గురువారం, ఫిబ్రవరి 27, 2014

కానరార కైలాస నివాస/గంగావతరణం

కైలాసానికేగి ఈశ్వరదర్శనాన్ని కోరుతూ రావణ బ్రహ్మ పాడిన ఈ పాట చాలా ప్రసన్నంగా బాగుంటుంది. ఇంతగా వేడుకున్ననూ శివుడు ప్రత్యక్షం కాకపోగా కావలి ఉన్న నంది హేళనగా నవ్వేసరికి కోపమోచ్చిన రావణాసురుడు కైలాసగిరినే పెకలించి తీసుకువెళ్ళే ప్రయత్నంలో పాడే శివతాండవ స్తోత్రం వీడియో ఇక్కడ చూడవచ్చు. రావణబ్రహ్మగా ఎన్టీఆర్ మొదట ఎంత ప్రసన్నంగా కనిపిస్తారో తరువాత అంత రౌద్రాన్నీ అవలీలగా పోషించారు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే రాగాలో ఇక్కడ వినవచ్చు. 
మిత్రులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు.
 


చిత్రం : సీతారామకళ్యాణం (1961)
సంగీతం : గాలి పెంచల నర్సింహారావు
సాహిత్యం : సముద్రాల సీనియుర్
గానం : ఘంటసాల

కానరార కైలాస నివాస
బాలేందు ధరా జటాధరాహర
కానరార కైలాస నివాస
బాలేందు ధరా జటాధరా కానరార

భక్తజాల పరిపాల దయాళ
భక్తజాల పరిపాల దయాళ
హిమశైలసుతా ప్రేమలోలా

కానరార కైలాస నివాస
బాలేందు ధరా జటాధరా కానరార

నిన్నుజూడ మది కోరితిరా... ఆ...
నిన్నుజూడ మది కోరితిరా
నీ సన్నిధానమున చేరితిరా
నిన్నుజూడ మది కోరితిరా
నీ సన్నిధానమున చేరితిరా

కన్నడ సేయక కన్నులు చల్లగ
మన్నన సేయరా గిరిజా రమణా

కానరార కైలాస నివాస
బాలేందు ధరా జటాధరా కానరార

సర్ప భూషితాంగ కందర్పదర్పభంగా
సర్ప భూషితాంగ కందర్పదర్పభంగా
భవపాశనాశ పార్వతీ మనోహర
హే మహేశ వ్యోమకేశ త్రిపురహర

కానరార కైలాస నివాస
బాలేందు ధరా జటాధరా కానరార 

~‌*~‌*~‌*~‌*~‌*~‌*~‌*~‌*~‌*~‌*~‌*~‌*~‌*~‌*~‌*~‌*~‌*~‌*~‌

బగీరధుని తపస్సుకు మెచ్చిన గంగ తాను దివినుండి భువికి దిగిరావడానికి సిద్దమే కానీ తననుభరించే నాథుడెవరు అని అడిగితే, ఆ భగీరధుడు గంగ ఉరవడిని కట్టడి చేయగలవాడు సాక్షత్తూ ఆ పరమశివుడేనని ఎంచి ఈశ్వరుని ఎలా వేడుకున్నాడో ఆ గంగావతరణమెలా జరిగిందో ఈ శివరాత్రి పర్వదినాన మరో సారి వీక్షించండి. ఈ క్లిప్ బాపు గారి దర్శకత్వంలో వచ్చిన సీతాకళ్యాణం సినిమాలోనిది, సినిమాటోగ్రఫీ రవికాంత్ నగాయచ్.


చిత్రం : సీతా కల్యాణం (1976)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : సినారె
గానం : పి. బి. శ్రీనివాస్, బాలు, రామకృష్ణ, సుశీల

ఇనవంశ జలజాత దినకరుడు
సత్యనిరతుడు ధర్మవ్రతుడు భగీరథుడు
తన ముత్తాతల తరింప చేయగా...
గగన గంగనే జగతికి దించగా...
తపమొనరించెను ఆనాడు..
అదియే నదియై నడిచెను ఈనాడు...ఊ..ఊ..

మెచ్చితిని తపమో భగిరథా...
నిశ్చలనిరంతర మనోరథా...
ఇచ్చెదను వరము దిగి వచ్చెదను ధరకు..
మరి నను భరించే నాథుడెవ్వడు...
నను భరించే నాథుడెవ్వడు...

ప్రభో శూలపాణే విభో విశ్వనాథా..
మహాదేవ శంభో మహేశా త్రినేత్రా...
శివా కాంతశాంతస్మరారే పురారే...
పదన్యోవరేణ్యోనమాణ్యోనగన్యః

గళమున గరళము ధరించినావే...
తలపై గంగను భరించలేవా..
భవా....శివా...శివా...

కదిలింది కదిలింది గంగ...
కదిలి ఉప్పొంగింది గంగ ...
పరమ రాజసభావ పరిచుంబితనితాంగ
కదిలింది కదిలింది గంగ ...
కదిలి ఉప్పొంగింది గంగ ...

ఆకాశమే అదరగా... ఐరావతం బెదరగా
నందనవనం ప్రిదులగా... బృందారకులు చెదరగా

సాగింది సాగింది గంగ.. సాగి చెలరేగింది గంగ...
ఊగింది ఊగింది గంగ.. ఉద్వేగాభినేకాంతరంగ..
హరుని శిరమున పోటులెత్తగా.. బ్రహ్మాండభాండము బీటలెత్తగా...

ఉల్లల గంగా మహోర్ణికా వీచికా...
కల్లోల ధాటి ఒక కంట వీక్షించి..
సురగంగ గర్వంబు విరువంగ నెంచి ...
సంకీర్ణ చెటు ఝటాఝటలనుప్పొంగించి...
దుర్గంబుగా మలచినాడు...
గంగనద్భుతముగా బంధించినాడు ...

వెడయను అడవిని వడివడి అడుగిడి జాడ ఎరుంగనిదై ..
తడబడి నడచుచు గడగడ వడకుచు సుడివడిపోయినదై ...
ఒకపరి ఇటుచని ఒకపరి అటుచని మొఖమే చెల్లనిదై...
అగుపించని ఆ గగన గంగకై.. ఆక్రందించే భగీరథుడు...
ఆ మొర విని సురభిని చెర విడిపించెను కరుణాభరణుడు పురహరుడు...

ఉరికింది ఉరికింది గంగా..ఉన్మొత్త మానసవిహంగా..
మున్ముందుగా భగీరథుడు నడువంగా...
తన మేన సరికొత్త తరగలుప్పొంగ..
ఉరికింది ఉరికింది గంగా...

జలజలా పారుతూ... గలగల సాగుతూ..
చెంగుమని దూకుతూ... చెలరేగి ఆడుతూ...
తుళ్ళుతూ.. తూలుతూ... నిక్కుతూ.. నీల్గుచూ...
ముంచి వేసెను జహ్నుముని ఆశ్రమమునూ...
కనలి ఆ ముని మ్రింగే గంగాధరమునూ...

తరలింది తరలింది గంగా... సాగరుల పాపములు కడుగంగా..
సద్గతులనూ వారికొసగంగా... అల భగీరథునిచే ఇల పైన నిలుపంగా
తాను భాగీరథిగా... పుణ్యమొసగే నదిగా... తరలింది తరలింది గంగా...
గంగావతరణం

2 comments:

ఈ మూవీ లో రణధీర్ శివుడి గా వేశారు..గంగావతరణం చూస్తుంటే,ఒళ్ళు పులకరిస్తుంది..సాక్షాత్ పరమ శివుడే దివి నించి భువికి దిగి వచ్చినట్టుంటుందా సన్నివేశం..హేట్సాఫ్ టు బాపుగారు...ఇంత మంచి పాట వేసిన మీకు బోల్డు థాంక్స్ వేణూజీ.

శివుడి పాత్రధారి పేరు చెప్పినందుకు ధన్యవాదాలు శాంతి గారు. నిజమండీ బాపుగారు చాలా చక్కగా చిత్రీకరించారా సన్నివేశాన్ని హాట్సాఫ్ టు హిమ్...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.