రతిభ అని ఈపాటతో మరోసారి రుజువైంది. సేమ్యా ఉప్మా చైనీస్ నూడుల్స్ అంటూ పాటలు రాసిన రామజోగయ్య శాస్త్రిగారితో విశ్వనాథ్ గారు ఎంతచక్కని పాట రాయించుకున్నారో మీరే చూడండి. ఈ అందమైన పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు.



చిత్రం : శుభప్రదం(2010)
సంగీతం : మణిశర్మ
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : చైత్ర, ఫిమేల్ కోరస్, మేల్ కోరస్

తైతారే.. తక్క.. తైతారే..
దిగుతక తైతారే తైతారే దిగుతకతై..
తైతారే.. తక్క.. తైతారే..
దిగుతక తైతారే తైతారే తకతకతారే..

తప్పట్లోయ్ తాళాలోయ్ 
అచ్చట్లోయ్ ముచ్చట్లోయ్
ప్రతిలోగిలి ముంగిట్లో 
సిరిమువ్వల కిట్టయ్య మెరుపుల మిరుమిట్లో
అట కురిసిన వెన్నెట్లో 
విరబూసిన గుండెల గలగల పదిరెట్లోయ్
నలుదిక్కుల చీకటినంతా 
తన మేనిలొ దాచిన వింతా
కడువిందుగా వెలుగులు 
చిందెను మా కన్నుల్లో
ఆనంద ముకుందుని చేతా 
ఆంతర్యము అణువణువంతా
మధునందనమాయెను 
తన్మయ తారంగంలో..ఓఓ..

తప్పట్లోయ్ తాళాలోయ్ 
అచ్చట్లోయ్ ముచ్చట్లోయ్
తప్పట్లోయ్ తాళాలోయ్ 
అచ్చట్లోయ్ ముచ్చట్లోయ్

స్వాగతం కృష్ణా శరణాగతమ్ కృష్ణా 
మధురాపురి సదనా 
మృదువదనా మధుసూదనా...

తలపైనా కన్నున్న ముక్కంటి తానేగా 
శివమూర్తి శిఖిపించ మౌళీ
ప్రాణాలు వెలిగించు ప్రాణవార్ధమేగా 
తన మోవి మురళీస్వరాళి
భవుని మేని ధూళీ 
తలపించదా వనమధూళీ
ప్రమాధగణ విరాగీ 
యదుకాంతులకు ప్రియవిరాళీ
ఝనన ఝనన పదయుగళమె 
జతపడి శివకేశవా భేదకేళీ

తప్పట్లోయ్ తాళాలోయ్ 
అచ్చట్లోయ్ ముచ్చట్లోయ్

హొయ్యారే తయ్యర తయ్ 
తయ్యర తయ్.. హోయ్..హోయ్..
తయ్యారే తయ్యర తయ్ 
తయ్యర తయ్.. హోయ్..హోయ్..

ముద్దుగారే యశోదా 
ముంగిట ముత్యము నేను
ముద్దుగోరే రాధమ్మ 
సందిట చెంగల్వ పూదండ నేను
చెలిమికోరే ..ఏ.ఎ.ఎ.ఏఏ.. 
చెలిమికోరే గోపెమ్మలా 
చేతవెన్నముద్ద నేను
నన్ను కోరే ఎవ్వరికైనా 
బంధుగోవిందుడనౌతానూ  
ముద్దుగారే యశోదా 
ముంగిట ముత్యము నువ్వూ
ముద్దుగోరే రాధమ్మ 
సందిట చెంగల్వ పూదండ నువ్వూ

తప్పట్లోయ్ తాళాలోయ్ 
అచ్చట్లోయ్ ముచ్చట్లోయ్
ప్రతిలోగిలి ముంగిట్లో 
సిరిమువ్వల కిట్టయ్య మెరుపుల మిరుమిట్లో
అట కురిసిన వెన్నెట్లో 
విరబూసిన గుండెల గలగల పదిరెట్లోయ్. 
ముద్దుగోరే రాధమ్మ సందిట చెంగల్వ పూదండ నువ్వూ

2 comments:

నదులెన్నున్నా చేరేది సాగరుడి లోనే..సాంప్రదాయాలెన్నున్నా చేర వల్సినది సర్వేశ్వరుడినే..కదూ వేణూజీ..

కరెక్ట్ శాంతి గారు.. థాంక్స్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.