మంగళవారం, డిసెంబర్ 27, 2011

ఎందరో మహానుభావులు

నేను ఈ కీర్తన గురించి చెప్పగలిగేటంతటి వాడిని కాదు... 1946 లో విడుదలైన త్యాగయ్య సినిమా కోసం నాగయ్య గారు నటించి గానం చేసిన ఈ కీర్తన విన్నాక సినిమాలో ఎవరో “బ్రహ్మానందం కలిగించారు త్యాగయ్య గారూ..” అని అంటారు, తక్షణమే మనం కూడా అవునవునంటూ ఏకీభవించేసి తలాడించేస్తాం. చిన్నపుడు ఇంట్లో ఉన్న ఈ సినిమా నవల చదవడం మాత్రమే గుర్తుంది కానీ ఇంతవరకూ నేనీ సినిమా చూడలేదు. ఆ పుస్తకం లోని ఫోటోలు మాత్రం మంచి ఆయిల్ పేపర్ పై ప్రింట్ చేసి అప్పట్లో వచ్చే సోవియట్ పత్రికలతో పోటీపడుతూ అద్భుతంగా ఉండేది బాగా గుర్తు. మొన్న ఈ వీడియో చూశాక సాధ్యమైనంత త్వరగా ఈ సినిమా చూడాలని నిశ్చయించుకున్నాను. మీరూ చూసి విని ఆనందించండి. ఈ కీర్తన ఆడియో మాత్రమే కావాలంటే ఇక్కడ(ఏడవపాట) వినవచ్చు.
ఎందరో మహానుభావులూ.. అందరికీ వందనమూలూ..
ఎందరో మహానుభావూలూ.. అందరికీ వందనమూలూ..
ఎందరో మహానుభావులూ..

చందురూ వర్ణూని అందా చందమును హృదయా అరవిందమూనా
జూచీ బ్రహ్మానందమనుభవించు వారెందరో మహానుభావులూ..

సామగాన లోలా మనసిజ లాఆ...వణ్య ధన్య
మూర్ధన్యులెందరో మహానుభావులూ

మానస వనచర వర సంచారము నిలిపి
మూర్తి బాగుగ పొడగనే వారెందరో మహానుభావులు

సరగున పాదములకు స్వాంతమను సరోజమును
సమర్పణము సేయువారెందరో మహానుభావులు

హొయలు మీరు నడలు గల్గు సరసుని
సదా కనుల జూచుచు పులక శరీరులై
ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను
యశంబు గలవారెందరో మహానుభావులు

భాగవత రామాయణ గీతాది 
శృతి శాస్త్ర పురాణపు మర్మములన్
శివాది సన్మతముల గూఢములన్
ముప్పది ముక్కోటి సురాంతరంగముల భావంబులనెరిగి
భావ రాగ లయాది సౌఖ్యముచే చిరాయువుల్గలిగి
నిరవధి సుఖాత్ములై త్యాగరాజాప్తులైన
వారెందరో మహానుభావులూ..
అందరికీ వందనమూలూ..
ఎందరో మహానుభావులూ..

11 comments:

వేణు ఈ కీర్తన బాలు గొంతులో కొత్త త్యాగయ్య సినిమాలోది, బాలమురళీకృష్ణ, ఎమ్ ఎస్, మరికొందరి గానంలో కూడా చూపిస్తూ , వినిపిస్తే బావుంటుందేమో కదా..

Thanks for the comment జ్యోతిగారు మంచి ఐడియా, శ్రావ్య గారు తన బ్లాగ్ లో ఇలానే డిఫరెంట్ వేరియంట్స్ పరిచయం చేస్తుంటారు. బాలమురళి గారు ఎమ్మెస్ గారు పాడినవి కేవలం ఒక ప్రత్యేకమైన మూడ్ లో మాత్రమే వినగలనండి.. బాపుగారి త్యాగయ్యలో బాలు పాడిన పాటకి కూడా నేను అంతగా కనెక్ట్ అవ్వలేదు కానీ నాగయ్య గారు పాడిన ఈ కీర్తన మాత్రం చాలా నచ్చేసింది. ఇవి అన్నీకూడా ఒకే రాగంలో చేసి ఉండచ్చు సంగీత పరిఙ్ఞానంలేని నాకు తేడాలేమిటో తెలియదు కానీ ఇదే అన్నిటికంటే బాగానచ్చింది, నాగయ్యగారి కంఠస్వరం వారి హావభావాలు కూడా నాకు బాగా నచ్చేశాయి.

వేణు గారూ.. ఇది శ్రీ రాగం లో చేసిన పంచరత్న కృతి.. చాలా బావుంటుంది.. ఎన్ని సార్లు ఎంత మంది గొంతులో విన్నా సరే.. జ్యోతిగారు చెప్పిన్నట్టు ఇంకొన్ని వీడియోలు పోస్ట్ చెయ్యండి. బావుంటుంది.

మా ఇంట్లో రోజూ పొద్దుటే వినేది బాలమురళిగారిదండీ. కానీ నాగయ్య గారి త్యాగయ్య లో అన్ని పాటలూ మేము అప్పుడప్పుడు వింటుంటాం. బ్రహ్మనందం కలిగింఛారు త్యాగయ్య గారూ డైలాగులతో సహా..:))
ఆ సిన్మాలోని పాటలు చాలా ఇష్టం మాకు.

ప్రసీద గారు, తృష్ణ గారు, శ్రావ్య గారు ధన్యవాదాలు.

ఇదే కాదు త్యాగరాజ కృతులన్నీ ఎంతో వినసొంపుగా భక్తిభావం తొణికిసలాడుతూ ఉంటాయి. పంచరత్న కృతుల్లో ఒకటి ఇది. పాత చిత్రంలో త్యాగరాజు గా నాగయ్య పాత్రకి జీవంపోస్తే, ఇదే చిత్రం 1980 లలో మళ్ళీ విడులయ్యింది. జే వీ జీ సోమయాజులు గారు ఆ పాత్రకి తగిన న్యాయం చేసి సగటు ప్రేక్షకుడి మనస్సు నుంచీ మరీంత భక్తి రసం చిలికారు . గూగుల్ వీడియో లలో ఈ ఆ చింత్రం ఆన్లైన్ దొరుకు తుంది చూడండి. http://video.google.com/videoplay?docid=8860992279846791388 ఎన్నో విశేషాలు తెలుస్తాయి ఏ కీర్తన త్యాగబ్రహ్మం గారి జీవితంలో ఏ ఘట్టం తో ఎలా ముడిపడిందో అన్న విషయం సుస్పష్టంగా అవగతమౌతుంది. నెనర్లు

నందు గారు Thanks for the comment and link. తప్పకుండా చూస్తాను.

గురువుల ఆశీర్వాదం, కోదండరాముని దయ,
శిష్య పరమాణువు చరితార్ధుడైనాడు.... ఈ వాక్యాలు త్యాగయ్య వినయాన్నేకాదు అంత వినయాన్ని సహజంగా చూపిన నాగయ్యకు సైతం వర్తిస్తుంది. జాగ్రత్తగా గమనిస్తే పాట సాగుతున్నంతసేపు చుట్టూ ఉన్న బ్రాహ్మణగణం ఎంత తాదాత్మ్యంలో పాట వింటున్నదో తెలుస్తుంది, కేవలం నాల్గు రూపాయల నటన కోసం ఆ తాదాత్మ్యం నటించినట్టే లేదు. కచేరీలో నేరుగా విని గానంలో లీనమైనట్టే కనిపిస్తుంది.

అదీ అప్పటి సహజత్వం. మనకాలంలోన సినిమాలున్నాయి ఖర్మ.. ఖర్మ..

ధన్యవాదాలు పూర్ణప్రజ్ఞాభారతి.. మీరు చెప్పినది అక్షర సత్యం... ఇప్పటి సినిమాల గురించి తక్కువ మాట్లాడుకోవడమే ఉత్తమంలేండి.

మన్నించాలి పూర్ణప్రజ్ఞాభారతి గారు మొన్న హడావిడిగా రిప్లై ఇస్తూ మీ పేరుమాత్రమే కాపీ చేసి గారు కలపడం మర్చిపోయాను.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.