ఆదివారం, డిసెంబర్ 25, 2011

కదిలిందీ కరుణరథం

నేను ఐదారు తరగతులు చదువుతున్నపుడు నా క్లాస్మెట్ ప్లస్ బెస్ట్ ఫ్రెండ్ ఒకడు క్లాస్ అందరిముందు పాడినపుడు నేను ఈ పాటను మొదటిసారి విన్నాను. అప్పటి వరకూ పాటంటే పల్లవి చరణం ఒకే రిథమిక్ ఫ్లోలో సాగే పాటలు మాత్రమే విన్న నాకు ఈ పాటలోని వేరియేషన్స్ ఆకట్టుకోడమే కాక ఒక కథను / సన్నివేశాన్ని పాటగా చెప్పడం బాగా నచ్చింది. వాడుకూడా ఎంత ప్రాక్టీస్ చేశాడో కానీ చాలా బాగా పాడేవాడు పాట చివరి కొచ్చేసరికి మాలో  చాలామందిమి ఏడ్చేసే వాళ్ళం. అలా పాడిన పద్దతే నాకు బాగా నచ్చి వాడిచేత సాహిత్యం ఒక పేపర్ మీద రాయించుకుని (వాడి రాత నాకిప్పటికి గుర్తే ముత్యాల సరాల్లా ఉండేది) వాళ్ళింట్లో ఈ పాట వింటూ నేనూ కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసి పాడడానికి ప్రయత్నించే వాడ్ని. 

ఆ తర్వాతెపుడో నేను తొమ్మిదో లేదా పదో తరగతో చదువుతున్నపుడు ఈ సినిమా నర్సరావుపేట సత్యన్నారాయణ టాకీస్ లో రీరిలీజ్ చేస్తే ఇంటి పక్క క్రిస్టియన్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలతో కలిసి వెళ్ళి చూశాను. సినిమాకూడా బాగానే ఉంటుంది. ఈ ఙ్ఞాపకాల వలననేమో ఈ పాట అలా మనసులో ముద్రించుకు పోయింది. క్రిస్మస్ గురించి తలచుకోగానే ఈ పాట, అప్పటి స్కూల్ రోజులు  అలా కళ్ళముందు కదులుతాయి. శిలువ వేసే సన్నివేశాన్ని వర్ణిస్తూ సాగే ఈ పాటలోని కరుణ రసాన్ని బాలుగారు తన స్వరంలో అద్భుతంగా పలికించారు. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు. 

చిత్రం : కరుణామయుడు
సంగీతం : జోసెఫ్ క్రిష్ణ, బొడ్డుగోపాలం
సాహిత్యం : యం.జాన్సన్, గోపి, శ్రీశ్రీ
గానం : బాలు.

కదిలిందీ.. కరుణరధం ..
సాగిందీ.. క్షమాయుగం
మనిషి కొరకు దైవమే
కరిగీ వెలిగే కాంతిపధం

కదిలింది.. కరుణరధం ..
సాగింది.. క్షమాయుగం
మనిషి కొరకు దైవమే
మనిషి కొరకు దైవమే
కరిగి వెలిగె కాంతిపధం

మనుషులు చేసిన పాపం..
మమతల భుజాన ఒరిగిందీ..
పరిశుద్ధాత్మతో పండిన గర్భం..
వరపుత్రునికై వగచింది.. వగచిందీ..

దీనజనాళికై దైవకుమారుడు.. 
పంచిన రొట్టెలే.. రాళ్ళైనాయి..
పాప క్షమాపణ పొందిన హృదయాలు.. 
నిలివున కరిగీ.. నీరయ్యాయి.. నీరయ్యాయి 

అమ్మలార నా కోసం ఏడవకండి 
మీ కోసం..మీ పిల్లల కోసం ఏడవండి

ద్వేషం.. అసూయ.. కార్పణ్యం.. 
ముళ్ళ కిరీటమయ్యింది 
ప్రేమా..సేవా..త్యాగం.. చెలిమి 
నెత్తురై ఒలికింది.. ఒలికిందీ
తాకినంతనే స్వస్తత నొసగిన 
తనువుపై కొరడా ఛెళ్ళందీ
అమానుషాన్ని అడ్డుకోలేని 
అబలల ప్రాణం అల్లాడింది

ప్రేమ పచ్చికల పెంచిన కాపరి 
దారుణ హింసకు గురికాగా
చెదిరిపోయిన మూగ గొర్రెలు 
చెల్లాచెదరై కుమిలాయి

పరమ వైద్యునిగ పారాడిన పవిత్ర పాదాలూ
నెత్తురు ముద్దగ మారాయి
అభిషిక్తుని రక్తాభిషెకంతో 
ధరణి ద్రవించి ముద్దాడింది
శిలువను తాకిన కల్వరిరాళ్ళు.. కలవరపడి..
కలవరపడి..కలవరపడి..అరిచాయి.. అరిచాయి !!!
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~
ఏదేమైనా కానీ పండగ రోజు  విషాద గీతంతో ముగించలేక ఒక మాంచి మెలోడీని అందిస్తున్నాను. ఇది సినిమాపాట కాకపోయినా ప్రైవేట్ ఆల్బంస్ లో బాగా ప్రాచుర్యం పొందిన పాట. ఇది కూడా మాసిలామణి గారు రాసిన పాటే. ఈ పాట తన ఇంటర్మీడియెట్ రోజులలో విన్నానంటూ నాకు పరిచయం చేసిన సౌమ్యగారికి నెనర్లు. ఆడియో ఇక్కడ వినవచ్చు.
అందాల తార అరుదెంచె నాకై - అంబర వీధిలో
అవతారమూర్తి యేసయ్య కీర్తి -అవని చాటుచున్
ఆనందసంద్ర ముప్పోంగెనాలో - అమరకాంతిలో
ఆది దేవుని జూడ - అశింపమనసు – పయనమైతిమి


||అందాల తార..||
 

విశ్వాసయాత్ర - దూరమెంతైన - విందుగా దోచెను
వింతైన శాంతి - వర్షంచెనాలో - విజయపధమున
విశ్వాలనేలెడి - దేవకుమారుని - వీక్షించు దీక్షలో
విరజిమ్మె బలము - ప్రవహించె ప్రేమ - విశ్రాంతి నొసగుచున్


||అందాల తార..||
 

యెరూషలేము - రాజనగరిలో - ఏసును వెదకుచు
ఎరిగిన దారి - తొలగిన వేల - ఎదలో క్రంగితి
ఏసయ్యతార - ఎప్పటివోలె - ఎదురాయె త్రోవలో
ఎంతో యబ్బురపడుచు - విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు


||అందాల తార..||

ప్రభుజన్మస్ధలము - పాకయేగాని పరలోక సౌధమే
బాలునిజూడ - జీవితమెంత - పావనమాయెను
ప్రభుపాదపూజ - దీవెనకాగా - ప్రసరించె పుణ్యము
బ్రతుకె మందిరమాయె - అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్ధన


||అందాల తార..||

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~


బ్లాగ్ మిత్రులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.
పరమత సహనం పాటిస్తూ, ఇతరులను మతంమారమని వత్తిడి చేయని క్రైస్తవ సోదర సోదరీమణులకు వారికుటుంబాలకు హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు.. పాశ్చత్య దేశాలలో ఉన్న మిత్రులకు ఇంకా ఆయా దేశాల క్లైంట్స్ తో పనిచేసే మిత్రులకు హ్యాపీ హ్యాపీ హాలిడేస్ :-)

2 comments:

:)) అందాల తార పాట బావుంది కదూ!

అవునుసౌమ్య మంచి ట్యూన్..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.