సోమవారం, మార్చి 02, 2015

కృషి ఉంటే మనుషులు...

అడవిరాముడు చిత్రంలోని ఒక అద్భుతమైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : అడవి రాముడు (1977)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల

మనిషై పుట్టినవాడు కారాదు మట్టిబొమ్మా...
పట్టుదలే వుంటే కాగలడు మరో బ్రహ్మ..

కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు..
మహాపురుషులౌతారు...
తరతరాలకి తరగని వెలుగౌతారు..
ఇలవేలుపులౌతారు...

అడుగో అతడే వాల్మీకీ.. బ్రతకు వేట అతనికి..
అతిభయంకరుడు యమకింకరుడు..
అడవి జంతువుల పాలిటి..
అడుగో అతడే వాల్మీకీ
 
పాల పిట్టల జంట వలపు తేనెల పంట
పండించుకొని పరవశించి పోయేవేళా..
ఆ పక్షుల జంటకు గురిపెట్టాడు..
ఒక పక్షిని నేల కూల్చాడు..

జంట బాసిన పక్షి కంటపొంగిన గంగ
తన కంటిలో పొంగ... మనసు కరగంగ...
ఆ శోకంలో ఒక శ్లోకం పలికే..
ఆ చీకటి ఎదలో దీపం వెలిగే...

కరకు బోయడే అంతరించగా..
కవిగా ఆతడు అవతరించగా...
మనిషి అతనిలో మేల్కొన్నాడు..
కడకు మహర్షే అయినాడు..

నవరసభరితం రాముని చరితం..
జగతికి ఆతడు పంచినామృతం
ఆ వాల్మీకి మీవాడూ... మీలోనే వున్నాడు...
అక్షరమై మీ మనసు వెలిగితే... మీలోనే వుంటాడు..
 
అందుకే.... 

కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు..
మహాపురుషులౌతారు...
తరతరాలకి తరగని వెలుగౌతారు..
ఇలవేలుపులౌతారు...

ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం..
తిరుగులేని దీక్షకీ అతడే ప్రాణం..
కులం తక్కువని విద్య నేర్పని గురువు బొమ్మగా మిగిలాడు..
బొమ్మ గురుతుగా చేసుకొని బాణవిద్యలో పెరిగాడు

హుటాహుటిని ద్రోణుడపుడు తటాలుమని తరలి వచ్చి
పక్షపాత బుద్దితో దక్షిణ ఇమ్మన్నాడు..
ఎదుట నిలిచిన గురుని పదమంటి...
ఏమివ్వ గలవాడననే ఏకలవ్యుడు..

బొటనవేలిమ్మని కపటి ఆ ద్రోణుడు..
వల్లెయనె శిష్యుడు... చెల్లె ద్రోణుని ముడుపు..
ఎరుకలవాడు అయితేనేమి గురికలవాడే మొనగాడు..
వేలునిచ్చి తన విల్లును విడిచి వేలుపుగా ఇల వెలిగాడు..

అందుకే.... 

కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు..
మహాపురుషులౌతారు...
తరతరాలకి తరగని వెలుగౌతారు..
ఇలవేలుపులౌతారు...

 
శబరి...
ఇంతకాలము వేచినది ఈ పిలుపుకే శబరి..
ఆశ పరుగిడి అడుగు తడబడి రామ పాదము కన్నది...
వంగిపోయిన నడుముతో నగుమోము చూడగలేక అపుడు..
కనుల నీరిడీ... ఆ రామ పాదము కడిగినది శబరి...
పదముల ఒరిగినది శబరి

ప్రేమ మీరగ రాముడప్పుడు శబరి తల్లి కనులు తుడిచి..
కోరి కోరి శబరి కొరికిన దోర పండ్లను ఆరగించే..
ఆమె ఎంగిలి గంగ కన్న మిన్నగా
భావించిన రఘురాముండెంతటి ధన్యుడో...
ఆ శబరి దెంతటి పుణ్యమో..

ఆమె ఎవ్వరో కాదు సుమా.. ఆడపడుచు మీ జాతికి...
జాతిరత్నములు ఎందరెందరో మీలో కలరీనాటికి...
అడవిని పుట్టి పెరిగిన కథలే అఖిల భారతికి హారతులు..
నాగరికతలో సాగు చరితలో మీరే మాకు సారథులూ...

అందుకే....

కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు..
మహాపురుషులౌతారు...
తరతరాలకి తరగని వెలుగౌతారు..
ఇలవేలుపులౌతారు...

1 comments:

అన్నగారి యెమోషన్..బాలూగారి ఎక్స్ ప్రెషన్..మోస్ట్ వైబ్రేటింగ్ సాంగ్..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.