శనివారం, డిసెంబర్ 09, 2017

నీ ప్రశ్నలు నీవే...

కొత్తబంగారులోకం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కొత్తబంగారు లోకం (2008)
సంగీతం : మిక్కీ జె. మేయర్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు

నీ ప్రశ్నలు నీవే.. ఎవ్వరో బదులివ్వరుగా..!
నీ చిక్కులు నీవే.. ఎవ్వరో విడిపించరుగా..!
ఏ గాలో నిన్ను.. తరుముతుంటే అల్లరిగా..
ఆగాలో లేదో.. తెలియదంటే చెల్లదుగా..!

పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా..
అపుడో ఇపుడో కననే కననూ అంటుందా..!
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా..
గుడికో జడకో సాగనంపక ఉంటుందా..!

బతుకంటే బడి చదువా.. అనుకుంటే అతి సులువా..!
పొరపడినా పడినా.. జాలి పడదే కాలం మనలాగా..!
ఒక నిముషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా..!

అలలుండని కడలేదని అడిగేందుకె తెలివుందా..
కలలుండని కనులేవని నిత్యం నిదరోమందా..!
గతముందని గమనించని నడిరేయికి రేపుందా..
గతి తోచని గమనానికి గమ్యం అంటూ వుందా..!

వలపేదో వల వేస్తుంది వయసేమో అటు తోస్తుంది..
గెలుపంటే ఏదో ఇంతవరకు వివరించే ఋజువేముంది..
సుడిలో పడు ప్రతి నావా.. చెబుతున్నది వినలేవా..!

పొరబాటున చేయి జారిన తరుణం తిరిగొస్తుందా..
ప్రతి పూటొక పుటలా తన పాఠం వివరిస్తుందా..!
మనకోసమే తనలో తను రగిలే రవి తపనంతా..
కనుమూసిన తరువాతనే పెనుచీకటి చెబుతుందా..!

కడతేరని పయనాలెన్ని
పడదోసిన ప్రణయాలెన్ని..
అని తిరగేసాయా చరిత పుటలు
వెనుచూడక ఉరికే జతలు..
తమ ముందు తరాలకు
స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు
ఇది కాదే విధి రాతా అనుకోదేం ఎదురీతా..!

పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా..
అపుడో ఇపుడో కననే కననూ అంటుందా..!
ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా..
గుడికో జడకో సాగానంపక ఉంటుందా..!

బతుకంటే బడి చదువా.. అనుకుంటే అతి సులువా..!
పొరపడినా పడినా.. జాలి పడదే కాలం మనలాగా..!
ఒక నిముషం కూడా ఆగిపోదే నువ్వొచ్చేదాకా..!

3 comments:

వేణుగారు మొదటి చరణంలో అది పోరపడినా పడినా లేదా పోరపడినా బడినా కొంచెం చెప్పగలరా మరియు ఒక నిముషం అని రాసారు అది నిమిషం అనుకుంటా కొంచెం చూడగలరా

వేణుగారు మళ్లీ ఇంకొక పదం వుంటుందా అని రాసారు అది ఉంటుందా న లేక పై పదమే సరైనదా కొంచెం చెప్పగలరా

థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ అండీ.. పడినా కరెక్ట్.. అలాగే ఉంటుందానే కరెక్టనుకుంటున్నాను. రెండు సరి చేశాను.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.