మంగళవారం, జూన్ 12, 2018

వినరా భారత వీర...

ఎందరో శ్రమించి సాధించిన స్వాతంత్ర్య ఫలాలను ప్రజలందరికీ అందనివ్వకుండా కొందరు పెద్దలు ఎలా స్వాహా చేస్తున్నారో విశదీకరించే ఈ నృత్యరూపకం పూలరంగడు చిత్రంలోనిది. ఈ సినిమా వచ్చి యాభై ఏండ్లు గడచినా పరిస్థితిలో పెద్దగా మార్పులేదనే చెప్పచ్చేమో. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పూలరంగడు (1967)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు
సాహిత్యం : కొసరాజు 
గానం : ఘంటసాల, సుశీల, కోరస్ 

వినరా భారత వీర సోదరా విజయము నీదేరా 
తందానతానా 
 కళ్ళు తెరచి నీదేశ పరిస్థితి ఒక్కసారి కనరా
తందానతానా
నీ తాతలు తండ్రులు దేశం కోసం త్యాగం చేశారూ
స్వాతంత్ర్యమే మన జన్మహక్కని చాటి చెప్పినారూ
తందాన తానా
బానిసతనమునకన్నా మరణమే మేలని అన్నారూ
మరఫిరంగులా గుండు దెబ్బలకు రొమ్ములొడ్డినారూ
తందాన తానా  
పరాయి దొరలను ధర్మ యుద్ధమున పారద్రోలినారూ
అమూల్యమైన స్వతంత్రమ్ము నీకప్పగించినారూ

వినరా భారత వీర సోదరా విజయము నీదేరా
కళ్ళు తెరచి నీదేశ పరిస్థితి ఒక్కసారి కనరా



ఇన్ని త్యాగాలు చేసి సంపాదించిన స్వాతంత్ర్య ఫలితం తమ బిడ్డలకైనా దక్కుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ! ఎన్నో కలలు గన్నారు ! 

ఏమిటో ఆ కలలు
కూడు గుడ్డలకు లోటు వుండదని 
తందానా తందాని తందనా 
పాడి పంటలకు తరుగు ఉండదని
 
తందానా తందాని తందనా 
 కరువు కాటకం మొఖం చూపదని 
తందానా తందాని తందనా 
 కన్నబిడ్డలకు సుఖం కల్గునని
తందానా తందాని తందనా 
అంతులేని ఆనందంలోన పొంగిపోయినారు

వినరా భారత వీర సోదరా విజయము నీదేరా 

 
పాపం వెర్రిబాగుల వాళ్ళు సత్యకాలం వాళ్ళు మన కళ్ళెదుట కనిపిస్తూనే ఉందిగా కల 

 
ఆరుగాలము శ్రమపడు రైతుకు అన్నము చాలదురా  
తందానా.. తందానా దేవ నందనానా..
రెక్కలు ముక్కలు చేసే కూలికి డొక్కే నిండదురా
తందానా.. తందానా దేవ నందనానా..
ఫైళ్ళలో మునిగే గుమస్తాలకు పస్తులబాధేనా
తందానా.. తందానా దేవ నందనానా..
 అశాంతిలోన దేశం అంతా అలమటించ వలెనా 
తందానా.. తందానా దేవ నందనానా..
  అరె ప్రజా ప్రభుత్వం వచ్చినందుకు ఫలితం ఇదియేనా  
తందానా.. తందానా దేవ నందనానా..

 దేవుడు వరమిచ్చాడు కాని అది భక్తులకు అందలేదు, అందుకని దేవుడ్ని నిందిస్తామా మన సుఖం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తూంది 

ఏమిటబ్బా ఆ కృషి 

ప్రాజెక్టులే కట్టిరి బంజరు భూములనే పండించిరి
ఫ్యాక్టరీలనే పెట్టిరి ఎంతో ఉత్పత్తినే పెంచిరి

దేశ దేశాలన్నీ తిరిగి అప్పులెన్నో తెచ్చారూ
ప్రజల సౌఖ్యం కోసం చక్కని ప్లానులెన్నో వేశారూ
పల్లెసీమల బాగుకోసమై పంచాయతులను పెట్టారూ
విద్యకోసం వైద్యం కోసం వసతులెన్నో చూపారూ 

 
ఈ విధంగా ప్రజల సుఖం కోసం ఎంతోడబ్బు ఖర్చు పెట్టారంటావ్... మరి ఆ డబ్బంతా ఏమైపోతోందో


స్వార్ధపరులెందరో... తందానా...
సమయము చూశారు
... తందానా...
దేశ సంపదనంత
... తందానో...
 దిగమింగినారండి... తందానా...
పదిమంది పెద్దలూ
... తందానో...
పంచుకున్నారండీ
... తందానా...
లంచగొండులతోటి
... తందానో...
లాలూచి పడ్డారు
... తందానా...
కోటాలు పర్మిట్లు పట్టారూ 
కోట్లు కోట్లు కూడబెట్టారు
కోటాలు పర్మిట్లు పట్టారూ 
కోట్లు కోట్లు కూడబెట్టారు 
 
  బియ్యంలోన రాళ్ళను కలిపి
సిమెంటులోన బూడిద గలిపి
మంచి వెన్నలో మైదా కలిపి
కల్తీ నకిలీ మందులు అమ్మి 
కల్తీ నకిలీ మందులు అమ్మి
మాటలు తీయగ చెబుతారూ
మనుషుల ప్రాణాల్ తీస్తారు
మాటలు తీయగ చెబుతారూ
మనుషుల ప్రాణాల్ తీస్తారు 

 
అవసరమైన వస్తువులన్నీ అక్రమమ్ముగా చాటున పెట్టి
రోజు రోజుకు ధరలను పెంచి ప్రజల నిలువునా దోపిడీ చేసి
ప్రజల నిలువునా దోపిడీ చేసి 
జేబులు పెద్దవి చేశారు బొజ్జలు బాగా పెంచారూ
 జేబులు పెద్దవి చేశారు బొజ్జలు బాగా పెంచారూ 
 
బాల పాపల నోళ్ళు గొట్టి పాలడబ్బాల్ దాచిపెట్టి
బ్లాకు మార్కెట్ లోన అమ్మేరూ
పాపల సొమ్మున పాలు పంచి పుణ్యం కొంటారు
పసివాళ్ళ వుసురు తగులుతుందని మరచే పోతారు 

 
ఏం గురూ ఈ పాపం ఇట్లా పెరిగి పోవలసిందేనా మనం గుడ్లప్పగించి చూస్తూ వూరుకోవలసిందేనా

ఏమన్నావ్ 
 
ఎందరో శ్రమపడి పెంచిన సంపదరా.. తందానా..
కొందరు పంచుక మ్రింగిన చెల్లదురా
..  తందానా..
నీకూ నాకూ లేని ఆ హక్కు
.. తందానా..
ఎవ్వడు వాడికి ఇచ్చాడో చెప్పు
.. తందానా..
సంఘద్రోహుల ఆట కట్టవలెరా
.. తందానా..
చీడపురుగులను వదల కొట్టవలెరా
.. తందానా..
ధైర్యంతో ముందడుగు వేయవలెరా
.. తందానా..
జాతినంతనూ కూడదీయవలెరా
.. తందానా..
అప్పుడు దేశం బాగుపడును గదరా
.. తందానా..
శాంతి సౌఖ్యమున ఓలలాడు గదరా
.. తందానా..
శాంతి సౌఖ్యమున ఓలలాడు గదరా.. తందానా..
తధిమి తత్ తధిమితా.. 


4 comments:

మోసం స్ధాయిలో మార్పు వచ్చింది సుమండీ..

హహహహ మరే నిజం చెప్పారండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..

వై ఫై యుగం కదండి. అంత వేగంగాను మోసాలు చేసే నైపుణ్యం పెరిగి వుంటది.అదే మార్పు.అంతేనంటారా!

అవునండీ మీరు చెప్పినది నిజం.. థాంక్స్ ఫర్ ద కామెంట్ మయూఖ గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.