శుక్రవారం, జులై 24, 2015

ఒడుపున్న పిలుపు...

అనుకోని పరిస్థితుల్లో కొంతకాలం ఊరికి దూరంగా ఉండాల్సొచ్చి వేదన పడుతున్న మనసుకు తిరిగి ఊరు వెళ్ళబోతున్నామనే కబురుకన్నా సంతోషమైనదేదైనా ఉంటుందా. అంతటి ఆనందాన్ని పంచుకోడానికి తాము పుట్టి పెరిగిన చల్లని గోదారి తల్లికన్నా వేరే ఎవరుంటారు చెప్పండి. అందుకే ఈ జంట తమ సంతోషాన్ని ఇంత అందమైన పాటతో ఇలా వ్యక్తపరుస్తున్నారు. ఆ సందడేమిటో మీరూ చూసీ వినీ ఆనందించండి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : సిరి సిరి మువ్వ (1978)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల  

ఒడుపున్న పిలుపు ఒదిగున్న పులుపు
ఒక గొంతులోనే పలికింది
అది ఏ రాగమని నన్నడిగింది
ఒడుపున్న పిలుపు ఒదిగున్న పులుపు
ఒక గొంతులోనే పలికింది
అది ఏ రాగమని నన్నడిగింది

అది మనవూరి కోకిలమ్మా 
నిన్నడిగింది కుశలమమ్మా
అది మనవూరి కోకిలమ్మా 
నిన్నడిగింది కుశలమమ్మా

నిజమేమొ తెలుపు నీ మనసు తెలుపు
ఎగిరేను మన వూరివైపు 
అది పదిమంది కామాట తెలుపు
నిజమేమొ తెలుపు నీ మనసు తెలుపు
ఎగిరేను మన వూరివైపు 
అది పదిమంది కామాట తెలుపు

గోదారల్లే ఎన్నెట్లో గోదారల్లే 
ఎల్లువ గోదారల్లే వెన్నెట్లో గోదారల్లె
ఎదలో ఏదోమాట రొదలో ఏదో పాట
గోదారల్లే ఎన్నెట్లో గోదారల్లే 
ఎల్లువ గోదారల్లే ఎన్నెట్లో గోదారల్లే

అలలా ఎన్నెల గువ్వా ఎగిరెగిరి పడుతుంటే
గట్టుమీన రెల్లు పువ్వా బిట్టులికి పడుతుంటే
అలలా ఎన్నెల గువ్వా ఎగిరెగిరి పడుతుంటే
గట్టుమీన రెల్లు పువ్వా బిట్టులికి పడుతుంటే

ఏటివార లంకలోనా ఏటవాలు డొంకలోనా
ఏటివార లంకలోనా ఏటవాలు డొంకలోనా
వల్లంకి పిట్టా పల్లకిలోనా 
సల్లంగ మెల్లంగ ఊగుతు ఉంటే

గోదారల్లే ఎన్నెట్లో గోదారల్లే  
ఎల్లువ గోదారల్లే ఎన్నెట్లో గోదారల్లె 


4 comments:

వెన్నెలంటి విరహాలు, వర్షమంటి ఙాపకాలూ, చల్లగాలి ఊహలూ, చందమామ ఊసులూ..ఇలా మౌనమే మాటాడితే ప్రకృతికంటే అందంగా అర్ధం చేసుకోగల వారెవ్వరు..అందులోనూ ఆ మౌనం ఓ అమ్మాయి మనసైతే అబ్బయి అనురాగం గోదారి వెల్లువై పోదా..

@శాంతి గారూ,

>>>వెన్నెలంటి విరహాలు, వర్షమంటి ఙాపకాలూ, చల్లగాలి ఊహలూ, చందమామ ఊసులూ..ఇలా మౌనమే మాటాడితే ప్రకృతికంటే అందంగా అర్ధం చేసుకోగల వారెవ్వరు..అందులోనూ ఆ మౌనం ఓ అమ్మాయి మనసైతే అబ్బయి అనురాగం గోదారి వెల్లువై పోదా..<<<

మిర్చి బజ్జీలు,ఉల్లిపాయ సమోసాలు,గోదావరి....రెండు జెళ్ళ సీత సినిమాలో సుధాకర్ లాగా మరీ ఇంత సతాయించకూడదండీ ? కంటికి కనిపించకుండా పారిపోతారు.

ఆహా ఎంత అందంగా పోల్చారు శాంతి గారు.. మీరు చెప్పినది అక్షర సత్యం.. థాంక్స్ ఫర్ ద కామెంట్.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.