శనివారం, జనవరి 14, 2012

గుణనుతి చేతును (హరికథ)

ఇది హరికథ కాదు అంటే హరిని గురించిన కథకాదు.. హరికథా ప్రక్రియను ఉపయోగించుకుని సామాజిక చైతన్యాన్ని ఉద్భోదిస్తూ కులమతవర్ణ వివక్షను వీడి వసుధైక కుటుంబంలా కలసి మెలసి జీవించమని చెప్పిన హాయైన కథ. సాథారణంగా ఇలాంటి సాంఘీక కథలు/సందేశాలూ హరికథా ప్రక్రియలో ఇమడ్చడానికి ప్రయత్నించినా అంతగా ఆకట్టుకోలేవు కానీ ఈ కథ మాత్రం ప్రత్యేకం. దండిభట్ల నారాయణమూర్తి గారు చక్కని తేటతెలుగు పదకట్టుతో రాస్తే బాలూ తన స్పష్టమైన ఉచ్చారణతో ఆసాంతం కదలకుండా వినేలా చేస్తాడు. మీరూ ఇక్కడ విని ఆస్వాదించండి. 


చిత్రం : దేవస్థానం
సాహిత్యం : దండిభట్లనారాయణమూర్తి
సంగీతం : స్వరవీణాపాణి
గానం : SP బాలు

గుణనుతి చేతును గణనాథా.. ప్రణతులు చేకొను ఘనవరదా..
అవరోధ శతమునణచు సదా అరింద్య వాహనా అభయప్రదా..
గుణనుతి చేతును గణనాథా..

రారే నిరతిమీర.. వినరారే తనివితీర
సాహిత్య లలిత సంగీత కలిత సందేశ యుత హరికథన్..
సంతోష రుచిర చాతుర్య ప్రచుర సల్లాప సుధల వసుధన్..
పంచంగ భాగవతులొచ్చె పంచ పూమాల చిడత జతతో..
పాపాయి మొదలు వయసైన ముసలి బాగంచు గాంచు ప్రభతో.. 

భక్తమహాశయులారా ఇది సమకాలీన పురాణ గాథ మానవత్వమపేక్షించి విశ్వశాంతి కాంక్షించి వర్ణ వ్యత్యాసముల ఖండించు లోక సంక్షేమ కాముక హరికథా కాలక్షేపము.. కాదిది కాలక్షేపము.. నిక్షేపము.. శ్రీమద్రమారమణగోవిందో హారి..

ఏ దేశము జూచిన ఏమున్నదీ గర్వకారణమ్మూ..
ఈ నుడి శ్రీశ్రీ ఏనాడనెనో ఎల్లెడల నిక్కమూ..
పొడమెను కయ్యము.. విడివడె నెయ్యమూ..
పొడమెను కయ్యము.. విడివడె నెయ్యమూ..
గడగడ వెడదిడు కలహ కులం..
రగులు పగలివిగొ.. తెగిన తలలివిగొ
ఊగు మదగజంలాగ మతం.. హరీ హరీ..

నదులకు బదులుగ కదులు రుధిరఝరి
చెదరిన కుదురుకు కుందు జగం.. 
సజ్జన భంజన దుర్జన గర్జన సంజారుల రణ సమయమిదే..
నాడు పున్నాగ పూల ధాత్రి
నేడు పన్నగ కాళ రాత్రీ.. 

జీవకోటిలో నరుడై పుట్టడమే గొప్పవరం ఆ వరమును పొంది వివేకముతో ఎన్నో సాధించిన మనిషి తోటివారితో సహవాసం వదిలి నైతికంగా తలక్రిందై నిత్యం ఘర్షణ పడుతున్నాడు. మరొక్కపర్యాయం భగవన్నామ స్మరణ శ్రీమద్రమారమణగోవిందో హారి..

ఎక్కువెవడు రా తక్కువెవడురా..
అందరిలా పుట్టావూ అందరితో పోతావు..
నరులను సృష్టించిన పరమాత్ముడే నాల్గువర్ణములు నావేననియే..
రామచరిత్రమ్మెవ్వరు రాసెరా..
భారతమ్ము ఏ మహర్షి ఊసురా..
ఏకలవ్యుడేజాతి వాడురా..
కన్నిచ్చిన.. తనకన్నిచ్చిన తిన్నడిదే కులమురా..
ఎక్కువెవడు రా తక్కువెవడురా..

ఈ ఒక్క కులమేనా చెలిమిని చీల్చేది.. మతమనే కమతం కూడా..
భరతఖండాన్నే కాక యావత్ భూమండలాన్ని కబళిస్తున్న భూతం ఈ మతం..
హితం చెప్పే మతాన్ని కొందరు ఉన్మాదంతో హతం వ్రతంగా మార్చారూ..
వారంటించిన బాంబు విస్ఫోటనాల దావానలంలో అమాయకులెందరో బలైపోతున్నారు.
ఏదేవుడు చెప్పాడయ్యా జీవుడ్ని చంపమనీ.. 

ఉగ్రవాద వ్యాఘ్రాన్ని శ్రీఘ్రమే మట్టుబెట్టి ఆ మట్టిలో శాంతీ సహనం సౌభ్రాత్రుత్వమనే పూల మొక్కలను నాటడమే మన ముందున్న తొలికర్తవ్యం. మనం నారుపోద్దాం నీరు పోయు వాడ్ని ప్రార్ధిద్దాం. శ్రీమధ్రమారమణ గోవిందో హారి.
విశ్వశాంతిని కోరుతూ వసుధైక కుటుంబంలా అందరం కలసి మెలసి ఉందాం.

పవమాన సుతుడు పట్టు పాదారవిందములకు..
నీనామ రూపములకు నిత్య జయమంగళం..   
శ్రీమధ్రమారమణ గోవిందో హరి.
సర్వేజనా సుజనాభవంతు.. సర్వే సుజనా సుఖినోభవంతు..
ఓం శాంతిశాంతిశాంతిః

3 comments:

baagundandee..yee chitram peru yeppudu vinaledandee..asalu ye chitram peru vinnaaru ani adakkandi sagam chitrala perlu naaku koththey.
manchi paata post chesaaru...sankranthi subhaakaankshalandee...

బావుంది వేణు గారు ! Thanks for sharing !

ధన్యవాదాలు శ్రావ్యా, ఎన్నెల గారు..
ఈ సినిమా కొత్తదండీ మొన్న డిశంబర్ పదహారున ఆడియో రిలీజ్ అయింది. సినిమా ఇంకా విడుదలవ లేదు బహుశా ఈ నెలాఖరునో ఫెబ్ లోనో రిలీజ్ చేస్తారనుకుంటాను. మీక్కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.