శుభోదయం నేస్తాలూ.. ఎలా ఉన్నారు ? నేను బ్రహ్మాండంగా ఉన్నాను :-) చాలామందిని కామెంట్ల ద్వారానూ, బజ్ మరియూ ప్లస్ ద్వారాను పలకరిస్తూనే ఉన్నాను కనుక పెద్దగా మిస్ అవలేదు కానీ సంకలినులకు రావడం తగ్గించడం వలన కొందరి బ్లాగులని మిస్ అయ్యాను, అవన్నీమెల్లగా కవర్ చేయాలి. ఈ బ్లాగులో హాయిగా బజ్జున్న బుజ్జి పాండాగాడ్ని నిద్రలేపడానికి మనసురాడంలేదు కానీ ఇప్పటికే చాలా రోజులైంది ఇక చాలులే మంచి మంచి పాటలతో నా బ్లాగ్ నేస్తాలకు కబుర్లు చెప్పేయాలి అని అన్నగారినీ ఘంటసాల గారినీ వెంటబెట్టుకుని ఇదిగో ఈ మాంచి మేలుకొలుపు పాటతో నిద్రలేపేశాను. ఇకపై రోజూ అని చెప్పలేను కానీ కాస్త తరచుగానే కలుసుకుని కబుర్లు చెప్పుకుందాం.
ఈ పాట నాకు చాలా ఇష్టమైన స్ఫూర్తిదాయకమైన గీతాలలో ఒకటి. రామారావు గారి నటన ఘంటసాల గారి గాత్రం రెండూ అద్భుతంగా ఉంటాయి. ఇక కొసరాజు గారి సాహిత్యం టివిరాజు గారి సంగీతం గురించి చెప్పడానికి ఏముంది. ఇంటర్మీడియేట్ రోజులలో నాకో మిత్రుడు ఉండేవాడు వాడు ఏదైనా చిన్న సమస్య వచ్చినా కూడా “అపాయమ్ము దాటడానికి ఉపాయమ్ము కావాలి” అంటూ అచ్చంగా అన్నగారిని అనుకరిస్తూ గంభీరంగా ఈపాటందుకునే వాడు ఆ విధంగా ఈ పాట తరచుగా వింటూండేవాడ్ని. మీరూ పాట విని/చూసి ఆనందించండి. వీడియో ప్లే అవ్వకపోతే ఈ పాటను ఇక్కడ వినవచ్చు...
అన్నట్లూ కొత్తావకాయ గారు రేపల్లెలో జరిగిన కథ అంటూ ధనుర్మాసమంతా
రోజుకొంచెం చొప్పున కన్నయ్యకథ చెప్తున్నారు చదివారా? అదే పోస్టులలో
తిరుప్పావై పాశురాలకు దేవులపల్లి వారి తెలుగుసేతనుండి రోజుకో కమ్మని పాటను
సైతం అందిస్తున్నారు. మీరు ఇంకా చూసి ఉండకపోతే అర్జంట్ గా ఇక్కడ చదివేయండి.
చిత్రం : శ్రీకృష్ణపాండవీయం
సంగీతం : టి.వి.రాజు
సాహిత్యం : కొసరాజు
గళం : ఘంటసాల
అపాయమ్ము దాటడానికి ఉపాయమ్ము కావాలి
అంధకారమలమినపుడు వెలుతురుకై వెదకాలి
ముందు చూపులేనివాడు ఎందునకూ కొరగాడు
సోమరియై కునుకువాడు సూక్ష్మమ్ము గ్రహించలేడు
మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా
మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా
ఆ మత్తులోనబడితే గమ్మత్తుగా చిత్తవుదువురా
మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా
జీవితమున సగభాగం నిద్దురకే సరిపోవు
జీవితమున సగభాగం నిద్దురకే సరిపోవు
మిగిలిన ఆ సగభాగం చిత్తశుద్ధి లేకపోవు
అతినిద్రాలోలుడు తెలివిలేని మూర్ఖుడు
అతినిద్రాలోలుడు తెలివిలేని మూర్ఖుడు
పరమార్ధం కానలేక వ్యర్ధంగా చెడతాడు
మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా
సాగినంత కాలమ్ము నా అంత వాడు లెడందురు
సాగకపోతే ఊరక చతికిల బడి పోదురు
కండబలము తోటే ఘనకార్యము సాధించలేరు
బుద్ధిబలము తోడైతే విజయమ్ము వరింపగలరు
మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా
చుట్టు ముట్టు ఆపదలను మట్టుబెట్ట పూనుమురా
చుట్టు ముట్టు ఆపదలను మట్టుబెట్ట పూనుమురా
పిరికితనము కట్టిపెట్టి ధైర్యము చెపట్టుమురా
కర్తవ్యం నీ వంతు కాపాడుట నా వంతు
చెప్పడమే నా ధర్మం వినకపోతే నీ ఖర్మం
మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా
ఆ మత్తులోనబడితే గమ్మత్తుగా చిత్తవుదువురా
మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా
14 comments:
మొత్తానికి మీరు నిద్ర లేచి అందరినీ నిద్ర లేపే ప్రయత్నం లో పడ్డారన్న మాట :)
Nice Song !
తెలుగు పై అపారమైన మక్కువ వున్న వారందరికీ ఈ పాట ఇష్టంగానే వుంటుంది. మీ బ్లాగు ద్వారా మరిన్ని తెలుగు పాటలు ఇపుడెలాగు టింగ్లీష్ ( తెలుగు తో వెరే భాషలు కలిపి వుండేవి మన కే.కే గారు మాట్లాడతారే ... అలా ) వుంటున్నాయి . కనుక అలనాటి మేటి పాటలను అందిస్తూ రకరకాల గమ్మత్తుల మత్తులలో జోగుతున్న ఇప్పటి యువతరాన్ని మేల్కొలిపే ప్రక్రియలో మీవంతు కృషిని కొనసాగిస్తారని ఆశిస్తున్నాను.
లేచారుగా ....ఇక పండగే ....కికికి
good song !
Welcome back ..:))
Inspiring song.....Good to see u back on blog
జీవితమున సగభాగం నెట్ మీద సరిపోవు
మిగిలిన పాతిక భాగం మొబైల్‌కే సరిపోవు
అతితెలివి మానవుడు, తెలివివున్న మూర్ఖుడు
పరమార్థం కానలేక వ్యర్‌థంగా చెడుతున్నాడు
అని కాలానుగుణంగా మార్చుకోవాలి.
welcome back అన్నయ్య :))))))))
హమ్మయ్యా మొత్తానికి మత్తు వదలాలి అన్న విషయం గ్రహించావన్నమాట .... లేకపోతె నిద్రపోతున్నా ఆ పాండాలని చూడలేక పోయాము అనుకో
అసలు ఆ పాత నీ బ్లాగ్ తెరిపించడం కోసమే రాసుంటారు ,..... ఈ ఉత్సాహం ఇలాగే ఉంచి మరిన్ని పోస్ట్ లు రాయాలి
P.S: నాన్నేప్పుడూ ఈ సాంగ్ నిద్రపోయేటప్పుడు పాడుతూ ఉంటారు ..ఇది ఏమిటీ డాడీ మేమింకా నిద్రేపోలేదు అప్పుడే మేలుకొలుపు ఏమిటి అని జోక్ చేస్తూ ఉంటాము
అబ్బ.. ఇన్నాళ్ళకి బజ్జున్న బుజ్జి పాండాకి నిద్ర మత్తు వదిలించారన్నమాట! బాగు బాగు.. బహు బాగు.. :)
వెల్కమ్ వెల్కోమ్. శుభం మంచి పాటే ఎన్నుకున్నారు పునరాగమానికీ.
So good to see you here :-)
శ్రావ్య గారు నెనర్లు :-)
కొండలరావు గారు నెనర్లు, ఆపాతమధురాలను కూడా ఎక్కువగా అందించడానికి ప్రయత్నిస్తానండీ. కానీ ఈ బ్లాగ్ నా అభిరుచికి తగినట్లుగా అన్ని రకాల పాటలని పొందుపరచడానికి మొదలుపెట్టాను.
RAAFSUN గారు నెనర్లు.
తృష్ణ గారు, శేఖర్ గారు, మధుర, గురూజీ, నిషీ ధన్యవాదాలు.
అజ్ఞాత గారు బాగా చెప్పారు, నెనర్లు.
థ్యాంక్స్ చెల్లాయ్.. ఓయ్ నన్నేమైనా అనుకాని మా బుజ్జి పాండాని ఏం అనకు :-D హహ మీనాన్నారి పద్దతి బాగుంది నిద్రపోయే ముందే ఎక్కువసేపు పడుకోకూడదు అని ఈ పాట గుర్తుచేసుకుంటున్నారనమాట.
చలికాలమైనా మత్తు, బద్దకం వదిలించుకున్నందుకు నిజంగానే మిమ్మల్ని అభినందిస్తున్నాను...:)
ఎంత బజ్జు, ప్లస్సులొచ్చినా... నాకెందుకో బ్లాగుపోస్టంటేనే మక్కువెక్కువ. పనులన్నీ పూర్తిచేసుకుని, విశ్రాంతిగ ఇంటిబయట అరుగు[రచ్చ:)] మీద కూర్చుని మనస్ఫూర్తిగ (నిరాటంకంగా) మాట్లాడుకుంటున్నట్టుంటుంది.
ఏదేమైనా మీరు మళ్ళీ ఇక్కడికొచ్చారు... అదీ మంచి పోస్టులేస్తానంటూ. ముందే బోలెడు ధన్యవాదాలు.
వేణుగారు, నేనెప్పుడు మత్తువదిలి మీ బ్లాగ్ కి వచ్చినా, మీరు అక్కడ ఉంచే వీడియోలకి కాలం చెల్లిపోతూ ఉందండి. నేనొప్పుకోనంతే.....చూడండి. మత్తువదలరా ఫేవరెట్ సాంగ్..విందామంటే యూట్యూబ్ వాడికి మత్తు వదిలి కాపీరైట్లు గుర్తొచ్చినట్టున్నాయి...ప్లే చేయనివ్వడం లేదు...అన్యాయం కాదూ..కదూ.
గీతిక గారు నెనర్లు.
సుధ గారు నెనర్లు లింక్ సరిచేశానండీ.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.