మంగళవారం, జనవరి 24, 2012

సూరట్టుకు జారతాదీ..

గతేడాది నిర్ధాక్షిణ్యంగా తీసుకువెళ్ళిపోయిన సినీప్రముఖుల్లో ఒకరైన జాలాది గారు సినిమాలకు రాసిన మొదటి పాటగా చెప్పబడే ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట. అసలు ఆహ్లాదకరమైన పల్లె వాతావారణంలో ఎపుడు  వర్షాన్ని చూసినా ఈ పాటే గుర్తొస్తుంటుంది. జాలాదిగారు వాడిన చక్కనైన పల్లె పదాలు మహదేవన్ గారి హుషారైన సంగీతంలో, సుశీలమ్మ స్వరంలో వింటూంటే మనపైన మత్తుజల్లినట్లు గమ్మత్తైన అనుభూతికి లోనవుతాం. ఈ సినిమాలో రంగనాథ్ జయసుధ నటించారని విన్నాను కానీ ఈ వీడియో ఎపుడూ చూసే అవకాశం కలుగలేదు. జయసుధగారు ఎంత బాగా అభినయించి ఉంటారో అని అపుడపుడు ఊహించడానికి ప్రయత్నిస్తుంటాను :-) అసలు ఈ పాట గాలిసచ్చినోడి గురించో గాలివానగాడి గురించో అర్ధమే కానంత చిలిపిగా అందంగా రాయడం జాలాది గారికే చెల్లింది. ఈ పాట మీరుకూడా ఇక్కడ విని ఆనందించండి. 

చిత్రం : పల్లెసీమ (1976)
గానం : పి.సుశీల
సాహిత్యం : జాలాది
సంగీతం : కె.వి.మహదేవన్

సూరట్టుకు జారతాదీ సితుక్కు సితుక్కు వానచుక్కా..
సూరట్టుకు జారతాదీ సితుక్కు సితుక్కు వానసుక్క..
గుండెల్నే కుదిపేత్తాదీ గతుక్కు గతుక్కు ఏందేలక్కా.. 
సూరట్టుకు జారతాదీ సితుక్కు సితుక్కు వానసుక్క..
గుండెల్నే కుదిపేత్తాదీ గతుక్కు గతుక్కు ఏందేలక్కా..
సూరట్టుకు జారతాదీ సితుక్కు సితుక్కు వానసుక్క..

కిటికీలో ఏదో మెరిసి ఇటుకంటా రమ్మంటాదీ..
తొంగి సూడబోతే జల్లు ఒళ్ళంతా తడిమేత్తాదీ..
కిటికీలో ఏదో మెరిసి ఇటుకంటా రమ్మంటాదీ..
తొంగి సూడబోతే జల్లు ఒళ్ళంతా తడిమేత్తాదీ..

తడిసిపోయానారేతిరీ ఆడి జిమ్మడిపోనూ..
కుదిపి సుట్టేశాడమ్మా గాలి సచ్చినోడూ.. గాలివాన గాడూ..

సూరట్టుకు జారతాదీ సితుక్కు సితుక్కు వానసుక్క..
గుండెల్నే కుదిపేత్తాదీ గతుక్కు గతుక్కు ఏందేలక్కా.. 
సూరట్టుకు జారతాదీ సితుక్కు సితుక్కు వానసుక్క..

పొగసూరిన ఆకాశంలో పోకిరోడూ మెరిశాడూ..
ఊరవతల సేలల్లో నను ఉరిమి ఉరిమి చూశాడూ..
పొగసూరిన ఆకాశంలో పోకిరోడూ మెరిశాడూ..
ఊరవతల సేలల్లో నను ఉరిమి ఉరిమి చూశాడూ..
సందెకాడ ఊరంతా సద్దుమణిగి నిదరోతుంటే..
సల్లంగా ఎపుడొచ్చాడో ఇల్లు ఒళ్ళు తడిపేశాడూ..
తడిసిపోయానారేతిరీ ఆడి జిమ్మడిపోనూ..
కుదిపి సుట్టేశాడమ్మా గాలి సచ్చినోడూ.. గాలివాన గాడూ..

సూరట్టుకు జారతాదీ సితుక్కు సితుక్కు వానసుక్క..
గుండెల్నే కుదిపేత్తాదీ గతుక్కు గతుక్కు ఏందేలక్కా.. 
సూరట్టుకు జారతాదీ సితుక్కు సితుక్కు వానసుక్క..

సూరుకింద ఖాళీ సూసి సొరవ చేసి నను చుట్టేసీ..
పదును పదును సలికోరల్తో ఉరిమి ఉరిమి ఉడికించీ..
సూరుకింద ఖాళీ సూసి సొరవ చేసి నను చుట్టేసీ..
పదును పదును సలికోరల్తో ఉరిమి ఉరిమి ఉడికించీ..
రెపరెపలాడించేశాడూ దీపం దిగమింగేశాడూ..
నడి ఝామున లేపేశాడూ నట్టింటో కురిసెల్లాడూ..

తడిసిపోయానారేతిరీ ఆడి జిమ్మడిపోనూ..
కుదిపి సుట్టేశాడమ్మా గాలి సచ్చినోడూ.. గాలివాన గాడూ..

సూరట్టుకు జారతాదీ సితుక్కు సితుక్కు వానసుక్క..
గుండెల్నే కుదిపేత్తాదీ గతుక్కు గతుక్కు ఏందేలక్కా.. 
సూరట్టుకు జారతాదీ సితుక్కు సితుక్కు వానసుక్క..

11 comments:

సాంగ్ ఇంకా వినలేదండీ..లిరిక్స్ చాలా బాగున్నాయ్.
thnx 4 sharing ;)

ఈ వ్యాఖ్యను రచయిత తీసివేశారు.

జానపదంలో భావుకతను రంగరించిన పాట...

వావ్వ్! ఎన్నేళ్ళైందో వేణూ, ఈ పాట విని.. భలే గుర్తుచేశారు!! థాంక్యూ.. థాంక్యూ :-)

నేను ఇదే మొదటిసారి వేణు గారు ఈ పాట వినడం బావుంది !

నేనూ ఇదే మొదటిసారి ఈ పాట వినడం.. మంచి పాటని పరిచయం చేసారు. ధన్యవాదాలు.

రాజ్, జ్యోతిర్మయి గారూ, నిషీ, శ్రావ్య, మధుర ధన్యవాదాలు :-)

వేణుగారు,చాలా మంచి పాటని గుర్తుచేశారు.అలాగే ఇంకోమంచి పాట,నూరామళ్ళ లేదా మూడామళ్ళ దూరాన,మువ్వలా బండిలో అనే యస్.పి శైలజ పాట నాకు బాగా గుర్తొస్తుంటుంది.సిలకా....... పంచెవన్నెల రామచిలకా అనే ఆలాపన బావుంటుంది.శ్రమ అనుకోకుండా,మీకు తెలిస్తే ఈపాట గురించి చెప్పగలరు.

ఇందిర గారు ధన్యవాదాలు.. నిన్నటినుండీ ఆలోచిస్తున్నాను కానీ ఆ పాట ఏమిటో గుర్తురావడంలేదండీ.. తెలియగానే చెప్తాను..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.